రాగం: ఆభోగి
ప|| అంతర్యామి అలసితి సొలసితి
ఇంతట నీ శరణిదె జొచ్చితిని ||
చ|| కోరిన కోర్కులు కోయని కట్లు
తీరవు నీవవి తెంచక
భారపు బగ్గాలు పాప పుణ్యములు
నేరుపుల బోనీవు నీవు వద్దనక ||
చ|| జనుల సంగముల జక్క రోగములు
విను విడువవు నీవు విడిపించక
వినయపు దైన్యము విడువని కర్మము
చనదది నీవిటు శాంతపరచక ||
చ|| మదిలో చింతలు మైలలు మణుగులు
వదలవు నీవవి వద్దనక
ఎదుటనె శ్రీ వెంకటేశ్వర నీవదె
అదన గాచితివి అట్టిట్టనక ||
-------------------------
రాగం: హిందోళం
ప|| అదివో అల్లదివో శ్రీహరివాసము |
పదివేల శేషుల పడగల మయము ||
చ|| అదె వేంకటాచల మఖిలోన్నతము |
అదివో బ్రహ్మాదుల కపురూపము |
అదివో నిత్య నివాసమఖిల మునులకు |
అదె చూడడదె మ్రొక్కుడా నందమయము ||
చ|| చెంగట నల్లదివో శేషాచలము |
నింగినున్న దేవతల నిజనివాసము |
ముంగిట నల్లదివో మూలనున్న ధనము |
బంగారు శిఖిరాల బహు బ్రహ్మమయము ||
చ|| కైవల్య పదము వేంకట నగమదివో |
శ్రీవేంకటపతికి సిరులైనది |
భావింప సకల సంపద రూపమదివో |
పావనములకెల్ల పావనమయము ||
---------------------
ప|| అన్ని మంత్రములు నిందే యావహించెను
వెన్నతో నాకు గలిగె వేంకటేశు మంత్రము ||
చ|| నారదుడు జపియించె నారాయణ మంత్రము
చేరె ప్రహ్లాదుడు నారసింహ మంత్రము
కోరి విభీషణుడు చేకొనె రామ మంత్రము |
వేరె నాకు గలిగె వేంకటేశు మంత్రము ||
చ|| రంగగు వాసుదేవ మంత్రము ధౄవుండు జపించె
సంగవించె కౄష్ణ మంత్రము అర్జునుడును
ముంగిట విష్ణు మంత్రము మొగి శుకుడు పఠియించె
వింగడమై నాకు నబ్బె వేంకటేశు మంత్రము ||
చ|| ఇన్ని మంత్రముల కెల్ల ఇందిరానాథుడె గురి
పన్నిన దిదియే పరబ్రహ్మ మంత్రము |
నన్ను గావ గలిగేబో నాకు గురుడియ్యగాను
వెన్నెల వంటిది శ్రీవేంకటేశు మంత్రము ||