"పెట్టుబడి లేని ప్రకృతి సేద్యం.." - "ZERO BUDGET NATURAL FARMING.."
~~~~~~~~~~~~~~~~~~~~~
అసలు ఏమిటి ఈ ప్రకృతి సేద్యం, దీని వలన రైతులకి జరిగే మేలు ఏమిటి అనేది ముందు ప్రధానంగా తెలుసుకోవలసిన విషయం.. ఒక్క ముక్కలో చెప్పాలంటే, పద్మశ్రీ శ్రీ సుభాష్ పాలేకర్ గారు ఊపిరి పోసిన ఈ ప్రకృతి సేద్యం ప్రధాన విషయం ఒక్కటే.. "90%-95% వరకూ రైతుకు పెట్టుబడి తగ్గించి, 20%-25% వరకూ కనిష్ఠంగా అధిక దిగుబడి రైతుకు రప్పించడమే ప్రకృతి సేద్యం అంటే..
ఒక ఉదాహరణ ద్వారా మీకు తెలియజేస్తాం..
రసాయన సేద్యంలో వరి పంటకి అయ్యే పెట్టుబడి ఆదాయాలకి, ప్రకృతి సేద్యంలో అయ్యే పెట్టుబడి ఆదాయాలకి తేడా చూస్తే మీకు స్పష్టంగా తెలుస్తుంది..
- ➣ పెట్టుబడి ఎకరాకు 25 ఎకరాకు 5-7వేలు నుండి 30వేలు అవుతుంది మాత్రమే అవుతుంది
- ➣ దిగుబడి 35నుంచి 45 కనిష్టంగా ఇంకో 5-10 బస్తాలు బస్తాలు ఎక్కువ వస్తుంది. కాకున్నా ఆ 45 బస్తాలైనా వస్తాయి.
- ➣ 20వేలు వరకూ పెట్టుబడి తగ్గి, ఇంకా దిగుబడి పెరిగినప్పుడు, తగ్గిన పెట్టుబడికి, పెరిగిన దిగుబడిని కలిపితే, మొత్తంగా పెట్టుబడి లేనట్లే కదా..
- ➣ అలాగే చెఱకు కూడా. రసాయన సేద్యంలో ఎకరాకు, చెఱకుకు పట్టే విత్తనం 3-4 టన్నులు, ఖర్చు 12 నుంచి 15 వేలు అవుతోంది. అదే ప్రకృతి సేద్యంలో కేవలం 198 కిలోల విత్తనం మాత్రమే పడుతుంది. అంటే 200కిలోలు. 200 కిలోల విత్తనం అంటే, దాదాపు ఎవరైనా ఉచితంగానే ఇస్తారు. కాదనుకున్నా, మహా అయితే ఒక వెయ్యి రూపాయలు. అంతే..
- ➣ ఇదీ రసాయన సేద్యానికి, ప్రకృతి సేద్యానికి ఉన్న భేధం..
- ➣ ఐతే ఖఛ్ఛితంగా ఒక విషయం గమనించండి. ఇప్పుడు మేము చెప్పిన ఈ లెక్కలన్నీ కూడా, ఖఛ్ఛితమైన శ్రధ్ధతో రైతు కష్టపడితే మాత్రమే జరుగుతుంది. పొయ్యి మీద అన్నం పెట్టాం, వెంటనే చేతికి అన్నం వచ్చేయాలి అన్నట్లు తొందరపడితే, ఏ ప్రయోజనం ఉండదని గమనించండి..
- ➣ శ్రధ్ధ, కృషి, పట్టుదల, అన్నిటినీ మించి ఓపిక, వేచి చూసే సహనం, ఇంకా ముఖ్యంగా "సరైన ఆవగాహన" చాలా అవసరం..
- ➣ రసాయన విషం నిండిపోయిన మీ భూములు, పూర్తి సంతృప్తికరమైన ఫలితాన్ని ఇవ్వాలంటే, కనీసం ఆరు జనరేషన్ల పంట కాలం పడుతుంది అని గ్రహించి పట్టుదలగా ప్రయత్నించండి. అంటే ఒక పంట కాలాన్ని ఒక జనరేషన్ గా తీసుకుంటే, మీరు ఒక సంవత్సరానికి మీ పంట భూముల్లో మీరు వేసే పంటల విధానాన్ని బట్టి, మీ భూముల జనరేషన్ పీరియడ్ గ్రహించుకోండి. దానిని బట్టి మీకు మీరే ఆరు జనరేషన్ల కాలానికి, మీ పంటల లెక్కలో ఒక టైమ్ పెట్టుకోండి. ఆ టైమ్ పూర్తి అయ్యేసరికి, మీలో ప్రతి ఒక్కరూ మరొక సుభాష్ పాలేకర్ అవుతారు..
- ➣ ఇవి మీకు ముందుగా తెలియజేస్తున్న జాగ్రత్తలు..
- ➣ ఇంక అసలు ప్రకృతి సేద్యం అంటే ఏమిటీ అనేది తెలుసుకునే ముందు, అసలు ముందు భూమి గురించి, రైతులు చేస్తున్న తప్పులు గురించి తెలుసుకోవాలి. ఈ రెండూ తెలుసుకుంటే తప్ప, ప్రకృతి సేద్యం ఎందుకు ఇలాగే చేయాలో మీకు అర్థ కాదు..
A. ముఖ్యంగా రైతులు చేస్తున్న తప్పులు:
- 1.భూమిని లోతు దుక్కి చేయడం
- 2.పంట వ్యర్ధాలు తగులబెట్టడం
- 3.పక్షుల్ని శత్రువుల్లా చూడడం
- 4.పంట చేల చుట్టూ గానీ, మధ్యలో గానీ ఉన్న చెట్లను నరికివేయడం
ఇవి ప్రధానంగా రైతులు చేసే తప్పులు. లోతు దుక్కులు, పంట వ్యర్ధాలు తగులబెట్టడం ఎందుకు చేస్తారని అడిగితే, పంటలకు కీడు చేసే పురుగులు చచ్చిపోతాయి అని జవాబు చెబుతారు. చెట్లు ఎందుకు నరుకుతారు అని అడిగితే, చెట్టు నీడలో పంట పండదు అని జవాబు చెబుతారు. పక్షులు పంట పాడు చేస్తాయి అని తరిమేస్తున్నాము అని జవాబు చెబుతారు. ఇవన్నీ అజ్ఞానమే. రైతులు చేసే భయంకరమైన తప్పులే. ఇవన్నీ తప్పులు ఎందుకు అవుతాయో మీకు స్పష్టంగా తెలియాలి..
వరుసగా చూద్దాం..
భూమిని లోతు దుక్కి చేయడం. పంట వ్యర్ధాలు తగులబెట్టడం. ఇవి రెండూ తప్పే. గమనించండి. రైతుకి కీడు చేసే పురుగులతో పాటు, రైతుకు మేలు చేసే పురుగులు కూడా ఉన్నాయి. వ్యవసాయశాఖ అధికారులకు తెలిసింది ఏమిటంటే, పంటల్ని నాశనం చేసే పురుగులు భూమిలో బాగా లోతుకి పోయి దాక్కుంటాయి, అందుకే లోతు దుక్కి చేస్తే, అవి పైకి వచ్చి, ఎండ వేడికి చచ్చిపోతాయి. చచ్చిపోగా మొండి పురుగులు ఉంటే, పంట వ్యర్ధాలు వేసి తగలబెడితే మొత్తం చస్తాయి, అంతే కాదు భూమి కూడా బాగా గుల్ల అవుతుంది, అని. ఆ సలహానే రైతులకి ఇవ్వడం ప్రారంభించారు. అప్పటివరకూ నాగలితో దున్నిన నేలని, ట్రాక్టర్లతో దున్నడం మొదలుపెట్టారు రైతులు. అదే రైతుకు పట్టిన మొదటి దరిద్రం..
ఎందుకంటే, రైతుకు కీడు చేసే పురుగులు భూమి లోపల అడుగు నుంచి అడుగున్నర లోతుకి పోయి దాక్కుని ఉంటే, ర
రైతుకు ఎంతగానో మేలు చేసే పురుగులు భూమికి కేవలం 3 నుంచి 4 అంగుళాల లోతులోనే నిద్రిస్తూ ఉంటాయి. వీటి పని రైతుకి కీడు చేసే పురుగుల్ని తిని రైతుకి మేలు చేయడమే. ఇప్పుడు లోతు దుక్కి చేయడం వలన, భూమి లోపల లోతులో ఉన్న పురుగులు బయటికి వచ్చి చావడం మాట దేవుడెరుగు గానీ, భూమి పైన 3 అంగుళాల లోతులో పైపైనే ఉన్న మేలు చేసే పురుగులు అన్నీ మొత్తం చచ్చిపోతాయి. ఇప్పుడు చెప్పండి. ఇది రైతుకి మేలు చేసే విషయమా, రైతుని నాశనం చేసే విషయమా..
అందుకే గమనించండి, ప్రకృతి సేద్యం ఎప్పుడూ కూడా లోతు దుక్కి చేయమని చెప్పదు..
ఎందుకంటే, ఎక్కడో బాగా లోతుల్లో ఉన్న కీడు చేసే పురుగుల కోసం భయపడాల్సిన అవసరంలేదు. పైపైన దుక్కి చేస్తే చాలు. దాని వలన, పైపైన 3 అంగుళాల లోతులో ఉండే మేలు చేసే పురుగులు క్షేమంగా ఉంటాయి. పంట కోసం రైతు భూమిని తడిపిన మరుక్షణం, ముందుగా ఆ మేలు కీటకాలు ప్రాణం పోసుకుని, తమకి ఆహారం కావడానికి భూమి లోపల లోతు నుంచి బయటికి రాబోయే తమ శత్రువులైన కీడు కీటకాల కోసం, ఒక సైన్యంలా ఎదురు చూస్తూ ఉంటాయి. భూమి బాగా నాని, తడి బాగా లోతుకి వెళ్ళగానే, ఆ తడి తగిలిన తరువాత కీడు కీటకాలు ప్రాణం పోసుకుని, పంట నాశనం చేయడానికి సిధ్ధం అయి పైకి వస్తాయి. కానీ అప్పటికే సిధ్ధంగా ఉన్న మేలు కీటకాల సైన్యం, ఆ కీడు కీటకాలను పట్టి, చంపి అంతం చేస్తాయి. అవి తినగా ఎక్కడైనా మిగిలి ఉండే కీటకాలను పక్షులు తిని రైతుకి మేలు చేస్తాయి. అప్పటికీ ఎక్కడైనా మిగిలి ఉంటే, వాటిని మనం కషాయాలతో అంతం చేయొచ్చు..
ఇప్పుడు చెప్పండి. లోతు దుక్కి చేయడం వలన, పంట వ్యర్ధాలు తగులబెట్టడం వలన రైతుకి జరిగే మేలు ఏమైనా ఉందా అసలు..
అలాగే గమనించుకోండి. పంట పక్వానికి వచ్చేంత వరకూ వచ్చే పక్షులన్నీ కూడా రైతుకి మేలు చేసేవే. కొంగలు, ఇతరత్రా రంగు రంగుల చిన్న చిన్న పక్షులు అన్నీ కూడా. అవి కీడు చేసే పురుగుల్ని తినడానికి మాత్రమే వస్తాయి అని గ్రహించుకోండి. కాబట్టి పంట పక్వానికి వచ్చే కాలానికి ముందుగా వచ్చే పక్షుల్ని వెళ్ళగొట్టకుండా, పనిగట్టుకుని చేనులోనికి ఆహ్వానించడం ఇంకా మంచిది. అందుకు పక్షి స్థావరాలు ఏర్పాటు చేసుకుంటే ఇంకా మేలు. పక్వానికి వస్తున్న సమయంలో వచ్చే పక్షుల విషయంలో మాత్రమే రైతు జాగ్రత్తగా ఉండాలి. పిచ్చుకలు, రామ చిలుకలు రైతుకి బధ్ధశత్రువులు..
అలాగే గమనించుకోండి. పంట పక్వానికి వచ్చేంత వరకూ వచ్చే పక్షులన్నీ కూడా రైతుకి మేలు చేసేవే. కొంగలు, ఇతరత్రా రంగు రంగుల చిన్న చిన్న పక్షులు అన్నీ కూడా. అవి కీడు చేసే పురుగుల్ని తినడానికి మాత్రమే వస్తాయి అని గ్రహించుకోండి. కాబట్టి పంట పక్వానికి వచ్చే కాలానికి ముందుగా వచ్చే పక్షుల్ని వెళ్ళగొట్టకుండా, పనిగట్టుకుని చేనులోనికి ఆహ్వానించడం ఇంకా మంచిది. అందుకు పక్షి స్థావరాలు ఏర్పాటు చేసుకుంటే ఇంకా మేలు. పక్వానికి వస్తున్న సమయంలో వచ్చే పక్షుల విషయంలో మాత్రమే రైతు జాగ్రత్తగా ఉండాలి. పిచ్చుకలు, రామ చిలుకలు రైతుకి బధ్ధశత్రువులు..
B. భూమికి సంబంధించిన విషయం:
భూమికి సంబంధించి తెలుసుకోవలసిన అతి ముఖ్య విషయం, లోతు దుక్కు వలన, భూమి మొత్తం గుల్లబారుతుంది అని వ్యవసాయశాఖ నూరిపోసిన అజ్ఞానం, రైతుల తలకి బాగా ఎక్కి దరిద్రం పట్టించింది. భూమి తప్పకుండా గుల్ల చేయాల్సిందే. కానీ ఆ పని కూడా మనం చేయాల్సిన అవసరంలేదు. భూమిని సహజంగానే గుల్ల చేసే, నేచురల్ ట్రాక్టర్స్ భూగోళం అంతటా, కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి. అవే వానపాములు. వానపాముల్ని జాగ్రత్తగా కాపాడుకుని, వృధ్ధి చేసినట్లైతే, భూమిని గుల్ల చేసే పని అవే చూసుకుంటాయి. అందుకు అవసరమైన పరిస్థితుల్ని మనం కల్పిస్తే చాలు. కానీ రసాయనాలు విపరీతంగా వాడి, భూమిలో ఉన్న వానపాముల్ని నాశనం చేస్తున్నారు రైతు. ఫలితంగా భూమి గట్టిపడి, దానిని గుల్ల చేయడానికి, వేలకు వేలు ఖర్చు పెట్టి, ట్రాక్టర్లతో దున్నించి పెట్టుబడులు పెంచుకుంటూ రైతు నాశనం అవుతున్నాడు. దీనికి విరుగుడు వానపాముల సంఖ్య పెంచడమే. దానికి మార్గమే ప్రకృతి సేద్యం..
ఇక్కడ రైతులు తెలుసుకోవలసిన విషయాలు నాలుగు..
- 1.భూమిలో వానపాముల్ని పెంచడం
- 2.భూమిలో సారం పెంచడం
- 3.ఖర్చు లేకుండా చీడ పీడల్ని అంతం చేయడం
- 4.ఏ పంటలు ఎలా పండించాలి
ఈ నాలుగు విషయాలు తెలియజేసేదే ప్రకృతి సేద్యం. ఈ నాలుగు విషయాలు రైతు తెలుసుకుని శ్రధ్ధగా అమలు చేయగలిగితే, మొత్తం సమాజం బాగుపడినట్లే.. అది తెలియజేసేదే ప్రకృతి సేద్యం.. ధన్యవాదాలు
సంకలనం: తీగల సురేష్ రెడ్డి