నిత్య జీవితంలో తెలుసుకోదగ్గ, పాటించవలసిన ముఖ్య మానవ ధర్మాలు
- 1. చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట, ఒట్టు పెట్టుట దోషం.
- 2. నిలబడికాని, అటూఇటూ తిరుగుతూ కాని అన్నం తినటం వల్ల క్రమంగా దరిద్రుడౌతాడు. రాబోయే జన్మలో బిచ్చగాడు అవుతాడు.
- 3. నోట్లో వ్రేళ్ళు పెట్టుకొనుట, గోళ్ళుకొరుకుట చేయరాదు.
- 4. దేవాలయ ప్రాంగణంలో ఉమ్మడం, పొగత్రాగటం రెండూ నిషిద్దాలే.
- 5. ఆదివారం, శుక్రవారం, మంగళవారం తులసిఆకులు కోయరాదు.
- 6. చీకటి పడ్డాక పువ్వులు, ఆకులు చెట్లనుండి త్రుంచరాదు.
- 7. గురువుద్వారా మంత్రోపదేశం పొందనివాడు ఎప్పటికీ తరించలేడు. కనుక ఉపదేశం పొందితీరాలి.
- 8. చెట్లు, దేవతా విగ్రహాలు ఈశాన్యంలో ఉంటే వాటిని బరువులుగా భావించి తీసివేసేవారు, తీసివేయమని సలహా ఇచ్చేవారు ఏడు జన్మలు ఉబ్బసపు రోగులుగా పుడతారు. ఈ పనులు చేయుట దైవద్రోహం కనుక చేయరాదు.
- 9. గురువులకు, అర్చకులకు, పౌరాణికులకు సరిగా పారితోషంఇవ్వక, వారికి ఋణపడేవారు నూరుజన్మలు కుక్కలుగా, చండాలురుగా పుట్టి కష్టనష్టాల పాలవుతారు.
- 10. శివలింగార్చన ఆడువారు కూడా చేయవచ్చు.
- 11. ఇంట్లో విగ్రహాలుంటే ఏమీ ప్రమాదం లేదు. పరులకు అపకారం కోరి పూజ చేసేవారికి మాత్రమే నియమాలు. తక్కిన వారికి పూజా విషయాలలో పెద్ద పెద్ద నియమాలు లేవు.
- 12. నిద్రనుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నామస్మరణ చేయాలి.
- 13. పాచి ముఖంతో అద్దం చూసుకొనరాదు.
- 14. హారతి ఇచ్చాక దేవునిపై నీరు చల్లాలి. హారతి ఇచ్చే పాత్రపై కాదు.
- 15. తీర్థం తీసుకున్నాక, ఆ చేతిని కడుక్కోవాలి తప్ప, అరచేతిని తలపై రాసుకొనరాదు.
- 16. స్నానం చేశాక శరీరం తుడుచుకొని తడి-పొడి తువ్వాలు కట్టుకొని పూజ చేయరాదు. పూజా మందిరంలో ప్రవేశించరాదు. పూర్తిగా ఆ తుండును తడిపి నీరు పిండి మాత్రమే కట్టుకోవాలి. లేదా వేరే శుభ్రమైన వస్త్రాలు పూజకు ధరించాలి.
- 17. ఉపవాసం ఉన్నపుడు, జాగరణ చేసినపుడు పరులదోషాలు తలుచుకోరాదు.
- 18. శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు. కొంచెం దూరం ఉంచాలి.
- 19. తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు, గురువులకు పెట్టరాదు. సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి. పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్ళీ వడ్డించి నేయి వేయాలి.
- 20. అన్నం తింటున్న వారెవరినీ తిట్టరాదు, దెప్పి పొడవరాదు.
- 21. నిజం తెలుసుకోకుండా ఎవరినీ నిందించరాదు, అభాండాలు వేయరాదు. అలా చేస్తే అవతలి వారి పాపాలన్నీ అభాండాలు వేసిన వారి తలకు చుట్టుకుంటాయి.
- 22. ఇస్తానని వాగ్దానం చేసి దానమివ్వనివాడు వందజన్మలు దరిద్రుడై పుడతాడు, వాగ్బంగం చాలా దోషం.
- 23. అన్నం తినేటప్పుడు కంచానికి బాగా దగ్గరగా కూరలు, మజ్జిగ మున్నగునవి ఉన్నపాత్రలు పెట్టరాదు. మనం తినేటప్పుడు ఎంగిలి ఆ పాత్రలలో పడితే ఆ పదార్థాన్ని మరొకరికి వడ్డిస్తే, వాడికి "యముడు" మల ముత్రాదులు ఆహారంగా ఇస్తాడు.
- 24. తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి. దీనిని కాయిక తపస్సు అంటారు.
- 25. గురువునకు ఉపదేశ సమయాలలో కాని, పురాణాదులు వినేటప్పుడు కాని పాదాలు ఒత్తితే 7 జన్మల పాపాలు తొలుగుతాయి.
- 26. గురువుగారి బట్టలు ఉతికి ఆరవేసిన వారికి 3 జన్మల పాపాలు తొలగుతాయి.
- 27. మంత్రోపదేశం చేసిన గురుని ఆజ్ఞ పాటించేవారికి ఏ పాపమూ అంటదు. పునర్జన్మ ఉండదు. (ఇది తప్పక పాటించవలసిన ముఖ్య పవిత్ర నియమము. దీనికి సాటి మరొకటి లేదు). పరాశర సంహితలో ఈ విషయాలున్నాయి.
- 28. అష్టమి, పూర్ణిమ, చతుర్థశి కాలలో స్వయంపాకం దానం చేస్తే అన్నపానాలకు ఏనాడు లోటుండదు.
- 29. ఎక్కువ వేడిగా, ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలు స్వీకరించరాదు.
- 30. భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవపూజ చేయరాదు.
- 31. శవాన్ని స్మశానం దాకా మోసినా, శవాన్ని ఇంటి దగ్గర ఉండటానికి అనుమతినిచ్చినా నరకానికి పోకుండా స్వర్గానికి పోతాము.
- 32. గృహప్రవేశ కాలంలో గాని, ఏడాదిలోపు గాని ఆ ఇంట మణిద్వీప పరాయణం చేయడం మంచిది. ఇది వాస్తుదోషాలను పరిహరిస్తుంది.
- 33. భోజనానికి ముందు, అనంతరం కూడా కాళ్ళు కడుక్కోవాలి.
- 34. సకల పురాణేతిహాస కోవిదుడు కాని వాని వద్ద మంత్రోపదేశం పొందరాదు.
- 35. పుట్టిన రోజునాడు దీపాలు కానీ, కొవ్వొత్తులు కానీ ఆర్పరాదు. నోటితో అగ్నిని ఊదుట ఘోరపాపం. అటువంటివారు గ్రహణపు మొర్రితో మళ్ళీ జన్మమెత్తి దుఃఖాలు పొందుతారు.
- 36. తలకి నూనె రాసుకొని ఆ చేతులతో పాదాలకు ఆ నూనెజిడ్డు పులమరాదు.
- 37. శుక్ర, శనివారం వంటి వార నియమాలు పెట్టుకున్నవారు హోటలు టిఫిన్లు తినుటగానీ, ఆనాటి అల్పహారాదులలో ఉల్లి వాడుట కాని నిషేదము. ఇది ప్రయాణ మధ్యంలో ఉన్న వారికి వర్తించదు.
- 38. చీటికి, మాటికి యజ్ఞోపవీతం తీసి పక్కనపెట్టడం, తాళి తీసేస్తుండటం రెండూ భయంకర దోషాలే.
- 39. క్రూరుడు, దుష్టుడు కాని మగనితో తాళికట్టించుకొన్న భార్య, కాపురం చేయక ఏడిపించటం, చెప్పిన మాట వినకపోవటం, తాళి తీసి భర్త చేతిలో పెట్టడం చేయరాదు. ఇలా చేసిన స్త్రీలకి వంద జన్మలలో వైధవ్యం కానీ, అసలు పెళ్లి కాకపోవడం జరుగుతుంది.
- 40. దీపాలు పెట్టేవేళ తలదువ్వుకోరాదు. ఇలా చేసిన స్త్రీలకి వందల జన్మలలో వైధవ్యం కాని, అసలు పెళ్లి జరగకపోవడం వంటివి జరుగుతాయి.
- 41. దిగంబరంగా నిద్రపోరాదు.
- 42. కలియుగంలో ఆలయంలో జంతువధ నిషేధం.
- 43. విజయదశమి, శివరాత్రి దినాలలో మాంసాహారం, ఉల్లి పనికిరాదు.
- 44. ఆచమనం చేసిన నీటిని దైవనివేదనలకు, అర్చనలకు వాడరాదు, కనుక వేరొక పాత్రలో శుద్ధ జలాన్ని ఈ కార్యాలకు వినియోగించుకోడానికి తెచ్చుకోవాలి.
- 45. దీపారాధనకు అగ్గిపెట్టె వాడకూడదని ఏ శాస్త్రాలు చెప్పలేదు. కనుక అగ్గిపెట్టెతో దీపం వెలిగించుకోవచ్చు.
- 46. దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడినపుడు మూడు వత్తులు వేయాలి.
- 47. కొబ్బరికాయ కొట్టాక వెనుకవైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు. శుభ్రత కోసం పీచు తీయవచ్చు, తీయకపోతే దోషం లేదు.
- 48. కొబ్బరికాయను నీళ్ళతో కడిగి కొట్టడం చాలా తప్పు, కొబ్బరికాయను పీచు ఒలిచివేశాక నీళ్ళతో కడగరాదు.
- 49. మాడిన అన్నం, అడుగంటిన పాయసం, కంపు వచ్చే నేయి ఇటువంటివి నైవేద్యానికి పనికిరావు.
- 50. ఆలయ ప్రాంగణంలో అర్చకునిపై కేకలు వేయరాదు. అర్చకునిలో దోషం ఉంటే బయటకు పిలిచి మందలించాలి లేదా మరింత దుష్టుడైన అర్చకునినైతే మూడు మాసాల జీతమిచ్చి ఆ పదవినుంచి తొలగించి వేయాలి.
రచన: రేణుకా పరశురామ్