వాస్తు ప్రకారం ఇంటికి నిర్మించిన తర్వాత ఆ ఇంట్లోకి ప్రవేశించే ముందు మంచి సమయం కోసం ఎదురు చూడడం అందరికీ తెలిసిందే. కొత్తగా నిర్మించిన గృహంలోకి ఎప్పుడు ప్రవేశిస్తే మంచిదనే విషయమై వాస్తుశాస్త్రం కొన్ని సూచనలు చేస్తోంది.
దీని ప్రకారం సూర్యుడు కుంభరాశిలో సంచరించే కాలం మినహా మిగిలిన మాసాలన్నీ శుభప్రదమైనవిగా వాస్తుశాస్త్రం పేర్కొంటోంది. అదేసమయంలో కార్తీక, మృగశిర మాసాలు మధ్యస్థ ఫలప్రదమైనవిగా వాస్తుశాస్త్రం చెబుతోంది.
అలాగే నూతన గృహ ప్రవేశానికి ఉత్తరాయణం మంచి కాలమని వాస్తుశాస్త్రం ఘోషిస్తోంది.ఇక రిక్త తిథులైన చవితి, నవమి, చతుర్థీ తిథులు విడిచిపెట్టి మిగిలిన తిథులలో చంద్రుని పూర్ణ, సప్తమి, అష్టమి, దశమి తిథులు శుక్ల పక్షము నందు ఏకాదశి, ద్వాదశి, త్రయోదశీలతో పాటు శుక్లపక్ష విదియ, తదియలు యోగ్యమైనవని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అలాగే దక్షిణ సింహద్వారము గల గృహమునకు సంబంధించి గృహ ప్రవేశానికి పాడ్యమి, షష్టి, ఏకాదశీ తిథులు మంచివి. ఉత్తరాయణంలో మాఘమాసం, ఫాల్గుణం, వైశాఖ మాసాలు యోగ్యమైనవి. మిగతా మాసాలందు నూతన గృహ ప్రవేశం మంచిది కాదని వాస్తు ఉవాచ.
దక్షిణ సింహద్వారము గల ఇంటికి సంబంధించి గృహ ప్రవేశానికి పాడ్యమి, షష్టి, ఏకాదశీ తిథులు మంచివి. తూర్పు సింహద్వారం కలిగిన ఇంటి గృహ ప్రవేశానికి పూర్ణ తిధులైన పంచమి, దశమి, పూర్ణిమా తిథులు, పశ్చిమ సింహద్వార గృహానికి విదియ, సప్తమి, ద్వాదశీ తిథులు మంచివని వాస్తు శాస్త్రం చెబుతోంది. సోమ, బుధ, గురు, శుక్రవారాలు శుభప్రదమని అదే విధంగా ఆది, మంగళ వారాలలో గృహ ప్రవేశం అశుభప్రదం కనుక ఈ వారాలలో గృహప్రవేశం చేయకూడదని వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది.
గృహంపై వీధి పోటు… వాస్తు ప్రభావం
ఇంటికి ఎదురుగా నిలువుగా వుండే వీధి ఇంటి వరకూ వచ్చి ఆగిపోయినా, లేదా అక్కడ నుండి ఏదోవైపుకు తిరిగినా దానిని వీధిపోటుగా గుర్తించాలి. ఇటువంటి వీధిపోటు వల్ల సదరు గృహస్తులకు కొన్ని మంచి ఫలితాలను, కొన్ని చెడు ఫలితాలను కలిగిస్తాయని వాస్తు చెబుతోంది. వాస్తు ప్రకారం వీధి పోటు వల్ల కలిగే ఫలితాలు కింది విధంగా ఉంటాయి.
గృహానికి తూర్పు, ఈశాన్య భాగంలో ఎదురుగా వుండే వీధి వల్ల వీధిపోటు కలుగుతుంది. ఈ రకమైన పోటు వల్ల సదరు గృహంలో నివశించే పురుషులకు సర్వాధికారాలు లభిస్తాయి. వీరు మంచి ఆత్మ విశ్వాసాన్ని కలిగి వుంటారు. ఏ రంగంలో కాలు పెట్టినా పైచేయి సాధిస్తారు.
- నివశించే ఇంటికి ఉత్తర – ఈశాన్య భాగంలో వీధి వున్నప్పుడు కలిగే వీధిపోటు వల్ల ఆ ఇంట్లోని స్త్రీలకు అన్నివిధాలా మేలు కలుగుతుంది. సుఖ సంతోషాలతో పాటు కోర్కెలు తీరి ఆనందంగా వుంటారు. ఇంటి యజమానికి మానసిక ప్రశాంతత, ధన ఆదాయం బాగుగా ఉంటుంది.
- ఇంటికి ఉత్తర – వాయువ్య భాగంలో నిలువుగా వీధి వుండుట వీధి పోటు కలుగుతుంది. ఈ తరహా వీధిపోటు వల్ల ఆ ఇంట్లోని స్త్రీలు తీవ్రమైన దుష్ప్రభావానికి లోనవుతారు. పెళ్లి సంబంధాలు కుదరక పోవడం, కుదిరిన సంబంధాలు కూడా చివరివరకు వచ్చి తప్పిపోవడం, ఇంకా అనేక సమస్యలకు, చికాకులకు కలుగుతాయి.
- ఇంటికి పశ్చిమ – వాయువ్యంలో వీధి వున్నప్పుడు వీధిపోటు కలుగుతుంది. దీని వలన మంచి ఫలితాలు పొందుతారు. ఇంటి యజమాని సమాజంలో గౌరవాన్ని, పలుకుబడిని పొందుతాడు. రాజకీయ నాయకులుగా కూడా రాణిస్తారు. ధనాదాయం బాగుంటుంది.
- ఇంటికి పశ్చిమ – నైరుతి భాగంలో వున్న వీధి వల్ల వీధిపోటు వస్తుంది. దీనివల్ల సదరు ఇంట్లోని వారికి శ్రమ అధికంగా వుంటుంది. ఎంత కష్టపడినా ప్రయోజనం వుండదు. చేతికి అందాల్సిన డబ్బు చేజారి పోతుంది. ఆర్థిక కష్ట, నష్టాలు తప్పవు.
- ఇంటికి దక్షిణ – నైరుతి భాగంలో వీధి వున్నప్పుడు వచ్చే వీధిపోటు వల్ల అనేక అశుభాలు కలుగుతాయి. భార్యాభర్తల మధ్య గొడవలు, స్త్రీలకు అనారోగ్యాలు కలుగుతాయి. ఏ పని మొదలు పెట్టినా ముందుకు సాగక పూర్తి ఇబ్బందులకు గురవుతారు.
- ఇంటికి దక్షిణ – ఆగ్నేయ భాగంలో వున్న వీధి వల్ల కలిగే పోటుతో మంచి ఫలితాలు కలుగుతాయి. కుటుంబం అంతా సుఖసంతోషాలతో, మానసిక ప్రశాంతతతో వుంటారు. బంధువుల ఆదరణ, శుభ కార్య నిర్వహణ వంటివి ఫలిస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.
పైన పేర్కొన్నవాటితోపాటు ఇంటికి తూర్పు – ఆగ్నేయంలో వీధి వుండటం కలిగే పోటు వల్ల అనేక కష్ట నష్టాలు ఎదుర్కొంటారు. ఎన్నిరకాలుగా కష్టపడి సంపాదించినా అంతకు మించిన ఖర్చు ఏదో ఒక రూపేణా వచ్చిపడుతుంది. ఎప్పుడూ మానసిక ఒత్తిడితో శ్రమపడాల్సి వుంటుంది. కుటుంబ కలహాలు మరికొంత వేదనకు గురి చేస్తాయి. ఈ విధంగా గృహానికి కలిగే వీధిపోట్ల వల్ల కొన్ని మంచి ఫలితాలు, మరి కొన్నిసార్లు చెడు ఫలితాలు కలిగే అవకాశముందని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు.
ఇంటి నిర్మాణంలో దిక్కుల ప్రాధాన్యత
ఇంటి నిర్మాణంలో దిక్కులకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతాకాదు. వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణాన్ని చేపట్టినప్పుడు దిక్కులను అనుసరించే ఆ ఇంటి నిర్మాణాన్ని రూపొందించడం జరుగుతుంది. ఎందుకంటే మనకున్న ఎనిమిది దిక్కుల్లో ఒక్కోదాన్ని ఒక్కో దేవత పాలిస్తుందన్నది నమ్మకం. దీన్ని అనుసరించి ఎనిమిది దిక్కుల్లో ఒక్కోదాని ప్రభావం గురించి తెలుసుకుందాం.
- తూర్పు: తూర్పు దిక్కును ఇంద్రుడు పాలిస్తుంటాడు. ఇంద్రుడు సంతానం, ఐశ్వర్యాలను కలిగిస్తాడని ప్రతీతి. అందుకే తూర్పు భాగంలో ఎక్కువ బరువు పెట్టడం మంచిది కాదు. అందుకే ఈ దిక్కులోని ఖాళీ స్థలంలో బావులు, బోర్లు నిర్మించటం వల్ల శుభం చేకూరుతుంది.
- పడమర: పడమర దిక్కునకు అధిష్టాన దేవత వరుణడు. గృహ నిర్మాణ సమయంలో తూర్పు దిక్కుకంటే తక్కువ ఖాళీ స్థలం విడిచిపెట్టి ఈ దిశలో ఎత్తు ఉండేలా చేస్తే సర్వ శుభములు కలుగుతాయి. పడమర భాగంలో కూడా మంచి నీటి బావులు, బోరులు ఏర్పరచవచ్చు. అయితే ఇవి విదిశలకు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.
- ఉత్తరం: ఈ దిక్కుకు అధిష్టాన దేవత కుబేరుడు. దక్షిణ దిక్కుకంటే పల్లంగానూ విశాలంగానూ ఉత్తరం ఉండేలా చూసుకోవాలి. ఈ దిక్కులో బోరులు, బావులు ఏర్పాటు చేసుకోవటం మంచిదే. దీనివల్ల విద్య, ఆదాయం, సంతానం, పలుకుబడి పెరుగే అవకాశం ఉంది.
- దక్షిణం: దక్షిణం దిశకు అధిష్టాన దేవత యముడు. ఉత్తరదిశతో పోల్చినపుడు ఈ దిక్కులో తక్కువ ఖాళీ స్థలం ఉండేటట్లు చూసుకోవడం ఉత్తమం. దీనివల్ల సంతానం, ఆదాయం అభివృద్ధి చెందుతుంది. దీనికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే స్థిరాస్తుల అమ్మకం, అనారోగ్యాలు బారిన పడక తప్పదు.
- ఈశాన్యం: ఈ దిక్కుకు అధిదేవత ఈశ్వరుడు. అన్ని దిక్కుల కన్నా ఈ దిశ విశాలంగాను, పల్లంగానూ ఉండాలి. ఈశ్వరుడు గంగాధరుడు కనుక ఈ దిశలో నీరు లేదా బావి ఉండటం వల్ల అష్టైశ్వర్యములు కలుగుతాయి. అంతేగాక భక్తి, జ్ఞానములు ఉన్నత ఉద్యోగాలు సమకూరతాయని వాస్తు శాస్త్రం తెలియజేస్తోంది.
- ఆగ్నేయం: ఈ దిక్కుకు అధి దేవత అగ్నిదేవుడు. అందువల్ల ఈ దిక్కున వంట ఏర్పాటు చేసుకోవటం శుభం. బావులు, గోతులు ఉండడం, ఇతర దిక్కులకంటే ఎక్కువ పల్లంగా ఉండడం ఎంత మాత్రం మంచిదికాదు. దీనివల్ల వ్యసనాలు, ప్రమాదాలు, అనారోగ్యాలు స్థిరాస్థులు కోల్పోవటంలాంటి అపశకునాలు కలుగుతాయి.
- వాయవ్యం: వాయువ్యానికి అధిదేవత వాయువు. ఈ దిక్కు నైరుతి, ఆగ్నేయ దిశలకంటే పల్లంగానూ, ఈశాన్యంకంటే ఎత్తుగానూ ఉండాలి. అలాగే ఈ దిశలో నూతులు,గోతులు ఉండకూడదు. ఈ దిశ ఈశాన్యం కంటే హెచ్చుగా పెరిగి ఉండరాదు. ఇలా ఉంటే పుత్ర సంతానానికి హాని, అభివృద్ధికి అవరోధం కలిగే అవకాశం ఉంది.
- నైరుతి: ఈ దిక్కుకు అధిదేవత నివృత్తి అనే రాక్షసుడు. అన్ని దిక్కులకన్నా ఈ దిక్కు తక్కువ ఖాళీగా ఉండి ఎక్కువ ఎత్తు కలిగి ఉండాలి. అలాగే ఈ దిక్కులో ఎక్కువగా బరువు ఉడడం శుభం. ఈ దిక్కులో గోతులు, నూతులు ఉన్నట్లైతే ప్రమాదాలు, దీర్ఘ వ్యాధులు, స్థిరాస్తులు కోల్పోవటం జరుగుతుంది.
పైన చెప్పిన విధంగా ఉన్న ఎనిమిది దిక్కుల అధి దేవతలను బట్టి, అందుకు అనుగుణంగా నిర్మాణాలు చేపడితే ఆ గృహం సకల ఆనందాలకు నెలవవుతుందని వాస్తుశాస్త్రం పేర్కొంటోంది.
ఇంటి కప్పు నిర్మాణంలో వాస్తు నియమాలు
గృహం నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రతి ఒక్క అంశాన్ని వాస్తుశాస్త్రం క్షణ్ణంగా వివరించింది. ఇందులో గృహాన్ని నిర్మించే స్థలం నుంచి గృహానికి సంబంధించి ఎలా నిర్మించాలి, ఏ దిశల్లో తలుపులు, కిటికీలు ఏర్పాటు చేయాలిలాంటి ఎన్నో అంశాలను వాస్తుశాస్త్రం వివరించింది.
- వీటితోపాటు గృహానికి పైన వేసే కప్పుకు సంబంధించి కూడా వాస్తుశాస్త్రం వివిధ రకాలైన జాగ్రత్తలను సూచించింది. వాస్తుశాస్త్రం ప్రకారం గృహానికి వేసే కప్పు విషయంలో జాగ్రత్తలు పాటిస్తే ఆ గృహం అన్ని రకాల సంతోషాలతో విలసిల్లుతుంది. గృహానికి వేసే కప్పుకు సంబంధించి వాస్తుశాస్త్రం ప్రకారం క్రింది జాగ్రత్తలు పాటించాలి.
- ఇంటి ముఖద్వారానికి ఎలాంటి గోడలు లేకుండా చూసుకోవడం. అలాగే మన ఇంటికి ఎదురుగా మరో ఇంటి పైకప్పు ఉండటం వంటివి ఉండకుండా చూసుకోవడం మంచిది.అలాగే ఓ ఖాళీ స్థలంలో గృహం నిర్మించినా, నిర్మించక పోయినా తూర్పు గోడను ఆనుకుని తూర్పు భాగంలో ఎలాంటి కట్టడమైనా నిర్మించి, దానిపై కప్పు వేయకూడదు. దీనివల్ల ఆ ఇంటిలో ఉండే పురుష సంతానం వక్ర మార్గంలో నడుచుకుంటారు.
- అలాగే పశ్చిమ గోడను ఆనుకుని ఎలాంటి కట్టడం గోడనైనా నిర్మించుకోవచ్చు. ఈ దిశను వరుణ దేవుని స్థానంగా పేర్కొంటారు. అందువల్ల పాడి పంటలకు మేలు చేకూరుతుంది. ముఖ్యంగా ఈ భాగంలో పశువుల పాకను గానీ, ధాన్యపు గదులను గానీ నిర్మించుకోవడంవల్ల కలిసివస్తుంది. దీనివల్ల మంచి ధనాదాయం సమకూరుతుంది. అయితే ఈ కట్టడంపై వేసే కప్పు తూర్పు వాలుగా ఉండేలా జాగ్రత్తవహించాలి. లేకుంటే స్త్రీలకు అనారోగ్య, ఇతర సమస్యలు కలిగే అవకాశముంది.
- వీటితోపాటు ఉత్తర భాగంలో ఓ కట్టడాన్ని నిర్మించి దానిపై కప్పు వేస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది కుబేర స్థానం కాబట్టి దీనిని కప్పి ఉంచడం వల్ల వచ్చే సిరి సంపదలు కోల్పోతామని వాస్తుశాస్త్రం చెపుతోంది. దీనివల్ల ధనరాబడి తగ్గి అష్టకష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక దక్షిణభాగంలో ఏదో ఓ కట్టడాన్ని నిర్మించి దానిపై మూత వేసి ఉంచడం మంచిది. ఎందుకంటే ఇది యమధర్మరాజు స్థానంగా పేర్కొంటారు.
- దీనివల్ల ఇంటిలో నివశించే వారికి ఆయురారోగ్యాలు కలుగడమే కాకుండా ఆ కుటుంబం సుఖ శాంతులతో వర్థిల్లుతుంది. ఈ కట్టడంపై వేసే కప్పు తప్పనిసరింగా తూర్పు లేదా ఉత్తరం వైపు వాలుగా ఉండే విధంగా చూసుకోవాలి. పైన చెప్పిన విధంగా గృహానికి సంబంధించిన కప్పు విషయంలో జాగ్రత్తలు పాటిస్తే సదరు గృహంలో ఎలాంటి కష్టాలు ఎదురుకాకుండా నిత్యం సంతోషం వెల్లివిరుస్తుంది.
ఇంటి పునాదికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఇంటి పునాది వేసే సమయంలో వాస్తు ప్రకారం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే… ఇంటిలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇల్లు నిర్మించబోయే ముందు స్థలానికి ఈశాన్య భాగంలో పునాదిని త్రవ్వడం మొదలు పెట్టాలి. ఇంటికి పునాదితోనే నిర్మాణం ప్రారంభమవుతుంది… కాబట్టి వాస్తు ప్రకారం పునాది వేయటం మంచిది.
ఈశాన్య భాగంలో పునాది తవ్వకం ప్రారంభిస్తే ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తవతాయి. అనంతరం నైరుతీ దిక్కును చదును చేసి పనులు ప్రారంభించుకోవాలి. వాస్తు ప్రకారం ప్రహరి గోడకు చాలా ప్రాధాన్యం ఉంది. శాస్త్రప్రకారం నిర్మించిన ప్రహరీ గోడ అనేక దోషాలను తొలగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ప్రహరీ గోడ నిర్మాణం పూర్తి కానిదే పూర్తిస్థాయిలో ఫలితాలు అందవు. ఇళ్లు ఎక్కువ కాలం ఉండాలంటే ప్రహరీ గోడలు తప్పనిసరిగా నిర్మించాలని సూచిస్తున్నారు. మనం నిర్మించుకున్న ఇంటి కంటే ఎత్తుగా తూర్పుదిశలో వేరొకరు ఇంటినిర్మాణం చేపడితే ఆ ఇంటికి సంబంధించిన దోషాలు మనం నిర్మించిన ఇంటిపై ప్రభావం చూపుతాయి.
ఇంటిలో వంటగది ఎక్కడ ఉండాలి?
ఇంటిలోనే వంటగది తప్పనిసరిగా ఉండాలని వాస్తురీత్యా నియమం లేదు. వాస్తుశాస్త్రాల ప్రకారం.. అగ్ని స్థానమైన ఆగ్నేయంలో వంటగది ఉండాలి. విశాలమైన ఆగ్నేయ ఆవరణ ఉన్నవాళ్లు ఉపగృహంలో వంటగది ఏర్పాటు చేసుకోవచ్చు.
ఆగ్నేయ దిశలో వంటగదిని నిర్మించుకుంటే ఆ గృహంలో అష్టైశ్వర్యాలు కొలువుంటాయని వాస్తు శాస్త్రజ్ఞులు పేర్కొంటున్నారు. వంటగదిలో గ్యాస్ పొయ్యికోసం తూర్పు గోడకు వేసే ఫ్లాట్‌ఫామ్ కింద మెట్టు పెట్టకూడదు.
దక్షిణ, పశ్చిమ దిశలలో వేసే ఫ్లాట్‌ఫారం కింద మెట్లు పెట్టుకోవచ్చు. ఫ్లాట్ఫాణ్తో పాటు పెట్టే నీళ్లు సింకు పొయ్యికి వీలైనంత దూరంలో గదికి ఈశాన్యంలో పెట్టాలి. వంటగదికి రెండు కిటికీలు పెట్టడం మంచిది.
ఇంటి పునాదికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఇంటి పునాది వేసే సమయంలో వాస్తు ప్రకారం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే… ఇంటిలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇల్లు నిర్మించబోయే ముందు స్థలానికి ఈశాన్య భాగంలో పునాదిని త్రవ్వడం మొదలు పెట్టాలి. ఇంటికి పునాదితోనే నిర్మాణం ప్రారంభమవుతుంది… కాబట్టి వాస్తు ప్రకారం పునాది వేయటం మంచిది.
ఈశాన్య భాగంలో పునాది తవ్వకం ప్రారంభిస్తే ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తవతాయి. అనంతరం నైరుతీ దిక్కును చదును చేసి పనులు ప్రారంభించుకోవాలి. వాస్తు ప్రకారం ప్రహరి గోడకు చాలా ప్రాధాన్యం ఉంది. శాస్త్రప్రకారం నిర్మించిన ప్రహరీ గోడ అనేక దోషాలను తొలగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ప్రహరీ గోడ నిర్మాణం పూర్తి కానిదే పూర్తిస్థాయిలో ఫలితాలు అందవు. ఇళ్లు ఎక్కువ కాలం ఉండాలంటే ప్రహరీ గోడలు తప్పనిసరిగా నిర్మించాలని సూచిస్తున్నారు. మనం నిర్మించుకున్న ఇంటి కంటే ఎత్తుగా తూర్పుదిశలో వేరొకరు ఇంటినిర్మాణం చేపడితే ఆ ఇంటికి సంబంధించిన దోషాలు మనం నిర్మించిన ఇంటిపై ప్రభావం చూపుతాయి.
చిన్న స్థలాల్లో ఇళ్లు కట్టేవారికి జాగ్రత్తలు ఇరుకైన చిన్న స్థలాల్లో ఇల్లు కట్టే వారు పాటించవలిసిన జాగ్రత్తలను భారతీయ వాస్తు శాస్త్రాలు సూచిస్తున్నాయి. విదిక్కులు తిరిగిన స్థలాలో ముఖ్యంగా తూర్పు ఆగ్నేయం, ఉత్తర వాయవ్యాలలో మెట్లు పెట్టాలనుకునే వాస్తు ప్రకారం జాగ్రత్తలు పాటించాలి. పునాదులు మొదలుపెట్టి గోడలు నిర్మించేటప్పుడు ఎన్ని కిటికీలు పెట్టాలి అన్న విషయం దగ్గర్నుంచి కిటికీలు ద్వారాలకు సరిపోయే విధంగా మార్కు చేశారా, అలమరాలు ఎలా అమరుస్తున్నారన్నదాన్ని తప్పకుండా ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి.
మెట్లు మార్కింగ్ చేసేటప్పుడు ఈ విషయాలపై దృష్టి కేంద్రీకరించటం ఎంతైనా అవసరం. అలాగే శ్లాబు వేసే ముందు దాని వాటం ఎలా ఉంది… బాల్కనీలో అది ఎలా ఉందీ అన్న అంశాలను ముందుగా ప్లాన్‌లో వేసుకున్న విధంగా సరిగా ఉన్నాయో లేదో చూసుకోవటం మంచిది. గోడలు నిర్మించి అటకలు కట్టేటప్పుడు, ప్లాస్టరింగ్ చేసేటప్పుడు ప్లాను ప్రకారం జరుగుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. అదే విధంగా ఫ్లోరింగ్ మొదలైనప్పుడు వాటం సరిగా ఉందా లేదా అనేది చూసుకోవాలి.
ఇంట్లో నిర్మించే సెప్టిక్ ట్యాంకులు, నీళ్ల సంపుల మార్కులు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఆ తర్వాత బయట అరుగులు కట్టే వారైతే వాటి మార్కింగ్‌ను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఇల్లు పూర్తవుతున్న సమయంలో ప్లాను ప్రకారం అన్ని సరిపోయాయా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి.
రచన: శ్రీ డబ్బీరు వెంకటేశ్వర రావు