కృషి పూర్ణిమ
వ్యవసాయ ప్రధానమైన మన భారతదేశంలో అన్నదాతలు చేసుకొనే వేడుకలు, పండుగలు అనేకం ఉన్నాయి. వాటిలో ప్రధానమైన ‘ఏరువాక పున్నమి’ని జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమనాడు కర్షకులు సకుటుంబంగా మహోత్సాహంతో జరుపుకొంటారు. ఈ పండుగను ‘కృషి పూర్ణిమ’ అనీ పిలుస్తారు.
కృషీవలురు తమకు అన్నంపెట్టే పంటపొలాల్లో, తమతో పాటు శ్రమించే పశువుల్లో, సేద్యానికి సంబంధించిన ఉపకరణాల్లో దైవాన్ని సంభావించి వాటిని పూజిస్తుంటారు. నాగలిని ఆరాధించి దుక్కిదున్నటం ప్రారంభించడంతో పాటు, వ్యవసాయానికి కావాల్సిన వృష్టిని ప్రసాదించే ఇంద్రుణ్ని ప్రార్థిస్తారు.
పొలం దున్నేందుకు శుభప్రదంగా భావించే జ్యేష్ఠా నక్షత్రంతో చంద్రుడు కూడి ఉంటే ఏర్పడేది- జ్యేష్ఠ పూర్ణిమ. సకల ఓషధులకూ అధిపతి చంద్రుడు. ఆ ఓషధులు సమృద్ధిగా ఉంటేనే వ్యవసాయం విశేష ఫలసాయం అందిస్తుందంటారు. వర్షరుతువు ప్రారంభంలో జరుపుకొనే ఈ పల్లెపండుగనాడు, రైతులు క్షేత్రపాలుణ్ని స్తుతిస్తూ మంత్రపఠనం చేసేవారని రుగ్వేదం చెబుతోంది.
ఉత్తరాదిన ఇదే రోజున ‘ఉద్వృషభ యజ్ఞం’ పేరుతో ఎడ్లను పూజించి, వాటిని పరుగెత్తిస్తారు. జైమిని న్యాయమాలలో ఈ ఉదంతం కనిపిస్తుంది. సీతాయజ్ఞం పేరుతో ఈ పండుగ నిర్వహించే ఆచారమున్నట్లు ‘విష్ణుపురాణం’ వర్ణిస్తోంది. ‘సీత’ అంటే నాగేటి చాలు. బౌద్ధ జాతక కథల్లోని ‘వప్ప మంగల దివస’ అనే పండుగ ఏరువాక పున్నమితో పోలి ఉంటుంది.
శుద్ధోధన మహారాజు కపిలవస్తు నగరంలో వర్షరుతువు ఆరంభం కాగానే లాంఛనంగా కర్షకులకు బంగారు నాగళ్లు బహూకరించేవాడని ‘లలిత విస్తరం’ అనే గ్రంథం చెబుతోంది. హాలుడి ‘గాథాసప్తశతి’లో ఏరువాక పున్నమి ప్రస్తావన ఉంది. ‘ఏరు’ అంటే ఎడ్లను కట్టి దున్నడానికి సిద్ధంచేసిన నాగలి అని, ‘ఏరువాక’ అంటే దున్నడానికి సిద్ధమయ్యే ఆరంభదశ అనీ నిఘంటు అర్థాలున్నాయి.
ఉత్సవ సందర్భంలో- వ్యవసాయానికి ఆలంబన అయిన పశుసంపదతో పాటు భూమి, పనిముట్లను శుభ్రపరుస్తారు. పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, టెంకాయలు వంటివాటిని సమర్పిస్తారు. ఎడ్లబండ్లను, ఎడ్లు కట్టిన నాగళ్లను మంగళవాద్యాలతో వూరేగిస్తారు. పొలాలకు వెళ్లి దుక్కి ప్రారంభిస్తారు. వాడవాడలా గోగునారతో చేసిన తోరణాలు కడతారు. వాటిని చర్నాకోళ్లతో కొట్టి, ఎవరికి దొరికిన పీచును వారు తీసుకువెళతారు. ఇది తమ పశువులకు శుభదాయకమని పల్లెవాసులు భావిస్తారు. ఐరోపా దేశాల్లో ఇదే పండుగను ‘మేషోవ్’ అనే పేరుతో జరుపుకొంటారు.
ఈ పర్వదినాన కొన్ని ప్రాంతాల్లో కాడికి ఓ వైపు ఎద్దును కట్టి, మరోవైపు రైతులే భుజాన వేసుకొని భూమిని దున్నే ఆచారం ఉంది. ‘అనడుత్సవం’ పేరుతో రైతులు ఈ ఉత్సవం జరుపుకొన్నట్లు అధర్వణ వేదం చెబుతోంది. ‘హలకర్మ’ అనే పేరుతో నాగలి పూజ, మేదినీ ఉత్సవం పేరిట భూమిపూజ, వృషభ సౌభాగ్యం పేరుతో పశువుల పూజ వంటి ప్రక్రియల విశ్లేషణ సైతం అధర్వణ వేదంలో కనిపిస్తుంది. వరాహ మిహిరుడు రాసిన ‘బృహత్సంహిత’లో, పరాశర విరచితమైన ‘కృషి పరాశరం’ గ్రంథంలో ఈ ఉత్సవాల ప్రస్తావనలున్నాయి.
కర్ణాటక రాష్ట్రంలో ఇదే పండుగను ‘కారిణి పబ్బం’గా వ్యవహరిస్తారు. కొన్ని ప్రాంతాల్లో వర్షానికి అధిదేవత అయిన ఇంద్రుణ్ని శాస్త్రోక్తంగా పూజించి, ‘పొంగలి’(బెల్లంతో వండిన పులగం) నివేదన చేసి, అందరికీ ఆ ప్రసాదం పంచిపెడతారు. ఎడ్లను పరుగెత్తిస్తూ పందేలకు దిగే ఆచారమూ కొన్నిచోట్ల ఇంకా ప్రాచుర్యంలో ఉంది.
భారతీయ సంస్కృతికి, జాతి జీవన విధానానికి పట్టుకొమ్మలైన ఉత్సవాలు ఇవి. నవనవోన్మేష చైతన్యానికి, సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణకు ఇవి ఎంతగానో దోహదపడతాయి!
రచన: చిమ్మపూడి శ్రీరామమూర్తి