విశ్వమంతా శివ తాండవం
“ ఈ విశ్వం అనంతంగా పుడుతూ, నాశనమవుతూ ఉంటుందని చెప్పిన ఏకైక ప్రాచీన మతం హిందూ మతం మాత్రమే. విశ్వం పుట్టుకకు సంబంధించి వీరి కాలగణన నేటి ఆధునిక కాస్మోలజీ వేస్తున్న లెక్కలకు చాలా దగ్గరగా ఉంది. వారు బ్రహ్మ యొక్క ఒక పగలు, రాత్రి కలిపి 8.64 బిలియన్ సంవత్సరాలని చెప్పారు. ఇది ఆధునిక ఖగోళ శాస్త్ర అంచనాలకు దగ్గరగా ఉంది.” - కార్ల్ సాగన్, ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త.
కార్ల్ సాగన్, ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త |
“The Hindu religion is the only one of the world's great faiths dedicated to the idea that the Cosmos itself undergoes an immense, indeed an infinite, number of deaths and rebirths. It is the only religion in which the time scales correspond to those of modern scientific cosmology.
Carl Sagan
జెనీవాలోని 'సెర్న్' (యూరోపియన్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ పార్టికల్ ఫిజిక్స్) పరిశోధనాలయం వద్ద రెండు మీటర్ల ఎత్తైన నటరాజ |
జూన్ 18, 2004 వ తేదీన జెనీవాలోని 'సెర్న్' (యూరోపియన్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ పార్టికల్ ఫిజిక్స్) పరిశోధనాలయం వద్ద రెండు మీటర్ల ఎత్తైన నటరాజ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ పరిశోధన కేంద్రంతో ఉన్న అనుబంధం దృష్ట్యా భారత ప్రభుత్వం ఈ విగ్రహాన్ని ‘సెర్న్’ కు బహుకరించింది.
ప్రభుత్వం శివ విగ్రహాన్ని బహూకరించడం, శాస్త్రవేత్తలు దానిని తమ ఆవరణలో ప్రతిష్ఠించుకోవడం వెనుక సుస్పష్టమైన తాత్త్వికత, శాస్త్రీయ దృష్టి గమనార్హం. సెర్న్ పరిశోధన కేంద్రంలో పరమాణు కణాలపై పరిశోధన జరుగుతోంది. పరమాణువులోని సూక్ష్మ అంశాలు నిరంతరం జరిపే శక్తి తాండవానికి ప్రతిరూపంగా నటరాజ రూపంలో జరిగే శివతాండవం మన భావనకు అందుతుంది.
దైవ కణం - higgs boson |
1972లో ఫ్రిట్జఫ్ కాప్రా అనే భౌతిక శాస్త్రవేత్త ఒక పత్రికలో వ్రాసిన వ్యాసంలో మొదటిసారిగా ఉపపరమాణు కణాల శక్తి తాండవాలను శివతాండవంతో పోల్చాడు. ఆ తర్వాత తను వ్రాసిన “ద తావో ఆఫ్ ఫిజిక్స్” అనే ప్రఖ్యాత గ్రంథంలో ఈ విషయాన్ని మరింత వివరించాడు. ఈ విషయాలను శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు తన "విజ్ఞాన వీచికలు" అనే గ్రంథంలో పొందుపరిచారు.
నృత్యంలో CERN వద్ద శివుడి నటరాజ విగ్రహం |
సెర్న్ లో నటరాజ విగ్రహం క్రింద ఫలకం మీద ఫ్రిట్జఫ్ కాప్రా మాటలను ఉల్లేఖించారు.
“ వందల సంవత్సరాల క్రితమే భారతీయ కళాకారులు నాట్యం చేస్తున్న శివుని కంచు విగ్రహాలను తయారు చేశారు. మన కాలంలో భౌతిక శాస్త్రవేత్తలు ‘కాస్మిక్ డ్యాన్స్’ ని వర్ణించడానికి అత్యాధునిక సాంకేతికతను వాడారు. ఈ ‘కాస్మిక్ నృత్యం’ అనే రూపకాలంకారం ప్రాచీన పురాణాలను, మతపరమైన కళారూపాలను ఆధునిక భౌతిక శాస్త్రంతో సమన్వయం చేస్తోంది. ఆధునిక భౌతిక శాస్త్రం ప్రకారం జనన మరణాలు జీవులకే కాక, జీవం లేని వాటికి కూడా ఉంటాయి. కాబట్టి, ఆధునిక భౌతిక శాస్త్రవేత్తలకు శివ తాండవమంటే ఉపపరమాణు కణాల తాండవమే.”
ఏతావతా శివతాండవం సర్వ ప్రాణుల, జడ పదార్థాల జనన మరణాలు, సృష్టిలయాలకు సంకేతం. భరత నాట్య కళారూపంలో రంగస్థలం మీద మనం చూసే శివతాండవం దానికి కేవల రసాత్మక ఆవిష్కరణ. దీనిని ఫ్రిట్జఫ్ కాప్రా ఎంతో హృద్యంగా వర్ణించారు.
- 💥 “నటరాజ భంగిమలో డమరుకాన్ని పట్టుకున్న హస్తం సృష్టికి ఆధారమైన శబ్దాన్ని సూచిస్తుంది.”
- 💥 “ఎడమ చేతిలోని అగ్ని వినాశనాన్ని అంటే ప్రళయాన్ని సూచిస్తుంది. ఆ రెండు చేతులూ ఒకే రీతిగా ఉండడం ఈ ప్రపంచంలో సృష్టి వినాశాలు ఎప్పుడూ సమానంగా కొనసాగుతాయని తెలుపుతుంది.”
- 💥 “రెండు బాహువుల మధ్య ఉన్న నిర్వికారమైన నటరాజు ముఖం సృష్టి వినాశనాలు రెండింటినీ సమన్వయించుకున్న, ఆ రెండిటికీ అతీతమైన స్థితిని సూచిస్తుంది.”
- 💥 “నటరాజు కుడి పక్కన ఉన్న రెండో బాహువు అభయ ముద్ర ద్వారా స్థితి, పాలనలను సూచిస్తుంది. ఎడమ ప్రక్కన ఉన్న రెండో బాహువు పైకెత్తిన ఆయన పాదాన్ని చూపుతూ మాయాజాలం నుంచి విముక్తిని సూచిస్తుంది.”
నటరాజు ఒక రాక్షసుడి దేహంపై నృత్యం చేస్తూ ఉంటాడు. ఆ రాక్షసుడు మానవునిలోని అజ్ఞానానికి ప్రతిరూపం. దానిని నశింపజేస్తేనే ముక్తి సాధ్యం.
రుద్ర తాండవం |
- శివుని అర్థ నారీశ్వర తత్వం సృష్టిలోని స్త్రీత్వ, పురుషత్వాలకు సంకేతం.
- శివుడి మూడో కన్ను జ్ఞానానికి సంకేతం.
- చేతిలోని పుర్రె మృత్యువుపై విజయానికి సంకేతం.
దట్టమైన శివుని జటాజూటం ప్రళయకాలంలో అన్ని వైపులా వ్యాపించి తుఫానులు,సునామీల వంటి ఉత్పాతాలను సృష్టిస్తుంది. శివుడు మూడో నేత్రం తెరవడంతో దాని నుంచి వెలువడే అగ్నిశిఖలు విశ్వమంతా దావానలంలా వ్యాపించి, దానిని నాశనం చేస్తాయి.
శివుడి ఈ రెండు తాండవాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. శివుడి ఈ రెండు రకాల నృత్యాలు 'చిదంబరం' అంటే - హృదయమనే ఆకాశంలో - అంటే చైతన్యానికి కేంద్రమైన చిదాకాశంలో జరుగుతాయి.
పరబ్రహ్మ స్వరూపుడైన శివుడు సర్వరూపాల్లోనూ ఉంటాడు కాబట్టి, తాండవం చేసే విశ్వమే శివుడు. ఆధునిక భౌతిక శాస్త్రం చెప్పినట్లు ఈ తాండవం నిత్యమూ జరిగేదే. శివతాండవం బ్రహ్మాండాల సృష్టి లయాలకే కాక, నిత్యమూ కొనసాగే జనన మరణాల వంటి ప్రకృతి క్రియలకు కూడా సంకేతం.
వివిధ రూపాలుగా మనకు కనిపించేదంతా నిజానికి అశాశ్వతం, భ్రాంతి మాత్రమేనని శివుడు సదా మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. బ్రహ్మ రాత్రిని అనుభవించినప్పుడు ప్రకృతి అచేతనంగా ఉంటుంది. శివుడు సంకల్పించేంత వరకు ప్రకృతి నృత్యం చేయజాలదు. ఆయన ఆత్మానందం నుంచి మేలుకొని, తన నృత్యం ద్వారా జడమైన ప్రకృతిని మేల్కొలిపేలా శబ్దం (డమరుక ధ్వనిగా సూచితం) చేస్తాడు. ఇలా తన నృత్యం ద్వారా పదార్థ రూపంలో వివిధ ప్రకృతి క్రియలను కొనసాగిస్తాడు. కాలాంతరంలో ఆయన తన నృత్యం ద్వారానే నామరూపాలనింటినీ నశింపజేసి, ప్రకృతికి విశ్రాంతినిస్తాడు. ఇదంతా కవిత్వంగా మురిపించే ఆధునిక విజ్ఞానం.
బ్రహ్మకు రాత్రి అయి నిద్రలోకి వెళ్ళినపుడు శివుడు రుద్ర తాండవం మొదలుపెడతాడు. అప్పుడు ఈ విశ్వం నాశనమై, కుంచించుకు పోయి, శూన్య స్థితికి చేరుతుంది. బ్రహ్మకు పగలు అయి, మేలుకున్నప్పుడు శివుడు ఆనంద తాండవం మొదలుపెడతాడు. అప్పుడు బ్రహ్మ సృష్టిని ప్రారంభిస్తాడు.
బ్రహ్మ |
సృష్టి అయిన దానిని ధ్వంసం చేయాలని ప్రయత్నిస్తే అందులో నుండి అఖండమైన శక్తి వెలువడుతుంది. ఐన్ స్టీన్ తన E=mc2 సమీకరణం ద్వారా ద్రవ్యరాశి - శక్తుల పరస్పర సంబంధాన్ని తెలియజేశాడు. శివ తాండవంలో కూడా ఈ భావన కనబడుతుంది.
బ్రహ్మం తన లీల కోసం ఈ జగత్తుగా రూపొంది, తిరిగి ఏకత్వాన్ని పొందుతుందని భగవద్గీత చెబుతుంది. (9:7-10)
"దేనినుండి తను ఉద్భవించాడో, దేనిలో తిరిగి లయిస్తాడో, దేనిలో ఇప్పుడు జీవిస్తున్నాడో అట్టిది బ్రహ్మమని తలచి దానిని అతడు ఆరాధించుగాక " అని ఛాందోగ్యోపనిషత్తు (3:14:1) చెబుతుంది.
పరమాణువులలో సూక్ష్మ స్థాయిలో జరిగే మార్పులు కూర్పు, లయ, తాళాలతో ఉండడం వల్ల ఆధునిక శాస్త్రవేత్తలు వాటిని తాండవంతో పోల్చారు. విశ్వమంతా శక్తి తాండవమే. ఇలా అనుక్షణమూ తాండవిస్తూ ఉండే పరమాణువుల సమూహాలే వస్తువులన్నీ. ఆధునిక భౌతిక శాస్త్రం ప్రకారం ఉప పరమాణు కణాలు అనుక్షణమూ ఉత్పన్నమవుతూ, నశిస్తూ ఉంటాయి. అంటే అనుక్షణమూ ఇవి సృష్టి లయాలను తాండవం చేస్తూ ఉంటాయి.
కెన్నెత్ ఫోర్డ్ తన రచన “ద వరల్డ్ ఆఫ్ ఎలిమెంటరీ పార్టికల్స్” లో ఇలా అంటారు : “ప్రతి ప్రోటాన్ అప్పుడప్పుడు ఇలాంటి సృష్టిలయాలనే తాండవం చేస్తుంది.”
ఫ్రిట్జఫ్ కాప్రా ఇలా లోతుగా మరో సంగతి చెబుతారు: “పరమాణువులోని ప్రతి కణము శక్తి నృత్యం చేయడమే కాదు. దానికదే ఒక శక్తి నృత్యం కూడా. అది అంతు లేకుండా సాగే సృష్టి, నాశనాల క్రమాన్ని సూచిస్తుంది. ఆధునిక భౌతిక శాస్త్రవేత్తలకు శివతాండవమంటే ఉపపరమాణు కణాల తాండవమే.”
పరమాణువులోని ఈ తాడనాల వల్ల శబ్ద తరంగాలు పుడతాయి. ఆ నృత్య క్రమం మారితే అక్కడ వెలువడే శబ్దం కూడా మారుతుంది. ఈ శబ్డమే అనుక్షణమూ స్థూలమూ, సూక్ష్మమూ అయిన రూపాలను ఉత్పన్నం చేస్తుంది. క్షేత్ర సిద్ధాంతం ప్రకారం ప్రతి కణమూ దాని సంగీతమది పాడుతూ ఉంటుంది.
శబ్దమే (ఓంకారం) బ్రహ్మమని, అదే సృష్టి, స్థితి, లయాలకు కారణమని హిందూ మత గ్రంథాలు చెప్పిన దానికి నేటి భౌతిక శాస్త్రం చెబుతున్న అంశాలు చాలా దగ్గరలో ఉన్నాయి.
అమెరికాకి చెందిన ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త కార్ల్ సాగన్ తన రచన “కాస్మోస్” లో నటరాజు తాండవం ఈ విశ్వం యొక్క అనంతమైన సృష్టి, వినాశనాలను సూచిస్తోందని అభిప్రాయపడ్డారు.
తన ప్రతిష్ఠాత్మకమైన అమెరికన్ టీవీ సీరియల్ “కాస్మోస్” ను చిత్రీకరించడానికి ఆయన తమిళనాడులోని చోళుల కాలం నాటి ఆలయాలను ఎంచుకున్నారు. చోళుల కాలంలో భారతదేశంలో క్రీ.శ. 880-1270 మధ్య కాలంలో నటరాజ కాంస్య విగ్రహాలు తయారయ్యాయి. తన టీవీ షో లో అక్కడి నటరాజ కాంస్య విగ్రహాన్ని చూపుతూ అది ఈ విశ్వం యొక్క సృష్టి వినాశనాలకు సంకేతంగా ఉందని వివరించాడు. కాప్రా చెప్పినట్లు “శివతాండవమంటే ఈ విశ్వ తాండవమే. అది అనంతమైన రీతుల్లో సాగే అలుపెరుగని శక్తి ప్రవాహం.”
రచన, పరిశోధన: మణి కుమార్