సనకసనందనాదులు
సృష్టికర్త అయిన బ్రహ్మ సృష్టిని ప్రారంభించగా, తొలుత కృష్ణ వర్ణములో అవిద్య వెలువడింది. తమస్సు, మోహం, అంధతామిస్రం చిత్త విభ్రమం మొదలైన దుఃఖ భూయిష్ఠములైన పదార్థాలకు ఆద్యరూపమైన అవిద్యను చూసి బ్రహ్మ దుఃఖితుడైనాడు. పిమ్మట స్థిరచిత్తుడై, భగవద్గ్ానామృత పవిత్ర మనస్సుతో తిరిగి సంకల్పించాడు అప్పుడు పరమపవిత్రులు, సత్త్వగరిష్ఠులు, ధీరజనోత్తములైన 1. సనక, 2. సనందన, 3. సనత్కుమార, 4. సనత్సుజాతులను నలుగురు మహామునులు ఆయన మానసం నుండి జన్మించారు. అందువలననే వారు బ్రహ్మమానస పుత్రులైనారు.అమృతత్త్వపు ఆలోచనలను పుణికిపుచ్చుకుని పుట్టిన ఈ నలుగురు శుద్ద మనస్కులై, నిరంతర దైవచింతనమే ఎరుకగా ఉండేవారు. వారి మనస్సులు నిర్మలంగా ఉండుటచే భ్రాంతి కారకాలు ఏవీ వారి దరిదాపులకు రాలేకపోయాయి, వారు ద్వంద్వాతీతులు వారిని ఉద్దేశించి, బ్రహ్మ సృష్టికార్యమునందు తోడ్పడమని అడుగగా, వారు తిరస్కరిస్తూ, “అపురూప బ్రహ్మమయ భావంతో నీవు మమ్ములను సృష్టించావు. అందుచేత మాకు ధ్యానమునందు తప్ప అన్యవిషయములపై ధ్యాసమళ్ళదు. భగవద్భక్తినే మేము రూపముగా దాల్చి ఉన్నాము. కనుక హరిధ్యానైక తత్పరులుగానే ఉండగలం.
మేము జనలోకములో కామరూపులమై ఉంటూ అవసరమనిపించినపుడు సహాయము చేయగలం. అని తెలిపి అక్కడ నుండి వెళ్ళిపోయారు. నివృత్తి మార్గానికి ఈ నలుగురిని మూలపురుషులని చెప్పవచ్చును. వీరు చూడటానికి అయిదేళ్ళ బాలురవలె కనిపిస్తారు.
యథేచ్ఛా సంచారులైన వీరు నిరంతరం శాంతమనస్కులై అన్నింటియందు నియంత్రణను కలిగి ఉండి, సర్వజీవ సమభావముతో ఉంటారు. హరి నామస్మరణం వారి శ్వాసయందు మిళితం అయిపోగా అత్యున్నత జ్ఞాన భాండాగారాన్ని కలిగి ఉన్నందున వీరు నిరహంకారులై నిలిచారు.
అయితే సృష్టి నిర్మాణమందు వీరు పలికిన ప్రతికూల వాక్యాలను విన్న బ్రహ్మకు క్రోధం కలిగింది. దానిని అతడు బుద్ధిచే నిగ్రహించుకున్నా, భ్రూమధ్యము నుండి ఆ క్రోధం నీలలోహితునిగా ఉదయించుచు ఘోరరోదనం చేసాడు. అతడే రుద్రుడు. బ్రహ్మ ఆనతిపై అతడు చేసిన సృష్టే, రుద్రగణాలుగా ప్రసిద్ధది చెందినవారు.
సనకసనందనాదులు నలుగురు వైకుంఠానికి శ్రీమన్నారాయణ సందర్శనానికి వెళ్ళగా, ద్వార పాలకులైన జయ వారిని లోపలకు పోనివ్వక అడ్డగించారు. |
ఆ శ్రీహరి వారిని ఊరడించి, తన సంకల్పాన్ని వారి వాక్కు ద్వారా తీర్చుకున్నానని అది కూడా లోకహితానికేనని తెలిపాడు. తదనుగుణంగా జయవిజయులు, హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగానూ, రావణ కుంభకర్ణులగానూ, శిశుపాల, దంతవక్తులుగా జన్మించారు.
తరువాత ఆ నారాయణుని చేతిలోనే హతమై, తిరిగి వారి స్వస్థానాన్ని చేరగలిగారు. ఇందుకై నారాయణుడు భూమియందు అవతరించవలసి వచ్చింది. మహాత్ముల కోపమునందు కూడా లోకహితం దాగి ఉంటుంది అనేది దీనివలన స్పష్టమవుతుంది.
పరమభాగవతోత్తముడు జ్ఞానసంపన్నుడైన పృధు చక్రవర్తి వద్దకు వీరు యోగీశ్వరులారా! నా పూర్వజన్మ సుకృతంచే మీ దర్శనభాగ్యం కలిగింది. బాగోగులకు, సుఖదుఃఖాలకు మీరు అతీతులు కనుక మిమ్ము కుశలము అడగలేదని. నా యందు దయ ఉంచి దేని వలన ఈ సంసారమున మోక్షము సిద్దించునో దానిని తెలుపమని' ప్రార్థించాడు.
దానికి సమాధానంగా, “శ్రద్ధ, భగవంతుని గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస, భక్తిమార్గం, మోక్షసాధనాలని తెలియజేశారు. అహంకారం అజ్ఞానానికి మూలమని, అది అణిగితే కాని ఆత్మచైతన్యం వెల్లడి కాదు, సుఖదుఃఖమిళితమైన ఈ విశ్వం స్వప్నం వంటిదని పరబ్రహ్మతత్త్వాన్ని తెలుసుకోవడమే మోక్షమని” ఉపదేశించారు. ఈ బోధ మన ఆధ్యాత్మిక తత్త్వానికి పట్టుగొమ్మ వంటిది.
ఒకనాడు రుద్రుడు సనత్కుమారుని దర్శించి, 'ధ్యానమున దర్శనీయమైనది ఏది? తత్త్వములెన్ని? సాంఖ్యమనగా ఏమిటి? ఈ విషయాలు తెలుపమని' అడుగగా, దానికి సంతోషించి ఇట్లు చెప్పాడు, "తత్వ్వాలు ఇరవై నాలుగని కొందరు, ఇరవై అయిదని" కొందరు అంటారు. నేను ఇరవై అయిదని అంటాను.
ఎలాగంటే:-
- ⭄ పంచభూతాలు అయిదు,
- ⭄ వాటి గుణాలు పది,
- ⭄ ఇంద్రియాలు అయిదు,
- ⭄ మనస్సు ఈ ఇరవై నాలుగు తత్త్వాలు కాక,
- ⭄ బుద్ధి,
- ⭄ అహంకారము,
- ⭄ ప్రకృతి దానిని మించిన తత్వ్వం ఇంకోటి ఉంది,
- ⭄ అది ఈ దేహమందలి పురుషుని అమృతార్థతత్త్వమేనని, అది తలమానికమని” తెలిపాడు.
అంతేకాక వీరు, మార్కండేయ మహర్షికి పితృదేవతా ప్రభావం పితృదేవతా పూజావిశేషాలను సోదాహరణముగా వివరించారు.
సర్వలోక సంచారి అయిన నారదుడు, సనత్కుమారుని దర్శించి జ్ఞానబోధ చేయమంటూ, 'తాను వేదములు, శాస్త్రములు, నృత్యగీతాది, విద్యలు మొదలైనవాటిని అన్నింటిని తెలుసుకున్నా ఆత్మవిద్య నేర్వలేదని అన్నింటిలోనూ ఏది గొప్పది' అని అడిగాడు.
"బ్రహ్మజ్ఞానము లేనిది ఎన్ని విద్యలైనా వ్యర్థములే అని, ఆత్మజ్ఞానం అన్ని జ్ఞానాలకు పరమావధి” అని చెబుతూ నారదునికి భూమావిద్యను ఉపదేశించారు.
ఇది అద్వైతమున విశిష్టముగా చెప్పబడుచూ, ఛాందోగ్యోపనిషత్తు యందు ప్రస్తావించబడింది.
నైమిశారణ్యమున, వ్యాస మహర్షి తన శిష్యులచే వేదాధ్యయనం చేయిస్తున్న తరుణంలో సనత్కుమారుడు అక్కడకు వెళ్ళాడు, వారు భక్తి ప్రపత్తులతో అర్థపాద్యాదులను అర్పించి రుద్రమహాత్మ్యమును తెలుపమని సనత్కుమారుని కోరారు. వారికి శివమహత్త్వం సమస్తం ప్రసిద్ధమైనది. ఇందు బ్రహ్మ విష్ణూత్పత్తి, హరివిరించి సంవాదం సప్తదీప, సప్తవర్ష చరిత్ర, శివలింగ పూజ, మహాదేవ సంకీర్తనం జ్ఞాన ప్రశంస, మోక్ష విచారం, వస్తు విచారం వంటివి అనేకం తెలుపబడినాయి.
కౌరవరాజైన ధృతరాష్ట్రుడు, విదురుని నుండి విదురనీతిని విన్న తెలుపమన్నాడు.
శూద్రుడనగుటచే, అంతకు మించింది చెప్పలేనని, బ్రహ్మర్షి అయిన సనత్సుజాతుని తలచాడు. పరిశుద్ధ హృదయుడైన విదురుని తలంపు తెలిసినవాడై, సనత్సుజాతుడు అక్కడకు వచ్చి, ధృతరాష్ట్రునకు మృత్యుతత్త్వమును తెలుపసాగెను. 'జీవికి మృత్యువు లేనేలేదు మోహభయాలే మృత్యురూపాలని తెలుసుకున్నవానికి చావు లేదు అంతరాత్మయందు పురుషుడు అంగుష్ఠ ప్రమాణమున ఉంటాడు.
జ్ఞానం, సత్యం, దానం, ధైర్యం, శమం, దమం, అనసూయ, తితీక్ష మొదలైన వాటిని విడువకుండా ఉంటే మోక్షం కరతలామలకమై నిలస్తుందని' తెలియజేశాడు.
అంతేకాక, 'నేను అన్నది ఆత్మ, సర్వమూ ఆత్మే, ఉన్నదీ లేనిదీ ఆత్మే. ఆత్మ ఒక్కటే సత్యం. ఆత్మ నుండే ఆత్మ పుట్టింది, ఆత్మకు ఆత్మయే ఉనికిపట్టు. ఆత్మయే నేను, నాకు చావు పుట్టుకలు లేవు. నేను నిత్యనిరుపాధి నిరవధికానంద స్వరూపుడను" అని వివరించాడు.ఇది సనత్సుజాతీయ సంవాదంగా మహాభారతంనందు సనత్సుజాత పర్వమందు కలదు. ఈ విధంగా సనకాదులు యథేచ్చా సంచారులై అన్ని లోకములయందు తిరుగడుచు, అసంగులై ఉంటూ, జిజ్ఞాసువులకు ఆత్మబోధనలు చేస్తూ, మోక్షమార్గాదర్శకులుగా మనకు దర్శనమిస్తారు.
సంకలనం, రచన: అపర్ణా శ్రీనివాస్
ముద్రణ: రామకృష్ణ మఠం