Angkor Wat |
అంగ్కోర్ వాట్ దేవాలయం - కంబోడియా - Angkor Wat Temple - Cambodia
భారతీయ సంస్కృతికి చిహ్నంగా.. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా వెలుగొందుతోంది కంబోడియాలోని "అంగ్కోర్ వాట్ దేవాలయం". ప్రపంచ చారిత్రక కట్టడాలలో ఒకటిగా పేరు సంపాదించిన ఈ ఆలయం.. అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో నిర్మించబడి, హిందూ సంస్కృతీ సౌరభాలను వెదజల్లుతోంది. భారతీయ పురాణేతిహాసాలను తనలో ఇముడ్చుకుని అందర్నీ ఆకర్షిస్తోంది.
కంబోడియా జాతీయ పతాకంలో కూడా చోటు దక్కించుకున్న అంగ్కోర్ వాట్.. ప్రపంచ ఆధునిక నాగరికతల్లో ఒకటిగా చెప్పబడే "ఖ్మేర్" సామ్రాజ్య కాలంలో నిర్మించినట్లు చెబుతుంటారు. ఈ దేవాలయ గోడలపై విష్ణుమూర్తి మొదలగు హిందూ దేవుళ్లతోపాటు.. రామాయణ, మహాభారత కాలంనాటి అద్భుతమైన ఘట్టాలు శిలా రూపాల్లో అత్యద్భుతంగా చెక్కబడి మనకు దర్శనమిస్తాయి.
అంగ్కోర్ వాట్ దేవాలయం |
కంబోడియాలోని "సీమ్ రీప్" అనే పట్టణానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది "అంగ్కోర్ వాట్" దేవాలయం. ఖ్మేర్ సామ్రాజ్యకాలంలో ఈ ఆలయానికి అంకురార్పణ జరిగినట్లు తెలుస్తోంది. క్రీస్తు శకం 12వ శతాబ్దంలో అంగ్కోర్ వాట్ను రాజధానిగా చేసుకుని పరిపాలించిన రెండవ సూర్యవర్మన్ కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు పలు చారిత్రక ఆధారాలు రుజువు చేస్తున్నాయి.
"టోనెల్ సాప్" సరస్సు తీరాన, 200 చదరపు కిలోమీటర్ల సువిశాలమైన ప్రదేశంలో.. "కులేన్" పర్వత శ్రేణుల పాదాలవద్ద అంగ్కోర్ వాట్ దేవాలయం నిర్మించబడింది. ఇది ప్రపంచంలోని అతి పెద్ద హిందూ దేవాలయంగానే కాకుండా.. అతిపెద్ద మహావిష్ణుదేవాలయంగా కూడా పేరు సంపాదించింది.
అంగ్కోర్ వాట్.. చాలా దేవాలయాల సముదాయం. పురాతన కాలంలోనే ఖచ్చితమైన కొలతలు, అద్భుతమైన ఆర్కిటెక్చర్ పనివిధానంతో ఈ ఆలయాన్ని రూపొందించటం ఇప్పటికీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. హిందూ సాంప్రదాయ అస్థిత్వం ఉండే భారత ఉపఖండంలో కూడా ఇంత పెద్ద దేవాలయం లేదని చెబితే అతిశయోక్తి కాదు.
అంగ్కోర్ వాట్ దేవాలయం లోపలి దృశ్యం |
ఈ దేవాలయాన్ని నిర్మించేందుకు సుమారు 30 సంవత్సరాల కాలం పట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ దేవాలయ నిర్మాణం.. అచ్చం తమిళనాడులోని దేవాలయాలను పోలి ఉండటం విశేషం. తమిళ చోళ రాజుల కాలంనాటి నిర్మాణ పద్ధతులు అంగ్కోర్ వాట్ ఆలయ నిర్మాణంలో గోచరిస్తూ ఉంటాయి. అదీ.. ఖ్మేర్ సామ్రాజ్య కాలంలో నిర్మించిన ఇతర దేవాలయాలకు కాస్త భిన్నంగా.. అంగ్కోర్ వాట్ ఆలయం పశ్చిమ ముఖద్వారాన్ని కలిగి ఉంటుంది.
ఖ్మేర్ పరిపాలనలో నీటిని నిల్వ ఉంచుకుని.. కరువు కాటకాలప్పుడు వాడుకునే టెక్నాలజీని అప్పట్లోనే అమలు చేశారు. కాబట్టే.. ఆ సామ్రాజ్యంలో కరువు ఛాయలు ఉండేవికావట. వీరు నీటిని నిల్వ ఉంచేందుకు వాటిన టెక్నాలజీలో.. నీరు పల్లం నుంచి ఎత్తుకు ప్రవహించేదట.. ఇదే టెక్నాలజీని అంగ్కోర్ వాట్ ఆలయ నిర్మాణంలో వాడారు.
ఈ టెక్నాలజీ ఎలా సాధ్యమయ్యిందనే విషయం నేటి ఆధునిక సాంకేతిన నిపుణులకు సైతం అంతుబట్టకుండా ఉంది. 5 మైళ్ల పొడవు, ఒకటిన్నర మైలు విశాలంతో నిర్మితమైన "బారే" (రిజర్వాయర్లు)లు ఆనాటి అద్భుతమైన ఇంజనీరింగ్ పనితీరుకు అద్దంపట్టేలా దర్శనమిస్తున్నాయి.
అంగ్కోర్ వాట్ దేవాలయం గగన దృశ్యం - కంబోడియా |
అంగ్కోర్ వాట్ దేవాలయం ముఖద్వారం నుంచి లోపలికి వెళ్లగానే పచ్చదనంతో కూడిన పరిసరాలు హాయిగా స్వాగతం పలుకుతాయి. ఆలయంలోకి ప్రవేశించగానే ముందుగా దర్శనమిచ్చేవి అద్భుతంగా నిర్మితమైన మూడు ఆలయ గోపురాలు. మధ్య గోపురం నుంచి ప్రయాణిస్తే.. అనేక గోపురాలు దర్శనమిస్తాయి.
ఈ ఆలయంలో ప్రత్యేకంగా సూర్యోదయం గురించి చెప్పుకోవాల్సి ఉంది. సూర్యోదయం వేళలో ఆలయ దర్శనం అద్భుతంగా ఉంటుంది. గోపుర ద్వారం నుంచి లోపలికి అడుగుపెట్టగానే.. గోపురం చాటు నుంచీ దోబూచులాడుతూ కిందకు జాలువారే ఉదయభానుడి లేలేత కిరణాలు ఓ అద్భుతమైన సుందర దృశ్యాన్ని కళ్లముందు నిలుపుతాయి. ఆ దృశ్యాన్ని చూసేందుకు రెండుకళ్లూ చాలవనిపిస్తుంది.
భారతదేశంలోగల అన్ని హిందూ ఆలయాలకుమల్లే అంగ్కోర్ వాట్ గోడలపై కూడా అద్భుతమైన శిల్పాలు చెక్కబడి ఉంటాయి. ఈ ఆలయంలోని మరో అద్భుత ప్రదేశం "బ్యాస్ రిలీఫ్స్" గ్యాలరీ. నాలుగు గోడలతో నిర్మితమైన ఈ మంటపంలో ఎక్కడ చూసినా హిందూ పురాణ గాథలు కనిపిస్తాయి. ముఖ్యంగా తూర్పువైపున ఉండే "మంటన్" గ్యాలరీ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. రామాయణ, మహాభారత దృశ్యాలు.. దేవతలు, రాక్షసుల మధ్య జరిగిన క్షీరసాగర మథన దృశ్యాలు అందర్నీ అబ్బురపరుస్తాయి.
ఆలయం తూర్పున పుట్టుక, అవతారాల గురించిన శిల్పాలు, పశ్చిమాన ఉండే మంటపం గోడలపై యుద్ధాలు, మరణాల గురించిన ఆకృతులు లో దర్శనమిస్తాయి. కురుక్షేత్ర యుద్ధం, రామ-రావణ యుద్ధంలాంటి అద్భుత సంఘటనలు సైతం ఈ గోడలలో అద్భుతంగా చెక్కబడి ఉంటాయి. ఇక దక్షిణ మంటంలో రెండవ సూర్యవర్మన్ సైనిక పటాలం.. మహామునులు, అప్సరసల నాట్య విన్యాసాలు, యమధర్మరాజు కొలువుదీరిన యమసభలాంటి అనేక కళాఖండాలు ఆయల గోడలపై సాక్షాత్కరిస్తాయి.
అంగ్కోర్ వాట్ దేవాలయానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే మరో అద్భుత ప్రదేశం "అంగ్కోర్ థోమ్". ఖ్మేర్ సామ్రాజ్యంలోని చివరి చక్రవర్తులలో ఒకరైన జయవర్మన్-6 ఈ థోమ్ను రాజధానిగా పరిపాలించినట్లు చారిత్రక ఆధారాలవల్ల తెలుస్తోంది. దీన్నే "గ్రేట్ సిటీ" అని కూడా పిలుస్తుంటారు. 9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది.
అంగ్కోర్ వాట్ దేవాలయంలో ఉన్న విష్ణు భగవానుని భారీ విగ్రహం |
ఈ థోమ్లో కూడా అనేక పురాణ కళాకృతులు మన చూపును మరల్చనీయవు. ముఖ్యంగా బౌద్ధమత సంస్కృతి ఉట్టిపడేలా ఉండే ఈ ఆలయంలో ఏనుగుల మిద్దెలు, లెపర్ రాజు ప్రతిమలు, బెయాన్, బఫూన్ లాంటి అనేక నిర్మాణాలు అనేకం ఉన్నాయి. ఈ ఆలయం మధ్యలో చిన్న చిన్న మిద్దెలతో నిర్మించిన గోల్డెన్ టవర్ (బెయాన్) చూపరులను ఆకట్టుకునేలా ఉంటుంది. 54 అంతస్తులతో నిర్మితమైన ఈ బెయాన్ అంగ్కోర్ థోమ్కే ఓ ప్రత్యేక ఆకర్షణ అని చెప్పవచ్చు.
ఇక చివరిగా చెప్పుకోవాలంటే.. ఖ్మేర్ సామ్రాజ్య పురాణ గాథల ఆధారంగా చూస్తే... ఖ్మేర్ సామ్రాజ్యాధినేత "కాము"తో భరత ఖండానికి సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఆ ఖ్మేర్ నాగరికత తరువాత కొన్ని శతాబ్దాల అనంతరం భారతీయ సంస్కృతి కంబోడియాకు వ్యాపించి.. సంస్కృతం అధికార భాషగా.. హిందూ, బౌద్ధమతాలు అధికార సంప్రదాయాలుగా వెలుగొందాయట. కాబట్టి భారత సంస్కృతిని అణువణువునా నింపుకున్న ఈ అద్భుత కట్టడాలను జీవితంలో ఒక్కసారయినా దర్శించుకుంటే జీవితం ధన్యమైనట్లే..!
సంకలనం: rmiddela