రామాయణాన్ని వక్రీకరించిన సప్తగిరి పత్రిక
సీతారాముల సంతానం పేర్లు ఏమిటని అడిగితే దేశంలో ఎవరైనా తడుముకోకుండా "కుశలవులు లేదా లవకుశల" అని చెబుతారు. వారి గాథతో తెలుగునాట ” లవకుశ” పేరుతో విడుదలయిన చలన చిత్రం అఖండ విజయాన్ని సాధించిన సంగతి అందరికీ తెలుసు. ఆ చలన చిత్రం విడుదలై అర్థ శతాబ్దం దాటినా ఆ చిత్రంలోని సన్నివేశాలను, గీతాలను ఇప్పటికీ గుర్తు చేసుకునేవారు ఎందరో ఆంధ్రదేశంలో ఉన్నారు.
కానీ కుశుడు సీతారాముల కుమారుడు కాదంటూ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ప్రతిష్టాత్మక ప్రచురణ అయిన ‘సప్తగిరి’ మాసపత్రికలో ఓ కథనం వెలువడ్డం అందరినీ ఆశ్చర్యానికీ, ఆగ్రహానికీ గురిచేస్తోంది. కుశుడు సీతారాముల సంతానం కాదని, వాల్మీకి మహర్షి పూజలో ఉండగా సీతమ్మ లవుని వాల్మీకి మహర్షి సంరక్షణలో ఉంచి నదీ స్నానానికి వెళ్లిందని, వాల్మీకి మహర్షి పూజలో మునిగి ఉండగా లవుని ఒక కోతి అపహరించుకు పోయిందని, లవుడు మాయమైన విషయం గమనించిన వాల్మీకి మహర్షి తన మంత్ర శక్తి చేత అచ్చం లవుని పోలిన మరో శిశువును సృష్టించాడని, ఇంతలో లవుని అపహరించుకు పోయిన కోతి ఆ శిశువును నది ఒడ్డున పెట్టి వెళ్ళగా… నదీ స్నానం నుంచి తిరిగి వస్తున్న సీతమ్మ అక్కడ లవుని చూచి ఆశ్చర్యపోయి ఆశ్రమానికి తీసుకొచ్చిందని, అక్కడ మరళా తన బిడ్డను చూచి ఆశ్చర్యపోయిన సీతమ్మకు వాల్మీకి జరిగిన వృత్తాంతం చెప్పగా ఆమె మిక్కిలి సంతోషించి కుశ (దర్భ)తో పుట్టాడు కనుక ఆ బిడ్డకు ” కుశుడు” అని నామకరణం చేసిందని పేర్కొంటూ ఓ కథ ప్రచురితమైంది. ఈ కథను తిరుపతిలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తొమ్మిదో తరగతి విద్యార్థి అయిన మాస్టర్ ఆర్పి పునీత్ అనే విద్యార్థి వ్రాసినట్లుగా అందులో పేర్కొనడం జరిగింది. దీనిపై ప్రస్తుతం రాష్ట్రమంతటా హిందూత్వ వాదులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి కుశలవులు కవలలు. పైగా కుశుడు లవుడి కంటే పెద్దవాడని రామాయణంలో చెప్పబడి ఉంది. మరి పై కథనం ప్రకారం లవ కుశులలో ఎవరు పెద్దవారు? లవ కుశులు జన్మించినపుడు రాముని సోదరుడైనశత్రుఘ్నుడు కూడా వాల్మీకి ఆశ్రమంలో ఉన్నట్టుగా రామాయణంలో చెప్పబడి ఉన్నదని, తన వదినకు కవలలు జన్మించిన సంగతి తెలుసుకుని శత్రుఘ్నుడు కూడా మిక్కిలి సంతోషించాడని కొందరు గుర్తు చేస్తున్నారు. ప్రతిష్టాత్మక సంస్థ అయిన తితిదేకి, దాని అధికారులకు రామాయణం తెలియకపోవడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
ఎవరో చిన్నపిల్లాడు కుశుడు రాముడి కొడుకు కాదని రాసిన పిచ్చికధను సప్తగిరి లాంటి ప్రతిష్ట కలిగిన పత్రికలో కనీసం పరీక్షించకుండా, నిజా నిజాలు నిర్ధారించుకోకుండా ఎలా ప్రచురించారని వారు ప్రశ్నిస్తున్నారు.
గతంలోనూ ఇదే తీరు :
గతంలోనూ TTD ప్రుచురించిన పుస్తకాలలో అనేక అభ్యంతరకర విషయాలు వెలుగుచూశాయి. ఒక పుస్తకంలో యేసు కీర్తన ప్రచురించటం కూడా అప్పట్లో వివాదాస్పదమైంది. ఇప్పటికే అనేకసార్లు తితిదే ప్రచురణలు పలుసార్లు వివాదాస్పదమైన దృష్ట్యా మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని TTD పెద్దలను వారు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం దీనిపై సామాజిక మాధ్యమాలలో పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమౌతున్నాయి. #ttd_learnRamayan పేరుతో ఒక హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అవుతోంది.
మూలము: విశ్వ సంవాద కేంద్రము (ఆంధ్ర రాష్ట్రము )