నియోగులు - ఆరువేల నియోగులు
వైదికులనుండి విడిపోయి, ప్రత్యేక శాఖగా ఏర్పడిన వారు 'నియోగులు'. ఇదొక విస్తృతమైన శాఖ. నియోగులలోనే- 1. ఆరువేల నియోగులు
- 2. నందవరీక నియోగులు
- 3. కరణకమ్మ నియోగులు
- 4. వెలనాటి నియోగులు
- 5. తెలగాణ్య నియోగులు
- 6. ద్రావిడ నియోగులు
- 7. కరణాలు
- 8. శిష్ట కరణాలు
- 9. కాసలనాటి నియోగులు
- 10. పాకలనాటి నియోగులు - అని పలు ఉపశాఖలు ఉన్నాయి.
అయితే, ఆయన అదే పుస్తకం 40వ పుటలో ఇంకోమాటా అంటారు: 'పౌరోహిత్యంమీద కాక, లౌకిక వృత్తులమీద జీవించిన వారే నియోగులు. ఈ నియోగులలో ఆరువేల నియోగులు పెద్ద ఉపశాఖ... వెలనాటి ప్రాంతపు ఆరువేల గ్రామాలకు నియోగింపబడిన బ్రాహ్మణులే ఆరువేల నియోగులు'. శివశంకర శర్మగారు అన్నట్లు 'ఆరువేల నియోగులు...' ఆరువేల గ్రామాలకు నియోగింపబడిన వారో, ఆరువేల గ్రామాలకు చెందిన వారో... కొంచెం ఆలోచించాల్సిన విషయమే!!
ఏమైనా నియోగులలో శాఖల గురించి ఆలోచించే ముందు మనం ఒకప్పటి మన ఆంధ్రదేశాన్ని పరిశీలించడం అవసరం అవుతుంది. చాలా శతాబ్దాల క్రితం మన ఆంధ్రదేశాన్ని పరిపాలించిన ఆంధ్రసామ్రాజ్య ప్రభువులు (ప్రధానంగా కాకతీయుల పరిపాలనాకాలంలో) పరిపాలనా సౌలభ్యం కోసం దేశాన్ని పలు చిన్న ప్రాంతాలుగా విభజించారు. శతాబ్దాలపాటు జరిగిన, అమలులో ఉన్న ఆ విభజనలనుబట్టి, స్థూలంగా ఆంధ్రదేశం వేర్వేరు కాలాలలో ఈ దిగువ ప్రాంతాలుగా విభజితమయి ఉండేది. (అక్షరక్రమంలో):
అస్సక దేశం, అశ్మక దేశం (మంజీరికా దేశం): నేటి నిజామాబాద్ జిల్లా
ఆరువేల నాడు, వెలనాడు: కృష్ణానదీ దక్షిణ ప్రాంతం, వేంగిలో ఒక భాగం (నేటి గుంటూరు జిల్లాలోని చందోలు ప్రాంతం)
కన్నాడు ప్రాంతం: నేటి కర్నాటక ప్రాంతం
కమ్మనాడు (కర్మ రాష్ట్రం): గుంటూరు నుంచి మన్నేరు వరకు
కాసలనాడు: పటం చెరువు (ఒకప్పుడు పొట్ల చెరువు) ప్రాంతం, నేటి పటాన్ చెరువు ప్రాంతం
కొనసీమ (కోనసీమ): తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురం, రాజోలు తాలూకాలు
కొరవి మండలం: (దో) డోర్నకల్లు - మానుకోట సమీప ప్రాంతం
కొండవీడు: నేటి గుంటూరు జిల్లా
దేవ రాష్ట్రం: నేటి విశాఖపట్నం జిల్లాలోని ఎలమంచిలి ప్రాంతం
నతవాటి సీమ: నేటి ఖమ్మం జిల్లాలోని మధిర ప్రాంతం
పల్నాడు (పలనాడు ప్రాంతం, పల్లవనాడు): నేటి మాచెర్ల, గురజాల ప్రాంతాలు
పాకనాడు (పోకనాడు, పూగి రాష్ట్రం): సముద్రతీరం నుంచి పెన్నా - గుండ్లకమ్మల మధ్య వెలిగొండల మీదుగా - కడప జిల్లాలోని బద్వేలు, రాజంపేట తాలూకా వరకు(మన్నేరు నుండి పెన్నానది వరకు) గల ప్రాంతం
పులుగులనాడు: నెల్లూరు - తిరుపతి ప్రాంతం
పొత్తపినాడు: నేటి కడప జిల్లాలోని రాయచోటి ప్రాంతం
ములకనాడు: మహారాష్ట్రలోని పైఠన్ ప్రాంతం
మెతుకు సీమ: నేటి మెదక్ జిల్లా
రేనాడు: కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలు
లేములవాడ: నేటి కరీమ్ నగర్ జిల్లాలోని వేములవాడ ప్రాంతం
వజ్రభూమి: నెల్లూరు, గుత్తి, కందనోలు మండలాలు
వజ్రాలదిన్నా: ధాన్యటకము (నేటి గుంటూరు జిల్లాలోని అమరావతి)
వెలనాడు: కటకంనుంచి పిఠాపురం వరకూ ఉన్న ప్రాంతం
వేగి లేదా వేంగి దేశం: కృష్ణాగోదావరీనదుల మధ్య ప్రాంతం
సబ్బి సాయిర (సబ్బి, సబ్బినాటి) మండలం: కరీమ్నగర్ జిల్లా
హిరణ్య రాష్ట్రం: కడప జిల్లాలోని జమ్మలమడక ప్రాంతం
పై విషయాలను పరిశీలిస్తే ఒక్క సంగతి స్పష్టమవుతుంది: నియోగులలో చాలా శాఖలు లేదా విభాగాలు ప్రాథమికంగా ఆయా ప్రాంతాల ఆధారంగా రూపొందినవేనన్నది స్పష్టం. ఆరువేల (నాటి) నియోగులు, కాసలనాటి నియోగులు, పాకలనాటి నియోగులు, తెలగాణ్య నియోగులు, ములకనాట్లు, వెలనాట్లు.. ఇవన్నీ ఇలా ఏర్పడినవేనన్నది అర్థమవుతుంది.
శిష్ణు కరణాలు, శిస్తు కరణాలు, సృష్టి కరణాలు అనే నియోగుల తెగ వారు అధికంగా ఒడిషాలోని గంజాం నుంచి మన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఉంటున్నారు. వీరు అధికంగా ఉపాధ్యాయ వృత్తిలోనూ, కరణీకంలోనూ స్థిరపడ్డారు. ఈ తెగ అసలు పేరు 'శిష్టకరణతో బ్రాహ్మణులు' అనీ, వీరు ఉత్కళ బ్రాహ్మణులలో ఒక తెగ అనీ శ్రీ చుండూరి వేంకట సుబ్రహ్మణ్యంగారి (వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులు, పే. 98) ఉవాచ.
అయితే, 'శిష్టి కరణాలు' అనే పదం అసలు 'శ్రేష్ఠ కరణాలు' అనే పదంలోంచి వచ్చిందని, అంటే వారు కరణాలలో ఉత్తమమైనవారనే అర్థం చెప్పుకోవచ్చుననీ మరికొందరి భావన. నిఘంటువులలో 'శిష్టి' అనే పదానికి అర్థం వెతికితే, ఆ పదానికి 'ఆజ్ఞ' అనే అర్థాన్ని బహుజనపల్లి సీతారామాచార్యులుగారు కూర్చిన
'శబ్ద రత్నాకరము'తోబాటుగా, 'బ్రౌణ్య తెలుగు - ఇంగ్లీషు నిఘంటువు', ఆచార్య జి.ఎన్. రెడ్డిగారి 'తెలుగు నిఘంటువు'లు చెప్తున్నాయి.
'ఆజ్ఞ' అంటే మళ్లీ 'నియోగము' అనే మరో అర్థాన్ని ఆచార్య జి.ఎన్. రెడ్డి గారి 'తెలుగు పర్యాయపద నిఘంటువు' చెప్తుండగా, 'నియోగము' అనే పదానికి 'హుకుమ్' అనే అర్థాన్ని తాటికొండ తిమ్మారెడ్డి సర్దేశాయ్గారు కూర్చిన 'శబ్దార్థ చింతామణి' (తెలుగు - ఉర్దూ) నిఘంటువు వివరిస్తోంది.
అంటే, 'నియోగము' అన్నా, 'ఆజ్ఞ' అన్నా ఒకటే అర్థం. బహుశా, ప్రాంతీయపరంగా ఆయా పదాలు వాడుకలో ఉండేవన్నమాట.
అలా చూస్తే, 'శిష్టి కరణాలు' 'నియోగులు' అన్నది స్పష్టం.
ఇక, మహారాష్ట్రలో అధికంగా ఉండే ప్రథమ శాఖ నియోగులు అయితే, శుక్ల యజుర్వేదాన్ని అనుసరిస్తారు. (అయితే, నియోగులలో ఎక్కువ మంది కృష్ణ యజుర్వేదాన్ని అనుసరించేవారే!). ఈ ప్రథమ శాఖ నియోగులలోనూ అనేక శాఖలు ఉన్నాయి. వాజసనేయులు, శైవులు, యాజ్ఞవల్క్యులు, కాణ్వులు వంటివి.
కృష్ణానదికి ఉత్తరాన ఉన్న ఆంధ్రదేశాన్ని క్రీ.శ. 3వ శతాబ్దంలో పరిపాలించిన బృహత్ఫలాయనుల కాలంలో ఆంధ్రదేశాన్ని పరిపాలన సౌలభ్యం కోసం 'హారము, ఆహారము, విషయము, నాడు'లుగా విభజించటం జరిగింది. (ఆంధ్రుల సాంఘిక చరిత్ర, బి.ఎన్.శాస్త్రి, ప్ర. మూసీ పబ్లికేషన్స్, 1991, పే. 136). తెలుగువారుండే ఆంధ్రదేశం 'తెలుగునాడు', తమిళులు ఉండే ప్రాంతం 'తమిళనాడు'లుగా ఎందుకు అయ్యాయో, కృష్ణాగోదావరి ప్రాంతాలలో 'అగ్రహారాలు' ఎందుకు ఉండేవో, బ్రాహ్మణులు 'అగ్రహారాల'లో ఎందుకు ఉండేవారో, వారు 'అగ్రహారికులు' ఎందుకు అయ్యారో స్పష్టంగా తెలుస్తోందికదా!!
నియోగుల గురించిన కథలు
బ్రాహ్మణులలో 'ఆరువేల నియోగులు' లేదా సంక్షిప్తంగా ఇప్పుడు అనేకులు వ్యవహరించే 'నియోగులు' అన్న ఒక బ్రాహ్మణశాఖ పుట్టుపూర్వోత్తరాల గురించిన కథలు చాలానే ఉన్నాయి.
ఒకప్పుడు 'వెలనాడు'గా చరిత్రలో ప్రసిద్ధమైన నేటి కృష్ణా, గుంటూరు జిల్లాలోని కొంత భాగాన్ని, అంటే కృష్ణానదికి దక్షిణ దిశగా ఉన్న (నేటి చందోలు) ప్రాంతాన్ని ఒకప్పుడు 'షట్సహస్ర దేశం' అనేవారని డా. నేలటూరి వెంకటరమణయ్య గారు తమ 'ఆంధ్రుల చరిత్ర'లో పేర్కొన్నారు. వెలనాడుకు ఆరువేల గ్రామాల పరిధి ఉండటం వల్ల ఈ పేరు వచ్చిందని వివరణ. ఆ ప్రాంతానికి చెందిన బ్రాహ్మణులను 'ఆరువేలనాటి (ప్రాంత) నియోగులు' అనేవారనీ ఒక వాదం. ఈ ప్రాంతాలలోని బ్రాహ్మణులలో కొందరిని నాటి సామాజిక అవసరాల కోసం వైదిక వృత్తినుంచి విడదీసి వేర్వేరు పనులకు నియోగించిన కారణంగా వీరిని 'ఆరువేల నాటి నియోగులు' లేదా 'ఆరువేల నియోగులు' అనటం ఆరంభమయిందని పలువురి భావన.
ఇక్కడ గమనించాల్సిన అంశం ఒకటి ఉంది. నియోగులకు ప్రాంత పరంగా 'ఆరువేలనాటి నియోగులు' అన్న పేరు వచ్చిందా లేక, వారి సంఖ్యాపరంగా 'ఆరువేల నియోగులు' అన్నమాట వచ్చిందా అనేది స్పష్టంగా తెలియటం లేదు.
కాకతీయుల పరిపాలన కాలంలో, ఆరువేల మంది బ్రాహ్మణులను, స్థానిక గ్రామాలకు చెందిన పత్రాల (రికార్డుల) నిర్వహణ కోసం గ్రామాధికారులుగా, గ్రామ కరణాలుగా (బహుశా రాయనమంత్రి - ఆయనే గోపరాజు రామప్రధాని - ఆదేశాల ప్రకారం) నియోగించారనీ, అందుకే వారికి 'ఆరువేల నియోగులు' అన్న పేరు వచ్చిందనీ మరో కథనం. అంతవరకూ యుద్ధాలలో సైతం వీరులుగా పాల్గొన్న బ్రాహ్మణులు యుద్ధరంగాన్ని వీడి, పాలనా రంగంలోకి వచ్చారని అనుకోవచ్చు. 'ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం' అన్న సూక్తే బ్రాహ్మణులు గతంలో యుద్ధరంగంలోనూ తమ శౌర్యసాహసాలను చూపారనే దానికి సాక్ష్యం. అందుకే ఇప్పటికీ కొందరి బ్రాహ్మణుల ఇంటిపేర్లలో, వారి గతకాలంనాటి శౌర్యాన్ని ప్రదర్శిస్తూ, 'రాజు' అన్న పదం (అన్నంరాజు, కోటంరాజు, ద్రోణంరాజు, మాదిరాజు వగైరా) దర్శనం ఇస్తుంటుంది.
ఇక్కడ మరొక విషయాన్నీ వివరించి చెప్పుకోవటం అవసరం: మన ఆంధ్రదేశంలోని అనేక గ్రామాల పూర్వ చరిత్రలను, అవి కట్టుడు కథలేకానీ, కాకమ్మ కథలే కానీ, వాటిని వీలైనంత వరకూ రికార్డ్ చేయించిన వ్యక్తి కల్నల్ కాలిన్ మెకంజీ (Col. Collin Mackenzie). ఆయన 1783లో ఈస్ట్ ఇండియా కంపెనీలో మద్రాస్ ఇంజనీర్స్ సర్వీస్‌లో చేరారు. (తర్వాత ఆయన 1810 నాటికి భారతదేశానికి సర్వేయర్ జనరల్ కూడా అయ్యారు). ఆయనకు స్వతహాగా ఉన్న ఆసక్తి కారణంగా దేశంలోని అనేక ప్రాంతాలలో పర్యటించారు. అప్పుడు ఆయన చూసిన అనేక రాళ్లు, రప్పలు, కొండలు, గుట్టలు వంటి అన్నిటి వెనకా ఎన్నో కథలు ఉన్నాయనిపించి, సొంత డబ్బుతో శ్రీ కావలి వెంకట బొర్రయ్యను, వారికి సాయం చేసేందుకు బొర్రయ్య సోదరులైన లక్ష్మయ్య, రామస్వామిలను కూడా నియమించి, ఈ రాళ్లు, రప్పలు, కొండలు, గుట్టల వెనక గల కథలను సేకరించటం ఆరంభించారు. ఈ పనికి అనుబంధంగా, ఆయా ప్రాంతాలలో కరణాల ద్వారా స్థానిక చరిత్రలను రాయించారు. ఈ పని సుమారుగా 1810 ప్రాంతాలలో జరిగి ఉంటుంది. ఇలా సేకరించిన గ్రామ చరిత్రల రికార్డులను ఇప్పుడు మెకంజీ పేరు మీదనే 'మెకంజీ రికార్డులు' అనే అంటున్నారు. ఇవి మొత్తం 1568. వీటినే 'కవిలెలు' అనీ, 'దండ కవిలెలు' అనీ అంటారు.
కవిలెలు చెప్పే కథలు
అనేకంగా ఉన్న ఈ గ్రామ రికార్డులలో కానవచ్చే ఒక సాధారణ అంశం - మన (ఆరువేల) నియోగులకు సంబంధించినది కావటం విశేషం. వీటిలో ఉన్న ఆ సాధారణ అంశం ప్రకారం -
క్రీ.శ. 1134లో గణపతి దేవుడు అనే ఒక రాజు, గణపతుల రాజ్యానికి అధిపతి అయ్యాడు. ఆయన వద్ద గోపరాజు రామన్న అనే ఒక మంత్రి ఉండేవాడు. కాకతి గణపతి రాజు దగ్గరనుంచి రాజ్యానికి చెందిన పూర్తి కరణీకపు హక్కులను రామన్న మంత్రి పొందాడు. తనకు లభించిన ఈ కరణీకపు హక్కులను రామన్న మంత్రి 'రక్తాక్షి నామ సంవత్సర భాద్రపద అమావాస్య (సూర్యగ్రహణం) మంగళవారంనాడు, కృష్ణానదీతీరంలో నియోగులకు' సంక్రమింపజేశాడు. (గ్రామ కైఫీయత్తులు, గుంటూరు జిల్లా, పే. 81, 83; గ్రామ కైఫీయత్తులు, పశ్చిమ గోదావరి జిల్లా, పే.12, ప్రచురణ: ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్కైవ్స్, తార్నాకా, హైదరాబాద్, 2005).
వివిధ ప్రాంతాలలోని గ్రామాలకు చెందిన అనేకమంది కరణాలు రాసినది దాదాపు ఇలాగే ఉన్నా, ఇది చరిత్రకు దూరమంటారు సుప్రసిద్ధ పరిశోధకులు
శ్రీ పి.వి.పరబ్రహ్మ శాస్త్రి. దానికి వారు చెప్పే కారణాలివీ:
- 1. క్రీ.శ. 1134-1135లో ఆంధ్రదేశంలో గజపతుల రాజ్యం ఉండేది కాదు. క్రీ.శ. 1134లోనే చాళుక్య - చోళుడైన రెండవ కులోత్తుంగుడు రాజు అయ్యాడు. ఆయన గణపతీ కాడు, గజపతీ కాడు. అదే కాలంలో, అంటే క్రీ.శ. 1135లో రెండవ గొంక (మహారాజు), పశ్చిమ చాళుక్యులను తరిమివేసి, కొత్త పాలనా విధానంతో, వెలనాడులో తన పాలనను ప్రారంభించాడు. అప్పటి నుంచే గ్రామ కరణీకాలను వారసత్వంగా పరిగణించటం ఆరంభం అయింది.
- 2. క్రీ.శ. 1323లో కాకతీయ సామ్రాజ్య పతనం జరిగిన తర్వాత, ఉత్కళ (ఉత్తర కళింగ)లో గజపతులు, విజయనగరంలో నరపతులు, దక్కన్ ముస్లిము ప్రాంతాలలో అశ్వపతులు తలెత్తటం జరిగింది. అయితే, గజపతులు, గణపతులు, నరపతులు, అశ్వపతులు... ఈ చరిత్ర, ఈ పదాల మధ్య తేడాలు నాటి గ్రామకరణాలకు అంతగా అర్థం కాకపోయి ఉండవచ్చు.
- 3. క్రీ.శ. 1454లో గజపతి రాజుల వద్ద మంత్రిగా ఉన్న ఒక వ్యక్తి (బహుశా గోపరాజు రామన్న కావచ్చు) గ్రామ రికార్డులను 'కవిలె'లు, లేదా 'దండ కవిలె'ల పేరుమీదుగానూ, వాటిని నిర్వహించేవారికి వారసత్వ (మిరాశీ) హక్కులున్న కరణీకాల పద్ధతిని ప్రారంభించాడు. ఈ సందర్భంగా ఆయన గతకాలానికి చెందిన అంశాలను కూడా ఆ 'కవిలె'లలో పొందుపరచవలసిందిగా ఆజ్ఞలు లేదా సూచనలు చేసి ఉండవచ్చు.
- 4. క్రీ.శ. 1802 నుంచి 1820లోగా మెకంజీ ఆజ్ఞలమీద, గ్రామ కరణాలు తమవద్దనున్న, లేదా తమకు తెలియవచ్చిన గ్రామ సంబంధిత విషయాలను సేకరించారు. పైన పేర్కొన్న 1, 2, 3 అంశాలలోని విషయాలను ఈ గ్రామ కరణాలు (అనాలోచితంగానో, తమ అమాయకత్వంతోనో) కలిపేయటం ద్వారా కొన్ని చారిత్రక అవాస్తవాలు ఈ 'మెకంజీ రికార్డుల'(Mackenzie Records) లోకి వచ్చేసి ఉండవచ్చు.
పై అంశాలను పరిశీలిస్తే... మనకు కొన్ని విషయాలు అర్థం అవుతాయి: గ్రామ కరణీకాల ఉద్యోగాలకు గోపరాజు రామన్న మంత్రి బ్రాహ్మణులలో కొందరిని నియోగించిన కారణంగా అప్పుడు కొత్తగా 'నియోగి' శాఖ ఏర్పడి ఉంటుందన్న భావం తప్పు కావచ్చు. ఎందుకంటే, తిక్కన రాసిన భారతంలో తనను తాను 'నియోగి'గా ఆయన పేర్కొన్నారు. తిక్కన కాలం క్రీ.శ.13వ శతాబ్దం అన్నది తెలిసిందే. అంటే, రామన్న మంత్రి (గోపరాజు రామప్రధాని) కాలానికి కనీసం రెండు శతాబ్దాల ముందునుంచే 'వైదికి', 'నియోగి' శాఖాభేదాలు ఉండి ఉండవచ్చు.
మరొక్క విషయం: ఆంధ్రేతిహాస పరిశోధక మండలి, రాజమండ్రి వారి ఆధ్వర్యంలో, సుప్రసిద్ధ చారిత్ర పరిశోధకులు డా. మారేమండ రామారావుగారి సంపాదకత్వంలో వెలువడిన సుమారు 430 పేజీల 'కాకతీయ సంచిక' (తొలి ప్రచురణ: 1935, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పురావస్తు ప్రదర్శన శాలల శాఖవారి మలి ప్రచురణ: 1991)లో కానీ, లేదా శ్రీ పి.వి. పరబ్రహ్మ శాస్త్రిగారి విశిష్ట పరిశోధన 'కాకతీయులు' (దాదాపు 300 పేజీలు ఉన్న ఈ పుస్తక ప్రచురణ: మీడియా హౌస్, హైదరాబాద్, 2005, అనువాదం: శ్రీ కాకాని చక్రపాణి) లో కానీ ఎక్కడా 'గోపరాజు రామప్రధాని' పేరు కానరావటం లేదన్నదీ మనం గుర్తించాలి.
'కాకతీయ సంచిక'లో కేవలం ఒకే ఒక్కచోట మాత్రం గ్రామ కరణాలుగా నియోగి బ్రాహ్మణుల నియామకంగురించిన ప్రస్తావన ఉంది (శ్రీ మేడేపల్లి వెంకటరమణాచార్యులు వారి వ్యాసం 'కాకతీయ వంశం', పే. 193). అదికూడా గ్రామకరణాలుగా అంతవరకూ ఉన్న 'వారి నాయుద్యోగములనుండి తప్పించివేసి, వారి స్థానమందు నియోగి బ్రాహ్మణులను బెట్టెను' అని ఉంది. అంటే, అప్పటికే 'నియోగి బ్రాహ్మణులు' అనేవారు ఉన్నట్లే భావించవలసి వస్తోంది. ఇదే పుస్తకంలో సందర్భవశాత్తూ, మరొకచోట కాకతీయుల పరిపాలనాకాలంలో రాజకీయ నియోగములు, సేనా నియోగములు వంటివి ఉండేవని రాశారు. ఇక్కడ 'నియోగం' అంటే అర్థం 'విభాగం' అని మాత్రమే తోస్తోంది. ఇలా అనిపించటానికి కారణం ఈ వాక్యం: '.. సేనానాయకా ద్యనేకోద్యోగములు గల సైనిక నియోగ మొకటి ప్రత్యేకముగ నుండెడిది.' ఈ వ్యాసంలోనే, పరిపాలనా సౌలభ్యంకోసం కాకతీయుల కాలంలో మొత్తం 77 రాజకీయ నియోగములు ఉండేవని పేర్కొన్నారు. ('కాకతీయుల చరిత్రము', డా. మారేమండ రామారావు, పే.87). అయితే, ఇదే సంపుటి 'పరిచయము' వ్యాసంలో శ్రీ వి.వి.కృష్ణశాస్త్రి గారు 'కాకతీయుల కాలంలో రాజ్యం పరిపాలనార్థం నాడులుగా విభజింపబడినట్లు ప్రతాపరుద్రుని శ్రీశైల శాసనాలు తెలుపుతున్నై. వేంగినాడు, వెలనాడు, నతవాడి, కోనమండలం, విసురునాడు, ఏఱువనాడు, మార్జవాడి, కొండపల్లినాడు, శకలిసీమ, ప్రొలినాడు ప్రశస్తి చెందినవి. నాడులు స్థలముగాను, ఒక్కొక్క స్థలములో కొన్ని గ్రామాలు చేరియుండేవి. వానికి స్థల కరణాలు, స్థల తీర్పరులు, స్థల సుంకరులు, గ్రామకరణాలు, గ్రామ తీర్పరి అధికారులుగా వుండేవారు' అని రాశారు. ఈ వ్యాసంలో ఇన్ని వివరాలు ఉన్నా, కరణాలుగా నియోగి బ్రాహ్మణుల నియామకం గురించి కానీ, గోపరాజు రామప్రధాని గురించి కానీ ఏ ప్రస్తావనా లేదన్నది గమనార్హం. (నాడులు సీమలుగా, సీమలు స్థలములుగా, స్థలములు గ్రామములుగా విభజితం అయ్యాయని పైన పేర్కొన్న డా. మారేమండ రామారావుగారి వ్యాసంలో ఉంది. పే. 87)
అయితే, మెకంజీ పుణ్యమా అని రూపొందిన 'కైఫీయత్తుల' కారణంగా ఇప్పుడు అభిస్తున్న అనేక గ్రామాల చరిత్రలో ఉన్న గోపరాజు రామప్రధాని గురించిన వృత్తాంతం పూర్తిగా కొట్టివేయలేమనేందుకు మరికొన్ని అంశాలు తోడవుతున్నాయి.
గ్రామ చరిత్రలలో పేర్కొన్న 'రక్తాక్షి నామ సంవత్సర భాద్రపద అమావాస్య మంగళవారం' శాలివాహన శకం 1037కు సరిపోతుందని శ్రీ నందవర చౌడేశ్వరీ చరిత్రలో ఉంది. (శ్రీదేవీ మాహాత్మ్యము-శ్రీ నందవర చౌడేశ్వరీ చరిత్ర, రచన : శ్రీ గోపానందనాథులు, మే, 2010, పే. 15). (అయితే, క్రీ.శ. 1037వ సంవత్సరం ఈశ్వర నామ సంవత్సరం అవుతుందని డా. ఆదిరాజు ఫణీంద్ర తెలియజేశారు.) అయినా, .ఇది సరైనదే అనుకుంటే, గోపరాజు రామప్రధాని అసలు కాకతీయుల కాలంనాటివాడు కానేకాకపోవచ్చు. అప్పుడు ఆయన గురించిన ప్రస్తావన కాకతీయులకు సంబంధించిన ఏ పుస్తకంలోనూ ఉండకపోవటం సహజం. ఈ పుస్తకం ప్రకారం అయితే, గోపరాజు రామప్రధాని, ఓఢ్రరాజైన గణపతి దేవుని కాలానికి చెందినవాడుగా తేలతాడు.
ఇక్కడ మరో విషయాన్నీ ప్రస్తావించుకోవటం భావ్యంగా ఉంటుంది. ఎన్నో కైఫీయత్తులలో ప్రస్తావితమైన 'రక్తాక్షి నామ సంవత్సర భాద్రపద అమావాస్య మంగళవారం, సూర్యగ్రహణం' రో.ఉకు సరైన ప్రస్తుత గ్రెగోరియన్ క్యాలెండర్ తేదీ ఏదయి ఉంటుందా అన్న ఆసక్తితో కొంత పరిశోధననూ నేను చేపట్టాను. నా విజ్ఞప్తి మేరకు, డా. ఆదిరాజుఫణీంద్రగారు తెలియజేసిన వివరాల స్రకారం,క్రీ.శ. 1084 సెప్టెంబర్ 9వ తేదీ రక్తాక్షి నామ సంవత్సర భాద్రపద బహుళ అమావాస్య అవుతోంది. ఎటొచ్చీ అమావాస్య సోమవారం.రాత్రితో ముగుస్తోంది. సోమవారం రాత్రి అంటే, మంగళవారం పొద్దు వచ్చినట్లే అని భావిస్తే, ఈ తిధి సరిపోతుంది. పైగా ఆ రోజు కొద్దిగా సూర్యగ్రహణం కూడా ఉండటం విశేషం. 'కొద్దిగా' అనటం దేనికీ అంటే, ఈ సూర్యగ్రహణం సంపూర్ణం కాదు, మన దేశంలో అంతగా దర్శనమూ ఇవ్వలేదు. చైనా దేశంలో ఈ సూర్యగ్రహణం ఉందని వారు వివరించారు. క్రీ.శ. 1084 అంటే, కాకతీయుల సామ్రాజ్యం తొలినాళ్లన్నది స్పష్టం. మరి అప్పటికే, రాజ్యపాలనలో కుదురుకోవటం, ప్రభుత్వ విధివిధానాల నిర్ణయం జరగటం వంటివి చోటు చేసుకుని ఉంటాయా అన్నది సందేహమే! మళ్లీ రక్తాక్షి నామ సంవత్సరం, అరవై ఏళ్లకు కానీ అంటే, 1144కు కానీ రాదు, అది 1037కు బహుదూరం అన్నదీ వాస్తవం. ఈ కోణంలో మరికొంత విషయాలు అవగతమయితే తప్ప, వైదికి, నియోగి శాఖావిభజన ఎప్పుడు జరిగిందీ, ఎందుకు జరిగిందీ తెలియరాదు.
భారతంలో నియోగులు
నన్నయ తన్ను తాను 'కులబ్రాహ్మణుడ'ని తన ఆంధ్ర మహాభారతం, ఆది పర్వం, 9వ పద్యంలో వర్ణించుకున్నాడు. అప్పటికింకా వైదికి, నియోగి శాఖాభేదాలు ఏర్పడలేదు కాబట్టి, ఆయనను బ్రాహ్మణుడు అనటంతో సరిపెట్టాలి. నిజానికి అది తనను తాను 'పురోహితుడి'నని చెప్పుకోవటం అనుకోవాలి. నన్నయ వారిది ముద్గల గోత్రం. ఇది బహుశా ఇప్పటి మౌద్గల్యస (లేదా ముద్గల) గోత్రం కావచ్చు. నన్నయ వారిది తణుకు.
ఇక, తిక్కన విషయం: తిక్కన సోమయాజి అసలు పేరు 'తిరుకుల' కావచ్చునని పరిశోధకుల భావన. ఇది శ్రీకాళహస్తీశ్వరుని పేరు అయి ఉండవచ్చు. (శ్రీ కాళ - శ్రీ కల - తిరుకల - తిక్కల - తిక్కన.. ఇవీ ఆ పదం పొందిన రూపాంతరాలు కావచ్చు.) వీరి ఇంటిపేరు కొట్టరువు వారు. వీరు గౌతమస గోత్ర నియోగి బ్రాహ్మణులు.
ఎర్రన శ్రీవత్స గోత్రానికి చెందిన నియోగి బ్రాహ్మణుడు. వీరి ఇంటిపేరు 'చెదలువాడ' (చదలవాడ కాదు) అయిఉండవచ్చునని ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రచురించిన 'ఆంధ్ర మహాభారతం' ద్వితీయ సంపుటం, ఆరణ్యపర్వం, పే. 62లో ఆ గ్రంథ సంపాదకులు పేర్కొన్నారు.
నన్నయ 'కులబ్రాహ్మణుడు' కాగా, తిక్కన, ఎర్రనలు నియోగి బ్రాహ్మణులు కావడం విశేషం. నన్నయ్య కాలానికి తర్వాత, తిక్కన కాలానికి ముందు 'నియోగి' బ్రాహ్మణుల తెగ ఏర్పడి ఉండవచ్చుననేందుకు ఇవి సూచికలు కావచ్చు!!
వేంగీ చాళుక్యుల కాలంలోనే బ్రాహ్మణుల చరిత్ర గొప్ప మలుపు తిరిగింది. అంతకాలం వేదపఠనానికి, పురహితానికి మాత్రమే పరిమితమైన బ్రాహ్మణులు మంత్రాంగ, మంత్రిత్వ నిర్వహణలకు దారి తీశారు. 'బ్రాహ్మణులు కేవలము వేదశాస్త్ర పాండిత్యాలతోనే కాలంపుచ్చక, రాజోద్యోగాలు నిర్వహించ సాగారు. సేనాపతులుగా పేరుపడ్డారు. క్షత్రియరాజులకు బ్రాహ్మణ మంత్రులు ఏర్పడ్డారు. రాజరాజ నరేంద్రుని వద్ద వజ్జియప్రగడ ప్రధానిగా ఉండేవాడు. బ్రాహ్మణులు మంత్రిత్వం నిర్వహించే ఆచారం చాళుక్యుల కాలంలోనే ప్రారంభమైనది. నియోగి, వైదిక శాఖలకు ప్రారంభం జరిగింది' అని పేర్కొన్నారు శ్రీ ఏటుకూరి బలరామ మూర్తి తమ 'ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర' (పే.91)లో.
వీరే అదే పుస్తకంలో 132వ పేజీలో 'బ్రాహ్మణులను (కాకతి) గణపతి దేవుడు ఈ వృత్తిలో (కరణీకం) స్థిరపరచాడు. వీరే నియోగులు.... ఈ ప్రధానమైన మార్పుకు గణపతి దేవుని ప్రోత్సహించిన మంత్రి గోపరాజు రామప్రధాని అని ఆంధ్రదేశంలోని గ్రామకవిలెలలో ఉంది' అని వివరించారు. శ్రీ ఖండవల్లి లక్ష్మీరంజనం గారు తమ 'ఆంధ్రుల చరిత్ర - సంస్కృతి' పుస్తకం పేజీ 307లో 'నన్నయభట్టారకుని తర్వాత బ్రాహ్మణులలో వైదీకి, నియోగి భేదములేర్పడెను' అంటారు. చరిత్రకారులు కాకతీయులలో గణపతిదేవుని కాలం క్రీ.శ. 1199-1262గా నిర్ధారించారు. అలాగే, రాజరాజ నరేంద్రుని పాలనాకాలాన్ని క్రీ.శ. 1022-1061గా చరిత్ర పర్కొంటోంది. నన్నయార్యుని కాలం సుమారుగా ఇదే. అంటే, సుమారు క్రీ.శ. 11వ శతాబ్దాంతంలోనో, లేదా 12వ శతాబ్దం ఆరంభంలోనో బ్రాహ్మణులలో వైదీకి, నియోగి శాఖల విభజన జరిగి ఉండవచ్చు. అంటే, బ్రాహ్మణులలో ఈ శాఖా విభజన నేటికి సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం జరిగి ఉండవచ్చు.
నియోగి రాజముద్రికలు
'నియోగుల' ఆవిర్భావం గురించి మరొక కథ కూడా ఉంది: ఒకసారి ఒక బ్రాహ్మణుడు గోల్కొండ ప్రాంతంలో నడిచి వెడుతున్నాడట. ఆ సమయంలో ఇద్దరు ముస్లిములు ఏదో విషయమై అక్కడ తగువు పడుతున్నారు. వారి తగువు తీర్చటం తన ధర్మమే అయినా, ఆ బ్రాహ్మణునికి వీరు మాట్లాడుకుంటున్న భాష (బహుశా ఉర్దూ కావచ్చు) రాకపోవటంతో, ఏం చేయాలో తోచక, అక్కడే ఉండిపోయాడు. చివరికి, పరిష్కారానికై ఈ తగువు గోల్కొండ నవాబు వద్దకు చేరింది. ఆయన అక్కడున్న సాక్షులను ప్రవేశపెట్టమని ఆజ్ఞ ఇవ్వగానే, భటులు ఈ బ్రాహ్మణుని ప్రవేశ పెట్టారు. జరిగిన విషయం ఏమిటని నవాబు అడిగితే, ఏకసంథగ్రాహి అయిన ఆ బ్రాహ్మణుడు 'వారిద్దరూ తగువు పడటం వాస్తవం. ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను. కానీ, నాకు వారు మాట్లాడిన భాష ఏమిటో తెలియలేదు. అయినా వారు అన్న మాటలను యథాతథంగా మీకు విన్నవిస్తాను' అంటూ, తనకు రాని ఉర్దూ భాషలో వారు పరస్పరం ఏమేం అనుకున్నారో, అన్ని మాటలనూ యథాతథంగా ఏకరువు పెటాడు. ఆ విద్వత్తుకు నవాబు ఆశ్చర్యపోయి, 'ఏం కావాలో కోరుకో' అన్నాడు. దీనికి వెంటనే బ్రాహ్మణుడు స్పందించలేకపోయాడు. అప్పుడు నవాబు 'అయితే ఇదిగో, నా రాజముద్రిక, అద్భుతమైన మీ మేధోసంపత్తికి నా జోహార్లు. ఈ రాజముద్రికపై మీకు 24 గంటల పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నాను. ఈ సమయంలో మీరు ఏం చేసినా, దానికి రాజామోదం ఉంటుంది' అన్నాడు.
అప్పుడు ఆ బ్రాహ్మణుడు తనకూ, తనవారికి ఏం చేయాలా అని ఆలోచించాడు. వెంటనే ఆయనకు ఏం చేయాలో తోచకపోవటంతో, ముందుగా కొన్ని పత్రాలమీద రాజముద్రికను వేసుకుంటే, తర్వాత ఆ పత్రాలను ఏవిధంగా నింపుకోవాలో ఆలోచించుకోవచ్చునని భావించి, ఆ ప్రకారమే ఖాళీ పత్రాలమీద ఆ రాజముద్రికను ముద్రించుకోనారంభించాడు. తెల్లవారే సమయానికి కేవలం ఆరువేల పత్రాలమీద ముద్రను వేయగలిగాడు. ఆ తర్వాత, బాగా ఆలోచించి, రాజ్యంలోని గ్రామ రికార్డులను పదిలపరిచే కరణీకం పనిని సాటి బ్రాహ్మణులకు ఇస్తూ, ఆ ఖాళీ రాజపత్రాలను నింపాడట. ఇలా, కరణీకవృత్తిలోకి నియోగింపబడిన ఆరు వేల మందే 'ఆరు వేల నియోగి బ్రాహ్మణులు' అయ్యారని ఒక కథ. ఇది ప్రచారంలో ఉన్నా, దీనికి చారిత్రక ఆధారాలు లేవు. పైగా నియోగి శాఖ, తిక్కన నాటికే ఉందన్నది స్పష్టం గనుక, ఆ తర్వాత చాలాకాలంనాటికి చెందిన గోల్కొండ నవాబులనాటిదనే ఈ కథను నమ్మనవసరం లేదనిపిస్తుంది.
ఇక్కడ మరొక అంశాన్నీ ప్రస్తావించటం భావ్యంగా ఉంటుంది. శాలంకాయనులలో ఒకడైన స్కందవర్మ వేయించిన కంతేరు దానశాసనంలో 'నియోగ, నియుక్త, యుక్తక, విషయపతి' అన్న పేర్లతో రాజోద్యోగులు కానవస్తున్నారు. ఇక్కడ 'నియోగ' అనేది ఒక రాజోద్యోగం అన్నది స్పష్టం. ఆ ఉద్యోగంలోని వారు ఏం చేసేవారో, వారి విధివిధానాలు ఏమిటో తెలియదు. కాకతీయుల కాలంలో కరణాలుగా నియుక్తులైన బ్రాహ్మణులు 'నియోగ' రాజోద్యోగం చేసేవారో, లేకుంటే, కరణాలుగానే నియమితులు అయ్యారో ఆలోచించాల్సి ఉంది.
నెల్లూరు ప్రాంతాన్ని మనుమసిద్ధి మహారాజు పరిపాలిస్తున్న కాలంలో, నాటి రాజమహేంద్ర వరాన్ని (నేటి రాజమండ్రి) పరిపాలిస్తున్న రాజరాజ నరేంద్రుని కుటుంబంతో కుదిరిన ఒక వైవాహిక బంధం ఒప్పందంలో భాగంగా, నెల్లూరు నుంచి ఆరువేల మంది బ్రాహ్మణులు రాజమహేంద్ర వరానికి అరణంగా వెళ్లారనే కథ మరొకటి ఉంది. అయితే, మనకు తెలిసిన చరిత్ర పరంగా చూస్తే, ఈ కథ అంత వాస్తవంగా అనిపించదు. చరిత్ర ప్రకారం, రాజరాజ నరేంద్రుడు, మనుమసిద్ధి సమకాలికులు (అంటే, ఒక కాలానికి చెందినవారు) కారు.మరొక కథనం ప్రకారం, మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన ఆరువేల మంది బ్రాహ్మణులు, అక్కడినుంచి ఆంధ్రప్రాంతానికి వలస వచ్చారని, వారు ఇక్కడ కరణాలుగా స్థిరపడ్డారని అంటారు. మహారాష్ట్రలో నేటికీ 'కులకర్ణి' బ్రాహ్మణులు ఉన్నారు. పూర్వాశ్రమంలో వారు అక్కడ 'కుల'వృత్తిగా 'కరణం' పనులు చేసేవారు కాబట్టి, 'కులకర్ణి'లు అయ్యారు.
అయితే, యాగయజ్ఞాలకు భిన్నమైన 'యోగ' సంబంధించిన విద్యలు అభ్యసించిన వారు కాబట్టి, వారికి 'యోగ' పదంలోంచి 'నియోగులు' అని పేరు వచ్చిందని, బ్రాహ్మణుల గురించిన పరిశోధనలు చేసిన జోగేంద్రనాథ్ భట్టాచార్య రాశారు.
ఆర్వేల వారు ఎంతటివారు!
'అఖిల రాజాధిరాజాస్థాన జన హృద్య విద్యావిహారు లార్వేలవారు' అని కంకంటి పాపరాజు తన 'ఉత్తర రామాయణం' కావ్యంలో మొదటి ఆశ్వాసం 27వ పద్యంలోనే పేర్కొన్నారు. సకల రాజుల ఆస్థానంలోని సమస్త జనుల హృదయాలను చూరగొనేంతటి పాండిత్యం కలవారు ఆరువేల (నియోగుల) వారు అని అర్థం.
దాదాపు ఇదే అర్థం వచ్చే విధంగానూ - బహుశా ఈ పద్యం స్ఫూర్తితోనే కావచ్చు- ఆంధ్రప్రదేశ్ ప్రథమ ఆస్థాన కవీంద్రులైన శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రిగారు తమ 'ధన్వంతరి చరిత్రము'లో
- 'రాజాధిరాజవిరాజితషాడ్గుణ్య
- విద్యావిహారు లార్వేలవారు
- శిబికర్ణముఖ దాతృ శేఖరసదృశాతి
- వితరణసారు లార్వేలవారు
- కావ్యజీవకుమార ఘనశస్తనిస్తుల
- విజ్ఞానధీరు లార్వేలవారు
- వేదసమ్మతలౌక్య వైదికవ్యవహార
- విధిసమాచారు లార్వేలవారు...'
'ఎందు నియోగింపవలెనన్నా, నియోగింపదగినవాడు నియోగి' అన్న సూక్తి కూడా ఉంది. 'తెనాలి రామకృష్ణ' సినిమాలో 'నియోగిబిడ్డను, దేనికి నియోగించినా వినియోగపడతాను' అని తెనాలి రామకృష్ణుడు, శ్రీకృష్ణ దేవరాయలవారితో అన్నట్లుగా సముద్రాల సీనియర్ సంభాషణారచన చేసిన సంగతినీ ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. ఈ చతురోక్తి నేటికీ అక్షరాలా నిజమేనంటూ నియోగి బిడ్డలు అనేక రంగాల్లోనూ తమ ప్రజ్ఞను నిరూపించుకుంటూనే ఉన్నారు.
మూలము: హిందూబ్రాహ్మణస్