తెలుగు రాష్ట్రాల్లో తెరుచుకున్న ఆలయాలు
లాక్ డౌన్‌తో కొద్ది రోజులు విశ్రాంతి తీసుకున్న దేవుడు మళ్లీ భక్తులకు దర్శనమిస్తున్నాడు.
తెలుగు రాష్ట్రాల్లో సోమవారం 8 జూన్ ఈ రోజు నుంచి ఆలయాలు తెరుచుకున్నాయి. అన్ లాక్ 1.oలో ఆలయాలు అనుమతి ఇవ్వడంతో దేశవ్యాప్తంగా తెరుచుకున్నాయి. అయితే అన్ని చోట్ల పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తున్నారు. ప్రధాన ఆలయాల్లో ముందుగా రెండు రోజుల పాటు ఆలయ ఉద్యోగులు, స్థానికులతో ట్రయల్ రన్ నిర్వహించిన తర్వాత సామాన్య భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు.
తిరుమలలో సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. రెండున్నర నెలల తర్వాత శ్రీవారి దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. ట్రయల్ రన్ కింద ఉద్యోగులను దర్శనానికి అనుమతించారు. ఇవాళ, రేపు కొంతమంది టీటీడీ సిబ్బందికి ఆలయ ప్రవేశం ఉంటుంది.
జూన్ పదిన తిరుమలలో స్థానికులకు అవకాశం కల్పిస్తారు. ఈనెల 11 నుంచి సాధారణ భక్తులను అనుమతిస్తారు. ఉదయం 6-30 గంటల వరకు వీఐపీ బ్రేక్ దర్శనం.. ఆపై రాత్రి 7-30 గంటలవరకు సాధారణ భక్తులకు దర్శనం కల్పిస్తారు.
ఆన్ లైన్లో 3 వేల టిక్కెట్లు అలిపిరి వద్ద ఉండే కౌంటర్ల ద్వారా మరో 3వేల టిక్కెట్లు విక్రయిస్తారు. ఆన్ లైన్లో దర్శనం టిక్కెట్లతోపాటే అద్దెగదులను బుక్ చేసుకోవచ్చు. ఒక గదిలో ఇద్దరికే అనుమతి ఇస్తారు. ఇది 24 గంటలకే పరిమితమని పొడిగింపుకు వీల్లేదు. ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి లేదు.
తీర్థప్రసాద వితరణ ఉండదు. దర్శనానికి ఎవరి సిఫారసు లేఖలు చెల్లవు. ప్రొటోకాల్ ఉన్న వీఐపీలు వ్యక్తిగతంగా వస్తే వారికి మాత్రమే ఉదయం 6-30 నుంచి 7-30 గంటల వరకు బ్రేక్ దర్శనం కల్పిస్తారు. గంటకు 500 మంది భక్తులకు మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు. రోజుకు 6వేల మంది భక్తులకు మాత్రమే స్వామి వారి దర్శనం లభించనుంది.
___తెలుగు భారత్