సాయంత్రం 4-30కి మట్టపల్లి చేరుకున్నాము. ఇక్కడ బ్రహ్మణ, వైశ్య వగైరా కుల ప్రాతిపదికపైన సత్రాలున్నాయి. గది అద్దె రోజుకి వంద రూపాయలు. భోజనం గురించి ముందు చెప్తే ఆ సత్రాలవాళ్ళు ఏర్పాటు చేస్తారు. ఒక దానిలో గది తీసుకుని సామాను పెట్టి దేవాలయానికి బయల్దేరాము.
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, మట్టపల్లి
ఆలయ దృశ్యం |
ఆలయం లోపల దృశ్యం |
ఆలయ దృశ్యం |
ఈ క్షేత్రమునకు వచ్చిన భక్తులు కృష్ణలో స్నానంచేసి 32 ప్రదక్షిణలు చేస్తారు. ఇది ఈ క్షేత్రంయొక్క ప్రాముఖ్యత. ఎందుకంటే మట్టపల్లి స్వామివారే స్వయంగా చెప్పారుట. సంపూర్ణమైన విశ్వాసం మరియు భక్తితో ఏదైనా కోరిక కోరుకుని 32 ప్రదక్షిణలు చేసి, కోరిన కోర్కె తీరిన తర్వాత మరలా ఈ క్షేత్రమునకు వచ్చి 32 ప్రదక్షిణలు చేయండి మీ కోరికలు నేను తీరుస్తాను అని. ఇంకా అనారోగ్య బాధలు, దుష్ట గ్రహ బాధలు ఋణబాధలు వున్నవారు, సంతానము లేనివారు నా క్షేత్రమునకు వచ్చి 11 రోజులు మూడుపూటలు కృష్ణలో స్నానం చేసి తడి బట్టలతో 32 ప్రదక్షిణలు చేసినచో మీ అన్ని కోర్కెలు తీరుస్తాను అని చెప్పారుట. ఈ క్షేత్రంలో యమధర్మరాజు స్వయంగా వచ్చి ప్రదక్షిణలు చేశారుట. అందుకే ఈ క్షేత్రానికి యమ మోహిత క్షేత్రమని కూడా పేరు.
ఇక్కడ రాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లను స్వామిని శాంతింప చేయటానికి తర్వాత ప్రతిష్టించారుట. ఉదయం కృష్ణ స్నానం, ప్రదక్షిణలు, దర్శనం అయ్యాక 10 గంటలకు బయల్దేరి 11-20 కి మేళ్ళ చెరువు చేరుకున్నాము.