కోరికలను జయించు ఉపాయములు
కోరికలను జయించవలెననే భావమే కోరిక. ధ్యానము, తపస్సు, యోగము మొదలగు సాధనలు చేయాలనేది కూడా కోరికే.- ➣ ఉపాయమేమంటే చేసే పనికి ఇష్టాయిష్టములు మూలము కాకూడదు. అత్యవసర కర్మ జరుపబడుచున్నట్లు ఉండవలెను.
- ➣ ముందుగా తలచుకోకుండానే చేయబడవలెను. పని పూర్తయిన తరువాత ఆ పని చేసినట్లుగాని, ఫలితముగాని గుర్తుకు రాకూడదు.
- ➣ స్వబుద్ధి నిర్ణయము ఉండకూడదు.
- ➣ దేనినీ విమర్శ చేయరాదు.
- ➣ తన పేరు, ఊరు, వ్యక్తిత్వమును, గొప్పతనమును, అపరాధమును ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రకటించవలెననే భావన ఉండకూడదు.
- ➣ అనామకునివలె ఉండవలెను.
కర్మలలో ఉత్సాహము గాని, నిరసన గాని చూపరాదు. అహము పనిచేయకూడదు. సంసారము, లోకము, మనోకల్పితమని, మనస్సే మాయయని, విచారణ ద్వారా తెలిసి తూష్ణీభూతముగా ఉండవలెను. ప్రారబ్ధమే కర్మను జరుపుచున్నది. నిజానికి ఎవరూ కర్మ చేయుటలేదు. నటనగా జీవించవలెను. వ్యవహారమందు అసంగముగా నుండవలెను. గతము గుర్తు రాకూడదు. భవిష్యత్తు గురించి చింత ఉండరాదు.
ఊహలు, పగటికలలు ఉండరాదు. కలలో తోచినవేలాగో అలాగేనని తలచి, ప్రతిస్పందన మానవలెను. అవసరమైనవి ప్రారబ్ధానుసారము జరుగుచున్నప్పుడు కర్తృత్వ రహితముగా ఉండుటయే లేనెరుక. ఎరుక ఏరూపములోనూ బాధించనప్పుడది లేనెరుక. విడచుట, మానుట, ఉదాసీనముగా ఉండుట, స్పందించకుండుట, గుర్తుంచు కొనకుండుట వంటివే కాని, ఇక ఏ సాధన లేదు. దీనినే కోరికలను జయించు ఉపాయముగా అభ్యాసము చేయవలెను.
అనువాదము: చల్లపల్లి