దేశంలో బట్టలు మిల్లులు ఎక్కువైనాయి, మీరు బట్టలు నెయ్యడం మానేయండి అంటూ నేతపనివారిని నాశనం చేశారు.
దేశంనిండా బోలెడు కర్మాగారాలను తెరిచాం, పనిముట్లు చేయకండి అని కమ్మరులను నాశనం చేశారు.
- ➣ కార్పొరేట్ వ్యవసాయమంటూ ట్రాక్టర్లను పెద్ద ఎత్తున పరిచయం చేసి ఎద్దులను బీఫ్ తయారీ కేంద్రాలకు, ఆవులను డైరీ పరిశ్రమకు తరలిస్తున్నారు.
- ➣ కార్పొరేట్ బంగారం షాపులు తెరిచి విశ్వబ్రాహ్మణ వారిని కూలీలుగా మార్చేశారు.
- ➣ కార్పొరేట్ విద్యాలయాలకు అనుమతినిచ్చి గురువులను సేల్స్మెన్గా మార్చేశారు.
- ➣ ప్రకృతి శత్రువైన ప్లాస్టిక్ విజృంభించి వడ్రంగులను, కుమ్మరులను నాశనం చేసింది.
- ➣ ప్రకృతికి ముప్పు తెచ్చే ఫ్లెక్స్ ప్రింటింగ్ వచ్చి చిత్రలేఖను కళను నాశనం చేసింది. చిత్రకారుల పొట్ట కొట్టింది.
- ➣ దేవాలయాలలో హుండీలు పెట్టి, పళ్లేలలో కానుకలు వేయకండి అంటూ అర్చకులను బిచ్చగాళ్లుగా మార్చేశారు.
- ➣ ఇప్పుడు పంటలు గిట్టుబాటు కావు, క్రాప్ హాలిడే అంటూ రైతులను తప్పుదోవ పట్టించి రైతులను నాశనం చేయడానికి పూనుకుంటున్నారు
- ➣ 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని ప్రకటించి హిందువుల స్వతంత్ర ఆర్థికమూలాలను సర్వనాశనం చేశారు. చేస్తూనే ఉన్నారు.
- ➣ హిందువులంటే బ్రాహ్మణులొక్కరే కారు. అనేకవృత్తులవారు స్వతంత్రంగా బ్రతకగలిగిన సమగ్రసమాజవ్యవస్థ వారిది.
తమ శ్రమశక్తితో సహస్రాబ్దాల తరబడి ఎన్నెన్నో ప్రభుత్వాలను పోషించిన హిందూ సమాజాన్ని అభివృద్ధి సంస్కరణల పేరిట చెత్త ప్రయోగాలు చేసి, ఛిన్నాభిన్నం చేసి, గవర్నమెంటు పోషిస్తే గాని బ్రతకడం చేతగాని దరిద్రస్థితికి దిగజార్చేశారు. పైగా వోట్ల కోసం అలా ఉచితకానుకలివ్వడం ప్రజలమీద తమకున్న ప్రేమకు నిదర్శనమంటూ ఆయా ప్రభుత్వాధిపతులు జేజేలు కొట్టించుకుంటున్నారు.
మనిషి స్వతంత్రంగా బ్రతకలేకపోతే అదేం అభివృద్ధి? నిత్యం ప్రభుత్వసహాయంకోసం ఎదురుచూసేలా చేసే టెక్నాలజీ ఎందుకు పనికొస్తున్నట్టు?
ఇప్పుడేమో దేవాలయం ఆస్తులు ఎక్కెక్కడో ఉన్నాయి, వాటిని నిర్వహించడం సాధ్యం కాదు, అందుకని అమ్మేస్తాం అంటూ చేతగాని పలుకులు పలుకుతున్నారు.
అయ్యా, హిందూసమాజపు స్వరూపస్వభావాలు తెలియని దేవాలయపాలకమండలీ, మీకు చేత కాదు కాని, రాజీనామా చేసేయండి.
వేరే రాష్ట్రం వేరే రాష్ట్రం అంటూ చెత్త పలుకులు వద్దు. కానుకలు పుచ్చుకొనేటపుడు అడ్డం రాని వేరే రాష్ట్రాలనే పరిమితులు కానుకల నిర్వహణకు అడ్డొచ్చేశాయా?
హిందూ సమాజం చాల విశాలమైనది. రాజకీయసరిహద్దులు హిందూసమాజానికి లేవు. ఇతరరాష్ట్రాలలోని దేవాలయపు ఆస్తులను హిందూ సమాజపు బాగోగులకోసం అనేకరకాలుగా ఉపయోగించుకోవచ్చు.
- 1. బల్లలు, కిటికీలు, తలుపులు మొదలైనవి ఈనాటికి కూడా అవసరమే. హిందువుల సంప్రదాయాన్ని అనుసరించి వాటిని ఆయా స్థలాలలో తయారు చేయించండి.
- 2. తులసి తోటలు, పూల తోటలు వేయించండి.
- 3. మునగ, వట్టివేరు, కలబంద, పసుపు వంటి ఔషధపు మొక్కలను ఆ స్థలాల్లో పెరగనివ్వండి.
- 4. హిందూ గ్రంథాలయాలను ఏర్పాటు చేయండి.
- 5. చిన్నవో పెద్దవో కల్యాణమంటపాలను నిర్మించండి.
- 6. వివిధస్థలాలలో వివిధ వృత్తులవారికి శిక్షణాలయాలు ఏర్పాటు చేయండి. సమాజానికి పనికిరాని వృత్తి లేదు. ఆధునికసమాజానికి కావలసిన ఆధునికరీతిలో వివిధ వస్తువులను తయారు చేయగల సామర్థ్యాన్ని వారికి కలిగించండి.
- 7. లడ్లు అమ్ముతామంటున్నారు కదా, లడ్లకు బదులుగా, స్థానికభాషలో ముద్రింపబడిన హిందూ సాహిత్యగ్రంథాలను, దేవస్థానం క్యాలెండర్లను, డైరీలను అమ్మే దుకాణం తెరవండి. లేదా, గీతాప్రెస్ వంటి హిందూ గ్రంథముద్రాపకులకు వాటిని అద్దెకు ఇవ్వండి.
- 8. హిందూ సాంప్రదాయిక సంగీతాన్ని, వివిధ శాస్త్రాలను బోధించే ఏర్పాటు చేయండి. వారికి అద్దెకిచ్చి, విద్యార్థుల మీద రాబడిని మాత్రం బోధకులనే తీసుకోనివ్వండి.
- 9. ప్రస్తుతసమాజానికి అవసరమైన ప్లంబర్లను, ఎలక్ట్రీషియన్లను, మెకానిక్కులను తదితరులను తయారుచేసే విద్యాలయాలుగా ఆ స్థలాలను మార్చండి.
- 10. వేంకటేశ్వరస్వామివారి చిన్న మందిరాన్ని నిర్మించి, ఒక అర్చకుని అక్కడ నియమించండి.
ఇంకా TTD పాలకమండలి అమ్మదలచుకున్న ఆస్తులను అమ్మకుండానే హిందూసమాజానికి ఉపయోగపడే ఎన్నెన్ని మంచిపనులను చేయవచ్చో, మిత్రులు సూచించండి.
మేము నిర్వహించలేని ఇరవై ఐదు స్థలాలను గుర్తించాం, అమ్మేస్తాం అనడం సరి కాదు. ఒక ఇంటి స్థలం కొనడానికి లేదా ఒక ఇల్లు కట్టడానికి ఒక మధ్యతరగతి హిందూ కుటుంబం తమ యావజ్జీవితాన్ని ఖర్చు పెడుతున్న రోజుల్లో ఆ ఇరవై ఐదు స్థలాలను చిన్నవి అని, నిరర్థకమైనవి అని అనడం చాలా క్రూరమైన ఆలోచన.
సిబ్బంది సరిపోనందువల్ల మేము నిర్వహించలేము అని కుంటిసాకులు చెప్పడం కాదు, ఆయా స్థలాలను నిర్వహించడానికి స్థానికులైన 25 మంది హిందువులను నియమించి, వారికి కేవలం ₹5000/- జీతం ఇవ్వండి.
అమ్మడానికి మాత్రం వీల్లేదంతే!
ఉత్తి పుణ్యానికి వేలాది పాస్టర్లను, వేలాది ముల్లాలను పోషిస్తున్న ప్రభుత్వం, కేవలం మరో 25 మంది హిందువులను పోషించలేని దుర్భరదారిద్ర్యంలో మగ్గిపోతోందని హిందూ సమాజం భావించటం లేదు.
రచన: శ్రీ శ్రీనివాస కృష్ణ.
గమనిక: ఈ వ్యాసంలో వ్యక్తపరిచిన అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం.
వ్యాస మూలము: విశ్వ సంవాద కేంద్రము (ఆంధ్ర ప్రదేశము )