శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి వచన కాలజ్ఞానము, వీరబ్రహ్మేంద్రస్వామి జీవితంలో ఎన్నో మహిమలు జరిగినట్టు చెబుతారు. అయితే ఈ మహిమలు చూసినవారు, జరిగాయా లేదా అని తర్కించేవారి విషయం పక్కన పెడితే ఆయన చెప్పిన కాలజ్ఞానం మాత్రం భవిష్య సూచికగా అత్యధికశాతం హిందువులు నమ్ముతారు.
అచ్చమ్మకు చెప్పిన కాలజ్ఞానం
🟔 దుర్మార్గులే రాజులుగా మారతారు. మంచిప్రవర్తన కలవారు భయంకర కష్టాలు అనుభవించి హీనంగా మరణిస్తారు.
- ప్రస్తుతం కేవలం అవినీతిపరులు మాత్రమే ప్రజా పాలకులుగా మారుతున్నారు. మన దేశమేకాదు, అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలతో సహా ప్రజలను పాలించేవారు అవినీతిపరులు, దుర్మార్గులుగానే వుంటున్నారు.
- ధనవంతులు మాత్రమే పాలకులుగా మారుతున్నారు. వారికి ధన సంపాదనే ధ్యేయం. ఈ ప్రయత్నంలో సామాన్య ప్రజల కష్టాల గురించి ఎవరికీ పట్టడం లేదు.
🟔 మతకలహాలు పెరిగి ఒకర్నొకరు చంపుకుంటారు.
- దేశ విభజన సమయంలో కూడా హిందూవులు, ముస్లింలు ఒకర్నొకరు చంపుకున్నారు. ఇటీవల కూడా గుజరాత్లో నరమేధం జరిగింది. ఇక్కడ ముందుగా ముస్లింలు మతకల్లోలాలను ప్రారంభించారు. వారు రైల్లో ప్రయాణిస్తున్న కొందరు హిందువులను సజీవదహనం చేయటంతో, హిందువులు ఆ పనిచేసిన ముస్లింలను హతమార్చారు.
🟔 అడవి మృగాలు అడవులలోనుంచి గ్రామాలు, పట్టణాలలోనికి ప్రవేశిస్తాయి మానవులను చంపుతాయి.
- పెరుగుతున్న జనాభాకు అవసరాలు కూడా పెరుగుతున్నాయి. దానివల్ల వారు పొలాల కోసం, కలపకోసం లక్షల ఎకరాలలో అడవులను నరికి, వాటిలో పంటలు పండిస్తున్నారు. ఫలితంగా అడవుల విస్తీర్ణం క్రమంగా తగ్గిపోతుంది. దీనివల్ల అక్కడ వుండాల్సిన పులులు, ఏనుగులు, ఎలుగుబంట్లు వంటివి ప్రజలు నివసించే గ్రామాల్లోకి ప్రవేశిస్తున్నాయి.
- మనుషుల్ని హతమారుస్తూ, పంటలను ధ్వంసం చేస్తున్నాయి
🟔 నీళ్ళతో దీపాలను వెలిగిస్తారు.
- బ్రహ్మంగారు పుట్టి, జ్యోతిష్యం చెప్పిన సమయానికి మారుమూల పల్లెలే కాదు, పట్నాల్లోకి కూడా ఎలక్ట్రిక్ దీపాలు రాలేదు. అసలు వాటి గురించి ఎవ్వరూ ఊహించలేదు కూడా. ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ వచ్చింది. ఈ శక్తి నీళ్ళ నుంచి ఆవిర్భవిస్తోందనేది మనందరికీ తెలుసు.
- ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి వందల ఏళ్ళ కిందటే తమ కాలజ్ఞానంలో చెప్పారాయన.
🟔 ఇతర దేశీయులు వచ్చి భారత దేశాన్ని పరిపాలిస్తారు.
- ప్రాచీనకాలంలో చూస్తే హూణులు తదితరులు, ఆ తర్వాత ముస్లింలు, తర్వాత డచ్, పోర్చ్ గీసువారు, తర్వాత బ్రిటీష్ వారు ఇలా కోట్లమంది మంది హిందువులను చంపి ఈ దేశాన్ని ఆక్రమించారు. వందల సంవత్సరాలు పాలించారు.
- భారతీయులలో సహజంగా వున్న అనైక్యత వల్లే ఇతర దేశీయులు ఈదేశాన్ని పరిపాలించగలిగారు.
- అక్షరాలా బ్రహ్మంగారు చెప్పింది పల్నాటి రాజ్యంలో జరిగింది. నాయకురాలు నాగమ్మ వల్ల పల్నాడు ఒక శ్మశానంగా మారిపోయింది.
- చిన్నచిన్న పట్టింపులు పౌరుషం వల్ల యుద్ధం జరిగి వేలాదిమంది ఆనాడు మరణించారు.
🟔 పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి. దీనివల్ల కొన్ని గ్రామాలలో ప్రజలు మరణిస్తారు.
- దీని గురించి ఖచ్చితమైన వివరణ ఇవ్వలేము. ఇది విమానాల్లో నుంచి వదిలే బాంబులు కావటానికి అవకాశం ఎక్కువగా వుంది. వియత్నాం యుద్ధంలో జరిగింది ఇదే. అక్కడ ఎక్కువగా గ్రామాలపైనే అమెరికా సేనలు దాడులు జరిపాయి.
- అక్కడ వామపక్ష గెరిల్లాలు గ్రామాలనుంచే తమ సాహసోపేతమయిన పారాటం చేశారు, అమెరికా సేనలను భయకంపితులను చేశారు.
🟔 ఒకరి భార్యను మరొకరు వశపరుచుకుంటారు. స్త్రీ, పురుషులు కామముచేత పీడితులవుతారు.
- నగర జీవనంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.
- గతంతో పోలిస్తే ఇప్పుడు స్త్రీ, పురుషులలో కామవాంఛ పెరిగింది. నైతిక విలువలు క్రమంగా తగ్గిపోతున్నాయి.
🟔 వేంకటేశ్వర క్షేత్రంలో దొంగతనాలు జరుగుతాయి. మహ్మదీయులు దేవాలయాలను దోచోచుకుంటారు.
- ఇప్పుడు ప్రతిరోజూ ఏదో ఒక దేవాలయంలో దొంగలు పడటం ఒక రోజువారీ వార్తగా మారిపోయింది.
- పూర్వం మహమ్మదీయుల పాలనాకాలంలో ఎన్నో ఆలయాలు ధ్వంసం చేయబడి దోచుకోబడ్డాయి.
🟔 మహామ్మదీయులు వేల సంఖ్యలో హిందువుల దేవాలయాలను ధ్వంసం చేస్తారు.
- గుజరాత్లోని అత్యంత సుసంపన్నమైన సోమనాథ ఆలయం మీద ముస్లిం చక్రవర్తులు వరుసగా అనేకసార్లు దండయాత్రలు చేసి అక్కడి సంపదను మొత్తం దోచుకుని వెళ్ళారు.
🟔 అయిదు వేల ఏళ్ళ తరువాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుంది.
- ఈ కాల పరిణామం సరస్వతీ నది విషయంలో అక్షరాలా జరిగింది. వేద కాలం నాటి సరస్వతీనది ప్రస్తుతం అంతర్ధానమైపోయినా, శాటిలైట్ ద్వారా ఆ నది గతంలో ప్రవహించిందని శాస్త్రవేత్తలు ధృవీకరించిన విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి.
- గంగ విషయంలో జరుగుతుందో లేదో కాలమే నిర్ణయిస్తుంది.
🟔 చెన్నకేశవస్వామి మహిమలు నాశనమైపోతాయి.
🟔 కృష్ణానది మధ్య ఒక బంగారు తేరు (రథము) పుడుతుంది. దాన్ని చూచినవారికి ఆ కాంతివల్ల కనులు కనబడవు.
- ఇది ఇప్పటివరకు జరగలేదు కానీ, ఇకముందు జరగవచ్చేమో తెలియదు ప్రపంచంలో ఇకముందు పాపుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది.
- క్షీణించిపోతున్న ధర్మాన్ని కాపాడి, పాపాత్ములను శిక్షించేందుకు నేను అయిదువేల ఏళ్ళ తరువాత వీరభోగ వసంతరాయులుగా తిరిగి అవతరిస్తాను.
🟔 విజయనగరం కొన్నాళ్ళు అత్యంత వైభవంగా వెలగుతుంది. ఆ తర్వాత ప్రాభవం కోల్పోయి నాశనమైపోతుంది.
- ఇది ఒక చారిత్రక వాస్తవం! శ్రీ కృష్ణదేవరాయల పాలన తర్వాత విజయనగర సామ్రాజ్యంలో అంతఃకలహాలు మొదలయ్యాయి.
- అసమర్థులు, భోగలాలసులైన చక్రవర్తులు నేతలుగా మారారు.
- మరోవైపు మహమ్మదీయుల దండయాత్రల వల్ల ఆ మహా సామ్రాజ్యం బలహీనమవటం ప్రారంభించింది.
- మిగిలిన భారతీయ రాజుల మాదిరిగానే కర్నాటక, ఆంధ్ర ప్రాంత రాజుల్లో అనైక్యత వల్ల కూడా విదేశీయులైన మహమ్మదీయులు విజయనగర సామ్రాజ్యాన్ని నాశనం చేయగలిగారు.
🟔 వెంకటేశ్వరునికి మహమ్మదీయులు కూడా పూజలు చేస్తారు.
- వెంకటేశ్వరునికి ఒక మహమ్మదీయ వనిత భార్యగా వున్న విషయం అందరికీతెలిసిందే. బీబీ నాంచారి పేరుతో ఈ మహిళ పూజలందుకుంటోంది.
🟔 కృష్ణ, గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా కూడి చచ్చేరు.
- కృష్ణ గోదావరి నదులు సముద్రంలో కలిసే చోటు మన రాష్ట్రంలోనే వుంది గతంలో కృష్ణా జిల్లాలో వచ్చిన తుఫాన్ సంఖ్యలో పశువులు మృతి చెందిన విషయం అందరికీ తెలుసు.
🟔 తూర్పునుంచి పడమర వరకు ఆకాశంబున యోజన ప్రమాణము వెడల్పుగా చెంగావి చీర కట్టినట్లు కనబడుతుంది.
- ఇది కూడా అణ్వస్త్రాల కలిగే ఫలితం కావచ్చు. అణు బాంబు వల్ల పుట్టే ఎర్రని మంటలు ఆకాశాన్ని కప్పివేసినట్టు కనబడ్డాయి.
సంకలనం:కే వీరబ్రహ్మచారి