హిందూ కుటుంబ విశిష్టత
సృష్టి ప్రారంభంలో ఒకే పరమాత్మ వున్నాడని హిందువుల విశ్వాసం. పరమాత్మునిలో ఒక ఆలోచన వచ్చింది - "ఏకోహం బహుస్యామ" - “ఒకడిని అనేకులు కావాలి". ఈ ఆలోచన అమలు చేయడం ద్వారా పరమాత్మ కుటుంబ వ్యవస్థ రూపొందించాడని అంటారు.కుటుంబం నుంచి సమాజ రచన, సమాజంలో పరస్పర అవగాహన, ఉన్నత సంస్కారాలు గల వ్యక్తుల నిర్మాణం, ఇరుగు పొరుగు వ్యక్తులు, పశువులు, పక్షులు, చెట్లు మొక్కలు, రాళ్ళు, మట్టి, ఇలా సృష్టి లోని అన్నింటితో ఆత్మీయతా వ్యవహారం, అహం' (నేను) అనే స్వార్థ భావనను విడనాడి 'వయం' (మనం) అనే సమష్ఠి భావనను అలవరచుకోవడం ఈ విషయాలన్నింటిని ఆచరణలో పెట్టడంలో హిందూ కుటుంబ జీవనం ఎంతో దోహదం చేస్తుంది.
ఇటువంటి ఉత్తమ లక్షణాలు గల కుటుంబంలో పెరిగిన వ్యక్తికి పరస్పర స్నేహ భావం, సహకారం, విశ్వాసం తదితర మంచి గుణాలు అలవడతాయి. దానితో పాటు సమస్యలు ఎదురైనప్పుడు ఇతరులకు సహాయం చేయడానికి తన వ్యక్తిగత అవసరాలను ప్రక్కన బెట్టి స్పందించే గుణం కూడా అలవాటపుతుంది. కుటుంబంలోని సభ్యులందరి సంక్షేమమే తన సంక్షేమంగా వ్యక్తి భావిస్తాడు, ఈ ఆలోచననుంచి ఇంకా ఉన్నతంగా ఎదిగి 'నేనే అంతా....' అన్న స్థాయినుంచి అందరి అభిప్రాయాలు స్వీకరించే మనస్తత్వం అలవాటవుతుంది. హిందూ కుటుంబంలో మరొక విశిష్టత ఇది.
నేడు ప్రపంచం స్వార్ధంతో నిండిపోయి పుంది. దీనివల్ల అనుమానం, ద్వేషం, హింస పెరిగిపోతున్నది. సంఘర్షణ చేయడమే జీవన విధానంగా మారిపోయింది. సంపాదించడమే లక్ష్యం అయిపోయింది. సంపాదించడమే మన సంస్కృతి అని భావిస్తున్నారు. ఇది మంచి ఆలోచనేనా? కాదని సమాధానం వస్తుంది. అయితే 'మంచి ఏమిటి?' అన్న ప్రశ్న ఉదయిస్తుంది. ఈ ప్రశ్నలకు సమాధానం లభించడం లేదు.
ప్రస్తుతం హిందూ కుటుంబం ఈ సైద్ధాంతిక డోలాయమానంలో పడిపోయింది. హిందూ కుటుంబ విశిష్టత సంఖ్యలో లేదు. వ్యక్తుల హృదయాలలో వుంది. సహృదయత, ఆత్మీయతానుబంధంతో ముడివడిన కుటుంబం... అంటే పిల్లలకు మార్గదర్శనం, ఆత్మవిశ్వాసం, ధైర్య సాహసాలు నూరిపోయడం, యువకులలో వ్యక్తిగత సుఖం కన్నా కుటుంబ, సమాజ శ్రేయస్సులో సుఖమున్నదని తెలియజెప్పడం, సమాజ హితం కోసం పరిశ్రమ చేసే మనస్తత్వం, వృద్ధుల పట్ల గౌరవం, చిన్న పిల్లల పట్ల స్నేహ భావం... తదితర గుణాలు పెంపొదించడం... ఇదే నిజానికి హిందూ కుటుంబ విశిష్టత.
_హిందూ నగారా