భారత్-చైనా దళాల మధ్య సోమవారం రాత్రి గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో దాదాపు 35 మంది చైనా సైనికులు మృతి చెందినట్లు అమెరికాకు చెందిన ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేస్తున్నట్లు ఫ్రీప్రెస్జర్నల్ తన కథనంలో పేర్కొంది. ఈ విషయం భారత వార్త సంస్థ పీటీఐలో కూడా వచ్చింది. ఐదు దశాబ్దాల్లో భారత్-చైనా మధ్య జరిగిన ఘర్షణల్లో ప్రాణనష్టాలను చైనా దాచిపెడుతోందని పేర్కొంది.
మాసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన చైనా విభాగం నిపుణడు ఎం.టేలర్ ఫార్వెల్ మాట్లాడుతూ ”ఈ ఆయుధ రహిత ఘర్షణలో ప్రాణ నష్టం వివరాలను చైనా కొన్ని దశాబ్దాల తర్వాత విడుదల చేయవచ్చు. 1962 యుద్ధానివి 1994లో అంతర్గత చరిత్రలో ప్రచురించింది” అని పేర్కొన్నారు.
యుఎస్ న్యూస్.కామ్ వెబ్సైట్లో వచ్చిన కథనం ప్రకారం ”అమెరికా ఇంటెలిజెన్స్ లెక్కల ప్రకారం దాదాపు 35 మంది చైనా సైనికులు చనిపోయారు. వీరిలో ఒక సీనియర్ అధికారి కూడా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన సన్నిహిత వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. అక్కడి నుంచి బలగాల ఉపసంహరణపై సమావేశం జరుగుతుండగానే ఈ ఘర్షణ చోటు చేసుకొంది” అని పేర్కొంది. ఈ ఘర్షణలో కత్తులు, కర్రలు వాడినట్లు తెలిసింది. ఇందులో ప్రాణ నష్టాన్ని ‘బీజింగ్ తమ సైనిక దళాలకు జరిగిన అవమానంగా భావిస్తోంది’ అని ఆ కథనంలో పేర్కొంది.
ఇరు వైపులా సైనికుల ఘర్షణలో 43 మంది చైనా సైనికులు చనిపోవడమో, గాయపడటమో జరిగినట్లు ఆంగ్ల వార్తా సంస్థ ఏఎన్ఐ పేర్కొంది. చైనీయుల కమ్యూనికేషన్లను ఇంటర్సెప్ట్ చేయడం ద్వారా ఈ విషయాన్ని కనుగొన్నట్లు పేర్కొంది.
_విశ్వ సంవాద కేంద్రము