ముక్తికి మార్గశిర మాసం
చాంద్రమాన సంప్రదాయాన్ని అనుసరించి చంద్రుడు మృగశిర నక్షత్రంలో ఉండే నెల మార్గశీర్షం. ఇది ప్రకృతి కాంతకు సీమంతం. తుషార బిందువుల హేమంతం. శ్రీమహావిష్ణువుకు ఇష్టమైన మాసం. 'మాసానాం మార్గశీర్షం'- మాసాల్లో తాను మార్గశిరమాసాన్ని అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోని విభూతియోగంలో. ఈకాలంలో పొలాలనుంచి ధాన్యం ఇళ్లకు చేరి ప్రజలు సంతోషంగా ఉంటారని ఉత్తమ మాసంగా పరిగణిస్తారు.
ఈ మాసమంతా శ్రీ విష్ణువును తులసీ దళముతో పూజించడం, పుణ్యప్రదం. ద్వాదశినాడు పంచామృతాలతో అభిషేకం చేయవలెను. శ్రీ విష్ణుతోపాటు సూర్యున్ని కూడా పూజించి శుభాలను పొందాలని, ఏ పనిచేస్తున్నా ఈ మాసంలో ‘ఓం దామోదరాయనమః, ఓ నమో నారాయణయనమః’ అనే మంత్రాన్ని పఠించాలని శాస్త్ర వచనం.
ప్రతిరోజు బ్రాహ్మీముహూర్తంలో తులసి వృక్ష సన్నిధిలోని మృత్తికతో, తులసి ఆకులను తీసికొని ‘ఓం నమో నారాయణాయ’ అనే మంత్రాన్ని పఠిస్తూ శరీరానికి పూసుకుని స్నానమాచరించాలి.
సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించగా వచ్చే ధనుస్సంక్రమణంతో సంక్రాంతి శోభకు స్వాగతం పలిేకందుకు ప్రతీ పల్లె సిద్ధమవుతుంది. సంక్రాంతి పండుగకు నెలరోజులు ముందుగా వచ్చే ధనుర్మాసం ఆధ్యాత్మికతతో ముడిపడి ఉంది.
సంక్రాంతిశోభ:
హరిదాసు ఆగమనం సంక్రాంతి సంబరాల శోభకు సంకేతమే. ధనుర్మాస నెల ఆరంభం నుంచి చాత్తాద శ్రీవైష్ణవ మతానికి చెందిన హరిదాసులు తమదైన ప్రత్యేకశైలిలో వేషధారణ చేసి తమ గానామృతంతో గ్రామవీధుల్లో తిరుగుతారు. హరిదాసులు వస్తున్నారంటే చిన్నారుల్లో సందడే సందడి. దోసెళ్ళతోను, పళ్ళాలతోను బియ్యం తీసుకువచ్చి అక్షయపాత్రలో పోస్తారు. ప్రతీ ఇంటా సంక్రాంతి ముస్తాబులు ఆరంభిస్తారు. శ్రీహరి నామస్మరణంతో తిరిగాడే హరిదాసు వృత్తికి పురాణ ప్రాశస్త్యం ఎంతో ఉంది.
అక్షయపాత్ర విశిష్టత:
అక్షయ అనగా ఎప్పుడూ నిండుగా ఉండేదని అర్ధం. శ్రీమహావిష్ణువు సూర్యభగవానుడికి అందించిన ఈ అక్షయపాత్రను పాండవుల వనవాస సమయంలో ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఇచ్చాడని తదుపరి ధర్మరాజు పట్టాభిషేకం సమయంలో ఈ పాత్రను ఎవరికి అందించాలన్న ప్రశ్నకు కృష్ణ్ణుడు బదులిస్తూ వేయిగంటల మండపాన్ని కట్టించి బ్రాహ్మణులకు భోజనం పెట్టమని ఆ సమయంలో గంటలు మోగాలని శ్రీకృష్ణుడు చెప్పినట్లు పురాణ కథనం.
ఆ ప్రకారం ధర్మరాజు బ్రాహ్మణులకు భోజనం పెట్టినా గంటలు మోగకపోవడంతో ధర్మరాజు శ్రీకృష్ణున్ని ప్రార్ధించాడని అప్పుడు చాత్తాది శ్రీవైష్ణవునకు భోజనం పెట్టమని ఆదేశించాడు. చాత్తాది శ్రీవైష్ణవుడు తాను భోజనం చేయనని స్వయంపాకం ఇమ్మని కోరినట్లు ఆ ప్రకారం అతడు స్వయంపాకాన్ని తీసుకువెళ్ళి వండి గోదాదేవీ సహిత శ్రీకృష్ణమూర్తిని అర్చించి నివేదన చేసి అప్పుడు అతను భుజించగా గంటలు మోగినట్లు ప్రతీతి అని హరిదాసులు చెబుతుంటారు. అప్పుడు ధర్మరాజు అక్షయపాత్రను చాత్తాది శ్రీవైష్ణవునకు ఇచ్చినట్లు నాటి నుండి వంశపారంపర్యం గా కులవృత్తిగా ఈ హరిదాసులు అక్షయపాత్రను ధరించి గ్రామసంచారం చేస్తున్నట్లు వీరు చెబుతారు. ధనుర్మాసం నెలరోజులూ సూర్యోదయానికి పూర్వమే శ్రీకృష్ణ్ణ గోదాదేవీలను అర్చించి తిరుప్పావై పఠించి అక్షయపాత్రను ధరించి గ్రామ సంచారం ప్రారంభిస్తామని తెలిపారు. గ్రామ సంచార ప్రారంభం నుంచి తిరిగి వచ్చేవరకు హరినామ సంకీర్తన తప్ప ఇతరులతో సంభాషణ చేయడంకానీ, అక్షయపాత్ర దింపడం కానీ చేయరాదని చెబుతారు.
తెల తెల్లవారుతుండగానే నారదముని వేషధారణలో "హరిలో రంగ హరి" అంటూ మాత్రం గ్రామాల్లో హరిదాసులు వేకువ జామునే కనిపిస్తుంటారు. ఒక చేతితో చిడతల సవ్వడి... మరొక చేతితో భుజాన వేసుకున్న తుంబుర వారుుస్తూ శిరస్సుపై గుండ్రని గుమ్మడి లాంటి రాగి పాత్ర, మెడలో పూల దండ, కాళ్ళకు గజ్జెలు, నోటితో హరినామస్మరణ ఇవన్నింటితో హరిదాసు గ్రామాల్లో తిరుగుతుంటూ ఆ వీధిలో ఉంటే ఈ వీధి వారికి, ఈ వీధిలో ఉంటే ఆ వీధి వారికి హరిదాసు సవ్వడి వినిపిస్తుంది.
మార్గశిరం ఎన్నో పర్వాలకు నెలవు. మార్గశిర శుద్ధ 'స్కంద షష్ఠి'- శివకుమారుడైన కుమారస్వామి ఈరోజున తారకాసురుని సంహరించాడని ఈ తిథి అతనికి ప్రియమైనదని చెబుతారు. తెలుగువారు దీన్ని 'సుబ్రహ్మణ్య షష్ఠి' అని వ్యవహరిస్తారు. మార్గశిర శుద్ధ ఏకాదశి 'వైకుంఠ ఏకాదశి'. దీనినే 'మోక్ష్తెకాదశి' అనీ అంటారు. ఆ రోజున విష్ణ్వాలయాల్లో ఉత్తరద్వారంనుంచి వెళ్లి దర్శనం చేసుకుంటే మోక్షం తథ్యమని భక్తుల విశ్వాసం. తిరుపతి, శ్రీరంగంవంటి వైష్ణవ క్షేత్రాల్లో ఆరోజు గొప్ప ఉత్సవం. వైకుంఠ ద్వారం సూర్యుని ఉత్తరాయణ ప్రవేశచిహ్నంగా భావిస్తారు. ఈ ఏకాదశి గీతాజయంతి. సమస్త మానవాళికి ధర్మ భాండాగారం, భారతీయ ఆధ్యాత్మ వాఞ్మయంలో శిఖరాయమానం అయిన భగవద్గీతను కృష్ణ భగవానుడు ప్రబోధించిన రోజు. మార్గశిర బహుళ ఏకాదశిని విమలైకాదశి అని, సఫలైకాదశి అని వ్యవహరిస్తారు.
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల సమైక్యస్థితి దత్తాత్రేయుడు. ఈ దత్తజయంతిని మార్గశిరంలోనే శుక్లపూర్ణిమనాడు జరుపుకొంటారు. మార్గశిర శుక్ల త్రయోదశినాడు హనుమద్వ్రతం ఆచరించడం పరిపాటి. ఇలా ఎన్నో విశిష్టతలతో భక్తజనావళికి హర్షం మార్గశీర్షం
అనువాదము: కోటి మాధవ్ బాలు చౌదరి