త్రిగుణములు
త్రిగుణములు:
ఇవి అన్యోన్య దాంపత్యమును అన్యోన్య సంశయమును గలవి. అన్యోన్య సంకలితములై, అన్యోన్య ఉపజీవితము గలవి. దుర్బోధము లైనవి.
- ➣ ఒక గుణము ప్రధానముగా వ్యక్తమైనప్పుడు మిగిలిన రెండు గుణములు అణగియుండును. తమోగుణము నియమితమైతే రజో గుణము సాగును. రజస్సు నియమితమైతే సత్వము సాగును. సత్వము అణిగినప్పుడు తమస్సు మొదలగును.
- ➣ ప్రతి వ్యవహారములోను గుణములు గుణములతో సంపర్కమవుతూ ఉండును.
- ➣ గుణములే వాసనల రూపమును క్షోభపెట్టి కాలానుగుణ్యముగా జీవుని అనుభవమునకు తీసుకొని వచ్చుచుండును.
- ➣ అపక్వవాసనలను పక్వానికి తెచ్చేవి గుణములే. క్షోభకు గురియైన వాసనలే ప్రారబ్ధ అనుభవము నిచ్చుచున్నవి.
- ➣ త్రిగుణ రహితునికి సంచిత వాసనలు నిర్బీజమగును. క్షోభ లేనందున ప్రారబ్ధముండదు.
- ➣ అదే జన్మరాహిత్యము. త్రిగుణ రహితుడే పరబ్రహ్మము.
శుద్ధ సాత్వికములు:
సత్వము, సంతోషము, అహింస, ధైర్యము, క్షమ, ఆర్జవము, సన్న్యాసము, పరిత్యాగము, విజ్ఞానము మొదలగునవి సహజమై యుండుట శుద్ధ సత్వగుణము.
- ➣ సత్వగుణ జనితములు : జపము, దానము, యజ్ఞము, తపస్సు మొదలగునవి.
- ➣ త్రిగుణ సామ్యము : శుభము, శాశ్వతత్వము
- ➣ త్రిగుణముల అవ్యక్తము : మోక్షము
- ➣ త్రిగుణ రహితము : అచల పరిపూర్ణము, పరమ పదము.
త్రిగుణ కర్తలు:
అనాసక్త భావముతో కర్మలను చేసేవాడు సాత్విక కర్త. రాగముతో కర్మలు చేసేవాడు రాజసిక కర్త. స్మృతి భ్రష్టుడై యుక్తాయుక్త విచక్షణ లేకుండా కర్మలు చేసేవాడు తామసిక కర్త. కేవలము సర్వాంతర్యామి, సర్వబాహ్యాంభ్యంతర స్వరూపుడగు పరమాత్మను ఉద్దేశించి కర్మలు చేసేవాడు, మరియు ప్రతి కర్మను పరమాత్మారాధనగా చేసేవాడు గుణాతీతకర్త.
త్రిగుణ వాసములు:
వనవాసము సాత్వికవాసము. గ్రామవాసము రాజసిక వాసము. జూదపాన గృహము తామసిక వాసము. దేవాలయములు, ఋష్యాశ్రమములు, పుణ్య క్షేత్రములు, హృదయ నివాసము - ఇవి గుణాతీత వాసములు.
త్రిగుణావస్థలు:
సత్వగుణము ప్రవృద్ధమైనప్పుడు జాగ్రదవస్థ. రజోగుణము ప్రవృద్ధమైనప్పుడు స్వప్నావస్థ. తమోగుణము ప్రవృద్ధమైనప్పుడు సుషుప్త్యావస్థ. ఈ మూడు గుణములు క్షీణించినప్పుడు మూడు అవస్థలకు సాక్షియై, ఆత్మానుభవము పొందినప్పుడు తురీయావస్థ.
త్రిగుణ కర్మలు:
సర్వాంతర్యామియగు పరమాత్మకు ప్రీతి కలిగించే ఉద్దేశ్యముతో ఫలాభిలాష లేకుండా, సమర్పణ భావముతో అనుష్ఠింపబడే నిత్య నైమిత్తిక కర్మలు సాత్విక కర్మలు. లోక సంబంధమైన ఫలమును కోరి చేసే కర్మలు రాజసిక కర్మలు. సహజీవులను బాధిస్తూ, హింసిస్తూ, దంభ మత్సరములతో కూడిన కర్మలు, ఇతరులపై ఆధిపత్యమును చెలాయించే కర్మలు తామసిక కర్మలు. కర్తృత్వము, భోక్తృత్వము లేకుండా జరిపే కర్మ సాధనములందు ఫలత్యాగముతోను, సర్వము బ్రహ్మరూపమని చేసే కర్మలు గుణాతీత కర్మలు.
త్రిగుణ శ్రద్ధలు:
ఆధ్యాత్మిక మార్గము సూచించుచున్న, బోధించుచున్న మార్గము, ఆశయముల పట్ల గల శ్రద్ధ సాత్విక శ్రద్ధ, నిర్మలమైన, సున్నితమైన, విస్తారమైన బుద్ధితో, శాస్త్రముల, ఆత్మజ్ఞుల బాటలో నడుస్తూ దానిని పరిశీలిస్తూ ఉండుట సాత్విక శ్రద్ధ. ఏదేదో ముందు ముందు చేయవలసినది ఉన్నదని ఎంతెంత పొందుచున్నాడనే పరిశీలన రాజసిక శ్రద్ధ. అధర్మమే అతని ధర్మమని అవివేకముతో కూడిన భావన తామసిక శ్రద్ధ అనబడును. భక్తియొక్క ప్రవృద్ధియే ఆశయముగా కలిగి, పరమాత్మను సేవించుటయందు గల శ్రద్ధ గుణాతీత శ్రద్ధ అనబడును.
త్రిగుణ జ్ఞానములు :
- ➣ దేహ భావనను, గుణములను అధిగమించి దేహిని గురించి, గుణిని గురించి ప్రవచించే, నిర్వచించే, తెలియజేసే జ్ఞానము సాత్విక జ్ఞానము. బంధ మోక్షములు, సాధన పద్ధతుల గురించిన నిశ్చయ జ్ఞానమును కూడా సాత్విక జ్ఞానమందురు.
- ➣ దేహమునకు, ఇంద్రియాదులకు, విషయములకు సంబంధించిన, లోక విశేషాదులకు సంబంధించిన జ్ఞానమును రాజసిక జ్ఞానము అందురు.
- ➣ పెత్తనము, ఆధిపత్యము, ఇతరులను లొంగదీసుకొనుట, బాధించుట, లోభత్వముల గురించిన జ్ఞానమును, ఇంద్రియ భోగములకు సంబంధించిన జ్ఞానమును తామసిక జ్ఞానము అందురు.
- ➣ జ్ఞానమే తానైన విజ్ఞానము, స్వస్వరూపము, ప్రజ్ఞాన ఘనము, చిత్ ఘనము, ఆనంద ఘనము, ఈ లక్షణములు గుణాతీత జ్ఞానము అనబడును.
త్రిగుణముల వృద్ధికి సూచనలు:
- ➣ చిత్తము కలత చెందుచూ, చిత్ను పూర్తిగా ఏమరుస్తూ వుంటే, సంకల్పాత్మకమైన మనస్సు బలహీనమై బద్ధకిస్తూ ఉంటే, అజ్ఞానము, విషాదము తెంపు లేకుండా ఉంటే - అది తమోగుణ వృద్ధికి సూచన.
- ➣ జీవుడు అనేక కర్మ వ్యవహారములందు ఆసక్తుడై, వికృతుడైతే, చిత్తము చంచలముగా ఉంటూ విక్షిప్తి చెందుతూ ఉంటే మనసు వ్యభిచరిస్తూ ఉంటే, కర్మేంద్రియములు అవిరామముగా ఉంటే - అది రజోగుణ వృద్ధికి సూచన.
- ➣ ఇంద్రియములు ప్రశాంతమై, చిత్తము నిర్మలమై, మనస్సు నిర్భయమై, సంగరహితమై, పరమాత్మను పొందుటకు అనుగుణముగా ఉంటే - అది సత్వగుణ వృద్ధికి సూచన.
- ➣ త్రిగుణములు జీవునికి చెందినవి కాదు. జీవుని యొక్క చిత్తమునకు సంబంధించినవి. చిత్తవృత్తి నిరోధము లేక మనోనాశ్ అయినప్పుడు జీవుడే పరమాత్మ.
త్రిగుణములు - ఉత్తరోత్తర గతులు:
- ➣ తమో గుణాశ్రయులు నిమ్న జాతి ఉపాధులలోను, స్థావరములలోను జన్మించి, అధోగతిని పొందెదరు. నరకమును కూడా పొందెదరు. రజోగుణాశ్రయులు మానవ లోకములో, మానవులుగా జన్మించెదరు.
- ➣ సత్వగుణాశ్రయులు క్రమముగా బ్రహ్మసాక్షాత్కార మార్గములో బ్రహ్మోపాసకులై, ఊర్ధ్వ లోములవైపు యానము చేసెదరు. బ్రహ్మ లోకమును పొందుట కూడా జరుగును.
- ➣ నిర్గుణులు జీవించి ఉన్నప్పుడే సర్వలోకాతీతులై పరమును చేరెదరు. జీవన్ముక్తులై 14 లోకములకు కేవల సాక్షియై, అతీతులై, వాటిని లీలా వినోదముగా చూచెదరు.
త్రిగుణముల బలము:
సత్వగుణ వృద్ధితో దేవతలు బలపడుదురు. రజోగుణ వృద్ధితో మానవులు బలపడుదురు. తమోగుణ వృద్ధితో రాక్షసులు బలపడుదురు.
త్రిగుణ ఆహారములు :
- ➣ సాత్వికాహారము: హితకరము, శుద్ధము, ఇతరులకు బాధ కలిగించ కుండా సంపాదించుకొన్నది. అనాయాస, అబాధిత, అనింద్యమైన సంపాదన వలన సమకూరినది సాత్వికాహారము.
- ➣ రాజసికాహారము: ఇంద్రియ భోగ లక్ష్యముగా కలిగినది. వగరు, పులుపు, ఉప్పు పదార్ధములు, సహజీవుల బాధలను లెక్కచేయక, పాపపుణ్య విచక్షణ లేక సంపాదించినది రాజసిక ఆహారము.
- ➣ తామసికాహారము: దాహము, దైన్యము, మత్తు కలిగించేవి, అపవిత్రమైనవి, ఇతరులను బాధించి మోసగించి సంపాదించినది తామసిక ఆహారము.
- ➣ గుణాతీత ఆహారము : భగవంతునికి నివేదించి, తిరిగి భగవత్ప్రసాదముగా స్వీకరించినది, న్యాయార్జితమైనది, దైవార్పితమైనది, మితము, హితము అయిన ఆహారము గుణాతీతాహారము. అన్నము యొక్క సూక్ష్మాంశము మనస్సు కనుక సాధకులు ఆహార విషయములో జాగరూకులై యుండి, వారి మనస్సును సాత్వికము చేసుకుని, చివరకు గుణాతీతము చేసుకొన్నచో వారు ముక్తులగుదురు.
త్రిగుణ మనస్సులు:
విషయములు గ్రహించు ప్రకాశమున్న మనస్సు సత్వగుణము. ప్రవృత్తి రూప మనస్సు రజోగుణము. మోహరూప మనస్సు తమోగుణము. ఈ విధముగా మనస్సు త్రిగుణములుగా నున్నది గనుక మనస్సన్నా మాయయన్నా ఒక్కటే. గుణాతీతమైన మనస్సు అనగా మనోనాశనమే. అందువలన అమనస్కమైనప్పుడు ఆత్మ ప్రకాశము స్పష్టము.
మనస్సు తమోగుణము చేత ఉద్రిక్తమైనప్పుడు దంభము, దర్పము మొదలగు అసుర సంపద పుట్టును. రజో గుణముచేత ఉద్రిక్తమైనప్పుడు తనలోని వాసనా త్రయము విజృంభించును. సత్వగుణముచేత ఉద్రిక్తమై నప్పుడు వివేకము, సత్వశుద్ధి కలిగి, జ్ఞానోదయమగును. అవిద్యా కార్యము లైన తమస్సు, రజస్సు నివర్తించబడును. అందువలన తమస్సు వలన కలిగిన ఆవరణము తొలగును. మరియు రజస్సు వలన కలిగిన విక్షేపము తొలగును. ఈ రెండూ తొలగినప్పుడు మిథ్యాభావము స్థిరమై వాసనా క్షయమగును. తాను బ్రహ్మమను అపరోక్షము సిద్ధించును.
త్రిగుణ పురుషార్థములు :
సత్వగుణము వలన ధర్మము, రజోగుణము వలన అర్థము, తమోగుణము వలన కామము జనించును. శుద్ధ సత్వము వలన మోక్షము, గుణాతీత స్థితివలన పరమపదము సిద్ధించును.
త్రిగుణ షడ్చక్రములు :
మూలాధారములో తమస్సు విశేషము, రజస్సు పూర్ణ వికాసము, సత్వము నిస్తేజము. స్వాధిష్ఠానములో రజస్సు 75% సత్వము 25%, మణిపూరకములో రజస్సు 50% సత్వము 50%, అనాహతములో రజస్సు 25% సత్వము 75%, విశుద్ధములో రజస్సు 10% సత్వము 90%, ఆజ్ఞలో సత్వము 100% శుద్ధ తమస్సు ప్రారంభము.
త్రిగుణ ప్రభావము :
- 1. తమోగుణ ప్రభావమైనవి : తేళ్ళు, పాములు, పందులు, కుక్కలు, చేపలు, కోళ్ళు, కాకులు, నక్కలు, క్రిములు, దోమలు, పొదలు, చెట్లు, అవి నొప్పులు, పీడ పొందును.
- 2. రజోగుణ ప్రభావమైనవి : బలము, శౌర్యము, మదము, ప్రాభవము, సుఖదుఃఖములను అంచనా వేయగల నేర్పు, స్నేహము, కాంక్ష, ఒప్పుకోలేక పోవుట, మోసము, కలహము, ఈర్ష్య, చమత్కారము, స్త్రీలపట్ల అతిగా అనురక్తి కలిగి యుండుట మొదలగునవి.
- 3. సత్వగుణ ప్రభావమైనవి : సంతోషము, ప్రకాశత్వము, సత్యము, శౌచము, ధైర్యము, అకుత్సితత్వము, తిత్షి, అహింస, ఆర్జవము, అనసూయత, అక్రోధము, అసంరంభము, సమత, దాక్షిణ్యము, శ్రద్ధ, లజ్జ, గౌరవము, అక్రూర స్వభావము మొదలగునవి.
త్రిగుణ వృత్తులు:
- 1. తమోగుణ వృత్తులు : క్రోధము, లోభము, అసత్యభాషణ, హింస, యాచన, దంభము, తానొక్కడే శ్రమపడుతూ అలసిపోవుచున్నట్లు, కాని ఇతరులు హాయిగా ఉన్నట్లు భావించుట, కలహము, శోకము, మోహము, దైన్యము, విషాదము, ఆవేదన, మానసిక బాధ, సోమరితనము, అతి నిద్ర, అత్యాశ, ప్రతిదానికి భయపడుట, పిరికితనము, నైరాశ్యము, ఉద్యమించకపోవుట, ప్రయత్నములో వెనుకంజ, ఆత్మహత్యా ప్రయత్నము మొదలైనవి.
- 2. రజోగుణ వృత్తులు : కామము, ప్రాపంచిక సంబంధమైన ఆలోచనలు, ఆశయములు, నిరంతరము ఏదో కార్యక్రమములో నిమగ్నమై యుండుట, ఆశ, తృష్ణ, దంభము, మదము, బేధ బుద్ధి, సుఖాభిలాష, మదోత్సాహము, కీర్తి కాంక్ష, దృశ్యవస్తు ప్రీతి, తన ప్రతాపమును చూపవలెననెడి ఉబలాటము, ఉద్వేగ పూరితమైన ప్రయత్నము, అనవసరముగా అతిగా స్పందించుట మొదలైనవి.
- 3. సత్వగుణ వృత్తులు : శమము, దమము, తితిక్ష, వివేకపూరితమైన దృష్టి (ఈక్ష), తపస్సు, సత్యము, దయ, స్మృతి, తుష్టి, సంతోషము, త్యాగము, అస్పృహ, శ్రద్ధ, లజ్జ, ఆత్మరతి మొదలైనవి.
త్రిగుణ సుఖములు :
- ⧫ తమోగుణ సుఖము : మోహము, దైన్యము, మత్తువలన కలిగే కల్పిత సుఖము, ఇతర సాధక బాధకములను లెక్కచేయకపోవుట వలన కలిగే కల్పిత సుఖము తమోగుణ సుఖమనబడును.
- ⧫ రజోగుణ సుఖము : విషయ భోగముల వలన అప్పటికప్పుడు కలిగే కల్పిత సుఖము రాజసిక సుఖమనబడును.
- ⧫ సత్వగుణ సుఖము : ప్రేమ, దయ, కర్తవ్య నిర్వహణ, పరోపకారము, వాటికై కష్టపడుచున్ననూ కలిగే సుఖము, సంతోషము, తృప్తి సాత్విక సుఖము.
- ⧫ గుణాతీత సుఖము : పరమాత్మను కీర్తించుట వలన కలిగే తన్మయత, మైమరపు, ఇత్యాదుల వలన కలిగే ఆనందము, గుణాతీతానందము.
త్రిగుణములు ప్రకటించబడుటకు నిమిత్త స్థానములు:
- 1. తెలియబడే దృశ్య జగత్తు
- 2. ప్రాణము
- 3. శక్తి
- 4. ప్రకృతి
- 5. జనులతో సంసర్గము
- 6. దేశము
- 7. కాలము
- 8. కర్మ
- 9. జన్మ
- 10. వాతావరణము
- 11. ధ్యానము
- 12. మంత్రము
- 13. సంస్కారము
- 14. శ్రద్ధ,
- 15. తపస్సు,
- 16. సాధన
పైన పేర్కొన్న స్థానములను విచారించినచో త్రిగుణ స్వభావమును అనేక ఉపాయములతో తొలగించుకొనగలరు. త్రిగుణాతీతమగు బ్రహ్మమగుట కొఱకు త్రిగుణములను ఆయా స్థానములందు గుర్తించి, విచారించి, సాధనలతో అధిగమించగలరు. త్రిగుణ రహితమనగా భ్రాంతి రహితము, అనగా మోక్షమే.
అసుర సంపత్తి:
కేవలము శరీర పోషణ, ధారణతో జీవించుచూ రజస్తమోగుణ మాలిన్యములతో కూడిన భావములుండుట అసుర సంపత్తి. అసద్వృత్తులే అసురులు.
దైవీ సంపత్తి :
రజస్తమో మాలిన్యము పూర్తిగా తొలగి చైతన్య ప్రకాశముతో వెలువడే భావములుండుట దైవీ సంపత్తి. సద్వృత్తులే దేవతలు.
దైవీ సంపత్తి గుణములు :
నిర్భయత్వము, చిత్త శుద్ధి, ఆత్మజ్ఞానోపాయమైన నిష్ఠ, దానము, ఇంద్రియ నిగ్రహము, యజ్ఞములు, క్రతువులు, హోమములు, అధ్యయనము, త్రివిధ తాపములు లేకుండుట, ఆర్జవము, త్రికరణ శుద్ధిచే ప్రాణిపీడావర్జనము, సత్యము, అక్రోధము, ఔదార్యము, మహాశాంతము, పరుల దోషములను పరోక్షముగా కూడా ఎంచకుండుట, సర్వ ప్రాణులందు దయ, అలోభము, మృదు స్వభావము, అకార్యములందు లజ్జ, చపలత్వము లేకుండుట, ప్రగల్భములాడకుండుట, ఓరిమి, ధైర్యము, బాహ్యాభ్యంతర శుద్ధి, ద్రోహచింతన లేకుండుట, నిరభిమానము.
బ్రహ్మర్షి:
జ్ఞానులైన వారి క్రియలందు సత్వగుణము ప్రధానముగా ఉన్న యెడల వారిని బ్రహ్మర్షులందురు.
రాజర్షి :
జ్ఞానులైన వారి క్రియలందు రజోగుణము ప్రధానముగా ఉన్న యెడల వారిని రాజర్షులందురు.
జ్ఞానులైన వారి క్రియలందు రజోగుణము ప్రధానముగా ఉన్న యెడల వారిని రాజర్షులందురు.
త్రిగుణ ధ్యానాభ్యాసములు :
ధ్యానాభ్యాసమందు తమోగుణము ఉద్రేకించి నప్పుడు దట్టమగు చీకటి గోచరించును. రజోగుణము ఉద్రేకించినప్పుడు ఉదయించే సూర్యునితో సమానమగు తేజము గోచరించును. సత్వగుణము ఉద్రేకించినప్పుడు కేవలము బయలు గోచరించును. నిర్గుణ సమాధియందు బయలే తానై యుండును. గుణములు తిరిగి తోచినప్పుడు సమాధి విరమణయై తిరిగి సంసారము తోచును. పరిపూర్ణ బోధవలన త్రిగుణ రహితమైతే బయలు స్వతస్సిద్దము.
త్రిగుణముల ఎరుక బేధము :
మాయ త్రిగుణాత్మకము. అందలి సత్వాంశము వలన త్రిమూర్తులు శక్తి రూపులైన అధిష్ఠాన దేవతలు కలిగిరి. తామసాంశము వలన జడ జగత్తు తోచెను. సత్వతమో గుణముల మిశ్రమము వలన రాజసాంశము కలిగి, దాని వలన జీవులు తోచిరి. సత్వాంశ జనితమును కేవలపు టెరుక అనియు, రాజసాంశ జనితమును మిశ్రమపుటెరుక అనియు తామసాంశజనితమును మలినపుటెరుక అనియు అందురు.
- ➣ కేవలపు టెరుకగా నున్న బ్రహ్మయందు రజోగుణము వలన సంకల్పము కలిగి చతుర్ముఖ బ్రహ్మ సృష్టి చేయుచుండెను. సత్వగుణము వలన సృష్టియొక్క స్థితిని విష్ణువు పోషించుచుండెను. తమోగుణము వలన ఆ సృష్టిని రుద్రుడు లయము చేయుచుండెను.
- ➣ మలినపుటెరుకగానున్న పంచభూతములు సమష్టిలో బ్రహ్మాండమై, వ్యష్టిలో పిండాండములైనవి. తమోగుణములోని సాత్వికాంశము అంతఃకరణ గాను, జ్ఞానేంద్రియములుగాను మారెను. తమోగుణములోని రాజసాంశము పంచప్రాణములుగాను కర్మేంద్రియములుగాను మారెను. తమోగుణములోని తామసాంశము జీవోపాధులుగా మారెను.
- ➣ మిశ్రమపుటెరుకలోని ప్రాణులు, జీవులలో మూడు గుణములు ఎక్కువగానో, తక్కువగానో ఉండి, వారి వారి స్వభావము ప్రకారము ఏదో ఒక గుణ ప్రధానముగాను, మిగిలిన రెండు గుణములు అణగియుండి ప్రవర్తించుచున్నారు.
ఈ విధముగా త్రిగుణములు ఏ రూపములో ఎంతమాత్రమున్నను అది యంతయు మాయాకార్యమే. త్రిగుణ రహితమునకు చేసే సాధనలు, ఫలించినప్పుడు తానే పునరావృత్తి లేని పరబ్రహ్మము అనే పరమపదము సిద్ధించును.
శ్లో|| ఉదాసీన వదాసీనో గుణైర్యో నవిచాల్యతే |
గుణావర్తంత ఇత్యేవ యో-వతిష్ఠతి నేంగతే ||
తా|| త్రిగుణములకును, వాటి కార్యరూపమైన శరీరేంద్రియ అంతఃకరణ వ్యాపారములకును ఏమాత్రము చలించక, త్రిగుణాతీతుడు, ఉదాసీనునివలె ఉండి, గుణములే గుణములతో ప్రవర్తించుచున్నవని తలంచువాడు సత్చిత్ ఆనంద ఘనుడై అచలుడై యుండును.
అనువాదము: చల్లపల్లి