వేదాలే హిందూధర్మం యొక్క మూలగ్రంథాలు,
వీటిని:
వీటిని:
- 卐 - శ్రుత (దర్శించబడినది)
- 卐 - ఆగమము (పరంపరాగతమైనది),
- 卐 - నిగమము (జీవితంపై పరిపూర్ణ అవగాహన కల్పించేది) అని కూడ పిలుస్తారు.
వేదం అంటే జ్ఞానం అని అర్థం. ధ్యానమగ్నులైన ఋషులకు భగవంతుని అనుగ్రహంచేత ఈ వేదాలు గోచరించాయి ఇందుకనే ఇవి 'అపౌరుషేయాలు'. అంటే ఇవి ఏ ఒక ప్రత్యేకమైన వ్యక్తి చేతనూ రచించబడినవి కావు.
వేదాలు నాలుగు:
- 1. ఋగ్వేదము,
- 2. యజుర్వేదము,
- 3. సామవేదము,
- 4. అథర్వవేదము అని వేదాలు నాలుగు.
ఋగ్వేదం ముఖ్యంగా ప్రార్ధనా మంత్రాలన్నింటినీ కూర్చిన సంకలనం. యజ్ఞయాగాదులకు సంబంధించిన మంత్రాలను కలిగివున్నది యజుర్వేదము. ఋగ్వేదంలోని కొన్ని మంత్రాలను సేకరించి, వాటిని సంగీతబద్ధంగా లయబద్ధంగా చేసి యజ్ఞయాగాదులలో ఏయే సందర్బాలలో ఎలా గానం చేయాలో వివరించినదే సామవేదంలోని ప్రధానాంశం.
మనిషి సాధారణంగా అనుసరించవలసిన నైతిక నియమాలు మంత్రతంత్రాలు, ఆరోగ్యపరమైన కొన్ని సూత్రాలు ప్రాపంచిక విజ్ఞానాలతో కూడి ఉన్నది అథర్వవేదము.
ప్రతి ఒక్క వేదాన్నీ
- (1) మంత్రము లేదా సంహిత,
- (2) బ్రాహ్మణము,
- (3) ఆరణ్యకము,
- (4) ఉపనిషత్తులు
అనే నాలుగు భాగాలుగా విభజించవచ్చు:
- 1. సంహిత అనేది ప్రార్ధనామంత్రాల సంకలనం.
- 2. యజ్ఞయాగాదులను చేసే విధానాలను గురించి వివరించేది బ్రాహ్మణము. (దీనికి బ్రాహ్మణ కులానికి ఏ సంబంధమూ లేదు.)
- 3. యాగక్రియలను ఆధారంగా చేసుకొని వికసితమైన ఉపాసనా విధానాలను గురించి వివరించేది ఆరణ్యకము.
- 4. సృష్టి రహస్యాన్ని, మూల (పరమ) సత్యాన్ని, మనిషి నిజస్వరూపాన్ని, జీవిత లక్ష్యాన్ని చేరుకునే మార్గాన్ని వివరించేవి ఉపనిషత్తులు.
రచన: స్వామి హర్షానంద - రామకృష్ణ మఠం