జ్యోతి’ పదం నుండి ‘జ్యోతిషం’ ఆవిర్భవించింది. ‘జ్యోతి’ అంటే ప్రకాశం, వెలుగు అర్థం. జ్యోతిషం ఒక వైజ్ఞానిక శాస్త్రం.
జ్యోతిషాం సూర్యాదిగ్రహాణాం బోధకం శాస్త్రం!
సూర్యాది గ్రహాలూ, కాలం గురించి తెలిపే శాస్రమే జ్యోతిషం.
గగనమండలంలోని ప్రధానగ్రహాలు, నక్షత్రాలు భూమిపై ఉండే ప్రాణులకు వెలుగునిస్తాయి. ఆకాశంలోని ఈ గ్రహాల నుండి ప్రసరించే జ్యోతికిరణాలు తమ తమ బలం, దూరాన్ని అనుసరించి భూమిపై ఉన్న ప్రాణులను ప్రభావితం చేస్తాయి. వాస్తవానికి ఒక వ్యక్తి జనన సమయంలోని జ్యోతికిరణాలు అతని స్వభావానికి కారణమౌతాయి. మానవుని జీవితంపై, అతని జీవితంలోని వివిధ కోణాలపై ఈ జ్యోతికిరణాల ప్రభావాన్ని విశ్లేషించే శాస్త్రమే ‘జ్యోతిర్విజ్ఞానం’ లేదా ‘జ్యోతిష విజ్ఞానం’ అని పిలవబడుతుంది.
1. శిక్ష, 2. కల్పం (సూత్రాలు), 3. వ్యాకరణం, 4. నిరుక్తం, 5. ఛందస్సు, 6. జ్యోతిషం వేదాలకు ఆరు అంగాలు. అందుచేత వేదాలను ‘షడంగ వేదాలు’ అంటారు. ‘వేదస్య నిర్మలం చక్షుర్జ్యోతి శాస్త్రమనుత్తమం’ అని నారదసంహితలో జ్యోతిషశాస్త్రాన్ని వేదాలకు నేత్రంగా చెప్పారు.
- ఋగ్వేదంలోని మొదటి శ్లోకం -
‘విఫలాన్యన్యాశాస్త్రాణి వివాద స్తేషు కేవలమ్|
సఫలం జ్యోతిషం శాస్త్రం చంద్రాక్కౌ యాత్ర సాక్షిణౌ||
యథా శిఖామయూరణాం నాగానాం మణయో యథా|
తత్వద్వేదాంగ శాస్త్రాణాం జ్యోతిషం మూర్థని స్థితమ్’ అని చెప్పబడింది.
చంద్రగుప్త విక్రమాదిత్యుని కాలం (క్రీ.శ. 380 నుండి 414)లో ఆర్యభట్టు ప్రసిద్ధ ఖగోళ, గణిత శాస్త్రజ్ఞుడు. గణిత, జ్యోతిష శాస్త్రాల గౌరవాన్ని అత్యున్నత స్థితికి చేర్చాడు.
ప్రాచీన మహర్షులు చేసిన సూర్యచంద్రుల గ్రహణ సమయాన్ని తెలుసుకునే విధానాన్ని ఆర్యభట్టు సంస్కరించి, సరైన గ్రహణ సమయాన్ని లెక్కించే విధానాన్ని రూపిందించి, ఆ మహర్షుల గౌరవానికి మరింత శోభ చేకూర్చాడు. వైదిక ఋషులు ద్వారా చెప్పబడిన శుభాశుభ సంఘటనల సమయాన్ని నిర్దిష్టంగా తెలుసుకోవటానికి 27 నక్షత్రాలపై ఆధారపడిన ఒక సమయసారిణి (సూచిక) సిద్ధం చేసాడు. భూమండలపై, భూమండల వాసులపై పడే గ్రహప్రభావాన్ని వివరించే ఒక చార్డ్ తయారుచేశాడు. ఆర్యభట్టీయమనే గ్రంథం రచించాడు. అది ప్రాచీన భారతచరిత్రలో స్వర్ణయుగం. నేటికీ ప్రపంచమంతా అతని గణనా విధానాన్నే అనుసరిస్తుంది. భారతదేశంలో ఇదే ప్రమాణం.
మధ్యయుగంలోని ప్రథమభాగంలో ఈ విజ్ఞానం మరింత ఉన్నతి చెందింది. ‘వరాహమిహిర’ పండితుడు దీనిని క్రమబద్ధం చేసి, అందులో అంకె నూతన తథ్యాలను సమీకరించి, బృహజ్జాతకమనే గ్రంథాన్ని రచించాడు.
ఆ తరువాత -
- ➲ కళ్యాణవర్మ,
- ➲ బ్రహ్మగుప్తుడు,
- ➲ మున్జాలుడు,
- ➲ చంద్రసేనుడు,
- ➲ శ్రీపతి,
- ➲ శ్రీధరుడు,
- ➲ భట్టవోసారి,
- ➲ మల్లిసేనుడు,
- ➲ బల్లాల సేనుడు,
- ➲ నరచంద్రుడు,
- ➲ అర్దదాసుడు,
- ➲ మకరందుడు,
- ➲ మహేంద్రసూరి,
- ➲ వైద్యనాథుడు,
- ➲ కేశవుడు,
- ➲ గణేశుడు,
- ➲ డుండిరాజు,
- ➲ నీలకంఠుడు మొదలైనవారు.
19వ శతాబ్దంలో -
- ➲ మునీశ్వరుడు,
- ➲ దివాకరుడు,
- ➲ నిత్యానందుడు,
- ➲ ఉభయకుశల బాషుజేముని,
- ➲ జస్వంతసాగరుడు,
- ➲ జగన్నాథసమ్రాట్టు,
- ➲ బాపుదేవ శాస్త్రి,
- ➲ నీలాంబరషూ,
- ➲ సుధాకర ద్వివేది మొదలైన ప్రసిద్ధ రచయితలు, టీకాకరులు, సమీక్షలు జ్యోతిశ్శాస్త్ర సంబంధిత రచనలు అనేకం చేశారు.
ప్రపంచలో రెండు ప్రాచీన దేశాల్లోనే జ్యోతిర్విజ్ఞానం పూర్తిగా రెక్కలు తొడిగింది. మొదటిది భారదేశం, రెండవది గ్రీసుదేశం. క్రీస్తుకు పూర్వం అనేక శతాబ్దాలు భారతదేశంలో విస్తరించిన జ్యోతిర్విజ్ఞాన వటవృక్షఛాయలో అనేక విదేశీయులు తమ తమ దుఃఖాలు, సమస్యలకు సమాధానం పొంది శాంతి అనుభవించేవారు. మానవ జీవితంలో జ్యోతిష్యం ఉపయోగం, మహత్తు – మానవుని సమస్త కార్యాలు జ్యోతిషం ద్వారానే జరుగుతాయి. వ్యావహారికంగా ముఖ్యమైన ఉపయోగకర దినాలు, సమయం, తిథి, వారం, సప్తాహం, పక్షం, మాసం, ఋతువు, సంవత్సరం, అయనం, నక్షత్రం, యోగం, కరణం, చంద్రసంచారంచ సూర్యస్థితి మొదలైన జ్ఞానం జ్యోతిషం వల్లనే లభిస్తుంది. ఈ జ్ఞానం కోసం వివిధ ప్రదేశాల పేర్లను ఆధారంగా తీసికొని పంచాంగం చూసి సామాన్య జనులు కూడా ఈ విషయాలను గ్రహించగలరు. అలాగే చారిత్రాత్మక అంశాలు కూడా పొందుపరచబడతాయి. వాటిని గురించి కూడా మనం సంప్రదించి నిర్ణయాలు తీసుకోవచ్చు.
జల-చార రాశులు, జల-చర నక్షత్రాల సమయంలో ఎక్కువ వర్షం పడే అవకాశం ఉంటుంది. పామరుడైన పల్లెటూరి రైతు ఆకాశాన్ని పరిశీలించి వర్షం గురించిన అంచనా వేయగలుగుతాడు. పుష్కలంగా పంట పండటానికి తగు సమయం అంచనా వేసి గింజలు నాటుతాడు. సముద్రయానం చేసే నావికులు, వారి కెప్టెన్ (నాయకుడు) సముద్రంలో ప్రయాణించే సమయంలో సూర్యచంద్రులు స్థితిని చూసి వాతావరణాన్ని ఊహించగలుగుతారు. సురక్షిత మార్గాలను, సమయాన్ని నిర్ణయించుకుంటారు. అందుచేత హాని జరుగదు. జ్యోతిషంలో ఒక శాఖ రేఖాగణితం, పర్వతాల ఎత్తును, సముద్రాల లోటును కొలవటానికి ఉపయోగపడుతుంది. సూర్య చంద్ర గ్రహణాల ఆధారంగా ప్రాచీన చారిత్రాత్మక తిథులను తెలుసుకోవచ్చు. భూగర్భంలో లభించే పురాతత్వ వస్తువుల ప్రాచీనత్వం, వాటి సమయాన్ని అంచనా వేయవచ్చు.
ఆకాంక్ష, రేఖాంశ దిశాజ్ఞానం కలిగిస్తాయి. ఈ జ్ఞానం ద్వారా ప్రపంచంలోని అనేక రహస్యాలు, యుగాలను గురించిన వివరాలు సూర్య – చంద్ర గ్రహణ కాలాలు, ఆటుపోట్ల త్రీవత, సమయం…ఇవన్నీ జ్యోతిషం ద్వారా తెలుస్తాయి. ఉత్తమమైన ఔషధాలను ఎ సమయం, ఋతువుల్లో తయారుచేయాలో కనుగొనవచ్చు. రోగనివారణకు ఔషధాలను ఉపయోగించాల్సిన సమయం తెలుస్తుంది. ఈ విధంగా జ్యోతిషం ప్రత్యక్షంగా, పరోక్షంగా భూమిపై ఉన్న మానవులకే కాక సర్వప్రాణులకు లాభకరంగా ఉంటుంది. ఆందుచేతనే అజ్ఞానాంధకారం తొలగించే దీపం జ్యోతిషశాస్త్రం.
ఈ జ్యోతిర్విజ్ఞానాన్ని పాశ్చాత్య విద్వాంసులు వేల సంవత్సరాలుగా పరిశ్రమించి పాశ్చాత్య విధానంలో రూపొందించారు. ఫలిత జ్యోతిశంపై పాశ్చాత్యులకు ఎంతగా గురి కుదిరిందంటే, అక్కడ ఈ విషయంపై అనేక చర్చలు, ఉపన్యాసాలు, గ్రంథ ప్రకాశానం, వ్యాఖ్యానాలు ఏర్పాటు చేస్తున్నారు. సాధారణ ప్రజానీకానికి నిర్దుష్టమైన జ్ఞానం అందించే ప్రయత్నం చేస్తున్నారు.
అమెరికాలో ఈ విజ్ఞానానికి సంబంధిచిన ప్రత్యెక విశ్వవిద్యాలయాలు స్థాపించారు. అందులో ఉత్తీర్ణులైన యోగ్య విద్యార్థులకు మంచి పదవులు ఇవ్వబడుతున్నాయి.
సంకలనం: నాగవరపు రవీంద్ర