"వ్యాధి వచ్చాక చికిత్స చేసేకన్నా, నివారణే మేలు.... ఆయుర్వేదంతో"
"Prevention is better than cure" ఇది ప్రపంచమంతటా తెలిసిన నానుడి. అయితే ఇది ఆయుర్వేదం వ్రాసినటువంటి మన పూర్వీకులైన ఋషులకు ఇంకా ముందే తెలిసినటువంటి నిజం! ప్రపంచంలోని అన్ని వైద్యశాస్త్రాలు వ్యాధి నిర్ధారణ, వాటి చికిత్స గురించి మాత్రమే చెబుతాయి. కానీ ఒక్క ఆయుర్వేద వైద్యశాస్త్రం మాత్రం వ్యాధి నిర్ధారణ- చికిత్స గురించి మాత్రమే కాకుండా అరోగ్యవంతమైన జీవనవిధానాలను, వ్యాధులు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఏఏ మూలికలను ఆహారం ద్వారా తీసుకుంటే వ్యాధులు రావు అనే పద్దతిని వివరంగా చెబుతుంది. ఈ విధానం మన పూర్వీకులైన ఋషులు మనకు ప్రసాదించిన గొప్ప వరం! కరోనా వైరస్ ను తట్టుకునే శక్తి భారతీయులకు ఉందని, ఒక్క వృద్దుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలని శాస్త్రవేత్త గగన్ దీప్ కాంగ్ అంటున్నారు. ఈవిడ నార్వేలోని అంటువ్యాధుల సన్నధత కార్యక్రమం (CEPI) ఉపాధ్యాక్షురాలు. కారణం మనం తినేటువంటి ఆహారపు అలవాట్లే అనుకోవచ్చును.
ఇప్పుడు కరోనా (కోవిడ్ 19) వైరస్ వలన ప్రపంచమంతటా భయభ్రాంతులకు గురవుతున్నారు. జలుబు, జ్వరాలు వంటి వ్యాధుల నుండి హెచ్ ఐవి, కరోనా వంటి ప్రమాధకరమైన చాలా వ్యాధులు వైరస్లు వలన వస్తాయని మనలో చాలామందికి తెలుసు. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వారి నివేదిక చాలామందికి తెలియని మరో ప్రమాదాన్ని మనకు తెలియచేస్తుంది. ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం "ప్రతీ పదిమంది భారతీయుల్లో ఒకరికి కేన్సర్ వస్తుందని, కేన్సర్ వచ్చిన ప్రతి 15 మందిలో ఒకరు మరణిస్తున్నారని" తెలియచేస్తుంది. "గత రెండు దశాబ్దాలలో భారతీయులలో కేన్సర్ 7% పెరిగిందని" ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక తెలుపుతుంది. ప్రఖ్యాత కేన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు మాట్లాడుతూ.. "భారతదేశంలో రోజుకు 1300 మంది కేన్సర్ తో ప్రాణాలు కోల్పోతున్నారని, ఏటా సుమారు 12 లక్షల మందిని కేన్సర్ పొట్టన బెట్టుకుంటుందని, పరిస్థితులు ఇలాగే కొనసాగితే భారత్ లో కేన్సర్ సునామీ తప్పదని" హెచ్చరించారు.
అయితే చాలా ప్రమాదకరమైన వ్యాధులను ఎదుర్కునే ఔషదాలు, మూలికలు మన ఆయుర్వేదంలో ఉన్నాయి. అంతేకాకుండా ఇటువంటి ప్రమాదకరమైన వ్యాధులు రాకుండా ముందుగానే జాగ్రత్తపడే విధానాలను మన పూర్వీకులు అయినటువంటి ఋషులు ఆయుర్వేద ఔషధాల ద్వారా మనకు అందచేయడమే కాకుండా, మనం నిత్యం తినేటువంటి ఆహారపదార్ధాలలో కూడా అటువంటి ఔషదాలు చేరేలా చూసారు.
ముందుగా మనం నిత్యం తినే ఆహారంలో అటువంటి ఔషద విలువలు ఉన్నవి ఏమి ఉన్నాయో ఒకసారి పరిశీలన చేద్దాం!
- 🟔 వాటిలో ముఖ్యమైనది "పసుపు". ఇది యాంటిబయాటిక్ గా, యాంటిసెప్టిక్ గా పనిచేస్తుందని చాలామందికి తెలుసు. కానీ ఈ పసుపు వైరస్ వలన వచ్చే చిన్న జలుబు నుండి అతిపెద్ద కేన్సర్ వ్యాధి వరకూ అద్భుతంగా పనిచేస్తుందని పరిశోధకులు అంటున్నారు. పసుపుకు మరో పేరు "క్రిమిఘ్నీ" అనగా క్రిములను చంపునది అని అర్థం. అయితే పసుపును బయటకొనడం కంటే, మనం స్వంతంగా మరాడించడమే మంచిది. నకిలీ పసుపు వాడడం వలన అసలు వ్యాధి తగ్గకపోగా, కొత్త వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉంది.
- 🟔 అలాగే మరొకటి "మిరియాలు". ఈ పసుపు, మిరియాలు మన శరీరంలో ఉండే విషపదార్ధాలు (Toxins) ను తొలగిస్తాయి. పసుపు ఒక చిటికెడు, మిరియాలు ఒక చిటికెడు కలిపి నీటిలో కానీ, పాలలో కానీ వేసి మరిగించి, వడకట్టి ప్రతీరోజూ రెండు పూటలు తాగితే అద్భుతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా ఇవి జ్వరము, దగ్గు, జలుబుకు పనిచేస్తాయి. ఇప్పటికి చాలా ఇళ్ళలో దీనిని ఉపయోగిస్తారు. ఇవి వాడినప్పుడు కోందరికి వేడిచేస్తుంది. అటువంటప్పుడు మజ్జిగ ఎక్కువగా తాగాలి.
- 🟔 మన పూర్వీకులైన ఋషులు మనకు అందించిన మరో అద్భుతం.. "నిశామలకీ చూర్ణం". నిశ అంటే పసుపు. ఆమలకి అంటే పెద్ద ఉసిరికాయ. ఈ పెద్ద ఉసిరికాయల లోపల గింజలు తీసేసి, దాని బెరడు చూర్ణాన్ని, దానికి సమంగా పసుపును కలిపితే అదే నిశామలకీ చూర్ణం. ఇది ఆయుర్వేద వైద్యంలో డయాబెటిస్ (మధుమేహం లేదా షుగరు) వ్యాధికి ఇచ్చే మంచి ఔషధం. దీనిని మధుమేహం వ్యాధిలోనే కాకుండా, అన్ని దీర్ఘకాలిక వ్యాధులలోనూ ఒక చెంచా నిశామలకీ చూర్ణాన్ని పాలలో గానీ, మజ్జిగలోగానీ కలిపి రోజూ రెండుసార్లు ఆహారం తినే అరగంట ముందు తాగాలి. నిశామలకి చూర్ణాన్ని మనం స్వయంగా తయారుచేసుకోవచ్చును, లేదా చాలా కంపెనీలు తయారుచేస్తున్నాయి. వేడి శరీరం ఉన్నవారు ఈ నిశామలకీ చూర్ణాన్ని అరచెంచా మోతాదుతో మొదలుపెట్టి, క్రమేణా చెంచామోతాదు వరకూ పెంచాలి. వీరు మజ్జిగ ఎక్కువగా వాడాలి.
- 🟔 మరొక అద్భుతమైన ఔషదం... "వేసవారం". ఇది ఎలా తయారుచేయాలంటే .... 5 గ్రాముల ఇంగువ, 10 గ్రాముల అల్లం, 20 గ్రాముల మిరియాల పొడి, 40 గ్రాముల జీలకర్ర, 80 గ్రాముల పసుపు,160 గ్రాముల ధనియాలపొడి కలపాలి. ఇంగువ ఇష్టం లేనివారు దానిని మినహాయించి తయారుచేసుకోవచ్చును. దీనిని అన్ని వంటకాల్లోనూ మషాల వలే కలుపుకోవచ్చు. లేకపోతే రసం, సాంబార్ వంటి వాటిల్లో కూడా కలుపుకోవచ్చును. లేకపోతే ఈ వేసవారంను మజ్జిగలో కలిపి కూడా తాగవచ్చును. దీనిని మనం ప్రతీరోజూ ఏదోఒక విధంగా ఉపయోగించినట్లయితే ఈ కరోనా వంటి వైరస్లు, కేన్సర్, గుండె జబ్బులు వంటివి మనకు దూరంగా ఉంటాయి.
- 🟔 ప్రతిరోజు ఈ వేసవారంను ఉపయోగించినట్లయితే అనేక వ్యాధులు మన దరిదాపుల్లోనికి కూడా రావు. ఈ పసుపులో ఉండేటటువంటి ప్రధాన రసాయనం "కర్కుమిన్". దీనివలన కేన్సర్, గుండె జబ్బులు, అల్జీమర్స్ అనే మతిమరుపు వ్యాధి, అనేక రకాల చర్మవ్యాధులు, కీళ్ళవాపులు- నొప్పులు తగ్గించడంలోనూ, కొన్ని లివర్ వ్యాధులలోనూ, కడుపులో మంట తగ్గడానికి, మానసిక వత్తిడి తగ్గడానికి, డయాబెటిస్, ఉబ్బసం వంటి ఎన్నో వ్యాధులను ఈ పసుపును ఉపయోగించి తగ్గించుకోవచ్చును అని పరిశోధకులు చెబుతున్నారు.
- 🟔 మరొకటి.... త్రిఫలారసాయనము
- "మధు కేన తుగాక్షర్య పిప్పల్ల్యా క్షౌద్రసర్పిషా
- త్రిఫలా సితయా చాపి యుక్తా సిద్ధం రసాయనమ్"
- ఉసిరి, కరక్కాయ, తానికాయ ఈ మూడింటి చూర్ణాన్ని త్రిఫలచూర్ణం అంటారు. ఒక చెంచా త్రిఫలచూర్ణానికి పావుచెంచా అతిమదురము లేక వెదురుప్పు లేక పిప్పళ్ళు (మూడింటిలో ఏదో ఒకటి) కలిపి తేనే లేక దేశవాళి ఆవు నెయ్యి అనుపానముగా చేర్చి తీసుకోవాలి. దీనిని త్రిఫలారసాయనమను సిద్దయోగము అంటారు. ఇది చరకసంహితలోని చికిత్సాస్ధానము నందు చెప్పిన యోగము. దీనిని ఒక సంవత్సరం పాటు సేవించుటవలన జుట్టు తెల్లబడడం, చర్మం ముడతలు పడడం వంటి వృద్ధాప్యం వల్ల కలిగే వ్యాధులు రాకుండా నూరు సంవత్సరాలు సుఖంగా జీవిస్తారు. ముఖ్యంగా కంటిచూపు తగ్గిన వారికి ఇది దివ్య ఔషధం. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. రోగాలు అన్నిటిని తగ్గిస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచి వ్యాధులబారిన పడకుండా రక్షిస్తుంది. ఈ త్రిఫలారసాయనము వాత, పిత్త, కఫాలకు సంబందించినటువంటి అన్ని వ్యాధులను తగ్గిస్తుంది.
- 🟔 మరొకటి....గోవుమూత్రం : గోమూత్రం అంటే అది దేశవాళీ ఆవు యొక్క మూత్రం మాత్రమే! జర్సీ ఆవు మూత్రం కాదు! అయితే గోమూత్రం అందరికీ లభించే అవకాశం లేదు. ఇప్పుడు కొన్ని కంపెనీలు గోమూత్రం నుండి "అరఖు" తయారుచేసి అమ్ముతున్నారు. ఆ అరఖును కొని, ఆ కంపెనీ వారు చెప్పిన విధంగా ఉపయోగించవచ్చును. ఇక గోమూత్రం ఉపయోగాలు తెలుసుకుందాం... గోవు మూత్రంలో నీటితోపాటు 18 సూక్ష్మ పోషకాలు ఉన్నాయి. మనిషి శరీరానికి కావలసిన అన్ని సూక్ష్మ పోషకాలు గోమూత్రంలో ఉన్నాయని లక్నో నగరంలో ఉన్నటువంటి సెంట్రల్ డ్రగ్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్ (CDRI) తన రిపోర్టులో తెలిపింది. పసుపులో కర్కుమిన్ అనే రసాయనం ఉంటుందని ముందు చెప్పుకున్నాము. పసుపు ద్వారా తీసుకునే కర్కుమిన్ శరీరంలో కలవడానికి సమయం పడుతుంది. కానీ గోమూత్రంలో ఉన్న కర్కుమిన్ అది తాగడంతోనే శరీరంలో కలిసి, పనిచేస్తుంది. అలాగే మిగిలిన సూక్ష్మపోషకాలు కూడా పనిచేస్తాయి! పసుపు, బెల్లం సమభాగాలు కలిపి, దానిని 5 గ్రాములు గోమూత్రంతో తీసుకున్నా బోదకాలు (ఫైలేరియా) తగ్గుతుంది. ఈ గోమూత్రం కూడా త్రిఫలచూర్ణం వలే వాత, పిత్త, కఫాలకు సంబందించిన అన్ని వ్యాధులను తగ్గిస్తుంది.
- 🟔 వ్యాధినిరోధక శక్తిని పెంచి, ఎటువంటి వ్యాధులు రాకుండా చేసేటువంటి అనేక రసాయన ఔషదాలను మన పూర్వీకులైన ఋషులు మనకు ఆయుర్వేదం ద్వారా అందచేశారు! కరోనా వైరస్ (కోవిడ్ 19), కేన్సర్, గుండె జబ్బులు వంటి పెద్ద, పెద్ద వ్యాధులు వచ్చిన తర్వాత మందులు వాడేకంటే, అవి రాకుండా పసుపు కలిసినటువంటి ఔషదాలను, త్రిఫలారసాయనము వంటివి, గోమూత్రం వంటివి ఉపయోగించినా.. ఇప్పటికే వచ్చిన వ్యాధులు తగ్గడానికి సహకరిస్తాయి. ఏ వ్యాధులు లేనివారు వీటిని ఉపయోగించి, ఎటువంటి వ్యాధులు రాకుండా ముందుగానే జాగ్రత్తపడడం మంచిది కదా ! పసుపుకు విరుగుళ్లు : 1.నిమ్మరసం, 2.నారింజరసం.
"ఓం ధన్వంతరయేనమః"
రచన: I.V.V.సత్యనారాయణ మూర్తి,
శ్రీవిజయలక్ష్మి అనువంశిక ఆయుర్వేదం,
(డా.యిందన అప్పారావుగారి ఆయుర్వేదం)
కిర్లంపూడి, తూ.గో.జిల్లా, ఆం.ప్ర. 533431
(గమనిక: ఇది కేవలం ప్రజల అవగాహన కోసం వ్రాసినటువంటి ఆర్టికల్)