ప్రముఖ దర్శకుడు రామానంద్ సాగర్ తెరకెక్కించిన ‘రామాయణ్’ ధారావాహికను ప్రముఖ ఛానెల్ బీబీసీ ప్రసారం చేయాలి అనుకుందట. కానీ దానికి తన తండ్రి రామానంద్ ఒప్పుకోలేదని ఆయన కుమారుడు ప్రేమ్ సాగర్ వెల్లడించారు.
దాదాపు 33 ఏళ్ల క్రితం దూరదర్శన్‌లో ప్రసారమైన ‘రామాయణ్’ కోట్లాది ప్రజల ఆదరణ పొందింది. లాక్డౌన్ నేపథ్యంలో ఈ ధారావాహికను పునఃప్రసారం చేశారు. అత్యధిక మంది వీక్షించిన సీరియల్‌గా ఇది ప్రపంచ రికార్డు సృష్టించింది. కాగా ఈ సీరియల్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని ప్రేమ్ సాగర్ తాజాగా మీడియాతో పంచుకున్నారు. అనేక ఏళ్ల క్రితం తన తండ్రి, ‘రామాయణ్’ బృందం కలిసి సీరియల్ ప్రసార హక్కుల్ని బీబీసీకి ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
‘ఇప్పటికీ పాశ్చాత్య మీడియాకు ‘రామాయణ్’ అనేది కేవలం ఓ కాస్ట్యూమ్ డ్రామా మాత్రమే. అప్పుడు కూడా అలానే అనుకునేవారు. ఎక్కువ మంది ఆసియా వ్యూయర్స్ తమ ఛానెల్ చూసేలా చేయడానికి ‘రామాయణ్’ హక్కులు కావాలని అడిగారు’ అని చెప్పారు.
అనంతరం 3 దశాబ్దాల క్రితం జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు. ‘ఆసియాలో పాపులారిటీ కోసం బీబీసీ ‘రామాయణ్’ సీరియల్ ప్రసార హక్కులు కొనుగోలు చేయాలి అనుకుంది. ఒప్పంద పత్రంలో సంతకం చేయడానికి ముందు నాన్న, నేను, రాముడి పాత్ర పోషించిన అరుణ్ గోవిల్, రావణుడిగా నటించిన అరవింద్ త్రివేది కలిసి వాళ్ల స్టూడియోకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్లాం. అప్పుడు అరుణ్ రాముడి వేషం వేసుకుని, తమ స్టూడియో మొత్తం నడవాలని, దాన్ని షూట్ చేసుకుంటామని అన్నారు. ఆ తర్వాత నాకు, నాన్నకు వాళ్ల ఉద్దేశం అర్థమైంది.
భారత్‌లో ప్రజలు దైవంగా ఆరాధించే శ్రీ రాముడ్ని వారు ఏ దృష్టితో చూస్తున్నారో తెలుసుకున్నాం. అందుకే బీబీసీకి హక్కులు ఇవ్వడానికి నాన్న ఒప్పుకోలేదు’ అని ప్రేమ్ సాగర్ చెప్పారు. తన తండ్రి రామానంద్ జీవిత కథను ప్రేమ్ సాగర్ రాశారు. దీన్ని ఇటీవల ‘కపిల్ శర్మ’ షోలో విడుదల చేశారు.
_విశ్వ సంవాద కేంద్రము