వరాహమిహిరుడు
ప్రాచీన భారతదేశపు అత్యంత ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్తలలో వరాహమిహిరుడు గణనీయుడు. ఈయన క్రీ.శ. 6వ శతాబ్దానికి చెందిన వాడు. ఈయన ప్రముఖ గ్రంధం పంచసిధ్ధాంతిక 505వ సంవత్సరంప్రాంతంలో వ్రాయబడింది. పంచసిధ్ధాంతికలో క్రీ.శ. 499లో రచించబడిన ఆర్యభట్టీయాన్నివరాహమిహిరుడు ప్రస్తావించాడు. బ్రహ్మగుప్తుడి బ్రహ్మస్ఫుట సిధ్ధాంతవ్యాఖ్యలో నవాధికపంచాసంఖ్యా శకే వరాహమిహిరాచార్యో దివంగతః అని ఉంది. దీనిని బట్టి, ఈయన 587వ సంవత్సరంలో నిర్యాణం చెందినట్లు తెలుస్తోంది.
వరాహమిహిరుడి బృహజ్జాతకంలో చివరన:
ఆదిత్యదాస తనయా స్తదవాప్తబోధః
కాపిథ్థకాః సవితృలబ్ధవరప్రసాదః
అవన్తికోమునిమతానై వలోక్య సమ్యక్
హోరం వరాహమిహిరో రుచిరంకార
అని ఉండటాన్ని బట్టి వరాహమిహురుడి తండ్రి పేరు ఆదిత్యదాసుడని, ఇతను సూర్య వరప్రసాదంగా జన్మించాడనీ అనీ తెలియ వస్తోంది. ఆయన స్వగ్రామం కాపిథ్థకం ఉత్తరప్రదేశ్ లోని సంకాశ్యం. తరువాతి కాలంలో ఈయన అవంతి (ఉజ్జయిని)లో నివసించాడు. మిహిర శబ్దానికి సూర్యుడని అర్థం. తదవాప్తబోధః అనటాన్ని బట్టి వరాహమిహురుడు తండ్రి వద్దే విద్యాభ్యాసం చేసాడని కూడా తెలుస్తోంది.
- ➣ వరాహమిహిరుడు విక్రమార్కుడి నవరత్నాలలో ఒకడని ప్రచారంలో ఉంది గాని అది అంత నమ్మదగ్గ విషయం కాదు.
- ➣ వరాహమిహిరుడు ఖగోళ శాస్త్రంలోనూ, జ్యోతిషంలోనూ ఉద్దండపండితుడు. స్కందత్రయ జ్యోతిష విభాగాల్లోనూ విస్తారంగా రచనలు చేసాడు. అవన్నీ చాలా పెద్దపెద్ద గ్రంధాలు కావటంతో, అంత పెద్ద వాటిని అవలోఢనం చేయలేని అశక్తుల కోసం వాటికి లఘు గ్రంధాలు కూడా తానే స్వయంగా విరచించాడు.
- ➣ సిధ్ధాంత గణితంలో పెద్దగ్రంధమైన పంచసిధ్ధాంతిక 18 ఆధ్యాయాలు కలిగి ఉంది. జాతకపధ్ధతికి సంబంధించిన ఆయన గ్రంధం బృహజ్జాతకంలో 26 ఆధ్యాయాలున్నాయి. ముహూర్తాది అనేక విషయాలుకల బృహత్సంహితలో యేకంగా 106 ఆధ్యాయాలున్నాయి.
- ➣ యుధ్ధవిషయకమైన జ్యోతిషవిభాగంలో వరాహమిహిరుడు మహాయాత్ర(భద్రయాత్ర, బృహద్యోగయాత్ర, యక్షేస్వమేధికయాత్ర అనికూడా దీనికి పేర్లున్నాయి), స్వల్పయాత్ర, యోగయాత్ర అని మూడు గ్రంధాలు రచించాడు.
- ➣ వివాహ విషయక జ్యోతిషంపైన వివాహపటలము, స్వల్పవివాహపటలమూ యీయన రచించాడు.
- ➣ ఈయన రచనలన్నీ సుష్టువైన, అందమైన, సరళమైన భాషలో ఉంటాయి. విషయాన్ని స్పష్టంగా చెప్పటమే కాకుండా చాలా కవితాత్మకంగా వ్రాయటం యీయన ప్రత్యేకత. ఛందస్సుమీద అఢికారమూ మంచి సరసత ఉన్నవాడు. కొన్ని కొన్ని చోట్ల మంచి కవితా ధోరణిలో తాను వ్రాస్తున్న పద్యం యొక్కఛందస్సు పేరును ఆ పద్యంలో ప్రస్తావించాడు కూడా. కొన్ని చోట్ల దండకాలు వంటివి కూడా వ్రాసాడు.
బృహజ్జాతకానికి వ్యాఖ్యరచించిన ఉత్పలుడు, దాని ప్రారంభంలో వరాహమిహిరుణ్ణి గురించి ఇలా అంటాడు.
యఛ్ఛాస్త్రం సవితా చకార విపులం స్కంధత్రయై ర్జ్యోతిషం
తస్యోఛ్ఛిత్తి భయాత్ పునః కలియుగే సంస్రజ్య యో భూతలం
భూయాః స్వల్పతరం వరాహమిహిర వ్యాజేన సర్వం వ్యధా
ద్దిష్టం యం ప్రవదన్తి మోక్షకుశలా స్తస్మై నమో భాస్వతే
తంత్ర (గణిత), జాతక, సంహితలనే మూడు స్కందములుగాల జ్యోతిషం సాక్షాత్తు సూర్యభగవానుడే స్థాపించాడు. కలియుగంలో అది నాశనమౌతుందని భయపడి, సూర్యుడే స్వయంగా వరాహమిహిరాచార్యుడిగా అవతారం ధరించి భూమికి వచ్చి ఆ స్కంధత్రయ జ్యోతిషాన్ని మరలా సులభంగా లఘురూపంలో మనకు అందించాడు. ఆసూర్యుడికి మోక్షార్ధులైన వాళ్ళు నమస్కరిస్తున్నారు. ఇదీ ఆ పై శ్లోకం యొక్క అర్థం.
సంకలనం/రచన: శ్యామలీయం