"నేను వృద్ధుడనయ్యాను. వంశాచారం ప్రకారం జ్యేష్ఠ పుత్రుడయిన శ్రీరామునికి యువరాజు పట్టాభిషేకం జరపాలని నాకు అనిపిస్తోంది. నా ఆలోచన సరైంది అనిపిస్తే అనుమతి ఇవ్వండి. అనుచితమనిపిస్తే ప్రత్యామ్నాయం సూచించండని” పలికాడు.ఒక్క రామాయణంలో తప్ప మరే ఇతర పురాణాలలో జ్యేష్ఠపుత్రునికి రాజ సింహాసనాధికారం కలిగించేందుకు ప్రజల అనుమతి కోరడం కనిపించదు. అదే నేటి పాలకులు తమ వారసులను అందలం ఎక్కించడానికి ఎన్ని పన్నాగాలు పన్నుతున్నారో చూస్తున్నాం.
యువరాజుగా పట్టాభిషిక్తుడు కావలసిన శ్రీరాముడు తండ్రి మాటకోసం వనవాసానికి సిద్దమ య్యాడు. వాస్తవంగా కైక వలన ఒక నిరపరాధి అడవులపాలయ్యాడని, రాజ్యాధికారం పొందలేక పోయాడని భావిస్తూ ఉంటారు. కానీ రాముడి వలన జరుగవలసిన మహత్కార్యం ఎంతో ఉంది. సమస్త భూమండలంపై ఉన్న రాక్షసులను నాశనం చేసి “సజ్జన రక్షణ” అనే బృహత్కార్య నిర్వహణ ఆయన చేయాలి. అందుకే సింహాసనం కాదని వనవాసాన్ని స్వీకరించాడు.
శ్రీరాముని వనవాసానికి అసలు ఒక్క రుషిగాని, కుల గురువైన వశిష్టుడు కానీ అడ్డు చెప్పనేలేదు. రాజైన దశరథునికి నచ్చచెప్పి రాముడిని విశ్వామిత్రు నితో అడవులకు పంపగలిగిన వశిష్టునికి, కైకేయి మాట చెల్లనీయకుండా చేయడం ఏమాత్రం కష్టం కాదు, కానీ అది వారి ఆకాంక్ష కాదు.
శ్రీరాముడి చేత రాక్షస సంహారం జరగాలన్నది మహర్షులందరి అభిష్టం లోకకళ్యాణం కోసం ఆనాడు అదే అత్యవసరం. *
-జాగృతి