వేదాల ననుసరించి యుగములు నాలుగు
అవి :
- 1) సత్యయుగము
- 2) త్రేతాయుగము
- 3) ద్వాపరయుగము
- 4) కలియుగము.
1. సత్యయుగము : నాలుగు యుగాలలో సత్య యుగము మొదటిది. ఈ సత్యయుగానికే కృతయుగమని పేరు. ఈ యుగమునందు భగవంతుడు నారాయణుడు, లక్ష్మీ సహితముగా భూమిని పరిపాలిస్తాడు. దీని కాల పరిమాణము 432000 * 4 = 1728000 అనగా పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరములు. ఈ యుగంలో ధర్మం నాలుగుపాదాల మీద నడుస్తుంది. ప్రజలు ఎలాంటి ఈతిబాధలు లేకుండా సుఖసంతోషాలతో ఉంటారు. అకాలమరణాలుండవు. ఈ యుగము వైవశ్వత మన్వంతరములో సత్యయుగము కార్తీక శుద్ధ నవమి రోజు ప్రారంభమయినది.
2. త్రేతాయుగము : రెండవ యుగము త్రేతా యుగము. ఈ యుగములో భగవంతుడు శ్రీ రామ చంద్రుడుగా అవతరించి రావణాసురుణ్ణి సంహరించి ధర్మ సంస్థాపన చేసాడు. ఈ యుగము పరిమితి 4,32,000 * 3 = 12,96,000 అనగా పన్నెండు లక్షల తొంభైఆరు వేల సంవత్సరములు. ఇందు ధర్మము మూడు పాదములపై నడుస్తుంది. ఈ యుగము వైశాఖ శుద్ధ తదియ రోజునుండి త్రేతాయుగము ప్రారంభమైనది.
3. ద్వాపరయుగము : మూడవు యుగమే ద్వాపర యుగము అని అంటారు, ఈ యుగమున భగవంతుడు శ్రీ కృష్ణుడుగా అవతరించారు. దీని కాల పరిమాణము 432000 * 2 = 864000అనగా ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరములు. చివరి ద్వాపర యుగము ముగిసి సుమారుగా ఐదు వేల సంవత్సరములు అయినది. ఇందు ధర్మము రెండు పాదముల పై నడుస్తుంది.
4. కలియుగము : కలి యుగము యొక్క కాల పరిమాణము 4,32,000 సంవత్సరములు, అందు సుమారుగా ఐదు వేల సంవత్సరములు గడిచిపోయినాయి. హిందూ మరియు బౌద్ధ కాలమానములకు ఆధార గ్రంధమైన సూర్య సిద్ధాంత ప్రకారము పూర్వ శఖము 3102 ఫిబ్రవరి 18 అర్ధరాత్రి (00:00) కలియుగము ప్రారంభమైనది. కృష్ణుడు సరిగ్గా అదే సమయానికి అవతారమును చాలించాడని భావిస్తారు. కలియుగాంతము నందు కల్కి రూపమున భగవంతుడు అవతరించి తిరిగి సత్య యుగ స్థాపనకు మార్గము సుగమము చేస్తారు.
రచన: అధికారాల శివ