శనిత్రయోదశి
శనిత్రయోదశి అంటే శనివారం + త్రయోదశి కలిసిన రోజు. దీనిని శనికి పవిత్రమైనదిగా భావిస్తారు.ఈ రోజు శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారు. నల్లటి వస్త్రాలు దానం చెస్తారు. కోర్టు కేసులు, శత్రువులు, రోగాలు, రుణాలు నుంచి విముక్తుల్ని చేయాల్సిందిగా మొక్కుకుని, కోర్కెలు తీరిన తరువాత మొక్కులు చెల్లిస్తుంటారు.శనీశ్వరుడి ఆలయం నుంచి బయటికి వెడుతూ వెనక్కు తిరిగి చూడకూడదని , వెనక్కు తిరిగి చూస్తే శని దోషం మళ్ళీ చుట్టుకుంటుందని ఇక్కడి పూజారులు భక్తుల్ని పదే పదే హెచ్చరిస్తూంటారు.
త్రయోదశి వ్రతం:
త్రయోదశి వ్రతం శనివారంతో కుడిన ఒక శుక్ల త్రయోదశితో ప్రారంభించి, ఏడాది పొడుగునా శనివారాలు మాత్రమే పడే త్రయోదశి గాని లేదా 24 శుక్ల పక్ష త్రయోదశులు గాని ఎన్నుకొని నియమబద్ధంగా చేయవచ్చు. ప్రదోషకాలంలో శివపూజ, నక్తభోజనం చేయాలి. సూర్యాస్తమయం తర్వాత ఆరు ఘడియల కాలం వరకు త్రయోదశి ఉండాలి. శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమాన్, కాలభైరవుడు. శనికి ఉన్న ఇతర పేర్లు కృషాణు, శౌరి, బభ్రు, రోద్రాంతక, సూర్యపుత్ర, కాశ్యపన గోత్రం. నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కళంకంలేని కరుణామూర్తి శనీశ్వరుడని పండితులు అంటున్నారు. ఏ త్రయోదశి అయితే శనివారము తో కూడి ఉంటుందో ఆ రోజు శని గ్రహాన్ని ' శనీశ్వరుడు 'గా సంబోధించి పరమశివుడు వరం ఇచ్చాడు . శని త్రయోదశి అంటే శనికి చాలా ఇష్టం. మూడు దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న యోగాన్ని అందించేవాడు శనీశ్వరుడు.
శని త్రయోదశి ఎలా ఏర్పడింది?
సృష్టి స్థితి లయ కారకుడైన ఈశ్వరుడికి కూడా ఆ శని బాధలు తప్పలేదు. సామాన్య మానవులు శని ప్రభావం వల్ల ఎంత ఇక్కట్లు పడుతున్నారో కదా అని ఆలోచించి ఈశ్వరుడు శనితో ఇలా అన్నాడు... " నేను ఇక్కడ తపస్సు చేసినందువల్ల నీవు నా పేరు కలుపుకొని శనేశ్వరుడని పేరు పొందగలవు. ఈ రోజు శని త్రయోదశి . నీ వల్ల ఇబ్బందులు పడుతున్నవారు ఈ రోజు నీ కిష్టమైన నువ్వుల నూనె, నల్ల నువ్వులు, నీలపు శంఖు పుష్పాలు, నల్లని వస్త్రంతో నిన్ను ఎవరైతే అర్పించి ఆరాధిస్తారో .. వారికి నీ వల్ల ఏర్పడిన అనారోగ్యం మృత్యుభయం పోయి ఆరోగ్యం చేకూరుతుంది అని వరం ఇస్తున్నా’’ అని తెలిపాడు. ఆ తర్వాత త్రేతాయుగంలో రాముడు, ద్వాపర యుగంలో కృష్ణుడు, పాండవులు, మహామునులు అందరూ కూడా ఈశ్వరునికి అర్చించి తమ దోషాలు పోగొట్టుకున్నారు. శనివారం త్రయోదశి తిథి వచ్చిన రోజున శనికి నువ్వులనూనెతో అభిషేకం చేసినా ఆస్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానం చేసినా శని ప్రసన్నుడవుతాడనీ, ఏలినాటి శని, అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుందనీ భక్తుల ప్రగాఢ విశ్వాసం.
శనిత్రయోదశి రోజు ఏంచేస్తే బాగుంటుంది?
- 1. ఉదయానే తలస్నానం చేయాలి. ఆరోగ్యం సహకరించేవారు ఆరోజు పగలు ఉపవాసం ఉండి సాయంత్రం 8గంటల తరువాత భోజనం చేయాలి.
- 2. ఆ రోజు మద్యమాంసాలు ముట్టరాదు.
- 3. వీలైన వారు శివార్చన తామే స్వయంగా చేస్తే మంచిది.
- 4. శనిగ్రహదోషాల వల్ల బాధపడేవారు (నీలాంజన సమభాసం,రవిపుత్రం యమాగ్రజం,ఛాయా మార్తాండ సంభూతం,తం నమామి శనైశ్చరం) అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లుపఠిస్తే మంచిది.
- 5. వీలైనంతసేపు ఏపని చేస్తున్నా "ఓం నమ: శివాయ" అనే శివపంచాక్షరీ మంత్రాన్ని జపించాలి.
- 6. ఆరోజు (కుంటివాళ్ళు,వికలాంగులకు) ఆకలి గొన్న జీవులకు భోజనం పెడితే మంచిది.
- 7. ఎవరివద్ద నుంచైనా ఇనుము,ఉప్పు,నువ్వులు,నువ్వులనూనె చేతితో తీసుకోకూడదు.
- 8. ఉదయం సూర్యోదయం కాగనే శరీరానికి నువ్వుల నూనె రాసుకుని గంట తర్వాత స్నానం చేయాలి.
రచన: సింహాద్రి అప్పన్న