ధర్మబద్ధమైన కర్మను చేయాలి !
కురుక్షేత్ర సంగ్రామంలో మోహంలో పడి యుద్ధ విముఖుడైన అర్జునుడికి తన ధర్మాన్ని గుర్తు చేసేందుకు భగవాన్ శ్రీకృష్ణుడు గీతను బోధించాడు. ఏం చేయాలి, ఎలా చేయాలి ? అనే విషయాలతో పాటు సమన్వయాత్మక దృష్టి కోణాన్ని ఈ గీత మనకు అందిస్తోంది. భగవద్గీతలో బోధించిన కర్మ సిద్ధాంతాన్ని మనం జాగ్రత్తగా అర్ధం చేసుకోవాలి. గీతలో కర్మ గురించి చెప్పబడిన క్రింది విషయాలు గమనిద్దాం.
నిజానికి కర్మ చేయకుండా ఒక్క క్షణం గడవదు. అయితే ఆ కర్మ ఎలాంటిది ఉండాలి? అనేదే ప్రశ్న. ఉదాహరణకు దొంగతనం చేయడం కూడా కర్మే. అయితే ఇలాంటి కర్మ వల్ల వ్యక్తికీ, సమాజానికి కీడు కలుగుతుంది. అందువల్ల ధర్మబద్ధమైన కర్మ చేయాలని గీతా వాక్యం చెబుతుంది. కర్మను చేయటమే కాదు, ఆ కర్మ యొక్క ఫలితాన్ని నిస్వార్ధ బుద్ధితో పరిత్యాగం చేయడం గీతా ధర్మం యొక్క పరమ లక్ష్యం. కర్మ చేయకపోవటం వల్ల వ్యక్తి సమాజానికి భారం అవుతాడు. సమాజంలో ఇతరుల కర్మఫలం వల్ల తాను లాభపడతాడు.
అంటే ఇతరుల శ్రమ ఫలాన్ని అక్రమంగా దోచుకున్న వాడవుతాడు. అందుకే వ్యక్తి కర్మ చేయాలి, ఆ కర్మ ఫలాన్ని తాను కోరక భగవంతుడికి అర్పించాలి. అట్లాగే విశ్వరూప సందర్శన యోగంలో భగవంతుడంటే ఈ చరాచర సృష్టి అనే భావం అర్జునుడికి స్పష్టమైంది. భగవదర్పణ చేయడమంటే ఏ సృష్టిలో తాను జీవిస్తున్నాడో, ఆ సృష్టికే ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా అర్పించడం. భగవద్భావనలో మరో విశేషం ఉంది. సామాజిక స్పృహ అనేది మనుషులకు మాత్రమే పరిమితమైనది. భగవద్భావన సమస్త సృష్టికి వ్యాప్తమైంది.
సంకలనం: కోటేశ్వర్