హిందూ గ్రంథాలలో డైనోసార్లు?
‘డైనోసార్లు’ లేదా ‘రాక్షసబల్లులు’ అనేవి సుమారు 23 కోట్ల సంవత్సరాల క్రితం ‘ట్రయాసిక్ యుగం’లో ఆవిర్భవించి ‘జురాసిక్ యుగం’ లో పూర్తి స్థాయిలో అభివృద్ధి చెంది ‘క్రెటాషియస్ యుగం’ చివర్లో, అంటే సుమారు 6.6 కోట్ల సంవత్సరాల క్రితం అంతరించాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డైనోసార్లనేవి ‘డైనోసారియా’ అనే ప్రజాతికి చెందిన జంతువుల సమూహం. వీటిలో వెయ్యి కి పైగా ఉపజాతులున్నాయి. మరి ఈ యుగాలకు చెందిన భారీ జంతువుల ప్రస్తావన హిందూ గ్రంథాలలో ఉందా? అనేది ఒకసారి పరిశీలిద్దాం.
మకర తోరణం - Makarathoranam |
“మకరం” అనేది సగం జలచరంగా, సగం భూమి మీద తిరిగే జంతువులా ఉండే ఒక భారీ రాక్షస జీవి. దీని తల మొసలి తలలా ఉంటుంది. దీని తోక నెమలి పింఛంలా లేదా చేప తోకలా ఉంటుంది. దీనికి మేకకి ఉన్నట్లు చిన్న చిన్న కొమ్ములుంటాయి. డైనోసార్లకు కూడా కొమ్ములు లేక శిఖ (కొప్పు) వంటి నిర్మాణాలుంటాయి.
హిందూ గ్రంథాలలో “మకరం” గంగా దేవి వాహనంగా చెప్పబడింది. అంతే కాక వరుణదేవుడి వాహనంగా కూడా చెప్పబడింది.
వరుణుడు మాత్రమే మకరాన్ని నియంత్రించి ఓడించగల సమర్థుడని కూడా చెప్పబడింది. మొసలినైతే నైపుణ్యం గల సాధారణ వ్యక్తీ కూడా నియంత్రించి ఓడించగలడు. కాబట్టి మకరం అనేది మొసలి కాదని తెలుస్తోంది.
మహా భారతం ప్రకారం ‘మకరం’ మరియు ‘తిమింగలం’ అనేవి సముద్రంలో ఉండే అత్యంత శక్తివంతమైన భారీ జలచరాలు.
“ నీటి అడుగున పెద్ద రాతి బండల్లాంటి తిమింగలాలు, తాబేళ్ళు, తిమి తిమింగలాలు, మకరాలు కనబడతాయి.” అని మహాభారతం లోని అరణ్యపర్వం 168.3 శ్లోకం వర్ణించింది.
అంతే కాక శుశ్రుత సంహిత, భాగవత పురాణం, భగవద్గీత వంటి గ్రంథాలలో కూడా ‘మకరం’ మరియు ‘తిమింగలాలు’ భయంకరమైన ఉభయచర జీవులుగా వర్ణించబడ్డాయి.
శుశ్రుత సంహిత - 45వ అధ్యాయం లో మకరం, తిమింగలం వంటివి సముద్ర జీవులని చెప్పబడింది.
భగవద్గీత (10-31) –
“పవన: పవతామస్మి రామ : శస్త్ర భృతామహమ్
ఝషాణాం మకరశ్చాస్మి స్రోతసామస్మి జాహ్నవీ.”
“పవిత్రీకరించు వాటిలో నేను వాయువును. ఆయుధధారులలో రాముడను. మత్స్యములలో మకరమును. ప్రవహించు నదులలో గంగా నదిని ఆగుదును.”
ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు " సముద్ర జీవుల్లో నేను మకరాన్ని " అని చెప్పాడు. అంటే అన్ని రకాల సముద్ర జీవుల్లోను ఉత్తమమైనది, భారీయైనది మకరం అని తెలుస్తోంది. ఈ వర్ణన మొసలికి సరిపోదు.
మకరము నీటిలో నివసించే జంతువులన్నింటిలో పెద్దదియు, మానవునకు హానికరమైనట్టిదియు నగుటచే అది శ్రీ కృష్ణునకు ప్రాతినిధ్యం వహించునని శ్రీ ఏ.సి. భక్తివేదాంతస్వామి భాష్యం వ్రాశారు.
శ్రీమద్భాగవతంలో మార్కండేయ మహా ముని పై మకరాలు, తిమింగలాలు దాడి చేసాయని ఉంది.
పై శ్లోకాలలోని వర్ణనలను బట్టి మకరానికి ‘అంబులోసీటస్’ (ఇయోసీన్ యుగానికి చెందినది ) లేదా ‘ప్లెసియోసార్’ ( క్రెటాషియస్ యుగానికి చెందినది) అనే ప్రజాతి కి చెందిన భారీ సరీసృపాలతో పోలికలు కనబడుతున్నాయి.
దాదాపు 15 కోట్ల సంవత్సరాల క్రితం నాటి ‘ప్లెసియోసార్’ శిలాజం 2003 లో ఇంగ్లాండ్ లో బయటపడింది. భూమి మీద మరియు నీటిలోనూ జీవించే ‘అంబులోసీటస్’ ప్రజాతికి చెందిన భారీ జంతువులు 6 కోట్ల సంవత్సరాల క్రితం నాటివి. వీటి శిలాజాలు నేటి పాకిస్తాన్ లో దొరికాయి.
మకరం, తిమింగలాల గురించే కాక ఇతర భారీ జంతువుల ప్రస్తావన కూడా హిందూ గ్రంథాలలో కనబడుతుంది. అయితే ఆ గ్రంథాలు దైవికమైన విషయాల గురించి వ్రాసినవి కాబట్టి ఆయా జంతువుల వర్ణనలు పరిమితంగానే అందులో కనబడతాయి. దేవతలు, రాక్షసుల మధ్య జరిగే యుద్ధాలలో ఇరు పక్షాలవారు ఎక్కువగా ప్రమాదకరమైన జంతువులను వాహనాలుగా కలిగి ఉండడం కనబడుతుంది.
విభీషణుడు |
సీతాన్వేషణలో భాగంగా హనుమంతుడు సముద్రం పై నుండి ఎగిరి, లంక కు వెళ్తున్నప్పుడు "సింహిక" అనే జల రక్కసి తారసపడుతుంది.
- “ ఆ తర్వాత హనుమంతుడు ప్రక్కల, పైనా, క్రిందా పరికించి చూడగా ఆ లవణ సముద్రంలోనుండి పైకి లేచిన ఒక భారీ జంతువు దర్శనమిచ్చింది.” (సుందరకాండ - 5-1-186)
- “ భయంకరమైన ముఖం గల ఆ జంతువును చూసిన హనుమంతుడు తనలో ఇలా అనుకున్నాడు. "నా నీడను పట్టుకొని లాగగలిగిన బలం గల, విచిత్రమైన ఆకారం గల ఈ జంతువు బహుశా సుగ్రీవుడు చెప్పినదై ఉండవచ్చు. అందులో సందేహం లేదు." (5-1-187)
- “ హనుమంతుడు తన శరీరాన్ని కుంచింపజేసుకొని ఆ జంతువు నోటిలోకి దూరి తన వాడియైన గోళ్ళతో దాని శరీరం లోపలి భాగాలను చీల్చి మనోవేగంతో బయటకు వచ్చాడు.”(5-1-194 )
ఈ వర్ణనలను బట్టి చూస్తే ఆ నీటి జంతువు డైనోసార్ జాతికి చెందినదిగా కనిపిస్తోంది.
మహాభారతంలో కూడా భయంకరమైన సరీసృపాల గురించి చేసిన వర్ణన డైనోసార్లను గుర్తుకు తెస్తుంది. సర్ప జాతిని సమూలంగా నాశనం చేయడానికి జనమేజయ మహారాజు సర్పయాగం తలపెడతాడు. ఈ సందర్భంలో నిప్పులు చిమ్మే డ్రాగన్ల గురించి, ఒక్క కాటుతో పచ్చని చెట్టు ని చంపగల సర్ప జాతుల గురించి వర్ణనలు కనబడతాయి. డైనోసార్లు కూడా సరీసృపాల జాతికి చెందినవేననే సంగతి గమనార్హం.
ఈ యాగంలో రకరకాల రంగులు కల వందల కొద్దీ, వేల కొద్దీ సర్పాలు, విషాలు కక్కుతూ మంటల్లో పడి బూడిద అయినట్లు వర్ణించబడింది. వాటిలో కొన్ని అనేక యోజనాల పొడవు ఉన్నవిగా కూడా చెప్పారు. ఒక యోజన అంటే సుమారు 8-15 కి.మీ.
డైనోసార్లు |
భాగవత పురాణం - 8 వ అధ్యాయం – 10 - 12 శ్లోకాలను పరిశీలిస్తే ఇందులో భాస, క్రికలస, గవయ, శరభ, అరుణ, వికృత విగ్రహ వంటివి ప్రమాదకరమైన జంతువులుగా చెప్పబడ్డాయి. సంస్కృతం లో “వికృత విగ్రహ” అంటే ‘వికృతమైన ఆకారం గల జంతువు’ అని అర్థం. “క్రికలస” అంటే ‘భారీ రాక్షస బల్లి లేదా ఊసరవెల్లి.’ ‘గవయ’ అంటే ‘అడవి దున్న.’ అయితే ఈ వర్ణనలు ఏ జంతువులను సూచిస్తున్నాయో ఇతమిత్థంగా చెప్పడం కష్టం. ఇవి అంతరించి పోయిన డైనోసార్లు లేదా ఇతర భారీ జంతువులు కావచ్చు.
భాగవత పురాణం ప్రకారం ప్రతీ మన్వంతరంలోనూ ఆ మన్వంతరానికి ప్రత్యేకమైన వృక్ష జంతు జాలాలుంటాయి. ఒక మన్వంతరంలోని కొన్ని జంతు, వృక్ష జాతులు ఆ తర్వాతి మన్వంతరంలో అంతరిస్తాయి. మరికొన్ని మన్వంతరాల తర్వాత తిరిగి పునరుజ్జీవింపబడతాయి. అంతరించిపోయిన జాతుల స్థానే, కొత్త మన్వంతరంలో కొత్త జాతులు ఏర్పడతాయి. ఈ పున:స్థాపన ను ‘ఆత్మ యొక్క శరీరాంతర ప్ర్రాప్తి’ అంటారు.
నాగ్ పూర్ జిల్లా లో ఇటివల పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తల అభిప్రాయంలో కొన్ని లక్షల సంవత్సరాల క్రితం భారత దేశం లోని కొన్ని డైనోసార్ జాతులు, ఆ కాలంలో పండిన ఒక రకమైన ‘వరి’ని తిని బ్రతికాయి. మధ్య భారతంలోని త్రవ్వకాలలో 6.8-6.5 కోట్ల సంవత్సరాల క్రితం నాటి డైనోసార్ల గుడ్లు, గూళ్ళు అత్యధిక సంఖ్యలో బయట పడ్డాయి. ప్రపంచంలో అత్యధికంగా డైనోసార్ల ప్రజననం జరిగిన స్థలంగా మధ్య భారతం గుర్తింపు పొందింది.
మానవుడు - డైనోసార్ల సహజీవనాన్ని నిరూపించేలా కొన్ని ఆధారాలు లభిస్తున్నా అనేక రాజకీయమైన, మతపరమైన, భావజాలపరమైన కారణాల వాళ్ళ వాటిని బయట పెట్టడానికి శాస్త్రవేత్తలు సాహసించట్లేదు. ఏమైనా, ఈ భూమి మీద ఒకానొక కాలంలో పూర్తిగా డైనోసార్లే ఆధిపత్యం చలాయించాయనే వాదనలో పస లేదని తెలుస్తోంది.
డైనోసార్లు నీటిలో జీవించేవని కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ కి చెందిన ప్రొఫెసర్ బ్రియాన్ జె. ఫోర్డ్ అనే శాస్త్రవేత్త అభిప్రాయ పడుతున్నాడు. ఈయన అభిప్రాయం ప్రకారం – “డైనోసార్ల తోకలు పెద్దవిగా ఉండటం వల్ల భూమి మీద వేగంగా నడవడానికి, వేటాడడానికి వీలుగా ఉండవు. కాబట్టి వాటికి కావాల్సినంత మేత దొరకడం కష్టమవుతుంది. వాటికుండే పెద్ద తోక శరీరాన్ని నీటిలో తేలిక చేసి, వేగంగా ఈదడానికి సహాయపడుతుంది. లోతు జలాలు డైనోసార్ల శరీర బరువుకు అనువుగా ఉంటాయి..”
డైనోసార్లు నీటిలో జీవించేవని |
మరి కొందరు శాస్త్రవేత్తల సిద్ధాంతం ప్రకారం డైనోసార్లు నీటిలో ఈదగలవు, చిత్తడి నేలల్లో నివసించగలవు. కాబట్టి డైనోసార్లు ఉభయచర జీవులయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.
పక్షిలా రెక్కలు, నెమలి కి ఉన్నట్లు పింఛము ఉన్న డైనోసార్ శిలాజం (Zhenyuanlong Suni - జెన్యువాన్లాంగ్ సుని) |
ఈ విషయాలన్నీ పరిశీలిస్తే డైనోసార్ల కు సంబంధించి శాస్త్రవేత్తలకు నూటికి నూరు శాతం స్పష్టత లేదని తెలుస్తోంది. అవి భూమి మీద తిరిగేవా? లేక నీళ్ళలోనా? లేక అవి ఉభయచర జీవులా? వాటికి తొండం ఉండేదా? అవి మానవులతో పాటే ఈ భూమి మీద ఉండేవా? అనే విషయాలపై ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉంది.
మొత్తం మీద చూస్తే ట్రయాసిక్, జురాసిక్, క్రెటాషియస్ యుగాలకు చెందినవిగా శాస్త్రవేత్తలు చెబుతున్నడైనోసార్లు, ఇతర భారీ సరీసృపాలను గురించిన ప్రస్తావన మన హిందూ గ్రంథాలలో మరియు హిందూ దేవాలయాలలోని వాస్తు శిల్పం లో కనిపిస్తోందని రూఢిగా చెప్పవచ్చును.
సంకలనం/రచన: మణి కుమార్