కోకిలా వ్రతం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది?
సద్గుణ సంపన్నురాలైన యువతి భార్యగా లభించడం కోసం యువకులు, తల్లిదండ్రులను మరిపించే ప్రేమానురాగాలను అందించే యువకుడిని భర్తగా పొందాలని యువతులు ఆశిస్తుంటారు. వాళ్ల కోరిక నెరవేరాలంటే 'కోకిలా వ్రతం' చేయాలని శాస్త్రం చెబుతోంది.
కోకిలా వ్రతాన్ని మొదట పార్వతీ దేవి, శివున్ని భర్తగా పొందటానికి చేసినట్లుగా భావిస్తారు. ఈ వ్రత సందర్బంగా సతీ దేవిని మరియు శివుడిని ఆరాధిస్తారు. ఈ వ్రతానికి సంబంధించిన కథ ప్రకారం దక్షుడు శివుడిని అవమానించినప్పుడు సతీదేవి తనలో తాను దహనమైపోతుంది. అలా మరణించిన ఆమె కోయిల రూపంలో పది వేల సంవత్సరాలు గడిపిన తర్వాతనే పార్వతిగా జన్మించి శివున్ని వివాహం చేసుకొంది.
పార్వతీ పరమేశ్వర |
సాధారణంగా ఆడపిల్లలు తల్లిదండ్రుల దగ్గర కాస్త గారాబంగా పెరుగుతుంటారు. అంతటి అపురూపంగా పెంచుకున్న తమ కూతురికి ఎలాంటి భర్త లభిస్తాడోనని వాళ్లు ఆందోళన చెందుతుంటారు. ఆమెకి తగిన జోడీని వెతకడంలో తాము పొరపాటు పడకుండా చూడమని దైవాన్ని కోరుతుంటారు.
ఇక యువకుడి విషయానికి వచ్చేసరికి అతని గురించి కూడా తల్లిదండ్రులు అదే విధంగా ఆలోచిస్తూ వుంటారు. తమ తరువాత ఆ కుటుంబాన్ని చక్కదిద్దవలసిన బాధ్యత కోడలికే వుంటుంది కనుక, ఉత్తమురాలైన అమ్మాయి తమకి కోడలిగా లభించేలా చేయమని దేవుడిని ప్రార్ధిస్తుంటారు. ఎందుకంటే సరైన తోడు దొరక్కపోతే అది ఒక జీవితకాలపు శిక్షగా మిగిలిపోతుందని ఇరు కుటుంబాలవాళ్లు భావిస్తుంటారు.
మరి జీవితాన్ని అనూహ్యమైన మలుపుతిప్పే వివాహం విషయంలో అంతా మంచే జరగాలంటే ' కోకిలా వ్రతం' చేయాలని శాస్త్రం చెబుతోంది. 'ఆషాఢ శుద్ధ పౌర్ణమి' మొదలు తెలక పిండితో ప్రతిరోజు కోకిల ప్రతిమను తయారుచేస్తూ, నెలరోజులపాటు దానిని పూజించాలనేది ఈ వ్రతం చెబుతోంది. ఈ వ్రతానికి సంబంధించి వివరాలు తెలుసుకుని, నియమబద్ధంగా ఆచరించడం వలన ఆశించిన ప్రయోజనం లభిస్తుంది.
కోకిలా వ్రత సంకల్పం మంత్రము
"మమధనధాన్య సహిత సౌభాగ్యప్రాప్తయే
శివతుష్టయే చ కోకిలావ్రతమహం కరిష్యే"
రచన: కళ్యాణ్