చంద్రశేఖర చంద్రశేఖర...
చంద్రశేఖర పాహిమామ్!
అదిగో... రంకెలేస్తున్న మృత్యుమహిషంలా నా అజ్ఞానపు మిడిసిపాటు. అదిగదిగో... యమభట ద్వయంలా నన్నావరించిన మదమాత్సర్యాలు. స్వయంకృతాలు స్వయంగా యమపాశాలై నన్ను కబళించేస్తున్నాయి. అపమృత్యుభయం నుంచి మార్కండేయుడిని కాపాడినట్టు, నన్నూ రక్షించు శివుడా! నాలోని కృతఘ్నతా భస్మాసురుడినీ, ధర్మదక్షతలేని దక్షుడినీ హరించు... హరుడా!
చంద్రశేఖర చంద్రశేఖర...
చంద్రశేఖర రక్షమామ్!
***
మనుషుల్ని బేరీజు వేయడంలో మా లెక్కలు మావీ. బ్రహ్మాదులైనా సరే, బ్యాంకునిండా డబ్బుంటేనే ఆదరిస్తాం. హోదాలుంటేనే వంగొంగి దండాలు పెడతాం. పనికొస్తారనిపిస్తేనే ప్రేమొలకబోస్తాం. అవసరం తీరిపోగానే... సెల్‌ఫోన్ కాంటాక్ట్ లిస్ట్లోంచే కాదు, మనసులోంచీ శాశ్వతంగా ‘డిలీట్’ చేసేస్తాం. ఇదే మా కలికాలపు కమ్యూనికేషన్ స్కిల్! నీకేమో, ప్రతి భక్తుడూ బంధువే. ప్రతి బంధమూ అమూల్యమే. ఎవరు పిలిచినా పలుకుతావు. ఎవరు రమ్మన్నా వాలిపోతావు. కల్పానికో బ్రహ్మ చొప్పున వేవేల బ్రహ్మలు వచ్చారూ పోయారూ. సృష్టి పాలనలో సహకరించిన పుణ్యానికే... పాత బ్రహ్మల కపాలాల్ని మెడలో వేసుకుని మురిసిపోయేంత...బంధాల బందీవి నువ్వు. బాల మార్కండేయుడు భయంభయంగా లింగాన్ని ఆలింగనం చేసుకోగానే, పరుగుపరుగున దిగొచ్చిన పరమాత్మవి నువ్వు! ఆ పిచ్చికన్నప్పకేం వచ్చూ ఒక నమకమా, ఒక చమకమా! గుడ్డిభక్తితో కనుగుడ్డు పీక్కున్నాడని తెలియగానే, ఉద్వేగంతో కళ్లుతుడుచుకుంటూ ప్రత్యక్షం కావడమేనా? బిడ్డ వేలుపట్టుకుని హోమ్‌వర్క్ చేయించే నాన్నగారిలా... భక్తులు చేయాల్సిన పనుల్నీ నువ్వే నెత్తినేసుకుంటావెందుకూ? అర్జునుడి విషయంలో అదే జరిగిందిగా. మహాభారత యుద్ధం ముగిశాక, పార్థుడికో సందేహం కలిగింది. వ్యాస భగవానుడిని దర్శించుకుని, ‘మహాత్మా! కురుక్షేత్రంలో... నేను నారి సారించకముందే, ఓ దివ్యతేజస్సు రివ్వున దూసుకెళ్లి శత్రువుల్ని నేలకూలుస్తున్నట్టు అనిపించేది. అదేమైనా భ్రాంతా’ అని అడిగాడు. ‘కాదుకాదు, ఆ తేజోరాశే పరమేశ్వరుడు. అదంతా ఆయన భక్తవత్సలత’ అని జవాబిచ్చారు వ్యాసులవారు. ఏ వేదంబు బఠించె లూత భుజంగంబేశాస్త్రముల్ చూచె దానే విద్యాభ్యసనం బొనర్చె గరి... మనుషుల వరకూ ఫర్వాలేదు, ఏనుగులకూ సాలెపురుగులకూ కూడా ఉత్తిపుణ్యానికే మోక్షమిచ్చే ఉబ్బుశంకరుడివి నువ్వు! మనలో మాట - పాముకంత ప్రాధాన్యం ఎందుకూ, ఎద్దునలా ముద్దుచేయడం ఏమిటీ? చివరికి, పచ్చని మొక్కలన్నా నీకు ప్రాణమే. ‘వృక్షాణాం పతయే నమః ఓషధీనాం పతయేనమః’ అంటుంది నమకం.
ఓసారి పార్వతీదేవి ‘శివా! నీకు మరకత లింగమిష్టమా, మాణిక్య లింగమిష్టమా? క్షీరాభిషేకం కావాలా, కనకాభిషేకం చేయాలా?’ అని అడిగితే, మట్టి లింగమంటేనే మక్కువని చెప్పావు కదూ! ‘శంభో...’ అంటూ చెంబెడు నీళ్లు పోసినా సంతోషిస్తానన్నావు, గుర్తుందా! అప్పట్లో బాణాసురుడనే రాక్షసుడు నర్మదాతీరంలో గొప్ప తపస్సు చేశాడు. ఆ భక్తికి మెచ్చి ‘ఇక నుంచీ నర్మదలోని గులకరాళ్లు సైతం నా మహాలింగంతో సమానం’ అంటూ రాళ్లూరప్పలకూ లింగ ప్రతిపత్తిని ప్రకటించేశావు. అంత బోళాతనం ఎలా సాధ్యమైందయ్యా! ఇంత నిరాడంబరంగా ఎలా ఉంటున్నావు దేవరా! అతి సామాన్యులమైన మేమే ఎంగిలాకుల్లా ఎగిరెగిరిపడుతుంటామే. నిజంగా, నువ్వో నిండుకుండవి! కుండంటే గుర్తుకొస్తోంది, నీ చొరవే లేకపోతే గంగావతరణ జరిగేదా, మందాకిని మాలోకానికొచ్చేదా, దాహార్తిని తీర్చేదా!
నీకు భక్తి ముఖ్యం. భక్తిలో నిజాయతీ ముఖ్యం. ఆ ఒక్క అర్హతా ఉంటే...పచ్చి విషమిచ్చినా ప్రేమగా తాగేస్తావు. క్షీరసాగర మథనంలో హాలాహలాన్ని పుచ్చుకున్నదీ ఆ మమకారంతోనేగా! పరహితము జేయునెవ్వడు, పరమహితుండగును భూతపంచకమునకున్, పరహితమె పరమధర్మము, పరహితునకు ఎదురులేదు పర్వేందుముఖీ! - అంటూ నేర్పుగా పార్వతిని ఒప్పించి మరీ నీలకంఠుడివి అయ్యావు. ఆ సంఘటన ద్వారా, ‘చిన్నినా పొట్టకు శ్రీరామరక్ష’ అనుకునే మానవజాతికి సామాజిక బాధ్యతనూ గుర్తుచేశావు. అవున్లే, మాలాగా ప్రతి ఒక్కర్నీ భూతద్దంలోంచి బేరీజు వేసుకుంటూ కూర్చుంటే బంధాలెలా నిలబడతాయీ, బలపడతాయీ. ఎదుటి మనిషిని యథాతథంగా ఆమోదిస్తే ఏ గొడవా ఉండదు. లేదనకుండా అనుగ్రహిస్తూ వెళ్లడమే నీ తత్వం. నిలుపుకుంటే, సిరియాళుడిలా నిలుస్తాడు. లేకపోతే, భస్మాసురుడిలా బూడిదై పో..తా...డు!
అష్టోత్తరాల్లోనో, శతనామాల్లోనో నిన్ను దర్శించుకునే ప్రయత్నం చేస్తే - ముదిముప్పులో వ్యాకరణం నేర్చుకున్నట్టే ఉంటుంది వ్యవహారం. శివతత్వం ఆచరణాత్మకం. శివభక్తి ఓ జీవనవిధానం. శంకరః శంకరస్సాక్షాత్! అద్వైత శంకరుడు అక్షరాలా నీ అంశేనంటారు. స్థూలంగా...శంకరుడివి నువ్వే, ఆదిశంకరుడివీ నువ్వే. సన్యాసివి నువ్వే, చండాలుడివీ నువ్వే! ఒక నువ్వులోని అజ్ఞానపు పొరను, మరో నువ్వు ద్వారా తొలగించావంతే! ‘పక్కకి వైదొలగు...’ అన్న ఆచార్యుడి మాటకు, ‘వైదొలగాల్సింది ఏమిటి, పదార్థం నుంచి పదార్థమా, ఆత్మ నుంచి ఆత్మా? ఆ సూర్యభగవానుడు గంగనీటిలో ఒకరకంగా, నా ముంతకల్లులో మరో రకంగా ప్రతిబింబిస్తాడా?’ అంటూ చండాలుడి ద్వారా నిలదీయించి... గొప్ప అద్వైత భావనను అనుగ్రహించావు. ద్వైదీభావంలేని ఆ దృక్కోణం మా మీదా ప్రసరించేలా చూడు జ్ఞానేశ్వరా!
***
వాగర్థా వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే
జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ..
మీ ఇద్దర్లో... ఒకరు వాక్కు అయితే ఒకరు అర్థం. ఒకరు పువ్వు అయితే, ఒకరు పరిమళం. ఒకటి లేక మరొకటి లేదు. ఒకరు లేక మరొకరు లేరు. ఆదిదంపతులుగా మీ అనుబంధమే ఓ దాంపత్య పాఠం. అహాలు నెత్తికెక్కి ఆ సత్యాన్ని అర్థం చేసుకోలేక పోతున్నామంతే!మనిషి విజయానికి మూడు శక్తులు అవసరమంటుంది వేదం. ఇచ్ఛాశక్తి (పవర్ ఆఫ్ డిజైర్), జ్ఞానశక్తి (పవర్ ఆఫ్ నాలెడ్జ్), క్రియాశక్తి (పవర్ ఆఫ్ యాక్షన్)... ఏ లక్ష్యాన్ని సాధించాలన్నా కోరిక ముఖ్యం, ఆ లక్ష్యాన్ని ఎలా చేరుకుంటామన్న జ్ఞానం ముఖ్యం, మూడోదీ అతిముఖ్యమైందీ...లక్ష్యం వైపుగా మనం వేసే అడుగు. అదే ఆచరణ! ఆ త్రిగుణాలకూ అధినేత్రి అమ్మవారు. అంతమాత్రాన, ఇదంతా నీకు సంబంధంలేని వ్యవహారమని ఎలా అనుకోగలం! ఆ తల్లి సూక్ష్మరూపంలో నీలోనే ఉంటుంది, నీతోనే ఉంటుంది. అంతః శాక్తో, బహిః శైవః... శివా నువ్వు పైకి త్రిశూలంతో, త్రినేత్రాలతో శివుడిగా కనిపించినా... నీ అంతరంగం నిండా అమ్మవారే! నీకు పార్వతి అంటే ఎంత ప్రేమంటే... ఆమెను వదులుకోడానికి కూడా సిద్ధపడేంత! ఆ బంధాన్ని ఆమోదించేముందు ఎంత తర్జనభర్జనపడ్డావూ? ‘నా లాంటి మొరటు మనిషిని ఆ సుకుమారి ఎలా భరిస్తుంది పాపం!’ అన్న అనుమానం! ‘ఈ శ్మశానవాసితో ఆ అంతఃపురకాంత ఎలా కాపురం చేస్తుందో’ అన్న భయం! కాబట్టే, మారువేషంలో వెళ్లి... ‘బిచ్చగాడిని కట్టుకుంటే బాగుపడలేవు. ఇంతకంటే మంచి సంబంధం వెతకమని మీ నాన్నగారికి చెప్పు’ అని సలహా కూడా ఇచ్చావు. అయినా సర్వమంగళ, నువ్వే సర్వస్వమంటూ నీ చేయిపట్టుకుంది. హృదయనేత్రాలతో దర్శించుకోవాలే కానీ, నీ అంత అందగాడు ముల్లోకాల్లో ఎక్కడుంటాడు సోమసుందరా! ఆస్తిపాస్తులంటావా? నీ వ్యక్తిత్వ సంపద ముందు... కుబేరాదుల వస్తువాహనాలూ వెలవెలబోవాల్సిందే.
స్త్రీ అంటే నీకెంత గౌరవం! భృంగే కదూ, పార్వతీసమేతంగా నువ్వు కొలువుదీరినప్పుడు... అమ్మవారిని విస్మరించి నీకొక్కడికే ప్రదక్షిణ చేయబోయాడు. మరుక్షణమే, ఆమెను సగాన్ని చేసుకుని జగానికో మహత్తర సందేశమిచ్చావు. దక్షప్రజాపతి... తన కూతుర్ని అవమానిస్తుంటే తట్టుకోలేకపోయావు. ఉగ్రుడవై వీరభద్రుడిని సృష్టించావు. బ్రహ్మదేవుడు శతరూప విషయంలో వక్రబుద్ధితో ఆలోచిస్తున్నప్పుడూ అంతే. తలలు తీసి ఆ తలపుల్ని ఖండించావు. స్త్రీత్వాన్ని గౌరవించడమూ శివతత్వంలో భాగమేనని నిరూపించావు. చేతులెత్తి నమస్కరిస్తున్నాం, మాకూ ఆ ఉత్తమ సంస్కారాన్ని ప్రసాదించు భిక్షపతీ!
***
శివా! నీ ప్రతి చర్యా ప్రతీకాత్మకమే. త్రిపురాలు... మనిషిని మింగేస్తున్న మూడు వికారాలు - నేను, నాది, నాది కానిది. ‘నేను’ అంటే - నా శరీరం, నా మనసు. ‘నాది’ అంటే - నా ఆస్తి, నా జ్ఞానం, నా కుటుంబం, నా అధికారం. ‘నాది కాదు’ అంటే - నాకు అందనిదీ, అందుబాటులో లేనిదీ, నేను అందుకోవాలని ఆరాటపడుతున్నదీ... ఏదైనా కావచ్చు. ‘నాది’ అనుకోవడంలో బాధ ఉంది, ‘నాది కాదే!’ అనుకోవడంలోనూ బాధ ఉంది. మొత్తంగా ‘నా...’ అన్న ఆలోచనే వద్దంటుంది నీ తత్వం. ఈ మూడూ దుఃఖ కారకాలే. ఆ త్రివిధ వికారాలకు ప్రతీకలైన ముగ్గురు రాక్షసులూ మూడు ఎగిరే నగరాల్ని సృష్టించుకుని ముల్లోకాల్నీ అల్లకల్లోలం చేస్తుంటారు. ఆ మూడు నగరాల్నీ ఒకే బాణంతో నేలకూల్చాలి. లేదంటే లేదు. ఇదీ అసురుల ధైర్యం, వారికున్న వరం. అంటే, ఒకే సరళరేఖలో ఎగురుతున్నప్పుడే దుష్టశిక్షణ సాధ్యం అవుతుంది. ఆ రాక్షస నగరాలేమో వంకరటింకరగా గాల్లో తేలుతుంటాయి. త్రిపురాల్ని నాశనం చేయడమంటే... నేను, నాది, నాది కాదు అన్న భావనల్ని తొలగించుకోవడమంటే... ఎంత కష్టం! మనలోని సమస్త శక్తుల్నీ కూడగట్టుకోవాలి. నువ్వు చేసిందీ అదే కదా! భూమిని రథం చేసుకున్నావు, భూమి వాస్తవిక దృక్పథానికి ప్రతీక. సూర్యచంద్రుల్ని చక్రాలుగా అమర్చుకున్నావు, ఆ రెండూ జీవితంలోని ఎత్తుపల్లాల్ని ప్రతిబింబిస్తాయి. బ్రహ్మ సారథ్యం వహించాడు, సృష్టికర్త జ్ఞానానికి మూలాధారం. మేరు పర్వతం వింటి చాపమైంది, కొండ ఆత్మబలానికి రూపం. శేషుడు వింటినారి అయ్యాడు, సర్పం కోరికల్ని ప్రతిబింబిస్తుంది. సర్పాన్ని సంధించడమంటే, కోరికల్ని జయించడం. పరిపూర్ణ ఆత్మవిశ్వాసంతో వెన్నంటి తరమగా తరమగా... త్రిపురాలు ఒకే సరళరేఖ మీదికి వచ్చాయి. నీ బాణం దెబ్బకు కాలి బూడిదైపోయాయి. ఆ భస్మాన్నే నువ్వు ఒళ్లంతా పూసుకుంటావని అంటారు. బూడిదిచ్చేవాడంటే...అహాల్ని తొలగించేవాడనేగా అర్థం. అంతటి మనో వికాసాన్ని సాధించేదాకా అన్నీ భయాలే! ఆఫీసుకెళ్లాలంటే భయం, ఏ నిమిషంలో పింక్ స్లిప్ ఇస్తారో తెలియని పరిస్థితి. ఎదుటి మనుషులతో స్నేహంగా ఉండాలంటే భయం, చొరవ తీసుకుని అప్పులు అడుగుతారన్న అనుమానం. వృత్తి ఉద్యోగాల్లో ప్రయోగాలు చేద్దామంటే భయం, ఎక్కడ వైఫల్యం ఎదురవుతుందో అన్న భీతి. మనలో తిష్టవేసుకున్న త్రిపురాసురుల్ని తుదముట్టించేదాకా ఆ జాడ్యం వదలదు.
నువ్వు పిశాచ గణాలకు అధిపతివి. పిశాచాలు బలహీనతకు ప్రతీకలు. మనిషిలో పిరికితనం పెరిగేకొద్దీ, మనసులోని పిశాచాలు మరింత శక్తిమంతం అవుతాయి. భయాలకు పెద్దన్న మృత్యుభయం. దాన్ని నువ్వు పరిపూర్ణంగా జయించావు. శ్మశానవాసం, బూడిదస్నానం... ఆ చిహ్నాలే. మనిషిని గడగడ వణికించే పాము నీ మెడలో హారం. రక్తమోడుతున్న పులిచర్మం నీ ఆచ్ఛాదన. పుర్రెలు నీ హారాలు. భయాన్ని గెలవడమే అభయం. చావుకు భయపడని అద్వితీయ స్థితే ముక్తి. అదే నాక్కావాలి. నీలా నేనుండాలి. అనుగ్రహించు జటాధరా!
***
ఓసారి సనక సనందనాది మహర్షులు తమ సందేహాల్ని తీర్చుకోడానికి నీ దగ్గరికి వచ్చారు. ఆ సమయానికి నువ్వు ఓ మహావృక్షం కింద బాలకుడి రూపంలో దర్శనమిచ్చావు. గురుస్థానంలో కూర్చుని మహామహా తాపసులకు బ్రహ్మవిద్యను బోధిస్తున్నావు - మౌనంగా! చీమ చిటుక్కుమన్నా వినిపించేంత నిశ్శబ్దం. రుషులు కూడా మౌనంగానే ఆ మహాసత్యాల్ని గ్రహిస్తున్నారు. సనక సనందనాదుల సందేహాలు కూడా వాటంతట అవే తొలగిపోయాయి. మాట కంటే మౌనం గొప్పదన్న సత్యాన్ని అలా నిరూపించావు మహాదేవా! మేమేమో, మాటల కోటలు కట్టేసుకుని మురిసిపోతున్నాం. కాలక్షేపపు సంభాషణలతో సమయాన్ని వృథా చేసుకుంటున్నాం.
అధిక రక్తపోట్లూ, మధుమేహాలూ, క్యాన్సర్ మహమ్మారులూ మనిషిని చంపే వ్యాధులైతే... అసూయా ఆత్మస్తుతీ పరనిందా వ్యక్తిత్వాన్ని మింగే మహాజాడ్యాలు. విష్ణుమూర్తిలా వైభోగాల వైకుంఠం లేదని నువ్వెప్పుడైనా బాధపడ్డావా! ఇంద్రుడిలా కల్పవృక్షమూ కామధేనువూ గొడ్లచావిడిలో కనిపించవెందుకని ఎవరిముందైనా గోడెళ్లబోసుకున్నావా? లేదే, నీ దారి నీది. నీ ధోరణి నీది. ఆ దిక్కుమాలిన పోలికలు మాకు మాత్రం అవసరమా? పక్కింటివాడు కారు కొంటే అసూయ, పక్కసీటువాడిని పదోన్నతి వరిస్తే కడుపుమంట, ఎవరి పిల్లాడో చదువుకుని వృద్ధిలోకి వచ్చినా ఏడుపే! సెల్లు ఎన్నంగుళాలూ, ఇల్లు ఎన్ని గజాలూ - మనుషుల్ని అంచనా వేయడానికి ఇవే మా తూకంరాళ్లు! నీలా నిర్మలంగా, నిరాడంబరంగా బతకడం నేర్పించు శివా! అప్పుడు, సగం హింస తగ్గిపోతుంది, సకల అవినీతులూ అడుగంటిపోతాయి.
కొత్తగా కాపురానికి వచ్చినప్పుడు కదూ! ‘ఏవండీ! మనమూ ఓ ఇల్లు కట్టుకుందాం..’ అని పార్వతీదేవి చెవినిల్లు కట్టుకుని చెప్పింది. నువ్వు విన్లేదు. ‘వేసవిలో ఎండలు ఎక్కువ స్వామీ’ అనగానే, వీధిలోని వేపచెట్టును చూపించి ‘ఇక్కడ విశ్రమిద్దాం’ అంటావా? ‘చలికాలంలో గడగడా వణికిపోతాం నాథా!’ అని ఫిర్యాదు చేయగానే, శ్మశానానికి వెంటబెట్టుకునెళ్లి చితిమంటల దగ్గర చలి కాచుకోమంటావా? చివరికి ‘వర్షం సంగతి ఏమిటి?’ అనడగ్గానే... మేఘాలకంటే ఓ మెట్టు పైకే తీసుకెళ్లి ‘ఇక్కడ ఎలాంటి సమస్యా ఉండదు’ అని భరోసా ఇస్తావా? బోళాగా కనిపిస్తావు కానీ, భలే చమత్కారివి. నీలోని నిర్మోహత్వంలో నాకూ వాటా ఇవ్వు విరూపాక్షా!
***
ఓవైపు ముల్లోకాల పాలన, మరోవైపు దుష్టశిక్షణా శిష్టరక్షణా! ఇన్ని బాధ్యతల నడుమ కూడా ఒత్తిడి లేకుండా, నవ్వుతూ ఎలా ఉంటున్నావయ్యా! అది చూసే...ఆ చిరునవ్వు ముందు సిగలోని చంద్రవంక కూడా చిన్నబోతుందని కవులు పద్యాలు కట్టేశారు. అర్థమైందిలే...యోగం, ధ్యానం, నాట్యం... ఇలా ఆధ్యాత్మిక సాధనతో, లలిత కళారాధనతో నిత్యం నిన్ను నీవు మెరుగుపరుచుకుంటావు. నీలా వ్యక్తిగత, వృత్తిగత జీవితాల్ని సమన్వయం చేసుకునే కిటుకేదో చెప్పి పుణ్యంకట్టుకో కపర్దీ!
గురవే సర్వలోకానామ్
భిషజే భవరోగిణామ్
నిధయే సర్వవిద్యానామ్
దక్షిణామూర్తయే నమః
ఆత్మానందం కోసమో, స్వీయానుభూతి కోసమో ఒక్క నిమిషమైనా కేటాయించలేక పోతున్న దురదృష్టవంతులం మేం. మంచి పుస్తకం చదివి ఎంతకాలమైందో! సూర్యోదయ సూర్యాస్తమయ దృశ్యాల్ని ఆస్వాదించి ఎన్నేళ్లయిందో! బతుకులు కళాహీనంగా, రసరహితంగా మారిపోతున్నాయి నటరాజా! నీకోసమే నువ్వు ఆడిపాడుతూ ఆనందించే...శివతాండవ దృశ్యాన్ని తలుచుకునైనా, మేం ప్రేరణ పొందాలి. ఏమానందము భూమీ తలమున శివతాండవమట, శివలాస్యంబట - అని పరవశంగా వర్ణించారు కదూ మా పుట్టపర్తివారు. ఆధునిక జీవితంలోని సమస్త రుగ్మతలకూ నీ తత్వమే చికిత్స. శివం అంటే... శాంతం, శుభం, శుద్ధం! నీలా సువిశాలంగా ఆలోచించగలిగితే మానసిక అశాంతికి చోటెక్కడ ఉంటుంది? నీలా అంతా నావాళ్లే అని భావిస్తే, ఎవరికి ఏకాస్త మంచి జరిగినా మనింట్లో శుభకార్యంలానే అనిపిస్తుంది. హిమశిఖరోన్నతమైన ఆ నిశ్చల స్థితిలో ప్రతి హృదయమూ పరిశుద్ధ స్ఫటికలింగమే! ఆ మనో వికాసాన్ని ప్రసాదించి...
నన్నాదరించు శివా!
నన్నావహించు శివా!
త్రిలింగేశ్వరా...
మూడు మహాలింగాల మధ్య విలసిల్లుతోంది... తెలుగుజాతి! చుట్టూ మూడు శైవక్షేత్రాలు... మధ్యలో, నిద్రలోనూ ‘శివ...శివా’ అని కలవరించే భక్తజనం. ఆ దృశ్యాన్ని మనో మంటపం మీద ప్రతిష్ఠించుకుంటే - త్రిలింగదేశం ఆత్మలింగంలా ఆవిష్కృతం అవుతుంది.
ద్రాక్షారామం
ఇక్కడ నెలకొన్న శివుడు భీమేశ్వరుడు. దక్షుడు యజ్ఞం చేసిన చోటు ఇదేనంటారు. తండ్రి చేసిన అవమానాన్ని భరించలేక, సతీదేవి ఆత్మాహుతి చేసుకుంటుంది. ఆ విషాదంలో, సతీదేవి పార్థివదేహాన్ని భుజానికెత్తుకుని అడవులు పట్టుకు తిరుగుతాడు శివుడు. వెనకాలే మహావిష్ణువు పరుగులు తీస్తూ... ఆ నిర్జీవదేహాన్ని ఖండిస్తూ వెళ్తాడు. అమ్మవారి కణత భాగం నేలపాలైన చోటు ద్రాక్షారామమని ఐతిహ్యం. అగస్త్యమహామునీ, వ్యాసభగవానుడూ ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకుని భీమేశ్వరుడిని సేవించినట్టు పురాణ కథనం. తూర్పుగోదావరి జిల్లాలో ఉందీ క్షేత్రం.
శ్రీశైలం
‘సంధ్యారంభ విజృంభిత శ్రుతి శిరః స్థానాంతరాధిష్ఠితమ్...’ అంటూ శ్రీశైల క్షేత్ర సౌందర్యాన్ని వర్ణించారు ఆదిశంకరులు. మల్లికా పుష్పాలతో కొలిచిన ఓ రాకుమారిని అనుగ్రహించి పరమేశ్వరుడు ఇక్కడ మల్లికార్జునుడిగా కొలువుదీరాడు. అరుణుడనే రాక్షసుడు ఏ ఆయుధాలతోనూ తనకు మరణం లేకుండా వరం పొందాడు. ఆ ధైర్యంతో తాపసులను తీవ్రంగా హింసించేవాడు. ఆ ఘోరాన్ని చూడలేక అమ్మవారు...భ్రమరాంబగా అవతరించి, కోట్లాది భ్రమరాల్ని సృష్టించి అరుణుడి మీదికి ఉసిగొల్పారు. ఆ గాయాల దెబ్బకు అరుణాసురుడు నేలకూలాడు. భ్రమరాంబికా మల్లికార్జునులు కొలువైన ఈ క్షేత్రం... కర్నూలు జిల్లాలో ఉంది.
కాళేశ్వరం
గోదావరి, ప్రాణహిత నదుల సంగమ స్థానం కాళేశ్వరం. కాలుడంటే యముడు. ఈశ్వరుడంటే పరమేశ్వరుడే! ఇద్దరూ ఓ చోట వెలిశారు కాబట్టి...కాళేశ్వరమైంది. దీనికి సంబంధించి ఓ ఐతిహాసిక గాథ ఉంది. ధర్మం నాలుగుపాదాలా నడుస్తున్న రోజుల్లో... స్వర్గం కిటకిటలాడిపోయేదట. నరకంలో మాత్రం నరమానవుడు కూడా కనిపించేవాడు కాదట. దీంతో, యమరాజు వెళ్లి శివుడికి మొరపెట్టుకున్నాడు. ‘అంతా యుగమహిమ! త్వరలోనే నీకు రెండు చేతులా పని ఉండబోతోంది. అప్పటిదాకా నా పక్కన వెలసి పూజలు అందుకో...’ అని ఆదేశించాడట పరమశివుడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉందీ ఆలయం.
శివరాత్రి మహత్యం!
శివరాత్ర మహోరాత్రం నిరాహారో జితేంద్రియః
అర్చయేద్వా యథాన్యాయం, యథాబల మవంచకః
మాఘ బహుళ చతుర్దశి... మహాశివరాత్రి. ఆత్మలింగోద్భవం జరిగిన రోజు ఇది. ఓసారి బ్రహ్మవిష్ణువులు నేను గొప్పంటే, నేనుగొప్పంటూ గొడవపడ్డారు. ఇద్దరు మూర్తుల అహాన్నీ కరిగించడానికి... పరమేశ్వరుడు తన విరాట్ రూపాన్ని చూపిన రోజే శివరాత్రి అని ఓ కథనం. వందే పార్వతీపరమేశ్వరౌ...అతడు సగం, ఆమె సగం. ఆమెతో కూడినప్పుడే శివుడు పరిపూర్ణుడు. అందుకే, పరమశివుడి జన్మదినంగా భావించే శివరాత్రి నాడే పార్వతీపరమేశ్వరుల కల్యాణం జరుపుతారు. పగలంతా ఉపవాసం, రాత్రంతా జాగారం, నోరారా నామస్మరణం...అంతకు మించిన శివానందం ఏం ఉంటుందీ! ఈరోజే శైవులు నిత్యధారణ కోసం విభూతి తయారు చేసుకుంటారని పాల్కురికి సోమనాథుని పండితారాధ్య చరిత్ర చెబుతోంది. శివరాత్రి మహత్యాన్ని చాటే ఉదంతాలు ప్రాచీన తెలుగు సాహిత్యంలో అనేకం. చోరులూ జారులూ కూడా... తెలిసో తెలియకో ఉపవాసం చేసో, ఏ దురుద్దేశంతోనో శివాలయంలో దీపం వెలిగించో ముక్తిని పొందిన ఉదంతాలు కోకొల్లలు.