Yoga |
యోగతో ఆరోగ్యం..
యోగ అనేది మనలో అంతర్లీనంగా ఉండే శక్తిని సమతుల్యమైన పధ్దతిలో మెరుగుపరచుకోవడానికి లేక అభివృధ్ది చేసుకోవడానికి ఉపకరించే ఒక క్రమశిక్షణ వంటిది. కీలకమైన స్వయం అనుభూతిని సాధించుకోవడానికి ఇది ఒక మార్గాన్ని చూపిస్తుంది.
సంస్కృతంలో ‘యోగ’ అనే మాటకు అర్ధం అక్షరాలా ‘యోకె ‘ అని. అందుచేత, యోగ అనే మాటను మన అంతరాత్మను, విశ్వాత్మతో ఐక్యం చేసే మార్గమని చెప్పవచ్చు. మహర్షి పతంజలి చెప్పినదాని ప్రకారం యోగ అనేది మనసులో సంభవిస్తూ ఉండే సవరణలను, మార్పులను అణగద్రొక్కి పెట్టేది.
మహర్షి పతంజలి |
సంస్కృతీ, సంప్రదాయాలకు నిలయమైన భారత దేశానికి అత్యంత ప్రాచీనమైన సంపద యోగ. భారత సంతతికి వంశపారంపర్యంగా, గురూపదేశంగా నేటికీ విడువకుండా అనుసరిస్తూ వస్తున్న ఏకైక హృదయ తరంగమిది. ఇది భారత ఋషుల అద్భుత సృష్టి. ఈ సృష్టికి 8 వేల సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. మనసుని అధీనంలో ఉంచుకోవడం ద్వారా ప్రాణ శక్తిని పెంపొందించడమనే ఈ ప్రక్రియ అద్భుతాలలోకెల్లా అద్భుతం. ఎటువంటి ఔషధాలూ, శస్త్ర చికిత్సలూ అవసరం లేకుండా కేవలం చిన్న చిన్న వ్యాయామాల ద్వారా దీర్ఘకాలిక రోగాల నుండి విముక్తులు కావడం వైద్య శాస్త్ర రంగానికి ఓ సవాలు.
క్రమశిక్షణతో కూడిన ఆరోగ్యాన్ని అలవరచుకోవడానికి యోగ అనువైన విధానం. ప్రత్యామ్నాయ వైద్య విధానంగా అమిత ప్రాచుర్యంలో ఉన్న యోగ నియమబద్ధమైన ఆహారం, అలవాట్లు ఉన్నవారికే సాధ్యం. సహజసిద్ధమైన ఆహారం యోగా అభ్యాసకులకు అతి ముఖ్యం. తీపి పదార్ధాలు, రసాయనాలు కలిపిన పదార్ధాలు వీరికి నిషిద్ధం. వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వ్యసనాలకు కూడా దూరంగా ఉండాలి. నేటి ఆధునిక జీవనం ఇందుకు ఏమాత్రం అనువుగా లేకపోవడంతో యోగ సాధన కష్టసాధ్యమైనా, యోగానే జీవన విధనంగా ఎంచుకుంటే ఎవరి ఆరోగ్యం వారి అధీనంలోనే ఉంటుంది.
యోగా ఆసనం |
ఆసనం అంటే?
ఆసనం పుట్టుక గురించి మూలాధారాలు లేవు. మనిషి పుట్టిన నాటినుంచి అది ఉంది. ఉయ్యాలలోని పసిబిడ్డ చేసే విన్యాసాలు కూడా ఆసనం క్రిందే వస్తాయి. మనిషి శారీరకంగా వ్యక్తపరచే ఏ భంగిమనైనా ఆసనం అనవచ్చు. ఐతే ఆ భంగిమలు ఒక క్రమపద్ధతిలో ఉండాలి. వాటికి తగినంత వ్యాయామం ఉండాలి. ఆసనాలు ఎన్ని అనడంలో భేదాభిప్రాయాలున్నా మనిషి సంపూర్ణ ఆరోగ్యవంతుడు కావడానికి కనీసం 25 ఆసనాలైనా వేయడం ఉత్తమమని యోగ పండితులు చెబుతారు. వాటిలో పద్మ, చక్ర, సర్వాంగ, హల, ధను, మయూర,పశ్చిమోత్తన, శీర్ష, శవాసనాలు తప్పకుండా వేయాల్నిన ఆసనాలు.
భగవద్గీతలో శ్రీ కృష్ణ పరమాత్మ, ఉపనిషత్తులలో మహర్షులు అత్యంత యోగ విజ్ఞానాన్ని అందించారు. యోగాలలో కూడా పలు రకాలున్నాయి. అవి రాజ యోగము, హఠ యోగము, కర్మ, భక్తి, ధ్యాన, జ్ఞాన యోగము...ఇంకా అనేకం. రాజ యోగాన్ని శ్రేష్టమైనదిగా చెబుతారు. యోగాసనాలతోపాటు నేతి, ధౌతి, భస్తి, త్రాటకం, కపాలభాతి మొదలైన హఠ యోగ క్రియలు కూడా నేడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కానీ వీటిని అభ్యసించేవారు చాలా తక్కువ.యోగాసనాలు ఎందుకు వేయాలి?
మానవ శరీరం మాలిన్యాల పేటికలాంటిది. దాన్ని ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకుంటూ ఉండాలి. మాలిన్యాలే అనారోగ్యానికి మూలకారణం. వాటిని నిర్వీర్యం చేయనిదే ఆరోగ్యం సాధ్యం కాదు. మాలిన్యాల నిర్మూలకు యోగా చక్కని పరిష్కారం. యోగ వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అందువల్ల పెద్దగా కష్టపడనవసరంలేని యోగాసనాలు చేయడం ప్రతి ఒక్కరికీ అవసరం.
విశ్వవ్యాప్తమైన యోగా |
యోగ – విశ్వవ్యాప్తంగా ఆచరించే ఒక క్రమశిక్షణ
సంస్కృతి, జాతీయత, వర్గం, కులం, మతం, విశ్వాసం, లింగబేధం, వయసు మరియ శారీరక స్ధితితో నిమిత్తంలేని, సాధన చేయడానికి మరియు అన్వయించుకోవడానికి కూడా యోగ ఒక విశ్వవ్యాప్తంగా యోగ్యత కల సత్ప్రవర్తనతో కూడి వుండే సాధన. కేవలం గ్రంధాలను చదవడం వల్ల, లేక ఒక సన్యాసి వేషాన్ని ధరించి ఉండడం వల్ల కూడా, ఎవరూ పరిపూర్ణమైన, నిష్ణాతుడైన సన్యాసి గానీ విరాగి గానీ కాలేరు. దీనిని సాధన చేయకుండా, లేక దీనిలో అంతర్లీనంగా ఉండే ప్రయోజనం గురించి కూడా గానీ, లేక యోగ లక్షణాలు గానీ, విశిష్టితలు వాటి వినియోగాల చిట్కాలను గురించి గానీ ఎవరికి గ్రాహ్యం కావడం గానీ, అనుభవంలోకి రావడం గాని జరగదు. రోజువారీ, ఒక క్రమపధ్దతిలో సాధన చేయడం వల్లనే శరీరాన్ని, మనసునూ ఉన్నత స్ధితికి చేర్చడానికి ఇది ఒక విధమైన ఒరవడిని సృష్టిస్తుంది. మనసును శిక్షణ ద్వారా లగ్నం చేస్తూ, అంతరాత్మను పరిశుధ్దం చేయడం ద్వారా ఉన్నత స్ధితిలో ఉన్న అంతరాత్మ యొక్క అనుభూతిని పొందడానికి సాధకుడిలో తీవ్రమైన మనోవాంఛ, కోరిక ఉండవలసి ఉంటుంది.ఆత్మకు చికిత్స - యోగ
యోగాలో అన్ని మార్గాలు కూడా (జపం, కర్మ, భక్తి మొదలైనవి) నొప్పులనుండి కలుగుతూ వుండే బాధలను దూరం చేస్తూ, వాటిని నయం చేయడానికి అవకాశం కలిగి ఉన్నవే. అయితే, దీనికి మనకు ముఖ్యంగా, ఒక నిష్టాతుడైన, సిధ్దుడైన, తన లక్ష్యాన్ని చేరుకోవడంలో ఇప్పటికే ఇదే మార్గాన్ననుసరించి ఉన్న వ్యక్తి నుండి సరైన మార్గదర్శకత్వాన్ని తీసుకోవలసిన అవసరం ఉంది. ఒక వ్యక్తిలో ఉండే జిజ్ఞాస వల్ల, సమర్ధుడైన, యోగ్యుడైన సలహాదారుని యొక్క సహకారంతో గానీ లేక సిధ్దహస్తుడైన ఒక యోగిని సంప్రదించి గాని ఈ ప్రత్యేక మార్గాన్ని జాగ్రత్తగా ఎంచుకోవలసి ఉంటుంది.
జప యోగ
“ఓమ్”, “రామా”, “ అల్లా”, “దేవుడా” , “వాహే గురు” మొదలగు పవిత్ర నామోఛ్చరణతో లేక పవిత్ర వర్ణాలను, మంత్రాలను, మరల మరల జపిస్తూ, మనసులో ధ్యానిస్తూ, మనసును భగవధ్యానంలో లగ్నంచేసి, వీటిని ఉఛ్చరిస్తూ, వాటిలోనే నిమగ్నమవడం.
కర్మ యోగ
కర్మయోగ ప్రతిఫలాపేక్ష లేకుండా, మనం కర్మలన్నింటిని నిర్వహించాలని బోధిస్తుంది ఇది. ఇటువంటి సాధనలో యోగి తాను చేసే ప్రతి కర్మ కూడా పవిత్ర మైనదిగా భావిస్తూ, దానిని మనస్ఫూర్తిగా, భక్తిభావంతో, భగవధ్యానంలో లీనమై కోరిక లన్నింటినీ దూరంగా పారద్రోలుతూ చేస్తాడు.
జ్ఞాన యోగ
నాది మరియు నాది కాదు అనే వాటి మధ్య ఉండే వ్యత్యాసాన్ని గ్రహించాలని భోధిస్తుంది, అలాగే పవిత్ర గ్రంధాలను చదవడం ద్వారా, సాధు సాంగత్యం ద్వారా మరియు ధ్యానాన్ని సాధన చేస్తూ వుండడం ద్వారా , మనం ఆధ్యాత్మిక జ్ఞనాన్ని పొందాలని ఇది బోధిస్తుంది.
భక్తి యోగ
అత్యంత భక్తితో భగవంతుడికి తనకు తానుగా భగవంతునికి అర్పించుకొని, పూర్తిగా దాసుడై ఉండడంపై శ్రధ్ద వహిస్తూ, అత్యంత భక్తితో భగవధ్యానంలో లీనమయ్యే విధానం ఇది. భక్త యోగం యొక్క నిజమైన సాధకుడు అహంకారం లేకుండా ఉంటూ, వినయ, విధేయతతో ప్రాపంచిక ద్వందానికి ప్రభావితం కాడు.
రాజ యోగ
“ అష్టాంగ యోగ” అని ప్రముఖంగా పిలువబడే ఈ రాజ యోగ అన్నింటా మానవాభివృధ్దిని కలుగజేసేది. ఇవిః యమ, నియమ, ఆసన, ప్రణయామ, ప్రత్యహార, ధారణ, ధ్యాన మరియు సమాధి.
కుండలిని
తాంత్రిక సాంప్రదాయ పధ్దతిలో కుండలిని యోగ ఒక భాగం. సృష్టి ప్రారంభం నాటినుండి తాంత్రికులు మరియు యోగులు ఈ భౌతిక శరీరంలో 7 చక్రాలలో మొదటిదైన మూలాధార చక్రంలో ఒక అవ్యక్తమైన శక్తి నివసిస్తూ ఉందని గ్రహించారు.
ఈ కుండలిని ఉండే చోటు. వెన్నెముక యొక్క మూల స్ధానంలో ఒక చిన్న గ్రంధి వంటిది పురుష శరీరంలో ఇది మూత్ర మరియు మల నిసర్జనకు సంబంధించిన అవయవాల మధ్య ఉండే స్ధానంలో ఉంటుంది. స్త్రీ శరీరంలో దీని స్ధానం గర్భాశయ ద్వారం వద్ద ఉంటుంది. ఈ అలౌకిక, మానవాతీతమైన శక్తిని మేల్కొలిపిన వారిని ఋషులు, ప్రవక్తలు, యోగులు, సిధ్దులు మరియు ఇతర పేర్లతో కాల, సాంప్రదాయ, సాంస్కృతిక పరిస్ధితు లను బట్టి పిలువబడ్డారు. ఈ కుండలినిని మేల్కొలపడానికి మీరు షట్క్రియ, ఆసన, ప్రాణాయామ, బంధ, ముద్ర మరియు ధ్యానం వంటి యోగసంబంధిత పధ్దతుల ద్వారా సిధ్దపడి ఉండాల్సి ఉంటుంది. కుండలినిని మేల్కొలపడంతో, మెదడులో ఒక విధమైన విస్ఫోటనం చోటు చేసుకుంటూ, దానిలో నిద్రాణంగా, సుషుప్తావస్ధలో ఉన్న ప్రాంతాలు పూల మాదిరిగా వికసిస్తూ, విచ్చుకోవడం ప్రారంభిస్తాయి.
నాడి
యోగ గ్రంధాలలో వివరించబడినట్లుగా, మానసిక స్థాయిలో మనం చూడ గలిగే, గుర్తుపట్టగలిగే, శక్తితో ప్రవహిస్తూ, స్పష్టమైన ప్రవాహాల, కాంతి, రంగు, శబ్దం వంటి ఇతర లక్షణాలతో, విశిష్టతలతో ఉంటూ ఉండే శక్తి ప్రవాహాకాలే ఈ నాడులు. ఈ నాడుల పూర్తి సమాహారం (నెట్ వర్క్) ఎంత విశాలమైనదంటే చివరికి యోగ గ్రంధాలు కూడా వాటి సరైన సంఖ్యను లెక్కగట్డే విషయంలో బేదాభిప్రాయాలను కలిగి ఉన్నాయి. గోరక్షశతకం లేక గోరక్ష సంహిత మరియు హఠయోగ ప్రదీపికలను తిరగేసి చూసినపుడు మణిపుర చక్ర అనే నాభిస్ధాన కేంద్రంగా వీటి సంఖ్య 72,000 గా చెప్పబడింది. ఈ నాడులన్నింటిలోనూ సుషుమ్న అని పిలువబడే నాడి చాలా ముఖ్యమైనది. శరీరాన్ని లోపలవైపుకు మరియు బయటవైపుకు కలుపుతూ ఉండే ‘ద్వార మార్గాలు’ గా ‘శివ స్వరోదయ’ పది ప్రధాన నాడులను లెక్కించింది. ఈ పదిలో ఇడ, పింగళ మరియు సుషుమ్న అనేవి చాలా ముఖ్యమైనవి. వెన్నెముకతో పాటుగా ఉండే విద్యుత్ ఉప కేంద్రాలకు (సబ్ స్టేషన్స్) లేక చక్రాలకు ఈ శక్తిని అందజేస్తూ వెడుతూ ఇవి అత్యంత విద్యుత్ శక్తితో ప్రవహిస్తూ ఉండే తీగల వంటివి.
ఎవరు యోగాకు అర్హులు?
వయసుతో నిమిత్తం లేదు. పసిపిల్లాడినుంచి పండు ముదుసలి వరకు అందరూ అర్హులే. దీనికి స్త్రీ, పురుష విచక్షణ అంతకంటే లేదు. శారీరక దృఢత్వంతో అవసరం లేదు. పరికరాల ఊసే లేదు. ఒక్క రూపాయి ఖర్చు కూడా కాదు. అందరూ అర్హులే. అంతటా అర్హతే.
యోగ చికిత్స అంటే ఆసనాలు, ప్రాణాయామ పద్ధతులు, ముద్రలు, బంధాలు, క్రియల సహాయంతో ఆరోగ్యవంతులను చేసే విధానం. పతంజలి మహర్షి 195 సూత్రాలను "యోగ సూత్రాలు" అనే గ్రంధంలో క్రోడీకరించాడు. ఒక్కో యోగాసనం ఒక్కో అనారోగ్యాన్ని నయం చేస్తుంది. దీర్ఘకాలిక రోగాలకు దీనిని మించిన చికిత్స లేదు. కాబట్టే ఇప్పుడు ప్రజలు ఎక్కువగా యోగ థెరపివైపు మొగ్గుచూపుతున్నారు. యోగ అంటే ప్రకృతికి సన్నిహితంగా సహజీవనం చేయడమే. ప్రకృతి వైద్య విధానంలో ఇది ఒక భాగం.
- ۞ సహజసిద్ధమైన ఆరోగ్యానికిది ఇది చక్కని మార్గం.
- ۞ స్థూలకాయం,
- ۞ మధుమేహం,
- ۞ రక్త పోటు,
- ۞ ఉదరకోశ వ్యాధులు,
- ۞ మలబద్ధకం,
- ۞ కీళ్ళు మరియు నడుము నొప్పులు రాకుండా ఉండాలంటే యోగా ఒక్కటే మార్గమని అనుభవపూర్వకంగా తెలుస్తోంది.
యోగ సాధనతో వ్యాధులు దూరం
పతంజలి మహర్షి యోగని ఎనిమిది భాగాలుగా విభజించారు. వీటిలో మొదటి అయిదు ధ్యానసాధనలో బాహ్యంగా సహాయపడితే, చివరి మూడు అంతర్గత శక్తులను వెలికి తీసేందుకు దోహదం చేసి, యోగ సాధన ఫలాలను యిస్తాయి.
ఎనిమిది విధానాలు:
యమ: ఒక సైనికుడి ఆయుధాలను అప్పగించినప్పుడు ముందుగా క్రమశిక్షణ నేర్పుతారు. ఎప్పుడు వాటిని ప్రయోగించాలి అనే విషయంతో పాటు సమాజ పరిరక్షణకు, శాంతి స్థాపనకు ఎలా ఉపయోగపడాలనేది అవగతం చేసుకుంటారు. జీవిత విధానంపై, ప్రవర్తనపై నిర్దిష్టమైన క్రమశిక్షణ వుండాలి.
ఆ అయిదు అంశాలు:
- 1. అహింస
- 2. సత్యం
- 3. బ్రహ్మచర్యం
- 4. దొంగతనానికి పాల్పడకపోవడం
- 5. కోరికలను అదుపులో ఉంచుకోవడం
ఈ అయిదు అంశాలను పాటించినప్పుడే యోగ సాధకుడు ముందు అడుగు వేయగలడు.
నియమాలు: యోగ సాధన ఈ దేహంతోనే చేయవలసి వుంటుంది. అందువల్ల శరీరం రోగగ్రస్తం కాకూడదు. ఆరోగ్యంగా, ధృఢంగా వుండాలి. ప్రకృతిలోని ఎటువంటి మార్పులని అయినా తట్టుకునే శక్తి కలిగి వుండాలి. వాంఛలు అదుపులో వుండాలి. సాధకుడు తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించగలగాలి. ఆ అనంతశక్తిని తెలుసుకోవాలనే జ్ఞానతృష్ణ కలిగి వుండాలి.
పతంజలి మహర్షి సూచించిన అయిదు నియమాలు ఇవి:-
పతంజలి మహర్షి సూచించిన అయిదు నియమాలు ఇవి:-
- 1. పరిశుభ్రత
- 2. సంతృప్తి
- 3. సంయమం
- 4. ధర్మశాస్త్రాల అధ్యయనం
- 5. ప్రతి చర్యను భగవత్ అర్పితం చేయడం
ఈ అయిదు నియమాలను పాటించడంతో సాధకుడికి మానసికంగా, శారీరకంగా ప్రయోజనం చేకూరుతుంది.
ఆసనాలు: ప్రస్తుత కాలంలో యోగ పేరు చెప్పగానే అందరూ యోగాసనాల గురించే మాట్లాడుతున్నారు. హఠయోగంలో ఆసనాలు ఒక భాగం. విశ్రాంతిగా, స్థిరంగా కూర్చునే ఆసనాలతో ద్వారా శరీరంలోని భౌతికపరమైన ఇబ్బందులు తొలగుతాయి. వేడి, చలిలాంటి ఉష్ణోగ్రత స్థితులపై అదుపు లభిస్తుంది. హఠయోగంలో పేర్కొన్న ఆసనాలను పాటించడంలో ఎటువంటి వ్యతిరేకత లేదు కాని, అత్యున్నతమైన సమాధిస్థితిని చేరుకోవడానికి యిది ప్రామాణికం కాదు.
ప్రాణాయామం: హఠ యోగంలో పేర్కొన్న వ్యాయామాల గురించి, పతంజలి మహర్షి ఎలా నొక్కి చెప్పలేదో, అలాగే శ్వాసక్రియ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పలేదు. కేవలం ఏకాగ్రతతో, నెమ్మదిగా, గాఢంగా ఊపిరి పీల్చి వదలడం మాత్రమే ఆయన సూచించారు. ఇలా ఉచ్ఛాశ్వ, నిశ్వాసక్రియ చేయడం వల్ల ఇంద్రియాలపై అదుపు ఏర్పడుతుంది. ఏకాగ్రతని వ్ధృది చేస్తుంది. అనునిత్యం సాధనం చేయడం వల్ల మాత్రమే యిది సాధ్యపడుతుంది.
ప్రత్యాహర: ఇంద్రియ నిగ్రహమే ప్రత్యాహర. ఇంద్రియ నిగ్రహం అంటే కేవలం వాంఛల నియంత్రణ, వైరాగ్యం పెంపొందించుకోవడం, ధర్మశ్త్రాసాల్లో చెప్పినట్లు నడుచుకోవడమే కాదు. నిరంతర ఏకాగ్రత సాధనతో జాగ్రదావస్థని దాటివుండటం. మెదడుని అదుపులో ఉంచడానికి నిరంతరం హృదయం, ఇంద్రియాలు ప్రయతిస్తుంటాయి. వాటిని జయించడానికి పైనచెప్పినట్లు నిరంతర సాధన, ఏకాగ్రత అవసరం.
ధారణ: సాధనలో పై అయిదు దశలు దాటాక, శరీరం, శ్వాసక్రియ, మనసు సాధకుడి అదుపులోకి వస్తాయి. ఇప్పుడు ఏకాగ్రతపై దృష్టి నిలపాలి. సాధకుడు ఓ ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని, ఓ నిరిద్దష్టమైన వస్తువుపై దృష్టి కేంద్రీకరించాలి. ప్రతి రోజూ యిలా సాధన చేయడం వల్ల సాధకుడు ఏకాగ్రతలో ఓ ఉన్న్థతసితిని చేరుకుంటాడు.
ధ్యానం: ఆలోచనల ప్రవాహానికి ఆనకట్ట వేయడానికి ధ్యానాన్ని మించినది లేదు. ధ్యానంలో ఒక వస్తువుపై దృష్టి నిలిపినప్పుడు, క్రమేపీ ఆలోచనలు అంతరిస్తాయి. తనకి, ఎదురుగా వున వస్తువుకి తేడా స్పష్టంగా తెలుస్తుంది. ఈ దశలో ఇంద్రియాలు, మనసు కూడా ఆ ్తవసువు వైపే లగ్నమవుతాయి. ఏకాగ్రత అనేది సహజసిద్ధంగా ఏర్పడుతుంది. ఇదొక అత్యున్నత స్థితి. ఈ స్థితికి చేరుకున్నాక సమస్యలను అర్ధం చేసుకోవడమే కాదు, వాటికి పరిష్కారాలు కూడా గోచరిస్తాయి.
సమాధి: ధ్యానానికి, యోగకి యిదే పతాకస్థాయి. సాధకుడు తను అనే అహాన్ని మరిచి, ఏ శక్తిని/వస్తువుని తన దృష్టి లగ్నంగా చేసుకున్నాడో ఆ శక్తి, తాను ఒకటే అనే స్థితికి చేరుకుంటాడు. హద్దులన్నింటిని దాటుకుని, ఈ ఉన్నతస్థితికి చేరుకున్న వ్యక్తిని ‘యోగి’ అంటారు. సమాధి స్థితికి చేరుకున్న సాధకుడు ప్రకృతిని అర్ధం చేసుకోవడమే కాదు, స్పర్శించగలడు, ప్రకృతిలోని ప్రతి అణువుతోనూ అనుభూతి చెందగలడు. ఈ అపూర్వ శక్తితోనే వేద ఋషులు కంప్యూటర్ల వంటి సాంకేతిక సహకారం లేని కాలంలోనే నాలుగు లక్షల సంవత్సరాలకు ఒకసారి గ్రహాలన్నీ ఒకే రేఖలోకి వస్తాయని, అదే యుగాంతమని కనుగొన్నారు.
సంకలనం: కోటి మాధవ్ బాలు చౌదరి