ప్రపంచంలో విస్తరణవాద శకం ముగిసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఇంతకాలం విస్తరణకాంక్షతో ప్రయత్నించిన శక్తులు ఓటమి చవిచూడటమో లేక తమ నిర్ణయాలను వెనక్కి తీసుకోవడమో జరిగిన విషయాన్ని చరిత్ర సాక్షాత్కరిస్తోందన్నారు. ఇది విస్తరణ సమయం కాదనీ, అభివృద్ధే ద్యేయంగా పనిచేయాల్సిన సమయమనీ చైనాకు పరోక్షంగా చురకలంటించారు. వాస్తవాధీన రేఖ వెంట దురాక్రమణకు పాల్పడుతూ, సరిహద్దు వివాదాలను సృష్టిస్తోన్న చైనాకు ఈ వ్యాఖ్యల ద్వారా దీటైన సందేశాన్ని పంపించారు. నేడు లద్దాఖ్‌లో పర్యటించిన మోదీ సైనికులనుద్దేశించి ప్రసంగించారు.
‘ప్రపంచం మొత్తానికి భారత్ శక్తి సామర్థ్యాలు నిరూపించారు. శత్రువులకు మీ పరాక్రమం ఏంటో చూపించారు. దేశవ్యాప్తంగా ప్రతి ఇంట్లో భారత సైనికుల సాహస గాథల గురించి మాట్లాడుకుంటున్నారు’ అని ప్రధాని మోదీ సైనికులను కొనియాడారు. అంతేకాకుండా, వేల సంవత్సరాల నుంచి ఎన్నో దాడులను తిప్పికొట్టిన మన సంకల్పం ఎంతో గొప్పది. ప్రస్తుతం భారత్ శక్తి సామర్థ్యాలు అజేయం. జల, వాయు, పదాతి, అంతరిక్ష విభాగాల్లో మన శక్తి సమున్నతమని అన్నారు. ధైర్య సాహసాలతోనే శాంతి అభిస్తుందని, బలహీనులు ఎప్పటికీ శాంతిని సాధించలేరని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు.
జూన్ 15వ తేదీ రాత్రి గల్వాన్ ఘర్షణలో 20మంది భారత సైనికులు అమరులైన విషయం తెలిసిందే. ఈ ఘర్షణలో దాదాపు 43మంది చైనా సైనికులు కూడా మరణించినట్లు సమాచారం. ఈ ఘర్షణ అనంతరం వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న తాజా పరిస్థితులపై సమీక్షించడంతోపాటు సైనికుల్లో స్థైర్యం నింపేందుకు భారత ప్రధాని నేడు లద్దాఖ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి సైనికులతో ప్రధాని మోదీ ముచ్చటించారు. అనంతరం అక్కడ నెలకొన్న పరిస్థితులపై చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆర్మీచీఫ్ జనరల్ ఎంఎం నరవణేతో కలిసి ప్రధాని సమీక్షించారు. సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలోనే ప్రధాని పర్యటించడం భారత సైనికుల్లో ఉత్సాహాన్ని కలిగించింది.
_vsk