‘గురుత్వాకర్షణ క్షేత్రాలు’ అనేవి ద్రవ్యరాశిత్వం గల వస్తువుల నుండి ఉద్భవించి ఇతర వస్తువులనన్నింటినీ ఆకర్షిస్తాయి. ఈ ‘గురుత్వాకర్షణ క్షేత్రం’ (Gravitational Field) అనేది ఆ వస్తువు చుట్టూ ఉండే శూన్య ప్రదేశాన్ని ప్రభావితం చేసి, ఇతర వస్తువులను ఆకర్షించేలా చేస్తుంది. అంతే కాక ఐన్ స్టీన్ సిద్ధాంతం ప్రకారం ఒక వస్తువుకు ఉండే ‘గురుత్వాకర్షణ శక్తి’ దాని చుట్టూ ఉండే శూన్యాకాశాన్ని వంచుతుంది. తద్వారా దాని రేఖాగణిత ధర్మాలనే మారుస్తుంది.
కృష్ణబిలాలు ఢీకొనే సమయంలోను, న్యూట్రాన్ తారలు ఢీకొన్నప్పుడు, నక్షత్రాల్లో పేలుడు సంభవించినప్పుడు గురుత్వాకర్షణ తరంగాలు జనిస్తాయని, అవి అలలు అలలుగా విస్తరిస్తాయని ఐన్స్టీన్ ప్రతిపాదించాడు. ఐన్ స్టీన్ ప్రతిపాదించిన, వందేళ్లుగా మిస్టరీగానే ఉన్న ఈ 'గురుత్వాకర్షణ తరంగాల'ను గుర్తించినట్లు శాస్త్రవేత్తలు ఫిబ్రవరి 2016 లో ప్రకటించారు. ఈ తరంగాలను గుర్తించేందుకు అమెరికాలో ‘లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్-వేవ్ అబ్జర్వేటరీ (లిగో)’ పేరిట పరిశోధనశాలను ఏర్పాటు చేశారు.
గురుత్వాకర్షణ తరంగాలు అతి స్వల్ప స్థాయిలో ఉన్నా గుర్తించగలిగే అత్యాధునికమైన రెండు అతి భారీ డిటెక్టర్ల సహాయంతో సుదూర అంతరిక్షంలో 130 కోట్ల ఏళ్ల క్రితం ఢీకొన్న రెండు కృష్ణబిలాలపై పరిశోధన చేశారు. అవి ఢీకొన్నప్పుడు వెలువడి, స్థల-కాలాల్లో అలల్లాగా విస్తరించిన గురుత్వాకర్షణ తరంగాలు గత ఏడాది సెప్టెంబర్ 14న భూమిని చేరాయి. వీటిని అదేరోజు 'లిగో' లోని డిటెక్టర్లు గుర్తించాయి. అయితే ఈ సమాచారాన్ని పూర్తిస్థాయిలో విశ్లేషించి, నిర్ధారించుకునేందుకు శాస్త్రవేత్తలకు 5 నెలల సమయం పట్టింది.
ఐన్ స్టీన్ సిద్ధాంతం ప్రకారం, పదార్థం దానియొక్క ఆకర్షణ క్షేత్రం నుండి వేరు కాదు. అలాగే ఆకర్షణ క్షేత్రం వంపు తిరిగిన ఆకాశం నుండి వేరు కాదు. అంటే డెమోక్రటిస్ కాలం నుండి మౌలికమైన వేర్వేరు అంశాలుగా తలచబడ్డ పదార్థము, శూన్యాకాశము అన్నవి వేరు కాదని సాపేక్ష సిద్ధాంతం నిరూపించింది.
అంతే కాక, శూన్యాకాశం నుండి కాలాన్ని వేరు చేయలేము. కాబట్టి ఒక భారీ వస్తువు వల్ల ( ఉదాహరణకు గ్రహాలూ, నక్షత్రాలు వంటివి ) శూన్యాకాశం వంపు తిరగడమే కాక అక్కడ కాలగతి కూడా మారుతుంది. విశ్వమంతా వివిధ ద్రవ్యరాశులు గల వస్తువులతో నిండి ఉంది కనుక ఆయా వస్తువుల సమక్షంలో కాలం వివిధంగా ఉంటుంది. అంటే మన భూగ్రహం శూన్యాకాశాన్ని ఒకలా వంచితే గురు గ్రహం మరోలా వంచుతుంది. ఎందుకంటే వాటి ద్రవ్యరాశులు వేర్వేరు కాబట్టి. దాని వల్ల భూగ్రహం వద్ద కాల గతి ఒకలా ఉంటే గురు గ్రహం వద్ద కాల గతి మరోలా ఉంటుంది.
అంటే విశ్వమంతా పదార్థం ఏ విధంగా ఉంచబడిందో దానిని బట్టి ఆయా పదార్ధాల వల్ల శూన్యాకాశంలో ఏర్పడే వంపు వేర్వేరు గా ఉంటుంది. ఆ వంపును బట్టి కాల గతి కూడా వేర్వేరుగా ఉంటుంది. అంటే స్థల కాలాలకు సంబంధించిన కొలతలు న్యూటన్ చెప్పినట్లు నిర్దిష్టమైనవి కావు. విశ్వంలో పదార్థం ఉంచబడిన తీరును బట్టి అవి మారతాయి.
మనకు సామాన్యంగా కనిపించే వస్తువులు కాంతి కంటే ఎంతో తక్కువ వేగంతో కదలడం వల్లే కాలం వాస్తవం అన్న భావన మనకు కలుగుతోంది. దాదాపు కాంతి వేగంతో సమానమైన వేగంతో ప్రయాణించే సూక్ష్మ కణాలకు కాలభావం వర్తించదని నేటి భౌతిక శాస్త్రం ప్రయోగాత్మకంగా నిరూపించింది. అంటే ఒక జెట్ విమానంలో మనం దాదాపు కాంతి వేగంతో ప్రయాణిస్తే మన వయస్సు పెరగడం ఆగిపోతుంది. అంటే ఆ స్థితిలో కాలమనేది ఉండదు.
మిన్ కౌస్కీ అనే శాస్త్రవేత్త చెప్పినట్లు “శున్యాకాశము (స్థలము), కాలము ఛాయా మాత్రమైనవి. ఆ రెండిటి సంపుటి మాత్రమే వాస్తవం.” అంటే స్థల కాలాలు విడదీయరానివి.
సామాన్య సాపేక్ష సిద్ధాంతం ప్రకారం వస్తువు యొక్క ద్రవ్యరాశి పెరిగిన కొద్దీ దాని సమక్షంలోని శూన్యాకాశం ఎక్కువ వంపు తిరుగుతుంది. ఆకాశానికి, కాలానికీ గల అవినాభావ సంబంధం వల్ల ‘దేశ – కాలము’ (స్పేస్ - టైమ్) కూడా వంపు తిరుగుతుంది. అంటే వస్తువు యొక్క ద్రవ్యరాశిత్వాన్ని బట్టి దాని సాన్నిధ్యంలో కాల గతి గూడా మారుతుంది. ఈ సిద్ధాంతం ప్రయోగాత్మకంగా నిరూపించబడింది కాబట్టి మనకిప్పుడు స్థూలంగా అనుభవమయ్యే ‘దేశ కాలాలు’ వాస్తవమైనవి కావని తేలుతోంది. అంటే మనకిప్పుడు గోచరించే జగత్తు దాని వాస్తవ రూపం కాదు.
కదిలే కడ్డీ దాని వేగాన్ననుసరించి సంకోచిస్తుంది. మనం ఎక్కువ వేగంతో కడ్డీ ని విసిరితే దాని పొడవు తగ్గుతుంది. అంటే ఒక వస్తువు పొడవెంత అని అడగడం సరికాదు. ఒక వస్తువు యొక్క పొడవు దాని వేగం మీద ఆధారపడి ఉంటుంది. ఇలాంటి ఆశ్చర్యకరమైన విషయాలనెన్నింటినో ఐన్ స్టీన్ సిద్ధాంతం వివరించింది.
- ➧ ఇద్దరు కవలల్లో ఒకరు జెట్ విమానంలో అత్యంత వేగంగా అంతరిక్షంలో ప్రయాణించి తిరిగి భూమి మీదకు వచ్చేసరికి తన సహోదరుని కంటే వయస్సులో చిన్నవాడై ఉంటాడు. దీనినే “ట్విన్ పారడాక్స్” (కవలల వైరుధ్యం ) అంటారు.
- ➧ భూమి మీద స్థిరంగా ఉన్న తన సహోదరునితో పోలిస్తే అంతరిక్షంలో అత్యంత వేగంతో ప్రయాణించే అతని శరీర గత వ్యవస్థలన్నీ నెమ్మదిగా పని చేసే గడియారంలా ఉంటాయన్నమాట.
- ➧ అంటే అతడు ఎంత వేగంతో ప్రయాణిస్తాడో అతడి వయస్సు పెరగడం అంత తగ్గుతుంది. దాదాపు కాంతి వేగంతో ప్రయాణిస్తే అతడి వయస్సు పెరగడం ఆగిపోతుంది. అంటే అతడికి కాల భావం వర్తించదు. (కాంతి వేగం అంటే సెకనుకు దాదాపు మూడు లక్షల కిలోమీటర్లు లేదా ఒక లక్షా ఎనభై ఆరు వేల మైళ్ళు)
- ➧ ఈ విషయం మరింత అర్థం కావడానికి మరో ఉదాహరణ తీసుకుందాం. ఒక వ్యక్తి వయస్సు 28 సంవత్సరాలనుకుందాం. అతడి తమ్ముడి వయస్సు 26 సంవత్సరాలనుకుందాం. 28 నంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తి, ఒక జెట్ విమానంలో 20 మానవ సంవత్సరాల పాటు అంతరిక్షంలో ప్రయాణించి తిరిగి భూమి మీదకు వచ్చాడనుకుందాం. అప్పుడు అతడి వయస్సు అదే 28 సంవత్సరాలుగా ఉంటుంది. కానీ అతడి తమ్ముడి వయస్సు మాత్రం 46 సంవత్సరాలుంటుంది. అంటే అతడు తన తమ్ముడి కంటే 20 ఏళ్ళు చిన్నవాడవుతాడన్నమాట.
- ➧ అంతరిక్ష నౌకల్లో ప్రయాణించే వ్యోమగాములు కూడా ఈ సాపేక్ష సిద్ధాంతాన్ని నిజమని నిరూపించారు. వారు వ్యోమనౌకల్లో సంవత్సరాల తరబడి ప్రయాణం చేసినా వారికి కొన్ని రోజులే ప్రయాణించినట్లుగా అనుభవమవుతుంది.
- ➧ ఈ విషయాలు మనకు ఆశ్చర్యకరంగా ఉండడానికి కారణం మన ఇంద్రియాలు నాలుగు నిరూపకాలు గల దేశ కాల జగత్తును చూడలేక పోవడం. మనకు అనుభవమవుతోంది మూడు నిరూపకాలతో కూడిన స్థాయిలోని ప్రపంచం యొక్క ఛాయాచిత్రం మాత్రమే.
మనం ప్రపంచాన్ని మూడుకొలతల్లోనే చూస్తాం. అవే ఎత్తు, పొడవు, వెడల్పు.
అసలు మన విశ్వంలో ఎన్ని కొలతలు (నిరూపకాలు) ఉన్నాయి? మనకు అనుభవం కాని వీటి ఆనుపానులు తెలుసుకోవడం సాధ్యమేనా? అనేదానిపై శాస్తవ్రేత్తలు నాలుగు దశాబ్దాలుగా కృషి చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటికీ వారికి సమాధానం అంతుచిక్కలేదు. కాకపోతే నాలుగవ కొలత మాత్రం ఉన్నదని గణితశాస్త్ర పరంగా, ఖగోళశాస్త్ర రీత్యా లెక్క కడుతున్నారు. అయితే 'స్ట్రింగ్ థియరీ' ప్రకారం పది నిరూపకాలుంటాయి.
ధ్యానం ద్వారా మాత్రమే నాలుగు నిరూపకాలతో కూడిన అనుభవం కలుగుతుందని ప్రాచీన ఋషులు చెప్పారు. ధ్యానం ద్వారా అలాంటి అనుభవాన్ని పొందిన శ్రీ అరవింద మహర్షి ఇలా అన్నారు : “ ఆ స్థితిలో మన దృష్టి సూక్ష్మమైన పరివర్తన చెంది నాలుగవ నిరూపకాన్ని (ఫోర్త్ డైమెన్షన్) అనుభవిస్తుంది.”
ధ్యానంలో చెప్పబడే ‘దేశానుభూతి’ (అనుభవం) నాల్గవ నిరూపకానికి సంబంధించింది. ఈ అనుభూతిలో సామాన్యమైన కాల క్రమానికి బదులు అన్ని సంఘటనలు, వస్తువులు ఏకకాలీయతను (అంటే ఒకే కాలాన్ని) కలిగి ఉంటాయి.
వేదం ప్రకారం శూన్యాకాశం బహుళ నిరూపకాలు కలది. అంటే శూన్యాకాశంలో 64 ప్రధాన నిరూపకాలుంటాయి. ఒక్కో నిరూపకంలో తిరిగి అనేక ఉప నిరూపకాలుంటాయి. కానీ మన ఇంద్రియాలు మూడు నిరూపకాలను మాత్రమే అనుభవించగలుగుతాయి. కాబట్టి ఇతర నిరూపకాలతో కూడిన యదార్థ తత్వాన్ని మనం గుర్తించలేక పోతున్నాము.
ప్రాచీన యోగ పద్ధతుల ద్వారానే (ముఖ్యంగా క్రియా యోగం ద్వారా) ఇతర నిరూపకాలను మానవుడు అనుభవించగలుగుతాడనీ, ఆ స్థితిలో ఉన్న యోగి అసాధారణ క్రియలను చేయగలుగుతాడని వైదిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి.
- ➧ డీ బ్రోగ్లీ అనే శాస్త్రవేత్త ఇలా వివరించాడు : “ మనకు భూత, భవిష్యత్, వర్తమానాలుగా కనిపించేదంతా దేశ కాలాల్లో ఒక్కసారే ఉనికిని కలిగి ఉంటుంది. (మూడు నిరూపకాల స్థాయిలో) పరిశీలకుడు కాలం గడిచిన కొద్దీ ఈ దేశ కాలం యొక్క కొత్త తునకలను చూసి, అవి కాలగతిలో కొత్తగా ఏర్పడ్డ అంశం అనుకుంటాడు. కానీ, ‘దేశ – కాలము’ అనేది అన్ని సంఘటనల సమూహం. ఆ కొత్త సంఘటనలన్నీ అతడు గుర్తించక ముందే ఉన్నాయి. ”
- ➧ ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రకారం – ‘మన స్థూల దృష్టికి వాస్తవంగా ఉన్నట్లు కనిపించే దేశ కాలాలు తత్త్వత: అసత్యాలు’. కానీ ఆధ్యాత్మిక వేత్తలు తాము భూత, భవిష్యత్, వర్తమానాలను ఏక కాలంలో దర్శిస్తామనీ, వివిధ స్థానాలలోని వస్తువుల ఏక దేశీయత తమకు ప్రత్యక్షంగా అనుభవమవుతుందనీ చెబుతారు.
- ➧ తన చివరి రోజుల్లో ఐన్ స్టీన్ ఇలా అన్నాడు : " భౌతిక శాస్త్రాన్ని నమ్మే మాలాంటి వారికి భూత, భవిష్యత్,వర్తమాన కాలాల మధ్య వ్యత్యాసం అనేది కేవలం మనల్ని పట్టి పీడించే ఒక భ్రాంతి మాత్రమేనని తెలుసు." అంటే ఐన్ స్టీన్ కాల ప్రవాహాన్ని ఒక 'మిథ్య' గా భావించాడని చెప్పవచ్చు.
- ➧ స్వామి వివేకానంద ఇలా అంటారు : “ కాలము, దేశము, కారణాత్మకత అనేవి కళ్ళజోడు అద్దాల్లాంటివి. మనం పరమసత్యాన్ని వాటి ద్వారా చూస్తాము. పరమసత్యంలో కాలము, దేశము, కారణాత్మకత అనేవి లేనే లేవు.”
సామాన్య చైతన్య స్థాయిలో గుర్తించబడు ‘కార్యకారణ సూత్రమే’ కర్మ బంధం రూపంలో జీవులను ‘అజ్ఞాన జనిత జనన మరణముల పరంపర’ అనబడే సంసార చక్రానికి బంధిస్తుందనీ, జ్ఞానం ద్వారా దానిని అతిక్రమించడమే ముక్తి అనీ హిందూ, బౌద్ధ గ్రంథాలు చెబుతాయి.
“బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం”
విశ్వావిర్భావానికి సంబంధించి నేడు ఎక్కువ మంది శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్న "బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం" ప్రకారం, ఈ విశ్వం ఒక ఒక అగ్ని గోళం యొక్క మహా విస్ఫోటనం తో ప్రారంభమై, నేటికీ అన్ని దిక్కులకు వ్యాపిస్తోంది. ఆ విస్ఫోటనం నుంచీ జరిగిన సంఘటనల ప్రవాహమే కాలం. అంటే ఈ విస్పోటనం ద్వారానే కాలం అనేది కూడా పుట్టింది. దీనికి ముందు కాలమనేదే లేదు.
బిగ్ బ్యాంగ్ కి ముందు ఉన్న “ఏమీ లేని స్థితి” లో పదార్ధం, శక్తి, స్థలము, కాలము, సాపేక్షత - ఇవేవీ లేవు. సైన్స్ ప్రకారం అది పరిపూర్ణమైన శూన్యం. అలాంటి శూన్యాన్ని సైన్స్ పరంగా నిర్వచించలేము (Undefined). ఇలాంటి పరిస్థితులలో బిగ్ బ్యాంగ్ విస్పోటనానికి కావాల్సిన ‘శక్తి’ ఎక్కడ నుండి వచ్చింది? విస్పోటనానికి గురయిన ‘పదార్థం’ ఎక్కడనుండి వచ్చింది? - ఇలాంటి ప్రశ్నలకు సైన్స్ దగ్గర సమాధానాలు లేవు.
బిగ్ బ్యాంగ్ కి ముందు కాలమనేది లేదు. కాలం అనేది ఉండాలంటే ఏదైనా ఒక సంఘటన జరగాలి. ఏ సంఘటనా జరగడానికి వీలు లేని పరిస్థితుల్లో కాలం అనేది ఉండదు. అంటే ఈ విశ్వం యొక్క సృష్టికి కారణమైన ఒకానొక ‘అతీత శక్తి’ (దేవుడు) గనక ఉంటే ఆ ‘చైతన్య శక్తి’కి కాలభావం వర్తించదు. అంటే ఆ శక్తి కాలాతీతం. కాలం లేని చోట చావు పుట్టుకలుండవు. శాస్త్రం భగవంతుడిని కాలాతీతుడని చెప్పింది. కాబట్టి భగవంతుడికి జనన మరణాలనేవి ఉండవు.. అందువల్ల భగవంతుడిని ఎవరు సృష్టించారు? అనే ప్రశ్న ఉత్పన్నం కాదు.
‘భగవద్గీత’ ఇలా చెబుతుంది
నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సత :
ఉభయోరపి దృష్టోన్త స్త్వనయో స్తత్త్వ దర్శిభి : (2-16)
“లేనిది ఎప్పటికీ ఉండదు. ఉన్నది ఎప్పటికీ లేకపోదు. రెండింటి నిర్ణయం తత్వజ్ఞులకే తెలుస్తుంది.”
భగవద్గీత లో చెప్పబడిన ఈ భావన నేటి సైన్స్ చెబుతున్న “శక్తి నిత్యత్వ నియమం”తో పోలి ఉంది. ఈ నియమం ప్రకారం శక్తిని సృష్టించలేము, నాశనము చేయలేము. ఈ నియమాన్ని వేల సంవత్సరాలకు పూర్వమే మన భారతీయ ఋషులు విశ్వంలోని ప్రతీ మూలకానికీ వర్తించే విధంగా చెప్పారు.
‘ఈశోపనిషత్తు’ ఇలా చెబుతుంది : “ఓం పూర్ణమద : పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమే వావశిష్యతే ”
దీని అర్ధం – “ఆ అదృశ్య బ్రహ్మము పూర్ణము. ఈ దృశ్య బ్రహ్మము కూడా పూర్ణము. ఆ అదృశ్య పూర్ణ బ్రహ్మమునుండి ఈ దృశ్య పూర్ణ బ్రహ్మమును తీసివేస్తే మళ్ళీ పూర్ణ బ్రహ్మమే మిగిలిఉంటుంది.”
అంటే పూర్ణుడైన భగవంతుని నుండి సంపూర్ణ జగత్తు పుట్టి మరల పూర్ణుడైన భగవంతుని లోనే సంపూర్ణముగా కలిసి పోతుంది అంటే, సర్వవ్యాపకమైన, శాశ్వతమైన (మార్పులేని) ‘చైతన్య శక్తి’ అనేది ఒక్కటే. అది పరిపూర్ణమైనది. అవిభాజ్యమైనది.
రచన: మణి వేమూరి