ఐన్ స్టీన్ సిద్ధాంతం - హైందవ దృక్పథం
1915 లో ఐన్ స్టీన్ ప్రతిపాదించిన “సాధారణ సాపేక్షతా సిద్ధాంతం” శాస్త్రీయ ప్రపంచంలో విప్లవాత్మకమైనది. ఈ సిద్ధాంతం - శున్యాకాశము, కాలము, గురుత్వాకర్షణ వంటి అంశాలపై అప్పటిదాకా ఉన్న శాస్త్రీయ అవగాహనను విప్లవాత్మకంగా మార్చివేసింది. అప్పటికి దాదాపు రెండు శతాబ్దాల పాటు భౌతిక శాస్త్రానికి, ఖగోళ శాస్త్రానికి ఆధారంగా ఉన్న న్యూటన్ ప్రతిపాదించిన “యాంత్రిక జగద్భావం” అన్న భావనను ఐన్ స్టీన్ సిద్ధాంతం పూర్తిగా తుడిచి పెట్టింది.
దీనికి ముందు 1905 లో ఐన్ స్టీన్ ప్రతిపాదించిన ‘ప్రత్యేక సాపేక్షతా సిద్ధాంతం’ లోని ముఖ్యాంశాలు :
- ➣ కాంతి కంటే వేగంగా ఏదీ ప్రయాణించలేదు. వివిధ పరిశీలకుల వేగాలతో సంబంధం లేకుండా కాంతి వేగం ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది.
- ➣ ఏ వస్తువు నిశ్చలంగా ఉందో, ఏ వస్తువు కదులుతోందో చెప్పడం వీలు కాదు. అంతా సాపేక్షమే.
- ➣ మన ప్రయాణ వేగానికి సాపేక్షంగా కాలం ఉంటుంది. మనం ఎంత వేగంగా ప్రయాణీస్తామో కాలం అంత తక్కువగా కదులుతుంది. కాంతి వేగంతో ప్రయాణిస్తే కాలం కదలక నిలిచి పోతుంది.
ఐన్ స్టీన్ “ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతం” సమాన వేగంతో ఒకే దిశలో ప్రయాణించే రెండు వస్తువులకే వర్తిస్తుంది. అన్ని రకాల వస్తువులకు, అన్ని రకాల పరిస్థితులలో వర్తించే విధంగా ఐన్ స్టీన్ 1915 లో తాను ప్రతిపాదించిన ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతాన్ని విస్తరించి “సామాన్య/సాధారణ సాపేక్ష సిద్ధాంతాన్ని” ప్రతిపాదించాడు.
‘దేశ కాలాలు’ (Space – time) |
న్యూటన్ ‘యాంత్రిక జగద్భావం’ ప్రకారం మూడు నిరూపకాలతో కూడిన శూన్యకాశము మరియు కాలము అనేవి ఈ జగన్నాటకానికి రంగస్థలం లాంటివి. వివిధ గ్రహాలూ, నక్షత్రాలు, గురుత్వాకర్షణ శక్తి, వివిధ జీవరాశులు మొదలైనవి ఇందులో పాత్రధారులు.
కానీ ‘సాధారణ సాపేక్షతా సిద్ధాంతం’ ప్రకారం స్థలకాలాలు విడదీయరానివి. ఇవి పదార్థం పై ప్రభావం చూపుతాయి. తిరిగి పదార్థంతో ప్రభావితమవుతాయి. అంటే రంగస్థలం కూడా పాత్రధారులతో కలిసి ఒక పాత్రధారిగా మారింది. ఈ ‘విశ్వ నృత్యం’ (కాస్మిక్ డాన్స్) అనే జగన్నాటకానికి ప్రేక్షకులంటూ ఎవరూ లేరు. అందరూ పాత్రధారులే. గత 30 సంవత్సరాలుగా జరిపిన ఎన్నో శాస్త్రీయ పరీక్షలు ఈ సాపేక్షతా సిద్ధాంతాన్ని నిజమని ఋజువు చేశాయి.
న్యూటన్ కాలాన్ని ఒక నదీ ప్రవాహం గా భావించాడు. అది వింటిని వదిలిన బాణంలాగా గతము నుండి, వర్తమానం గుండా, భవిష్యత్తు వైపుకు అవిచ్ఛిన్నంగా, ఏకరూపంగా ప్రయాణిస్తుందనీ, దాని గతి ఏ కారణంగాను మారదనీ చెప్పాడు.
కానీ, ఐన్ స్టీన్ కాలమనే నదీ ప్రవాహం ఏకరీతిగా సాగదని, గ్రహాలూ, నక్షత్రాలు, గెలాక్సీల వంటి వాటి సమక్షంలో అది వంపు తిరుగుతుందని, వాటి చుట్టూ కాలం వేగంగా సాగడమో లేక నిదానంగా సాగడమో జరుగుతుందని తెలిపాడు. సముద్రంలో ఈదే చేప తన చుట్టు ప్రక్కల ఉన్న నీటిని ఎలా వెనక్కి నెడుతుందో అలాగే ఒక నక్షత్రము లేదా తోకచుక్క లేదా గ్రహము తను ప్రయాణించే అంతరిక్షంలో దాని దిక్కాలాలలో మార్పును తీసుకు వస్తుంది. దిశ: కాలాలు వేర్వేరు కావు. అవి ఒకటి లేకుండా ఒకటి మనలేవు.
వివిధ వేగాలతో ప్రయాణించే వ్యక్తులు ఒకే సంఘటనల పూర్వాపరాలను విభిన్నంగా గుర్తిస్తారు. ఒక పరిశీలకుడిని ఒకే సమయంలో జరిగినట్లుగా కనిపించే రెండు సంఘటనలు వేరొక పరిశీలకునికి వేరొక విధంగా కనిపించవచ్చని ఐన్ స్టీన్ నిరూపించారు.
‘దేశ కాలాలు’ అనేవి ప్రకృతి క్రియలను వర్ణించడానికి ఒక పరిశీలకుడు వాడే భాషలోని అంశాలు మాత్రమే. (ఈ విషయాలను శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు తాను వ్రాసిన "విజ్ఞాన వీచికలు" అనే గ్రంథంలో పొందుపరిచారు.)
ఐన్ స్టీన్ E=MC2 |
ఈ విధంగా ఐన్ స్టీన్ పదార్థము శక్తి దిక్కులు కాలము లను ఏకీకరణం చేశాడు.
కణాద మహర్షి - Acharya Kanada |
అకాశం, కాలం, దిక్ అనేవి అనంతాలు. వీటికి అంతం లేదు.
దిక్, కాలం - ఈ రెండూ సర్వ వ్యాప్త పదార్ధాలు.
కణాద మహర్షి ఇలా చెప్పాడు : “ పదార్ధానికి రెండు స్థితులున్నాయి. ఒకటి ‘అణు స్థితి’ అయితే రెండవది ‘మహత్ స్థితి’. మెదటిది సూక్ష్మతమమైనదైతే రెండవ స్థితి అతి విశాలతమ బ్రహ్మాండమంతటిది. ద్రవ్యము (పదార్థము) యొక్క స్థితి ఒకేతీరుగా సమానంగా ఉండదు.
కణాదుని సిద్ధాంతం ప్రకారం ఈ విశ్వం లో ఆరు రకాల ధర్మాలు ఉంటాయి. అవి ద్రవ్యం(Matter), గుణం(Quality), కర్మ(Action),సామాన్యము(Universal), విశేషము(Special), సమవాయము లేక సామూహికము(Inherence).
ఈ ఆరింటినీ కణాదుడు జ్ఞానవిషయాలుగా చెప్పాడు.
‘పదార్థం’ లేక ‘ద్రవ్యం’ అనేది తొమ్మిది రకాల అస్తిత్వాలను కలిగి ఉంటుందని కణాదుడు చెప్పాడు.
అవి : పృథ్వి (ద్రవ్యం యొక్క ఘన రూపం), జలము (ద్రవ రూపం), వాయు (వాయు రూపం), తేజస్సు (శక్తి రూపం), ఆకాశము (ఈథర్), కాలము, దిక్కులు, ఆత్మ మరియు మనస్సు.
కణాదుడు |
కణాద మహర్షి అభిప్రాయం ప్రకారం మనస్సు, ఆత్మ కూడా ద్రవ్యాలే. అయితే దీనిని నిరూపించే పరిజ్ఞానం ఇప్పటి ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో లేదు.
భాగవతం ప్రకారం పదార్థమనేది రెండు స్థితులలో ఉంటుంది : ఒకటి వ్యక్త స్థితి. రెండవది అవ్యక్త స్థితి. పదార్థం వ్యక్త రూపంలోకి మారినప్పుడు ఈ విశ్వం సృష్టి అవుతుంది. ఈ విశ్వం నాశనమైనప్పుడు పదార్థం తిరిగి అవ్యక్త స్థితిలోకి వెళ్తుంది.
సర్వ ప్రాణుల, జడ పదార్థాల జనన మరణాలు, సృష్టిలయాలకు సంకేతంగా ఉన్న 'శివతాండవం' లో ఐన్ స్టీన్ యొక్క పదార్థము - శక్తి యొక్క సమత్వభావన కనబడుతుంది.
- 🝒 శివుడు తన శక్తి నృత్యం ద్వారా జడమైన ప్రకృతిని మేల్కొలిపేలా శబ్దం (డమరుక ధ్వనిగా సూచితం) చేస్తాడు.
- 🝒 ఇలా తన నృత్యం ద్వారా పదార్థ రూపంలో వివిధ ప్రకృతి క్రియలను కొనసాగిస్తాడు.
- 🝒 కాలాంతరంలో ఆయన తన నృత్యం ద్వారానే నామరూపాలనింటినీ నశింపజేసి, ప్రకృతికి విశ్రాంతినిస్తాడు.
- 🝒 బ్రహ్మకు రాత్రి అయి నిద్రలోకి వెళ్ళినపుడు శివుడు రుద్ర తాండవం మొదలుపెడతాడు.
- 🝒 అప్పుడు ఈ విశ్వం నాశనమై, కుంచించుకు పోయి, శూన్య స్థితికి చేరుతుంది.
- 🝒 బ్రహ్మకు పగలు అయి, మేలుకున్నప్పుడు శివుడు ఆనంద తాండవం మొదలుపెడతాడు. అప్పుడు బ్రహ్మ సృష్టిని ప్రారంభిస్తాడు.
- 🝒 సృష్టి అయిన దానిని ధ్వంసం చేయాలని ప్రయత్నిస్తే అందులో నుండి అఖండమైన శక్తి వెలువడుతుంది.
- 🝒 ఈ భావన శివుడి రుద్రతాండవంలో కనబడుతుంది.
- 🝒 ఈ విధంగా పదార్థము - శక్తి ఒకదానిలోకి ఒకటి రూపాంతరం చెందుతాయన్న విషయాన్ని శివతాండవం తెలియజేస్తోంది.
“ఇండియా : లివింగ్ విస్ డమ్ సిరీస్” అనే గ్రంథంలో రిచర్డ్ వాటర్ స్టోన్ ఇలా అంటారు : “నటరాజు యొక్క శక్తివంతమైన భంగిమలో సృష్టి లయలనబడే అంతులేని గతిశీల ప్రక్రియ ప్రకటితమవుతోంది. శివ తాండవం వ్యక్త పరుస్తున్న ‘పదార్థము - శక్తి యొక్క సమత్వాని’కీ, ‘ఒక ఉపపరమాణు కణంలో నిబిడీకృతమై ఉన్న శక్తి దానియొక్క ద్రవ్యరాశి మరియు కాంతివేగం యొక్క లబ్దం తో సమానమని’ చెప్పిన ఐన్ స్టీన్ సమీకరణానికి (E=mc2) ఆశ్చర్యకరమైన పోలికలున్నాయి.”
“క్రీ.ఫూ. 700 కి పూర్వమే హిందూ ఋషులు ‘నేతి, నేతి’ (ఇది కాదు, ఇది కాదు) అని ఉచ్ఛరిస్తూ బాహ్య ప్రపంచం యొక్క అంతిమ వాస్తవికతను మిథ్య గా తెలుసుకున్నారు. దానికి బదులుగా వారు అన్ని జీవుల్లోనూ ఉన్న ఆత్మరూపంలోని బ్రహ్మము యొక్క శాశ్వతమైన తేజ: కణము కోసం అన్వేషించారు.”
పరాశక్తి - Parashakti |
సంకలనం: మణికుమార్ వేమూరి
రచన: శ్రీ ఎ భరద్వాజ
రచన: శ్రీ ఎ భరద్వాజ