శ్రీరామదాసు చిత్రంలో బ్రాహ్మణ ద్వేషం
(గమనిక: నేను బ్రాహ్మణుడిని కాను)కొంచెం ఆశ్చర్యం అనిపించినా ఇదే నిజం. బ్రాహ్మణ ద్వేషాన్ని ఏదో కొమ్మ్యూనిస్టు చిత్రాలు మాత్రమే ప్రచారం చేశాయి అనుకుంటే పొరపాటే. ఎన్నో భక్తి చిత్రాలలో కూడా ఇది మనకు కనబడుతుంది. చివరికి మాయాబజార్ వంటి గొప్ప చిత్రంలో కూడా మనకి బ్రాహ్మణ ద్వేషం కనిపిస్తుంది. ఆ చిత్రంలోని తాన శాస్త్రి, తందాన శర్మ పాత్రాల సృష్టి ఉద్దేశం అదే.
ఇక రామదాసు చిత్రం విషయానికి . వస్తే, ఇందులో కూడా మనకు బ్రాహ్మణ ద్వేషం స్పష్టంగా కనిపిస్తుంది. చారిత్రకంగా నిజం కాకపోయినా (కనీసం నాకు తెలిసి) రామదాసు గారిని కబీర్ గారు కలిసినట్లు ఈ సినిమాలో చూపించారు. అంతేకాక ఆయనే భద్రాచల రామ మందిర నిర్మాణానికి ముహూర్తం కూడా పెట్టినట్లు చూపించారు. దీనిని ఒక బ్రాహ్మణుడు వ్యతిరేకిస్తాడు. అది కల్పిత పాత్ర అనేది స్పష్టం. ఆ పాత్రని బ్రహ్మానందం గారు పోషించారు. కబీర్ గారు రామ మందిర నిర్మానికి ముహూర్తం పెట్టడాన్ని, తరువాతి కాలంలో రామ మందిరంలోకి ప్రవేశించడాన్నీ కూడా ఆ బ్రాహ్మణుడు వ్యతిరేకిస్తాడు. ఈ సినిమా ప్రకారం కబీర్ గారిని వ్యతిరేకించిన బ్రాహ్మణుడు చాలా నీచుడు, ఒక సమయంలో రామదాసు, అతనిని మేడపట్టుకు తోసేస్తాడు. చివరికి అతను తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాప పడి, కబీర్ గారి కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాడు.
ఈ సినిమాలోనే ఇంకో బ్రాహ్మణ పాత్ర కూడా ఉంది. అతను రామదాసుకి ద్రోహం చేసే మరో వ్యక్తికి సహాయం చేస్తూ ఉంటాడు. పరమ నీచుడు. ఈ మొత్తంలో రామదాసు గారిని కబీర్ కలిశారు అని మాత్రమే ఒకరిద్దరు అంటుంటారు తప్పా, దాని ఆధారంగా చిత్రంలో చేర్చిన మిగిలిన సంఘటనలు అన్నీ కల్పితాలే. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాబీర్ ని వ్యతిరేకించే పాత్ర, రామదాసుకి వ్యతిరేకంగా కుట్రలు చేసే వాడికి సహాయం చేసే బ్రాహ్మణ పాత్ర రెండూ కల్పితాలే. ఇవి కల్పితాలు అనడంలో చర్చ లేదు. అంటే వీటిని రామదాసు చిత్రం రచయిత, దర్శకులు కావాలనే సృష్టించారు. ఇంకో ముఖ్యమైన విషయం, సినిమా మొత్తంలో ఈ రెండు బ్రాహ్మణ పాత్రలవి తప్ప మిగిలిన ఏ ప్రధాన పాత్ర కులం ఫలానా అని మనకి తెలియదు. నిజానికి రామదాసు గారు బ్రాహ్మణుడు, కానీ ఆ విషయం సినిమాలో ఎక్కడా చూపించరు. అంటే ఆ సినిమా ఎవరి గురించి అయితే తీశారో, ఆ మహాభక్తుడు బ్రాహ్మణుడు అయినా, ఆ విషయం సినిమా మొత్తంలో ఎక్కడా ప్రస్తావించలేదు, అదే సమయంలో రెండు కల్పిత బ్రాహ్మణ పాత్రలు సృష్టించి వాటిని నీచంగా చూపారు.
నాకైతే ఇది యాదృచ్ఛికంగా (Coincidence) జరిగింది అనిపించడం లేదు. ఏవైనా కొత్త బైకులు విడుదల అయినప్పుడు, హీరోలు వాటిని వాడినట్లు సినిమాలో చూపిస్తారు. ఇది ఒకరకమైన వాణిజ్య ప్రకటన (Advertisement). అందుకు సినిమా వారికి బహుశా ఆ కంపెనీ వారు కొంత డబ్బు ఇస్తారు.
అలానే సినిమాలో మధ్యం (మందు) తాగిన సన్నివేశాలు చూపించినందుకు కూడా వాళ్ళకు మధ్యం అమ్మే సంస్థలు డబ్బు ఇస్తాయి అని నా అనుమానం. హీరో ఆ బైక్ నడపకపోయినా, సినిమాలో మధ్యం తాగే సన్నివేశాలు లేకపోయినా సినిమాలో ఏ మార్పూ రాదు, అంటే ఈ సన్నివేశాలు టివి కార్యక్రమాల మధ్యలో వచ్చే వాణిజ్య ప్రకటనల వంటివి అన్నమాట. అలానే రామదాసు సినిమాలో కూడా ఆ రెండు దుష్ట బ్రాహ్మణ పాత్రలు లేకపోయినా సినిమాకి వచ్చే నష్టం ఏమీ ఉండదు. మరి వేరే ఎవరికైనా నష్టం వస్తుందేమో తెలియదు.
అంటే ఎవరైనా డబ్బులు ఇచ్చి మరీ ఇలా సినిమాలలో బ్రాహ్మణ ద్వేషాన్ని ప్రచారం చేస్తున్నారని మీ అనుమానామా, అని మీరు అడిగితే నా సమాదానం “అవును” అనే. నిశ్చయంగా తెలియకపోయినా, బలమైన అనుమానం మాత్రం ఉంది. దీనినే పరిస్తితి సంబంధ సాక్ష్యము (circumstantial evidence) అంటారు. అయితే ఎందుకు పనిగట్టుకుని ఇలా బ్రాహ్మణులను చులకచెయ్యడం, అది కూడా డబ్బు ఖర్చు పెట్టి మరీ అని మీరు అడగవచ్చు. దానికి ఒక్కటే కారణం, బ్రాహ్మణ్యం హిందూ ధర్మ ప్రధాన బలాలలో ఒకటి. దానిని నాశనం చేసేస్తే హిందూ ధర్మాన్ని, అటు తరువాత భారతదేశాన్ని నాశనం చేసెయ్యడం చాలా సులభం. బ్రాహ్మణ్యం హిందూ ధర్మాన్ని కాపాడే బలమైన కోట వంటిది అని, దానిని నాశనం చేస్తేనే కానీ క్రైస్తవం విజయం సాధించలేదు అని మోనియర్ విలియమ్స్ అభిప్రాయ పడ్డాడు. కనుక బ్రాహ్మణ్యాన్ని నాశనం చెయ్యాలి అనే కోరిక, అవసరం ఎవరికి ఉంటాయో మీకు ఈ పాటికే అర్దం అయి ఉంటుంది. బ్రాహ్మణ్యం బలంగా ఉన్నంత కాలం హిందువులను మతం మార్చడం అసాధ్యం అని మత మార్పిడి మాఫియాలకు బాగా తెలుసు. ఇక తెలియాల్సింది మనకే. బహుశా, ఇటువంటి వ్యవస్థలు లేకపోవడం వల్లనే క్రైస్తవం, ఇస్లాంలు మిగిలిన చోట్ల చాలా సులభంగా మత మార్పిడులు చెయ్యగలిగారు
బ్రాహ్మణ ద్వేషాన్ని పెంచి, పోషించే సినిమా వారందరికీ ఈ విషయం తెలుసో, తెలియదో నాకు తెలియదు కానీ వారు చేసే పనుల వలన మాత్రం మనకు చాలా నష్టం జరిగింది, జరుగుతోంది. నిజానికి ఇది బ్రాహ్మణ ద్వేషం కాదు, ఆ రూపంలో కనబడే హిందూ ద్వేషం, భారతదేశం మీద ద్వేషం. వారి లక్ష్యం హిందూ ధర్మాన్ని నాశనం చెయ్యడం, బ్రాహ్మణ్యం వారికి అడ్డు కనుక దానిని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రతీ హిందువూ అర్దం చేసుకోవాలి.
గమనిక:
ఈ వ్యాసము రచయిత అభిప్రాయం..
సంకలనం/రచన: వడియాల రంజిత్