ఆగస్టు 5న అయోధ్యలో జరగబోయే రామ మందిర నిర్మాణానికి భూమిపూజ వేడుకను భగ్నం చేయడంతో పాటు విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్ ఐఎస్ఐ కుట్రలు పన్నుతోందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో అయోధ్య, దిల్లీ, జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ముమ్మర తనిఖీలు చేపడుతున్నాయి. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అయోధ్యలో హై అలర్ట్ ప్రకటించారు.
అయోధ్యలో భూమి పూజ నిర్వహిచిన రోజు, జమ్మూకశ్మీర్ ఆర్టికల్ 370ని రద్దు చేసిన రోజు ఆగస్టు 5 కావడంతో భద్రతా బలగాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని గతేడాది ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే.
ఆగస్టు 5న అయోధ్యలో జరగబోయే రామాలయ భూమిపూజ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా భాజపా అగ్రనేతలు ఎల్కే ఆడ్వాణీ, మురళీమనోహర్ జోషీ, ఉమా భారతితో పాటు ఆరెస్సెస్ అగ్ర నేతలు, దేశంలోని దిగ్గజ పారిశ్రామికవేత్తలు, అధికారులు పాల్గొనే అవకాశం ఉన్నట్టు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రధాని చాపర్ దిగే సాకేత్ మహా విద్యాలయం నుంచి రామ జన్మభూమి స్థలం వరకు ఇప్పటికే భద్రతా దళాలు మోహరించాయి. అలాగే, రామ్‌కోట్ ప్రాంత నివాసితుల రాకపోకలకు సంబంధించి ప్రత్యేక పాస్‌లను సైతం జారీ చేశారు.
అలాగే, రోజూ భద్రతా బలగాలు మాక్ డ్రిల్స్ నిర్వహించడంతో పాటు ఇంటింటికీ తనిఖీలు చేపడుతున్నారు. ఆ ప్రాంతంలో డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టినట్టు అధికారులు పేర్కొన్నారు.
_విశ్వ సంవాద కేంద్రము