జాతకం అంటే ఏమిటి?
జాతకం అంటే ఏమిటి? జాత అంటే పుట్టుక ....పుట్టుకతో వచ్చినది కావున జాతకం అంటారు. ఏ మనిషికైనా భవిష్యత్తు గురించి కొద్దో గొప్పో బెంగ ఉండే ఉంటుంది.రేపు తనకు జరగబోయే శుభాశుభాలను గురించి తెలుసుకోవటం, ఏవైనా బాధలుంటే వాటికి నివారణోపాయాలను వెతుక్కోవాలనుకోవటం, ప్రతిక్షణం సుఖసంతోషాలతో జీవించాలనుకోవటం మనిషి నైజం. ఆ సుఖవంతమైన జీవితం అన్వేషణలోనే ఎన్నో రకాల శాస్త్రవిషయాలను కనుక్కోవటం జరుగుతున్నది. అయినప్పటికి భవిష్యత్తును తెలుసుకోవాలన్నా, దానిని సుఖవంతముగా మార్చుకోవాలన్నా అది ఒకే ఒక శాస్త్రంతోనే సాధ్యమవుతుంది.
అదే జ్యోతిష శాస్త్రం.జ్యోతిష్య శాస్త్రం ద్వారా మనము జన్మించిన సమయానికి ఖగోళములోని గ్రహస్థితులను సూచిస్తూ వేయబడే చక్రాన్నే జాతకము అంటారు. దీనినే జాతకచక్రము, జన్మకుండలి, హోరోస్కోప్ ఇలా వివిధ రకాల పేర్లతో ఆయా ప్రాంతాలవారు సంబోధిస్తుంటారు. ఒక వ్యక్తి జన్మించిన సమయము, ప్రదేశము ఆధారముగా జాతకచక్రము గణించబడుతుంది.
ఖగోళములోని గ్రహస్థితులను గణితాధారముగా లెక్కించి, ఆయా రాశి, నక్షత్ర, భావాలలో ఉన్న గ్రహాల ఆధారముగా భవిష్యత్తు చెప్పబడుతుంది.దీని గణనలో కాని, జన్మించిన సమయములో కాని తప్పు జరిగినట్లయితే అది ఆ నిర్దేశిత వ్యక్తి జాతకం కాక వేరే వారి జాతకం అవటమే కాకుండా, ఈ వ్యక్తికి చెప్పబడ్డ భవిష్య ఫలాలన్నీ తప్పే అవకాశం ఉంటుంది.కాబట్టి భవిష్యత్తు తెలుసుకోవలనుకుంటే జాతక చక్రము అత్యావశ్యమైనదిగా చెప్పబడింది.
జాతకం మనకు మన జీవిత రేఖను తెలియజేస్తుంది. మన గ్రహ స్థితిని అనుసరించి మనం తగు జాగ్రత్తలు పాటిస్తే పెను ప్రమాదం నుండి కాపాడబడి ఉపశమనం పొందగలము. ఉదా : వర్షం నుండి రక్షణ కలిగించే గొడుగులా ...ప్రమాదం నుండి కాపాడే శిరస్త్రానం లా.
సంకలనం: ప్రసాద్