సుప్రీంకోర్టు ఆంక్షల మధ్య పూరీ పట్టణంలో జగన్నాథ రథయాత్ర నిరాడంబరంగా ప్రారంభమయింది. మూడు దారు రథాల్లో ఆసీనులైన సుభద్రా, బలభద్ర సమేత జగన్నాథ స్వామిని భక్తులు స్వయంగా లాగుతూ ‘బడొదండొ’ మార్గంలో గుండిచా దేవి మందిరానికి తీసుకువెళ్లే యాత్రనే రథయాత్ర అంటారని తెలిసిందే.
కాగా నేడు ప్రత్యేక పూజల తర్వాత సంప్రదాయానుసారం మధ్యాహ్నం 12 గంటలకు పూరీ మహారాజు దివ్యసింగ్దేబ్ గజపతి.. బంగారు చీపురుతో స్వామివారి రథాన్ని శుభ్రం చేసే కార్యక్రమం ‘ఛెర్రా పహన్రా’ పూర్తిచేశారు. దీనితో జగన్నాధుడు తన నందిఘోష్ రథంలో, బలభద్రుడు తాళ ధ్వజంలోను, సుభద్రా దేవి దర్పదళన్ రథంలో తరలివచ్చే రథయాత్రకు మార్గం సుగమమయింది.
ఒక్కో రథాన్ని లాగేందుకు భద్రతా సిబ్బందితో సహా కేవలం 500 మందినే సుప్రీం కోర్టు అనుమతించిన నేపథ్యంలో… లక్షలాది భక్తులతో కిక్కిరిసి ఉండాల్సిన పూరీ వీధులు ఈసారి బోసిపోవడం గమనార్హం. చరిత్రలోనే తొలిసారిగా నేటి యాత్రలో కేవలం పూజారులు, సిబ్బంది మాత్రమే పాల్గొన్నారు. రథయాత్ర కొనసాగుతుండగానే క్రిమినాశక శానిటైజేషన్ ద్రవాన్ని పరిసరాల్లో పిచికారీ చేశారు. అంతేకాకుండా, కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ప్రజలను నియంత్రించేందుకు పట్టణంలోని అన్ని ప్రవేశ ద్వారాలను మూసివేశారు.
_విశ్వ సంవాద కేంద్రము