ఓం
దేవుడు అంటే English లో GOD అని అంటారు. G – Generator – సృష్టించేవాడు, O – Operator – పరిపాలించేవాడు, D – Destroyer – నాశనం చేసేవాడు (లయించేవాడు).
- 1. సృష్టించేవాడు బ్రహ్మ అని,
- 2. పరిపాలించేవాడు విష్ణువు అని
- 3. మరియు లయించేవాడు ఈశ్వరుడు అని మన పురాణాలు మనకు తెలిపాయి.
ఈ మూడు కూడ ఒకరినుండే జరుగుతున్నాయి. ఒకరే ఈ మూడుగా మారాడు. ఒకటి (శక్తి) మూడు అయింది. అయిన మూడులో ఒకరు అయిన బ్రహ్మ ఆ శక్తినుండే పంచభూతాలను (అగ్ని, నీరు, గాలి, ఆకాశం మరియు భూమి) సృష్టించాడు. కనిపించే ఈ సమస్తమైన నశ్వర (నశించే) ప్రకుతి అంతా ఈ పంచభూతాలనుండే వచ్చింది. అదేవిధంగా మనకు కనిపించే ఈ చరాచర జీవజాలం (మనుషులు, పక్షులు మరియు జంతువులు) అంతయు పంచభూతాల ద్వారానే తయారయ్యాయి. మన కండ్లకు కనిపించని ఆ శక్తే భగవంతుడయ్యాడు. ఆ భగవంతుడు సృష్టి స్తితి, కర్త మరియు లయగా మారినపుడు ఒక సూక్ష్మ రూప శరీర ధారి అయ్యాడు. ఆ సూక్ష్మ రూప శరీర ధారులైన వారిని దేవతలు అంటాము. అదేలాగు కనిపించే ఈ పంచభూతాలకు, అంతరిక్షంలోని గ్రహాలకు మరియు సూర్య, చంద్రాది మరియు నక్షత్ర్రాలకు అధిపతులు కూడ సూక్ష్మ శరీర రూప ధారులుగా ఉన్నారు. వారినే దేవతలు అంటారు.
ఇదే విషయాన్ని ఐతరేయోపనిషత్తులో వివరించారు, “సృష్టికి పూర్వం భగవంతుడు ఒక్కడు మాత్రమె ఉన్నాడు. వేరొకటి అంటూ ఏదియును లేదు. లోకాలను సృష్టించాలి అని అనుకున్నాడు. సృష్టించాడు” మరియు ““మహాచైతన్య పదార్థమైన పరమాత్మే సృష్టికర్తగాను, దేవతలగాను(పంచ భూతాల అధిపతులగాను), ప్రకృతిగను (భూమి, ఆకాశం, గాలి, అగ్ని మరియు జలము) అనే ఐదు మౌలిక మూలకాలుగాను అదే ఉన్నది. సమస్త ప్రాణి కోటి మరియు సమస్త జీవరాసులు కూడా ఆ ఆత్మనే అయి వుంది. స్థావర జంగామాలు అన్నీ ఆత్మే. సమస్తం ఆత్మ మార్గదర్శకంలో నడుచుకుంటున్నాయి. అన్ని ఆత్మలోనే నెలకొనివున్నాయి. లోకమంతా ఆత్మచే నడిపించ బడుతోంది. సమస్తానికి ఆత్మే ఆధారం. మహాచైతన్య పదార్థమైన ఆత్మే బ్రహ్మ.”
అయితే జీవుల జ్ఞానానికి, దృష్టికి అందని ఒకే అంశం, తత్త్వం ఈ సృష్టికి ముందు నుంచీ వుంది. ఇప్పుడు కూడా వుంది. తర్వాత కూడా వుంటుంది. దానినే మూల తత్త్వమనీ, భగవంతుడనీ పిలుస్తాం. దాని స్వభావాన్ని గ్రహించటం అనేది దాదాపు అసాధ్యం. అది సాధారణ భావనకు అందనిది.సమస్త సృష్టికీ కారణభూతమే ఈ అంశం. ఇది పరిపూర్ణమైనది. అణువు మొదలు బ్రహ్మాండం వరకు అన్నీ ఇందులోంచే ఉద్భవించాయి.
రచన: జి ఎం రెడ్డి