ఉపాసనలో విగ్రహారాధన ఐదవ వర్గంలోకి వస్తుంది. మనసు చంచలమైనది. ప్రతిక్షణం పరిభ్రవిస్తూ ఉంటుంది. దానిని నియంత్రించి ఏకాగ్రత సాధించటానికి మార్గం విగ్రహారాధన. వైదికకాలం నుండి విగ్రహారాధనకు ప్రాధాన్యత ఉంది.
మనోధృతిర్ధారణా స్యాత్ సమాధిర్బ్రహ్మాణి స్థితిః|
అమూర్తో చేత్ స్థిరా న స్వాత్ తో మూర్తి విచింతయేత్||
మనస్సు యొక్క ధృతి (స్థిరత్వం) ధారణ అనబడుతుంది. బ్రహ్మలో స్థతి పొందటం సమాధి అవుతుంది. కాని, మనసు స్థిరంగా ఉండకపోతే ఆలంబనగా విగ్రహాన్ని గ్రహించటం అవసమౌతుంది. జ్ఞాని స్థితిని పొందటానికి సాధకుడు మొదట స్థిరత్వం సాధించాలి. అది విగ్రహారాధన వల్లనే సాధ్యమౌతుంది. దానివల్ల మనసుకు ఏకాగ్రత లభిస్తుంది.
మనస్సులో భావం ఉత్పన్నం కావటానికి ఒక చిత్రపటం లేదా ప్రతిమ అవసరమన్న అంశాన్ని శాస్త్రీయంగా కూడా వైజ్ఞానికులు అంగీకరించారు. ఉదాహరణకు ఒక వ్యక్తి చేతిలో తన తల్లి, సోదరి, భార్య చిత్రపటాలు ఉన్నాయనుకుందాం. తల్లి చిత్రం చూడగానే అతనిలో ఆమె వాత్సల్యం; సోదరి చిత్రం చూడగానే స్నేహం, ఆర్ద్రత,భార్య చిత్రం చూడగానే ప్రణయభావం జాగృతం కావటం సహజం.
ఏకలవ్యుడు ఏమి చేశాడు? ధనుర్విద్య అభ్యసించటానికి ద్రోణాచార్యుని ప్రతిమను భక్తీభావంతో పూజించి ఆ ప్రతిమలో గురువును భావన చేసి, ధనుర్విద్యలో అర్జునుని మించిన విలుకాడుగా ఎదిగాడు. ధ్రువుడు నారదుని ఉపదేశంతో శ్రీమన్నారాయణుని మూర్తిని నిర్మించి, దానిపై మనసు నిలిపి ఆరుమాసాల్లో భవత్సాక్షాత్కారం పొందాడు. కేవలం సనాతన హిందూధర్మంలోనే కాక ఇతర అనేక మతాల్లోనూ విగ్రహారాధన ఉంది. క్రైస్తవులు శిలువను పూజిస్తారు. ముసల్మానులు మక్కాలో ‘సంగే అసబద్’ ను చుంబిస్తారు. సమాధులపై పూలు చల్లుతారు. సిక్కులు గురు గ్రంథసాహెబ్ను భక్తితో ఆరాధిస్తారు.
నిర్గుణ, నిరాకార పరబ్రహ్మను ధ్యానించగలిగే స్థితిని చేరేవరకు సగుణమూర్తిని ఉపాసించటం సముచిత విధానమే.
రచన: నాగవరపు రవీంద్ర