పరమ శివుడు పులి చర్మం ధరించడము లోని అంతరార్థం
శివుడు త్రిమూర్తులలో చివరివాడైన లయకారుడు. సంస్కృతంలో శివ అనగా సౌమ్యం, శుభం అని అర్థాలు వస్తాయి. శివుడు హిందూ మతంలోని ప్రధాన దేవుళ్లలో ఒకరు. సింధూ నాగరికత కాలానికే శివుడు లింగం రూపంలోను, పశుపతి గాను పూజలందుకున్నాడు. శివాలయాలే దేశంలో నేటికీ ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. శివుడిని రుద్రుడిగా వేదాలలో పేర్కొన్నారు. శివుడు జనన మరణాలకు అతీతుడు. శివుని ఆకృతిలో ఒక్కొక్కదానికి ఒక్కొక్క అర్థం ఉంది. శివుడు ఎల్లప్పుడూ పులి చర్మాన్నే ధరిస్తాడు. శివుడు పులి చర్మాన్ని ధరించడానికి శివ పురాణంలో ఒక కథ చెప్పబడింది.ఒకానొక సమయంలో శివుడు అరణ్యంలో వెళుతుండగా శివుని తేజస్సును చూసి మహర్షులు, రుషులు, పండితుల భార్యలు ఆశ్చర్యపోతారు.
ముని కాంతలలో శివున్ని చూడాలన్న కాంక్ష పెరగటంతో వారు ఇంటి పనులు కూడా సరిగ్గా చేసేవారు కాదు. తన భార్యలలో ఈ మార్పు ఎందుకు వచ్చిందో అర్థమైన మునులు శివుడిని ఎలాగైనా హతమార్చాలని అనుకుంటారు. మునులు ప్రతిరోజు స్వామి ప్రయాణించే దారిలో ఒక గుంతను తవ్వి మంత్ర శక్తితో పులిని తయారు చేసి శివుడు ఆ గుంత సమీపంలోకి రాగానే శివునిపై పులిని ఉసిగొల్పుతారు. శివుడు సునాయసంగా పులిని సంహరించి మునుల చర్య వెనుక ఉద్దేశాన్ని అర్థం చేసుకుని పులి చర్మాన్ని కప్పుకున్నాడు. అప్పటినుండి శివుడు పులి చర్మాన్ని ధరిస్తూ వస్తున్నాడు. శివుడు ధరించిన పులి చర్మం అహంకారాన్ని త్యజించమని, కోరికలకు దూరంగా ఉండమని ఉండమని సూచిస్తుంది...
|| ఓం నమః శివాయ ||