పరమశివుని పూజించుకునేటప్పుడు మనం ‘ఏకబిల్వం శివార్పణం’ అంటూ మారేడు దళాలను సమర్పించుకుంటూ పూజించుకుంటుంటాము.
జ్ఞానస్వరూపమయిన పరమాత్మయే పరమశివుడు. మనలోని అజ్ఞానాన్ని (మందబుద్ధిని) రూపుమాపి, ‘జ్ఞానజ్యోతి’ ని వెలిగించి, మన మనసులను పవిత్రం చేసి, నిర్మలమైన జీవనాన్ని కల్గించమని, జ్ఞానస్వరూపమైన మారేడు దళాలను స్వామికి సమర్పించుకుంటుంటాము.
పూజకుడు – పూజ్యము – పూజ/స్తోత్రము – స్తుత్యము – స్తుతి /జ్ఞాత – జ్ఞేయము – జ్ఞానము అనే అర్థాలను చెబుతున్నారు. ఇలా (3×3) మూడు x మూడును వేర్వేరుగా భావించుటయే త్రిపుతిజ్ఞానం. ఒక వృక్షానికి కొమ్మలు వేరువేరుగా కనిపించినప్పటికీ, ఆధారకాండము ఒక్కటే అయినట్లు, సృష్టి, స్థితి, లయ కారకుడైన ఆ మహాదేవుడు మారేడు దళాలలో మూడుపత్రాలుగా వేరు వేరుగా వున్నట్లు గోచరిస్తున్నాడు. కానీ, ఆయన సర్వాంతర్యామి. బిల్వపత్ర దర్శనం వలన అత్యంత పుణ్యం లభిస్తుంది. వాటిని స్పృశించటం వలన సర్వపాపాలు నశిస్తాయి. ఒక బిల్వ పత్రాన్ని శివునికి భక్తిశ్రద్ధలతో అర్పించటం వలన, ఘోరాతిఘోరమైన పాపాలు సైతం తొలగిపోతుంటాయి. అటువంటి త్రిగుణాలుగల బిల్వ దళాన్ని స్వామికి అర్పించుకుంటే ఆయన అనుగ్రహం సులభంగా కలుగుతుంది.
“పూజకుడవు నీవే, పూజింపబడేది నీవే, పూజాక్రియవు నీవే” అనే భావంతో శివుని పూజించుటయే సరియైన పద్ధతి. ఈ జ్ఞానరహస్యాన్ని తెలుసుకుని – బిల్వపత్రరూపంతో ‘త్రిపుటి జ్ఞానాన్ని’ నీ పాదాల చెంత నేను సమర్పిస్తున్నాను అని స్వామికి విన్నవించుకుని ‘శివోహం, శివోహం’ అనే మహావాక్యజ్ఞానాన్ని స్థిరపరిచేదే బిల్వార్చన అవుతుంది. పవిత్రమయిన ఈశ్వరపూజకు ‘బిల్వపత్రం’ సర్వశ్రేష్టమైనది. శివార్చనలకు మూడురేకులతోనున్న పూర్తి బిల్వదళాన్నే ఉపయోగించాలి. ఒకసారి కోసిన బిల్వపత్రాలు, సుమారు 15 రోజులవరకు పూజార్హత కలిగి ఉంటాయి. వాదిపోయినప్పటికీ దోషం ఉండదు.
ఏకబిలపత్రంలోని మూడురేకులలో ఎడమవైపునది బ్రహ్మఅనీ, కుదివైపుది విష్ణువనీ, మధ్యనున్నది శివుడని చెప్పబడుతోంది. ఇంకా బిల్వదళములోని ముందుభాగంలో అమృతము, వెనుక భాగంలో యక్షులుండటంచేత, బిల్వపత్రంయొక్క మున్డుభాగాన్ని శివునివైపు ఉంచి పూజించాలి. బిల్వవనం కాశీక్షేత్రంతో సరిసమానమైనది అని శాస్త్రవచనం. మారేడుచెట్టు ఉన్నచోట, ఆ చెట్టు క్రింద ‘లింగాకారం’లో శివుడు వెలసి ఉంటాడుట. ఇంటి ఆవరణలో ఈశాన్యభాగంలో మారేడుచెట్టు ఉంటే, ఆపదలు తొలగి సర్వైశ్వర్యాలు కలుగుతాయి. తూర్పున ఉంటే సుఖప్రాప్తి కలుగుతుంది. పడమరవైపున ఉంటే సుపుత్రసంతాన ప్రాప్తి, దక్షిణవైపు ఉంటే యమబాధాలు ఉండవు.
సంకలనం: కోటేశ్వర్