కర్మ
మానసిక స్పందనతో చేయబడే పని కర్మ. రాగద్వేషములతో స్వార్థముతో, అరిషడ్వర్గముతో ప్రయోజనమును ఆశించి చేయబడే కర్మ తలపులలో వచ్చినా, మాటల ద్వారా వచ్చినా, చేతల ద్వారా జరిగినా అది కర్మయే. కర్తృత్వ, భోక్తృత్వము, ఇష్టాయిష్టములున్నచో అది కర్మ. విషయీకరించుకొనుచున్న మనస్సు కర్మను అంటించుకొనును. త్రిగుణముల పాత్ర ఉన్నచో జరిగిన పనియు, ఆ పనుల ఫలితములు కర్మను జమచేయును.
కర్మ వాసన:
కర్మ జరుగుచున్నంతసేపు ఆ విషయములు గుర్తులుగా మారి, తిరిగి ఎప్పుడో ఒకప్పుడు అనుభవమునకు వచ్చును. ఆ గుర్తులనే కర్మవాసన అందురు.
సంస్కారము:
కర్మవాసనను తిరిగి అనుభవించబడుటకు గాను, ఒక స్వభావముతో కూడిన వ్యక్తిత్వము ఏర్పడును. కర్మ విషయము వ్యక్తియొక్క స్వభావము కలిసి సంస్కారమనబడును.
వ్యక్తిత్వము:
అనేక జన్మలలో పొందిన అనుభవములు, గుణపాఠముల నుండి పరిణమించిన స్వభావము, అహంకారముతో కూడినది వ్యక్తిత్వమన బడును. ఈ వ్యక్తిత్వము అనేక జన్మల అనుభవ సారాంశమును బట్టి నిర్మితమగును. ప్రతి జన్మకు మార్పు చెందుతూ, ముముక్షువైన వానిలో ఆ వ్యక్తిత్వము నశించి అతడు ముక్తుడగును.
నిసర్గము:
పుట్టుకతో వచ్చిన స్వభావము, విధి, ప్రారబ్ధము, దైవదత్తము అని పేరులు.
ప్రారబ్ధము:
వర్తమాన దేహమును కలుగజేసి సుఖ దుఃఖములను కలుగజేయుటకు కనిపెట్టుకొని యున్న కర్మ. ప్రారబ్ధము అనేక జన్మార్జిత కర్మల సంచితమునుండి వర్తమాన జన్మలో వాటి ఫలితములను అనుభవింప జేయుటకు విడిబడిన భాగము. ఈ భాగము అనుభవించక తప్పదు. అంతమేరకు ఖర్చై సంచిత కర్మరాశి తరిగి పోవుచుండును.
కర్మ నాశనము:
తత్త్వ జ్ఞానికి అనారబ్ధ కర్మ నశించును. కాని ప్రారబ్ధము మాత్రము భోగించుట పూర్తియగుట వలన క్రమముగా నశించును. అందువలన జ్ఞానికి వెంటనే వర్తమాన దేహము పతనమగుటలేదు. జీవన్ముక్తుడుగా ఆయుష్షు తీరువరకు శరీర ప్రారబ్ధము ననుభవించుచూ ఉండవలెను.
ఆగామికర్మ:
ప్రారబ్ధము అనుభవించబడుచుండగా ప్రతిస్పందన కలిగిన మనస్సు క్రొత్త కర్మ వాసనలను ముద్రించుకొనును. క్రొత్త కర్మలను ఆగామి కర్మలందురు. ప్రతి జన్మలోను ఏర్పరచుకొన్న ఆగామి కర్మలు మొత్తముగా జమయైన రాశిలో కలసి సంచితము పెరుగుచుండును.
సంచితకర్మ:
ఆగామి వలన జమ, ప్రారబ్ధము బోగించుట వలన ఖర్చు అగుటచే ఎప్పటికప్పుడు మిగిలియున్న కర్మరాశిని సంచిత కర్మ అందురు. ఇవి వాసనారూపములో ఉండి కార్యరూపము గానివి. ప్రారబ్ధముతో ఖర్చై తరుగుచుండగా, ఆగామివలన పెరుగుచుండును. ఈ సంచితరాశియే కారణ శరీరము. రాబోవు జన్మలకు కారణము.
కారణ శరీరము:
సంచిత కర్మరాశి. ఇది జన్మలకు కారణముగా నుండును. స్థూల శరీరమును పనిముట్టుగా చేసుకుని, సూక్ష్మ శరీరము భోగించును. ఏ జన్మకా జన్మలో స్థూల శరీరములు పుట్టి నశించుచుండును. కాని సూక్ష్మ శరీరము నశించక కొనసాగుచుండును. కారణ శరీరము నశించినప్పుడు సూక్ష్మ శరీరము భంగమగును. ఇవి జరుగుటకు తత్త్వజ్ఞానము అవసరము . లింగ శరీర భంగమే ముక్తి.
మలిన వాసన:
అజ్ఞాన కారణముగా యే వాసనలు భ్రమలను కలిగించుచూ, అహంకారముతో కలిసి యుండునో తరువాత పునర్జన్మలకు హేతువగునో ఆ వాసనలు మలినవాసనలనబడును.
శుద్ధ వాసన:
తత్త్వము తెలుసుకొనుటకును, పునర్జన్మలను నివారించుటకు హేతువగు సత్కర్మల వలన, భక్తి జ్ఞాన వైరాగ్యాభాసము వలన, యేర్పడు వాసనలు శుద్ధ వాసనలనబడును. ఇవి మలిన వాసనలను చెరిపివేయును.
కర్మ రాహిత్యము:
నిష్కామ కర్మవలన ఆగామి యేర్పడదు. జ్ఞానము వలన సంచితము దగ్ధమగును. ప్రారబ్ధము అప్పటికే వదలిన బాణమువలె ఉండి లక్ష్యము చేరగానే పడిపోవునట్లు శరీర పతనము వరకు ఉండి ముక్తాత్మల విషయములో లేకుండా పోవును.
నిష్కామ కర్మ
మజ్జిగ చిలుకునప్పుడు బయటకు చిందకుండా పాత్రలోనే చిందునట్లు చేయుటవలె, ఎలాంటి భావము బయటికి సాగిరానీయక, లోపలివి లోపలనే అణగిపోయేటట్లు అభావముగా అనగా కీలుబొమ్మలా వర్తించే శాంత మనస్కులకు అన్నిటికీ మూలమైన బుద్ధి నిశ్చలమగును. అట్టి నిర్మల బుద్ధిగా ఉంటూనే అప్పుడు చేయబడే కర్మలు, అభావమందు, పాప పుణ్యకర్మలు ఫలించవు.నైష్కర్మ్యమునకు ఉపాయము :
సమస్త కర్మలను భగవంతుడే చేయుచున్న కర్మలుగాను, అందువలన కర్మల ఫలితము కూడా ఆ భగవంతుని లీలా విలాసము కొఱకేనని భావించుచూ కర్మలను ఆచరించవలెను. అన్ని కర్మల ఫలితములను ఆ భగవంతునికే అర్పించవలెను. అంతా భగవదేచ్ఛ అని ఊరకుండుట.
- సత్కర్మలు : తనకు, ఇతరులకు హితము చేకూర్చే కర్మలు
- దుష్కర్మలు : తనకు, ఇతరులకు చెరుపు కలిగించే కర్మలు
స్థూల కర్మాచరణమందున్న యోగి నిర్లిప్త భావముతో జగత్కల్యాణము కొఱకు రాగద్వేష రహితముగా ఫలాకాంక్ష లేకుండా చేసే కర్మ.
అకర్మలో కర్మ:
సదా ఆత్మరతుడై, జ్ఞానులైన మునులు దేనినీ ఇచ్ఛగించని వారు. ఇది కూడా కర్మయే. దీనిని అకర్మలో కర్మ అందురు.
- పక్వకర్మలు : క్రమముగా ప్రారబ్ధానుభవమునకు వచ్చుచున్నవి.
- అపక్వకర్మలు : అనుభవమునకు రాకుండా వాసనా రూపములో నుండేవన్నీ అపక్వ కర్మలు.
కర్మ అనగా విద్యుక్తమైన కర్మ. అకర్మ అనగా కర్మ చేయకుండుట. వికర్మ అనగా చేయకూడని కర్మ చేయుట. నైష్కర్మ్యమనగా కర్మ చేసియు, చేయనివాడై యుండుట అనగా కర్తృత్వ భోక్తృత్వ రహిత కర్మాచరణ.
హతోదితకర్మలు
జీవన్ముక్తులచేత చేయబడు కర్మలు. అవి మానసిక స్పందనతో చేయబడు కర్మలు కావు. అందువలన ఆ కర్మలు ఫలించవు. అనగా ఆగామి ఏర్పడదు. ఆ కర్మలన్నీ నిష్కామకర్మలు, కర్తృత్వ రహిత కర్మలు.కర్మ ఫలితములు 4 విధములు :
- 1. ఉత్పాద్యము : కుండ చేయబడెను అన్నట్లు జరిగే కర్మ.
- 2. ప్రాప్యము : ధనము ప్రాప్తించనిది అన్నట్లు జరిగే కర్మ
- 3. వైకారము : బియ్యము ఉడికి అన్నము అయినట్లు జరిగే కర్మ.
- 4. సంస్కార్యము : అద్దము తుడిచి, మురికి, దుమ్ము లేకుండా చేయునట్లు జరిగే కర్మలు.
సాత్విక కర్మలు
ఫలకాంక్ష లేకుండా, సంగరహిత బుద్ధితో, రాగద్వేషములు కలుగని రీతిగా, ధర్మబద్ధముగా నిష్పక్షపాతముగా, నియతితో జరుపబడు కర్మలు. నిస్వార్ధముగా, విద్యుక్త ధర్మముగా, పేరు ప్రతిష్ఠలకోసము కాకుండా జరుపబడు కర్మలు.- ➣ రాజస కర్మలు : ఫలకాంక్షతో, అహంకారముతో, బహు ప్రయాసపడి చేసే కర్మలు.
- ➣ తామసిక కర్మలు : పౌరుషముతో హింసాత్మక బుద్ధితో, మూర్ఖముగా చేసే కర్మలు. పాపకర్మ అనాలోచితముగా చేసినను, పరోక్షముగా చేసినను, అది పాప కర్మయే.
- ➣ పశ్చాత్తాప కర్మలు : చేసిన పాపములకు పశ్చాత్తాపపడుట వలన సగము పాపము తగ్గును. ఇంక ఎప్పుడూ అట్టి పాపకర్మలు చేయనని నిశ్చయించుట వలన మరియు చేయకుండుట వలన మిగిలిన సగము పాపము నశించును. తాను చేసిన పాపము వలన నష్టపడినవారిని ఆదుకొని, మేలు చేయుట వలన పుణ్యము వచ్చును.
ఏ పదార్థము దానము చేసిన, ఆ పదార్థములు సమృద్ధిగా లభించును.
- ➣ మౌనము పాటించిన, జ్ఞానము వృద్ధి యగును.
- ➣ తపస్సు అధికమైతే, అధిక భోగము కలుగును.
- ➣ అహింస వలన రూపము, బలము, ఐశ్వర్యము కలుగును.
- ➣ బ్రహ్మచర్యము వలన ఆయువు వృద్ధి యగును.
- ➣ ఉపవాసము వలన చిత్తశుద్ధి కలుగును.
- ➣ వేద పఠనమువలన సౌఖ్యము, వేదార్థబోధ, సుగతి లభించును.
- ➣ సత్యమును వ్రతముగా ఆచరించినచో ముక్తి కలుగును.
- 1. బ్రహ్మజ్ఞానము వలన సకల కర్మలు నష్టమగును.
- 2. భోగించుట వలన కొన్ని ఖర్చు అగును. మరికొన్ని మిగులును. ఆగామి వలన కొత్తవి ఏర్పడును.
- 3. పశ్చాత్తాపము, ప్రాయశ్చిత్త కర్మల వలన కొన్ని కర్మలు కొంతవరకు నష్టమగును.
- 1. మద్య సేవనము,
- 2. బ్రహ్మ హత్య,
- 3. బంగారము మొదలగువానిని దొంగిలించుట,
- 4. గురుపత్నిపై మోహము,
- 5. ఇట్టివారితో స్నేహము చేయుట.
- 1. రౌరవము,
- 2. మహా రౌరవము,
- 3. కంటకావనము,
- 4. అగ్నికుండము,
- 5. పంచకష్టములు.
- ఇవి పాపకర్మల ఫలితము తక్కువ ఎక్కువలను బట్టి ఉండును.
సంసారమునకున్న మూడు వేరులు మూడు కర్మలు. సంచితము, ఆగామి, ప్రారబ్ధము. ఈ మూడూ నశించినప్పుడు మూడు ప్రతిష్ఠలు సిద్ధించును.
- 1. సత్య ప్రతిష్ఠ అనగా అసతోమా సద్గమయ
- 2. ప్రాణ ప్రతిష్ఠ అనగా తమసోమా జ్యోతిర్గమయ
- 3. ఆనంద ప్రతిష్ఠ అనగా మృత్యోర్మా అమృతంగమయ
ఔపరమికము, నిరపకరణము, సోపకరణము అని మూడు విధములు.
- 1. ఔపరమికమనగా పాపములను వర్జించుట, నరకలోకాది భీతి కలిగియుండుట. పాప కర్మలను చేయక, చేయించక, ప్రోత్సహించక వాటికి దూరముగా ఉండుట. మంచి మాటలు వినుట. పెద్దలతోడి సాంగత్యము. ఇంద్రియ నిగ్రహము వలన కలిగే స్వర్గము.
- 2. నిరపకరణమనగా శౌచము, శాంతి, దాంతి, ఆర్జవము, వ్రత నియమము బ్రహ్మచర్యము, తీర్థాటనము, నదీ సాగర సంగమస్నానము, నదీనద సంగమ స్నానము, దేవతార్చన, గోబ్రాహ్మణ పూజల వలన పొందబడే స్వర్గము.
- 3. సోపకరణమనగా ధన ధాన్యాది సమృద్ధితో గృహస్థుల వైదిక పితృకాది పుణ్య క్రియల విశేష ఆచరణ, దాన ధర్మములు, న్యాయార్జిత సంపదను వేదవిదుడైన శాంతుడైన శుద్ధ బ్రాహ్మణునికి చేసే దానములు, శక్తికి మించి కూడా చేసే త్యాగములు, అహంకారము లేకుండా చేసే క్రియలు, చేసిన పిదప వాటిని చింతించకుండుట వలన పొందబడే స్వర్గము.
అనాది కర్మవాసన చేత, అనిర్వచనీయ మాయా శక్తిచేత, ఆత్మ అనాత్మతో కలిసియున్నట్లు తోచుటచేత, అనాత్మ గుణములన్నీ ఆత్మ గుణములే అయినట్లు కనిపించుటచేత సంసార పాశము కలుగుచున్నది. దీనినే అజ్ఞానము, అవిద్య, మాయ, ప్రకృతి, మనస్సు, కర్మ అని సందర్భోచితముగా పిలిచెదరు.
యజ్ఞముగా నిర్వర్తించే కర్మ:
విధి నిర్వహణగా, ఈశ్వర సమర్పితముగా, నిస్వార్థముగా, లోక కళ్యాణార్థము, పెద్దల సూచనలు ఆదేశాలకు అనుగుణముగా చేయబడే కర్మలు యజ్ఞమనబడును. ఉపాసనా దృష్టితో జరిపే కర్మ యజ్ఞము. యజ్ఞ భావమనగా పదిమందితో కలిసి చేయబడే కర్మలో తాను ఒక పాత్రధారి మాత్రమేననే భావము. సమష్టి కర్మ నిర్వహణ యందు వ్యష్టిపాత్రలో అనుకూలముగా గాని, వ్యతిరేకముగా గాని భావనలు కలుగక, వ్యక్తిగత ప్రయోజనమును ఆశించక చేయబడే కర్మ యజ్ఞ మనబడును. ఇట్టి యజ్ఞ భావ కర్మలు మిక్కిలి సత్ఫలితముల నందించును.
సూక్ష్మాతిసూక్ష్మ కర్మ :
ఆత్మ రతులై ఆనందము ఆస్వాదించుచుండుట అనే కర్మ పరమాత్మ సాన్నిధ్యమును అందించును. ఇది సూక్ష్మాతి సూక్ష్మ కర్మ.
ముమూర్షువు :
ప్రస్తుత జన్మలో ప్రారబ్ధ కర్మ ఫలములన్నింటినీ అనుభవించి, ఈ జన్మయొక్క, ఈ లోకముయొక్క వ్యవహారములన్నింటినీ పూర్తిచేసి ముందు జన్మకు రాబోవు దేహప్రాప్తికి సిద్ధమయ్యేవాడు, ప్రస్తుత జన్మను చాలించుట కొఱకు చనిపోవువాడు ముమూర్షువు.
లోకవాసన :
ఈ లోకములో ఇతరులు నన్ను ఏ ప్రకారముగా ఉంటే స్తుతించుదురో ఆ ప్రకారముగా ప్రవర్తించెదను అనెడి వాసన లోక వాసన అనబడును. పదునాలుగు లోకములు సత్యమనెడి వాసన లోక వాసన. లోకములు, లోకేశులు, లోకస్థులు, మిథ్యయనెడిది జ్ఞానము.
శాస్త్రవాసన:
- 1. పాఠ్యవ్యసనము : 3 వేదములు చదివిన భరద్వాజ ముని సారమును గ్రహించక నాల్గవ వేదమును కూడా అధ్యయనము చేయవలెనని, దేవేంద్రుని వద్ద తన కోరిక వెలిబుచ్చగా, దేవేంద్రుడు నిరాకరించెను. మోక్షసాధనయగు సగుణ బ్రహ్మ విద్యను బోధించెను. భరద్వాజ ముని సద్గతి పొందెను.
- 2. బహుశాస్త్ర వ్యసనము : అనేక శాస్త్రములు చదివిన దుర్వాస మునిని నారదుడు గంధపు చెక్కలు మోసే గాడిదగా పరిహసించగా, ఆ శాస్త్రములన్నిటిని సముద్రములో పారవైచి సాంబమూర్తి వద్ద బ్రహ్మవిద్య ఉపదేశము బడసి కృతార్థుడయ్యెను.
- 3. అనుష్ఠాన వ్యసనము : ఋభు మహర్షి నుండి సమస్త వేదాంగములను తెలుసుకున్న నిదాఘుడు అనే శిష్యుడు, గృహస్థాశ్రమమున కర్మానుష్ఠానమునకు ప్రాధాన్యమిచ్చెను. గురువైన ఋభు మహర్షి రెండు మూడు పర్యాయములు ఆ శిష్యుని పరీక్షించి, అనేక ఉపాయములతో బ్రహ్మ విద్యను బోధించిన పిదప గాని, నిదాఘుడు తన కర్మానుష్ఠాన వ్యసనము నుండి బయట పడలేదు. చివరకు బ్రహ్మనిష్ఠ కుదిరి ఊరక ఉండెను.
- 1. దేహాత్మత్వ భ్రాంతి :
- దేహమే ఆత్మయని చార్వాకుల మతము. వీరి గురువు బృహస్పతి అందురు. ఇంద్రియ గోచరమగు ప్రపంచమే సత్యమనునది వీరికి ప్రత్యక్ష ప్రమాణము. వీరి మతమును లోకాయితికమని అందురు. బలి చక్రవర్తి కుమారుడు విరోచనుడు 33 సంవత్సరములు బ్రహ్మచర్యము, గురు శుశ్రూష చేసి కూడా పరతత్త్వము నెరుగక, దేహమే ఆత్మయని స్థిరపడెను. దైత్య దానవులందరికిని అదే బోధించెను. జీవతనువులు 4, ఈశ్వర తనువులు 4 కలిసి అష్ట తనువులలో ఏది బంధించినను, అది దేహవాసనయే. అనగా ప్రత్యగాత్మ, పరమాత్మ యనెడి శరీర వాసనలు కూడా దేహవాసన క్రిందికి వచ్చును. ఈ వాసనను క్షయము చేసేది పరిపూర్ణ బోధ మాత్రమే.
- 2. గుణాదాన భ్రాంతి :
- దీనిలో లౌకిక గుణాదాన, శాస్త్రీయమగు గుణాదానములని రెండు విధములు. గాన సౌందర్యమునకు, చర్మ సౌందర్యమునకు, లోక సంబంధమైన ఆహారము భుజించుట, లేపనములను ఉపయోగించుట వంటివి లౌకిక గుణాదానమనబడును. గంగాస్నానము, సాలగ్రామ తీర్థ సేవనము మొదలగునవి శాస్త్రములో చెప్పినట్లు చేయుట శాస్త్రీయ గుణాదానమనబడును. అద్వైతము సిద్ధించుటకు చరమ దశలో ఈ వాసనాత్రయము అనగా లోకవాసనా, శాస్త్రవాసన, దేహవాసనలు పూర్తిగా క్షయము కావలెను.
ఏది ఎలా జరుగనున్నదో, దానిని అలాగే జరుగనిచ్చుటను ప్రాప్తకాలత్వము అందురు. సాధకుడు ప్రారబ్ధ కర్మ ఫలితమును అంగీకరించుచు, ఆగామి యేర్పడకుండా చేసే పురుష ప్రయత్నము ప్రాప్తకాలత్వము క్రిందికి వచ్చును.
నైష్కర్మ్యయ సిద్ధి:
కర్మ, జ్ఞాన, యోగాభ్యాసములను సమన్వయపరచుకొని, కర్తృత్వ రహితముగా, సహజముగా నుండుట.
శ్లో|| ప్రారబ్ధం భోగతో నశ్యతే | తత్త్వ జ్ఞానేన సంచితః ||
ఆగామి ద్వివిధం కర్మత | ద్వేషీ ప్రియావాదినః ||
తా|| ప్రారబ్ధము అనుభవించుట వల్లనే నశించును. సంచిత రాశి తత్త్వ జ్ఞానము వలన లేనిదగును. నిష్కామ కర్మ యోగము వలన ఆగామి ఏర్పడదు. రాగ ద్వేషములనెడి ద్వంద్వములు లేకుండా పోయి, ముక్తుడగును.
శ్రు|| నకర్మణా నప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వ మానశుః ||
తా|| అమృతత్వమును కర్మచే పొందరు. సంతానము, ధనములతో పొందలేరు. సర్వ త్యాగముతో మాత్రమే సిద్ధించును.
సంకలనం: చల్లపల్లి