ఇంట్లో పూజ గది ఎటు ఉండాలి?
ఎంత లేనివాళ్లయినా.. ఎంత చిన్న ఇల్లయినా పూజ కోసం కొంత భాగాన్ని కేటాయించడం హిందూ సంప్రదాయం. చివరకు గూట్లో అయినా ఓ పటాన్ని ఉంచి చిన్న దీపాన్ని వెలిగించాలనే చూస్తారు ఎవరైనా. ఎవరి స్తోమతును బట్టి వారు దేవుడికి అలమరాలలో ఒక అరగాని, ప్రత్యేకించి ఒక మందిరంగాని లేదా ప్రత్యేకంగా ఒక గదినిగాని ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఇల్లు సర్వ హంగులతో అలరారాలంటే ఇంట్లో దేవుడికి ప్రత్యేకంగా గది ఉండాల్సిందే. అలాగే ఇంట్లో ఎక్కడ వీలు దొరికితే అక్కడ దేవుడి గదిని ఏర్పాటు చేసుకోకూడదు. దేవుడి గది కోసం కూడా వాస్తును పాటించాల్సిందే.ఇంట్లో సానుకూల శక్తిని పెంచడానికి, ప్రతికూల శక్తిని తొలగించడానికి పూజగది.. పూజా కార్యక్రమాలు ఉపకరిస్తాయని పెద్దలు చెబుతారు. పూజ గది విషయంలో దాని మూలకాలు, శక్తిని పరిగణనలోకి తీసుకుని ఈ గది నిర్మాణానికి కొన్ని సూత్రాలను రూపొందించారు పెద్దలు. వాటిని అనుసరించడం వల్ల ఆ ఇంట్లో సానుకూల శక్తి పెరిగి అందులో నివసించేవారికి మంచి ఆరోగ్యం, ఆయుష్షు పెరుగుతాయని, మానసిక ప్రశాంతత చేకూరుతుందని.. దైవానుగ్రహంతో పరిపూర్ణ ఆనందం, అదృష్టం లభిస్తాయని చెబుతారు.
దాదాపుగా ప్రతి కుటుంబానికీ మూల దైవం ఒకరు ఉంటారు. వారికి సంబంధించిన విగ్రహాలనో, చిత్ర పటాలనో పెట్టి ప్రార్థన చేసుకునేందుకు ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేసుకునే వారు గతంలో. ప్రస్తుతం నగరాలలోని ఇరుకు జీవనాల్లో దేవుడికి ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించడం పెద్ద సమస్యే. అపార్ట్మెంట్లలో అయితే మరీ కష్టం. 1200 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండే ఫ్లాటులో కూడా పూజకు ప్రత్యేక గదిని కేటాయించలేని పరిస్థితి. ఇక్కడ ఇంకో ప్రధాన కారణం ఉంది. సాధారణంగా బిల్డర్లు ఏ ఒక్క వర్గం వారినో దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేయరు కనుక పూజగదిపై ప్రతే్యకంగా దృష్టిపెట్టరు. ఒకవేళ నిర్మాణదశలోనే కొనుక్కునేవారు.. ప్రత్యేక అభిరుచి ఉన్నవారు మాత్రం చిన్నదైనా పూజగది కావాలని కోరుతుంటారు. ఒక గదిని ప్రత్యేకంగా కేటాయించాలనే అనుకునేవారు..
దేవుని గది - pooja gadi |
- ➣ పూజ గదిని సాధ్యమైనంత వరకూ ఈశాన్యం లేదా తూర్పు లేదా ఉత్తరం దిక్కున ఏర్పాటు చేసుకోవడం మంచిదని పెద్దలు చెబుతారు. దీనికి కారణం ఉదయాన్నే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు కనుక.. ఇంటికి ఈశాన్య దిక్కున సూర్యకిరణాలు ప్రసరిస్తాయి కనుక ఈ సమయంలో యోగ, ధాన్యం, పూజ ఎంతో ప్రశాంతంగా సాగుతాయనేది ఇందులోని ప్రాథమి సూత్రం. సూర్యుడి లేత కిరణాలు ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. కనుక పూజ గదికి ఈశాన్య దిక్కును ఎంచుకోవడం మం చిది.
- ➣ రెండు అంతస్తుల ఇల్లయితే పూజ గదిని ఎప్పుడూ కింది భాగంలోనే ఏర్పాటు చేయాలి. అలాగని సెల్లార్ లేదా బేస్మెంట్లో పెట్టుకోకూడదు. ఎందుకంటే అక్కడికి వెలుతురు ప్రసరించదు కనుక. సూర్యుడి తొలి కిరణాల వల్ల లబ్ధి పొందలేరు. అలాగే పూజ గదిని పైఅంతస్తుల్లో ఏర్పాటుచేసుకోవడం కూడా మంచిదికాదు. ఎందుకంటే ఇది అందరికీ అందుబాటులో ఉండాలి. ఇంట్లో పెద్ద వారు, కదలలేని వారు ఉంటే ఇది సమస్య అవుతుంది.
- ➣ ఒకవేళ పూజగది ఏర్పాటు చేసుకోవడానికి స్థలం లేకపోతే వంటింట్లోనే ఈశాన్య దిక్కున పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది ఇదే చేస్తున్నారు. అపార్ట్మెంట్లలో ప్రత్యేకంగా పూజ గదిని ఏర్పాటు చేసుకోవడం కుదరదు కనుక ఇది ఉత్తమ పద్ధతి.
- ➣ పూజా మందిరాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పడకగదులలో ఏర్పాటు చేసుకోకూడదు. అలాగే బాత్రూంకు సమీపంలోనూ ఏర్పాటుచేసుకోకూడదు. కొంతమంది స్థలం సర్దుబాటు కోసం టాయిలెట్ పక్కన పూజ గదిని ఏర్పాటు చేసుకుంటారు. అది చాలాతప్పు. పవిత్రమైన ప్రార్థినా మందిరం దగ్గర బాత్రూం ఉండటం అనారోగ్యకరం. టాయిలెట్ లేదా బాత్రూమ్ వంటివి వ్యతిరేక శక్తిని (నెగెటివ్ పవర్స్) ఉత్పత్తి చేస్తుంటాయి. వాటిలోంచి దుర్వాసన వ్యాపిస్తుంటుంది. బాత్రూమ్, టాయిలెట్ లేదా సామానుల గది పక్కన కాకుండా మరెక్కడైనా పూజ గది ఉండవచ్చు. బహుళ అంతస్తుల భవంతిలో ఫ్లాట్లు కొనేటప్పుడు పై పోర్షన్లో ఉండే బాత్రూమ్లు, టాయిలెట్లకు దిగువన మన పూజగది రాకుండా చూసుకోవాలి.
- ➣ పూజగదిలో దేవుడికి దీపాలు వెలిగించడం, రకరకాల సువాసనలు వెదజల్లే పరిమళభరితమైన పువ్వులను అర్పించడం, కర్పూరం, అగరవత్తులు వెలిగించి, మంత్రోచ్ఛారణ చేయడం వల్ల పూజ గది నుంచి సానుకూల శక్తి వెలువడుతుంటుంది. దేవతా ప్రతిమలను పూజగదిలో ఉంచి, పువ్వులు, పత్రిని సమర్పించడం.. జలాలు, సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకం చేయడం వలన అక్కడ పాజిటివ్ ఎనర్జీ (సానుకూల శక్తి) పుడుతుంది. ఇది ఇల్లంతటికీ వ్యాపిస్తుంది.
- ➣ పూజగదిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటే విగ్రహాలను ఎటు పెట్టుకోవాలన్నది చాలామంది సందేహం. విగ్రహాలను ఈశాన్యం, తూర్పు లేదా పడమర దిక్కున పెట్టుకోవచ్చు. దీనికి కారణం ఉదయం సూర్య కిరణాలు ఈశాన్య, తూర్పు దిక్కుల నుంచి ప్రసరిస్తాయి, సాయం వేళల్లో పడమర నుంచి ప్రసరిస్తాయి. కనుక ఇవి వి గ్రహాల మీద పడి మరింత భక్తి భావనను కలిగిస్తాయి. విగ్రహాలను ఉత్తర దిక్కు పెట్టకూడదు. ఆ దిక్కున పెడితే ప్రార్థించేవారు దక్షిణ ముఖంగా కూర్చోవలసి వస్తుంది. అలా కూర్చున్నప్పుడు వారి పాదాలు దక్షిణ దిక్కుకు, తల ఉత్తరం దిక్కుకు ఉంటాయి. దీనివల్ల శరీరంలోని ఉత్తర మూలమైన తల భూమి నుంచి వచ్చే అయస్కాంత ఉత్తర ధృవాన్ని వికర్షిస్తాయి. అలాగే దేవుడి గదిలో విరిగిన విగ్రహాలు, పగిలిన పటాలు లేదా చిరిగిపోయిన బొమ్మలను పెట్టుకోకూడదు. ఇందుకు కారణం దానిని చూస్తూ దేవుడి మీద మనసును లగ్నం చేయలేం. అలాగే విగ్రహాలు ఒకదానికి ఎదురుగా ఒకటి పెట్టకూడదు. ఎందుకంటే మనం విగ్రహాలను చూసి పూజించాలి తప్ప అవి ఒకదానిని ఒకటి చూసుకోరాదు.
- గోడకు అంగుళం దూరంలో విగ్రహాలు పెట్టాలి. దీని వెనుక ఉన్న కారణం గాలి, అగరువత్తుల పొగ వంటివన్నీ చుట్టుకోకుండా సులభంగా పారడానికే. దేవుడి ముందు దీపా లు వెలిగించేటప్పుడు వాటిని విగ్రహం ముందే పెట్టాలి. అసలు దీపం పెట్టడమే వెలుగు కోసం కనుక విగ్రహం ముందు పెడితే అవి మరింత మెరుగ్గా కనిపిస్తాయి. నైవేద్యం పెట్టేటప్పుడు దానిని విగ్రహం ఎదురుగా పెట్టాలి తప్ప మన ఎదురుగా ఉంచుకోకూడదు. పూజ సామగ్రిని గదిలో ఆగ్నేయ దిక్కున భద్రపరచాలి. అవి విగ్రహాలకు, మనం కూచోవడానికి అడ్డం లేకుండా ఉంటాయనేది దీని వెనుక ఉన్న శాస్ర్తీయ కారణం. అంతే కాదు, సూర్య కిరణాలు సవ్యంగా ప్రసరించకుండా అడ్డం ఉండవు.
- ➣ ఈశాన్యం గదిని దేవుడి గదిగా ఏర్పాటు చేయడం వీలుకాని పక్షంలో తూర్పు, ఉత్తర, పశ్చిమ, దక్షిణ, వాయవ్యాలలో దేవుడిగదిని ఏర్పాటు చేసుకోవచ్చు. నైరుతి ఆగ్నేయ గదులు మాత్రం దేవుడి గదులుగా చేయకండి. ప్రత్యేకించి దేవుడిగదిని ఏర్పాటు చేయటం అనుకూలం కాని పక్షంలో గృహములో ఏ గదిలోనైనా సరే (నైరుతి, ఆగ్నేయ, గదులలో అయిన సరే) అలమారలలోగాని, పీటమీదగాని దేవుడి పటాలు, ప్రతిమలు వుంచుకొని పూజించవచ్చు.
- ➣ దేవుడి చిత్ర పటాలను ఈశాన్యం గదిలో దక్షిణ, పశ్చిమ నైరుతిలలో పీట వేసిగాని, ఏదైనా మంచి వస్త్రం వేసి గాని దానిపై పటాలు, ప్రతిమలు ఉంచి పూజించుకోవచ్చు. పటాలు, ప్రతిమలు తూర్పు, ఉత్తరాలకు దేవుడు అభిముఖంగా వుండాలని కొందరు, పూజించేవారి ముఖం తూర్పు, ఉత్తరాలకు అభిముఖంగా ఉండాలని మరికొందరు చెబుతుంటారు. మీరు ఏ వైపునకు అభిముఖంగా ఉన్నా అది వాస్తుతో కాకుండా మనలోని భక్తికి సంబంధించినదనే చెప్పాలి. అయితే ధ్యానం చేసే అలవాటు ఉంటే తూర్పునకు అభిముఖంగా కూర్చుని చేయటం ఉత్తమం.
- పూజ గదిలో అరుగులు నిర్మించి దానిపై దేవుని పటాలను వుంచి పూజ చేసుకోవడం చాలా ఇళ్లల్లో అలవాటుగా వుంది. పూజ పటాలను అరుగులపై వుంచే కన్నా, కొయ్యపీట, మండపంలో ఉంచుకోవడం మంచిది. అరుగు మీద లేదా నేల మీద పటాలు వుంచినప్పుడు నేలపై కొత్త వస్త్రాన్ని ఏర్పాటు చేసి దానిపై పటాలను ఏర్పాటు చేయాలి. వట్టి నేలపై కూర్చొని పూజ చేయకూడదు. చాప కాని, వస్త్రం కాని వేసుకొని దానిపై కూర్చొని పూజా కార్యక్రమం నిర్వహించాలి. పూజామందరంలో నిత్య దీపారాధన ఎంతో శుభకరం.
దేవుని గది - pooja gadi |
దేవుని గది.. కొన్ని జాగ్రత్తలు
- ➣ మరో ముఖ్య విషయం ఏమిటంటే.. పూజ గదికి ఎటువైపు కూడా అనుకుని బాత్ రూమ్ లేదా టాయిలెట్సు ఉండకూడదు. ఇదే విధంగా పూజ గది పైనగాని, కింద గాని టాయిలెట్సు, వుండకూడదు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండి పొరపాటు చేయకూడదు. వీటి విషయంలో అపార్ట్ మెంట్ లో ఉండే వారు జాగ్రత్తగా ఉండాలి. చాలా వరకు అపార్ట్ మెంట్స్ లో ఒకరి పూజ గది పైన ఇతరుల టాయిలెట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోకూడదు.
- ➣ అలాగే పూజ గది మీద 'లో-రూఫ్' వేసి అనవసరమైన వస్తువుల్ని అక్కడ దాస్తుంటారు. ఇలా చేయకూడదు.
- ➣ మరణించిన తాత ముత్తాతల ఫోటోలు పూజ గదిలో పెట్టడం సరికాదు. చాలామంది పెద్దల పట్ల గౌరవం చూపిస్తున్నామని భావిస్తుంటారు. పెద్దల విషయంలో మనకున్న గౌరవానికి గాను వారి ఫోటోలకు ప్రత్యేకంగా వుండాలేగాని, పూజ గదిలో దేవుడి ఫోటోలతో సమానంగా వుంచడం శుభకరమైన విధానం కాదు. కానీ అవి మన దృష్టిని, ఆలోచనలను మరల్చడమే కాదు బాధాకరమైన జ్ఞాపకాలు వస్తే ఏకాగ్రత దెబ్బతింటుంది.
- ➣ ఇళ్లలోని పూజామందిరాల్లో పూజించే దేవతామూర్తుల విగ్రహాలు ఎప్పుడూ మరీ పెద్దవిగా ఉండకూడదు. సాధారణంగా అంగుష్ఠ ప్రమాణంలో (బొటన వేలెడంత) మాత్రమే ఉండాలని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారితో సహా ఎంతోమంది పెద్దలు చెబుతుంటారు. ఇంట్లో ఉండే విగ్రహాలు పెద్దవిగా ఉంటే వాటికి మామూలుగా ఇంట్లో చేసుకునే పూజ సరిపోదు. విశేష పూజలు, నైవేద్యాలు సమర్పించాలి.
- ➣ పూజామందిరంలో డబ్బు, ఇతర విలువైన వస్తువులను దాచడం సరికాదు. ఈ గదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఆ గదికి ఎప్పుడూ రెండు తలుపులు ఉన్న ద్వారాన్నే ఎంచుకోవాలి. ఈ గదికి తప్పనిసరిగా గడప ఉండాలి. లోపల లేత రంగులే వేయాలి. తెలుపు, లేత పసుపు లేదా లేత నీలాన్ని ఎంచుకోవచ్చు. దీనివల్ల మనసు ప్రశాంతంగా ఉండి దేవుడిపై దృష్టి పెట్టడం సులువవుతుంది.
- ➣ పటాలను గోడకు వేలాడదీయదలిస్తే దక్షిణ, పశ్చిమ గోడలకు పెట్టుకోవాలి. ఈశాన్యం గదిలో దక్షిణ, పశ్చిమగోడలలో గల అలమారలో కూడా దేవుణ్ణి వుంచవచ్చు.
- 1. పుజ కోసం ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించండి .
- 2. లేదంటే శుచి, శుభ్రత ఉండే గదిలో తూర్పు ముఖంగా దేవుని విగ్రహాలను ప్రతిష్ఠించాలి.
- ౩. సాధారణంగా మన ఇళ్లలో ఓ పెద్ద తప్పు చేస్తుంటారు. సెలవులకు ఊరెళుతున్నాం కదా అని దేవుని గదికి తాళం వేసేస్తుంటారు. అలా చేయడం వల్ల దేవుడిని మనం ఇంట్లోకి రాకుండా ఆపినట్లు అవుతుందని పురాణాలు చెబుతున్నాయి.
- 4. ఇంట్లో వారానికోసారి మాత్రమే పూజ చేస్తుంటారు కొందరు. అప్పుడే దేవుడి గది శుభ్రం చేస్తారు. అలా కాకుండా రోజు వారి దినచర్యలో భాగంగా దేవుడి గదిని శుభ్రం చేసుకోవాలి.
- 5. దేవతల చిత్రాలను పెట్టుకుంటే వీలైనంత వరకు సీతారాములు, పార్వతీ పరశమేశ్వరులు, లక్ష్మీ నారాయణలు.. ఇలా దంపతులు ఫోటోలు ఉంచుకోవడం మంచిది.
- 6. దేవతలకు అధిపతులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడి ప్రతిమలను (ఇప్పుడైతే ఫొటోలు) పూజామందిరంలో తప్పనిసరిగా ప్రతిష్ఠించాలని సహస్త్రపురాణం చెబుతోంది.
- 7. దేవుడి గదిలో ఎన్నివిగ్రహాలైన పెట్టుకోవచ్చు. కాని వాటికి నిత్య ధూప దీప నైవేద్యాలకు లోటు రాకుండా చూసుకోవడం ఉత్తమం.
- 8. వీలైనంత వరకు వంటగదిలో పూజామందిరాన్ని పెట్టకూడదు. ఎందుకంటే వంటగది ఎప్పుడూ చిందరవందరగా ఉంటుంది. ఒకవేళ మరెక్కడా కుదరని పక్షంలో వంటగదినే పరిశుభ్రంగా ఉంచుకొని దైవారాధన చేయాలి.
- 9. మన ఇంటి దేవుడి గుడిలో మూడు వినాయక విగ్రహాలు, రెండు శివలింగాలను పెట్టడం మంచిదని పెద్దలు చెబుతారు.
- 10. పూజ గదిలో గుడుల్లో మాదిరిగా పెద్ద గంటను ఏర్పాటు చేయడం సరికాదు. పూజ గది ఆలయం కాదు. అది మన వ్యక్తిగత ధ్యానానికి, పూజకు ఉద్దేశించింది కనుక పెద్ద శబ్దాలు లేకుండా ఉంటుంది. చిన్నగంట సరిపోతుంది.
- 11. ఇంటీరియర్ డిజైన్‌తో పూజగదిని మరింత అందంగా మార్చుకోవచ్చు..
- 12. పూజ గది గుమ్మం బ్లాక్ కలర్లో చెక్కతో తయారుచేసిన మెటిరీయల్ ఉంటే ఆధ్యాత్మికత తట్టిలేపేలా ఉంటుంది. గుమ్మానికి ఇరువైపులా డిజైన్ చేసిన దేవుళ్ల ప్రతిమలు ఉంటే అందంగా ఉంటుంది.
- 13. ఫ్లోర్‌కు ఇటాలియన్ మార్బుల్స్ డిజైన్‌ను ఎంచుకుంటే పూజ సమయంలో ప్రశాంతత కనిపించేట్లు ఉంటుంది. వైట్ కలర్ అయితే ఇంకా బెటర్.
- 14. కబోర్డ్స్ కూడా ట్రెడిషన్‌గా కనబడేలా ఉండాలి. వీటికోసం మార్కెట్లో చాలా రకాల డిజైన్లు అందుబాటులో ఉన్నాయి. పూజా సామాగ్రి ఎక్కడ పడితే అక్కడ కాకుండా ప్రత్యేకమైన కబోర్డ్లోనే పెడితే బెటర్.
- 15. గది లోపలి భాగం మరీ తక్కువ కాకుండా ప్లాన్ చేసుకోవాలి. ఇలా ఉంటే పూజతో పాటు మెడిటేషన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. పూజగదికి ఇంటీరియర్ డిజైన్ కల్పిస్తే ఎల్లప్పుడు ఆధ్యాత్మిక భావాలు కలుగుతాయి.