రామాయణం, మహాభారతం, మార్కండేయ పురాణం ఇత్యాదులలో విశ్వామిత్రుని గురించి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నా, మంత్రదష్ట అయిన విశ్వామిత్రుడు, వ్యాజ్యయంలో పేర్కొన్న విశ్వామిత్రుడు వేరు అని కొందరు, ఒక్కరే అని కొందరు అభిప్రాయ పడుతున్నారు. ఇద్దరూ ఉన్నా, వారు గాధేయులుగానే చెప్పబడ్డారు (గాధి కొడుకు గాధేయుడు).
ఏమైనప్పటికీ విశ్వామిత్రుని నామం 'విశ్వానికి అన్ని విధాలా మిత్రుడు' అనే ఉదాత్త భావాన్ని కలిగి ఉంది. ఋగ్వేద సంహితలో నలభైఆరు సూక్తాలను, కృష్ణయజుస్సంహితలో ముప్పయి మూడు మంత్రాలను, సామసంహితలో ఇరవైనాలుగు దశతుల్లో కొన్ని మంత్రాలను, అధర్వసంహితలో మహాప్రభావశాలిగా విశ్వామిత్రుడు వైదికవాజ్మయంలో మనకు దర్శనమిస్తాడు. ఐతరేయ, శత పధ, కౌషీతకీ బ్రాహ్మణాల్లో విశ్వామిత్రుని గురించి ఉదంతాలు కనబడతాయి.
విశ్వామిత్ర మహర్షి ప్రసాదంగా గాయత్రీ మంత్రం మనకు లభ్యమైనది. విశ్వామిత్ర ఋషిః గాయత్రీ ఛందః అని ప్రతీ సంధ్యావందనంలో మూడు సార్లు ఈ ఋషిని స్మరించడం సంప్రదాయమైనది. మహాశక్తిమంతమైన గాయత్రీ మంత్రం ఋగ్వేదం మూడవ మండలం అరవై రెండవ సూక్తంలో ఉంది.
“గాయంతం త్రాయత ఇతి గాయత్రీ” అని గానం చేసేవారిని (జపించేవారిని) రక్షించునది గాయత్రి. గాయత్రి యొక్క మహత్తు ఎలాంటిదంటే మూడు వేదాలు క్షుణ్ణంగా పారాయణం చేసి కంఠస్థం చేసిన పుణ్యం గాయత్రీ స్మరణతో కలుగుతుందని పెద్దలు చెబుతారు. ఈ ఉపదేశం మనిషికి ద్విజత్వాన్ని ప్రసాదిస్తుంది. ఇందులో విశ్వామిత్రుడు సూర్యునికి ప్రతిరూపమైన సవితను (ఉషోదయ, సూర్యోదయ సమయాల మధ్యలోగల సూర్యుని రూపం సవితగా చెప్పబడింది) ప్రార్థించాడు.
పురాణేతిహాసాల ఆధారంగా ఉన్న విశ్వామిత్రుని చరిత్ర ప్రకారం, ఈయన కుశిక వంశంలోని గాధిరాజు కుమారుడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుని సోదరి అయిన సత్యవతికి, ఋచీక మహర్షికి పుట్టిన వాడు జమదగ్ని. వీరిరువురు ఋచీకుని యజ్ఞ ఫలంగా ఒకే సమయంలో పుట్టినవారు. అయితే యజ్ఞప్రసాద విభజనలో సత్యవతికి ఒక భాగం ఇచ్చి, మరొక భాగం సత్యవతి తల్లికి ఇవ్వగా, దైవ యోగం వలన ఆ ప్రసాద భాగాలు తారుమారవడంతో తపస్వి అయిన ఋచీకునికి జమదగ్ని కుమారునిగా జన్మించాడు.
ఆ జమదగ్నికి తనయుడైన పరశురాముడు క్షాత్రశక్తిని కలిగి ఉన్నాడు. అలాగే విశ్వామిత్రుడు జన్మతః రాజైనప్పటికీ, యజ్ఞ ప్రసాద ఫలం వల్ల తపస్సుపై దృష్టి మళ్ళి, క్రమంగా బ్రహ్మర్షిత్వాన్ని సాధించాడు.
విశ్వామిత్రుడు, మేనక |
అయితే మూడు సార్లు తపశ్శక్తి వృధా అయినా, తన లోపాలను గుర్తించి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాతృస్యర్యాలనే అరిషడ్వర్గాలను చివరకు జయించి, బ్రహ్మర్షి కాగలిగాడు. ఇదీ ఆయన విశిష్టత. బ్రహ్మర్షి అయినవారికి ఇంక ఎటువంటి వికారాలు ఉండవు కదా!
ఇంక రామాయణంలో, బాలకాండలో మొట్ట మొదటిసారిగా మనకు దర్శనమిస్తాడు విశ్వామిత్రుడు. బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడు కౌశికీనదీ తీరంలో ఉన్న సిద్దాశ్రమంలో చేసే యాగ రక్షణార్ధం రామలక్ష్మణులను తనతో పంపమని చెప్పడానికి దశరథుని వద్దకు వెళ్ళాడు. వారు చిన్నవాళ్ళని సంశయపడుతున్న దశరథునితో "మహాత్ముడు, సత్యపరాక్రముడు అయిన రాముని సంగతి నాకే కాదు ఈ సభలోని వసిష్ఠాది మహర్షులందరికి తెలుసు, కనుక సందేహపడవద్దని”, సాక్షాత్ పరబ్రహ్మమే శ్రీరాముడనే ధ్వని ఆ మాటలలో తెలియజేసినవాడు విశ్వామిత్రుడు. ఒక రకంగా రామునికి మార్గదర్శక గురువులుగా నిలిచినవారు వసిష్ఠ, విశ్వామిత్రులే.
చిన్నవయస్సులోనే యోగవాసిష్ఠాన్ని బోధించి మనోనిగ్రహం కలిగేలా చేసినవాడు వసిష్ఠుడైతే, దుర్గమమైన అరణ్యమార్గంలో నడిపించి, జీవితంలో ధైర్యంగా ప్రతీది ఎలా ఎదుర్కోవాలో, ప్రయోగపూర్వకంగా నేర్పించిన వాడు విశ్వామిత్రుడు.
అంతే కాదు, ఆ సమయంలోనే "కౌసల్యా సుప్రజారామా / పూర్వాసంధ్యా ప్రవర్తే / ఉత్తిష్ఠ నరశార్దూల | కర్తవ్యం దైవమాహ్నికమ్॥ అంటూ తొలిసారిగా భగవత్ సుప్రభాతానికి నాంది పలికింది విశ్వామిత్రుడే.విశ్వామిత్రునికి హవిచ్ఛందుడు, దృఢనేత్రుడు, మహారధుడు, మధుచ్ఛందుడు అనే సత్య ధర్మ పరాయణులైన కొడుకులు నలుగురు ఉన్నారు. వీరిలో మధుచ్ఛందుడు ఋగ్వేదంలో అనేక మంత్రాలకు ద్రష్టగా నిలిచాడు ఋగ్వేదంలోని ప్రథమ మండలంలో మొదటి పది సూక్తాలను దర్శించాడు.
ఒకసారి అంబరీషుడు చేసే యాగానికి యజ్ఞపశువుకి బదులుగా, అజీగర్తుడనే పేద బ్రాహ్మణుని కుమారుడైన శునశ్శేపుడిని తండ్రి అంగీకారంతో యజ్ఞపశువుగా స్తంభానికి కట్టాడు. అది చూసి జాలిపడిన విశ్వామిత్రుడు అతనికి రెండు మంత్రాలను ఉపదేశించి జపించమన్నాడు. ఆ మంత్రప్రభావానికి ఇంద్రాది దేవతలు ప్రత్యక్షమై బాలుడిని బంధవిముక్తుడిని చేశారు. ఈ విధంగా తన మంత్రోపదేశంతో, నరవధ కానీయకుండా అడ్డుకున్నాడు విశ్వామిత్రుడు.
దేవతల చేత తిరిగి ఇవ్వబడిన వాడు కనుక, శునశ్శేపుడికి 'దేవరాతుడు' అనే పేరు కూడా ఏర్పడింది. తరువాత ఈ శునశ్శేపుడు కూడా గొప్ప మంత్రద్రష్ట అయ్యాడు. ఋగ్వేదంలో దేవరాతుడు పేరుతో కొన్ని మంత్రాలు ఉన్నాయి.
కుశిక వంశానికి చెందినవాడు కనుక విశ్వామిత్రునికి, కౌశికుడు అనే పేరు కూడా ఉంది. ఇక్ష్వాకు వంశీయుడైన హరిశ్చంద్రుని సత్యనిరతిని, కీర్తిని లోకానికి తెలియచేయడంలో కూడా విశ్వామిత్రుని పాత్ర ఉంది.
విశ్వరూపాదులు విశ్వామిత్రుని స్మృతికర్తగా కూడా పేర్కొన్నారు. 'విశ్వామిత్ర స్మృతి' పేరిట తొమ్మిది అధ్యాయాలతో శ్లోకరూపంలో ఒక స్మృతి ఉందని పెద్దలు చెబుతారు.
ఒక వ్యక్తి స్వయంకృషితో, అచంచలదీక్షతో, అంచెలంచెలుగా ఎంతటి మహోన్నతస్థానాన్నైనా సాధించవచ్చును అనే సత్యానికి మహోజ్వలమైన దృష్టాంతంగా బ్రహ్మర్షి విశ్వామిత్రుడు నిలుస్తాడు సప్తఋషులలో ఒకనిగా, జ్యోతిర్మండలంలో ప్రత్యేక స్థానాన్ని అలంకరించిన విశ్వామిత్రుడు, తన వేద విజ్ఞానం ద్వారా విశ్వానికి నిజంగా మిత్రునిగా నిలిచిపోయాడు.
సంకలనం, రచన: అపర్ణా శ్రీనివాస్