దత్తాత్రేయని జన్మదినాన్ని మార్గశిర పౌర్ణమి రోజున దత్త జయంతిగా జరుపుకుంటారు. ఇది పవిత్రమైన రోజుగా పరిగణించబడుతోంది. అత్రి మహాముని, మహా పతివ్రత అనసూయల సంతానమే దత్తాత్రేయుడు. ఈయన త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుల అంశలతో జన్మించిన అవతారమూర్తి. అందునా దత్తాత్రేయుడు విష్ణువు అంశతో, చంద్రుడు బ్రహ్మ అంశతో, దుర్వాసుడు శివుని అంశతో జన్మించారని పురాణ కథనం.
దత్త జయంతి రోజున తెల్లవారు జామునే భక్తులు నదీస్నానం లేదా ఏటి స్నానం చేస్తారు. దత్తత్రేయునికి షోడశోపచారాలతో పూజ చేస్తారు. జప ధ్యానాలకు ఈ రోజు ప్రాముఖ్యం ఇస్తారు. దత్తాత్రేయుని యోగమార్గం అవలంబిస్తామని సంకల్పించుకుంటారు. దత్త చరిత్ర, గుర చరిత్ర, అవధూత గీత, జీవన్ముక్త గీత, శ్రీపాదవల్లభ చరిత్ర, నృసింహసరస్వతి చరిత్ర, షిర్డి సాయిబాబా చరిత్రం, శ్రీదత్తదర్శనం వంటివి పారాయణ చేస్తారు. ఈ రోజు ఉపవాసం ఉండడం కూడా ఆనవాయితీనే. సాయం వేళలో భజనలు చేస్తారు. మహబూబ్ నగర్ జిల్లాలోని కురుపురం, తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం శ్రీపాద వల్లభ అవతారానికి సంబంధించిన ప్రదేశాలు. అవధూత దత్త పీఠం వారి ఆధ్వర్యంలో కూడా కొన్ని దత్తాత్రేయ ఆలయాలు ఉన్నాయి వాటిలో కూడా ప్రత్యేక పూజలు జరుగుతాయి.
దత్త జయంతి విశేషాలు
పరమాత్మ ఒక్కో సమయంలో ఒక్కో అవతారంలో వచ్చి ప్రజల్ని ఉద్ధరిస్తాడు. ధర్మావతారాల్లో రాముడిగా, కృష్ణుడిగా రాక్షస సంహారం ద్వారా ధర్మసంస్థాపన జరిపిన నారాయణుడే దత్తాత్రేయుడి అవతారంలో సమర్థ గురువుగా జ్ఞానప్రబోధ చేశాడు డిసెంబరు 13న అనగా ఈ రోజు దత్త జయంతి.
దత్తాత్రేయుడు శ్రీమన్నారాయణుడి ఆరో అవతారమని భాగవతమూ, విష్ణుపురాణమూ ఘోషిస్తున్నాయి. అత్రి మహర్షి, అనసూయ దంపతుల తనయుడిగా జన్మించాడు బాలదత్తుడు. ఆ దంపతులు ఓంకారాన్ని ధ్యానిస్తూ మహాతపస్సు చేశారు. ఆ సాధనకు మెచ్చి ఓ దివ్య తేజస్సు ప్రత్యక్షమైంది. ఆ కాంతిపుంజంలో త్రిమూర్తులు దర్శనమిచ్చారు. ఆ ముగ్గురు మూర్తుల అంశగా దత్తుడు వారికి జన్మించాడు. అత్రి అంటే త్రిగుణాతీత స్థితికి చేరుకున్నవాడని అర్థం. అతడి అర్ధాంగి అనసూయ అసూయలేనిది. నిజానికి ఇవి పేర్లు కాదు ఆ ఆలూమగల సుగుణాలు. ఆ సద్గుణ సంపన్నుల బిడ్డగా జన్మించాడు దత్తుడు. దత్తం అంటే సమర్పించుకోవడం దత్తుడు జ్ఞానబోధ కోసం తనను తాను అంకితం చేసుకున్నాడు. అత్రిపుత్రుడు కాబట్టి ఆత్రేయుడన్న పేరూ వచ్చింది.
దత్తుడిది జ్ఞానావతారం!
పిచ్చివాడిలానో, వ్యసనపరుడిలానో కనిపించి పైపై మెరుగులకు భ్రమపడిపోయే అజ్ఞానులకు బుద్ధిచెప్పిన ఉదంతాలు అనేకం. దేవతలకు కూడా చేతిలో కల్లుముంతతో, ఒడిలో ప్రియురాలితో దర్శనమిచ్చాడోసారి. అది సుర కాదు, బ్రహ్మజ్ఞానం. ఆమె శ్రీలక్ష్మి. దత్తుడు ఓపట్టాన అర్థం కాడు. దత్తతత్వాన్ని తెలుసుకోవాలంటే అహాన్ని వదిలిపెట్టాలి. శరణాగతి సూత్రాన్ని పాటించాలి.
అసుర సంహారం
పూర్వం జంభాసురుడనే రాక్షసుడు ప్రజల్ని హింసించేవాడు. దీంతో దేవతలంతా విష్ణు స్వరూపుడైన దత్తాత్రేయుడిని ప్రార్థించారు. ‘ఆ రాక్షసుడిని నా దగ్గరికి తీసుకురండి. మిగతా విషయాలు నేను చూసుకుంటాను’ అని మాటిచ్చాడు. దీంతో దేవతలు జంభాసురుడి మీద కయ్యానికి కాలుదువ్వుతున్నట్టు నటించారు. ఆ అసురుడికి కోపం తన్నుకొచ్చింది. ‘ఇంతకుముందే చావుదెబ్బ తీశాను. అంతలోనే ఇంత ధైర్యం ఏమిటి?’ అంటూ కోపంగా మళ్లీ రంగంలో దూకాడు. దేవతలు ఉద్దేశపూర్వకంగా వెన్నుచూపారు. జంభాసురుడు వాళ్లను తరుముతూ వెళ్లాడు. దత్తుడి సమక్షంలోకి వెళ్లగానే ఠక్కున మాయమైపోయింది దేవగణమంతా ఎదురుగా ఒడిలో అందాల రాశితో, మహాభోగిలా దర్శనమిచ్చాడు దత్తాత్రేయుడు.
జంభాసురుడి కళ్లు ఆ సౌందర్యరాశి మీదికి మళ్లాయి. ఆమె శ్రీమహాలక్ష్మి అన్న ఇంగితం కూడా లేకుండా బలవంతంగా తీసుకెళ్లి నెత్తిమీద పెట్టుకున్నాడు. సంపద నెత్తికెక్కిందంటే, పతనం మొదలైనట్టే. జంభాసురుడి బలం క్షీణించసాగింది. దేవతల పని సులువైపోయింది. అసుర సంహారం జరిగిపోయింది.
ప్రహ్లాద వరదుడు
అనేక సంవత్సరాల రాజ్యపాలన తర్వాత జ్ఞానాన్వేషణలో ప్రహ్లాదుడు అరణ్యమార్గం పట్టాడు. అక్కడ, అజగరవృత్తిలో ఓ వ్యక్తి కనిపించాడు. అజగరం అంటే కొండచిలువ! ఆ విషప్రాణికో ప్రత్యేకత ఉంది. కొండచిలువ ఆహారం కోసం వేటకు వెళ్లదు. తాను ఉన్నచోటికి ఆహారం వస్తే మాత్రం గుటుక్కున మింగి కడుపు నింపుకుంటుంది. లేకపోతే ఉపవాసమే. సాధకులు కూడా ఆహారపానీయాల విషయంలో ఇలాంటి నిర్మోహత్వాన్నే అనుసరిస్తారు. పిచ్చివాడిలా కనిపిస్తున్న ఆ మనిషే దత్తుడని ప్రహ్లాదుడు గ్రహించాడు. ‘జై గురుదత్తా ’ అంటూ పాదాల మీద పడ్డాడు.
ఆ మహాగురువు కరుణించి జ్ఞానమార్గాన్ని బోధించాడు. వివిధ సందర్భాల్లో కార్తవీర్యార్జునుడికీ, పరశురాముడికీ, యదువంశ మూలపురుషుడు యదువుకూ ఇలా ఎంతోమందికి జ్ఞానాన్ని బోధించాడు దత్తగురుడు. యోగిరాజ వల్లభుడు, జ్ఞానసాగరుడు, సంస్కారహీన శివురూపుడు ఇలా భిన్నరూపాలలో కనిపించి భక్తులకు దివ్యప్రబోధ చేశాడు. మహారాష్ట్రలోని మహుర్ సుప్రసిద్ధ దత్తక్షేత్రం. దత్తుడు కాశీలో స్నానంచేసి, కొల్హాపూర్లో భిక్ష స్వీకరించి, మహుర్లో నిద్రించేవాడని అంటారు. శ్రీపాద శ్రీవల్లభుడు (పిఠాపురం), నరసింహ సరస్వతి (మహారాష్ట్ర), అక్కల్కోట మహరాజ్ (అక్కల్), షిర్డీసాయి (షిర్డీ) దత్తుని అవతారాలని చెబుతారు. దత్తుడు స్మృతిగామి తలచిన వెంటనే భక్తుల హృదయాల్లో ప్రత్యక్షమైపోతాడని సాధకుల విశ్వాసం.
తెలుగు గడ్డ మీద దత్తుడు:
మార్గశిర పౌర్ణమినాడు దత్తుడు ఉదయించాడు. అదే దత్తజయంతి. దత్తుడి రూపం అపురూపం. ఆరు చేతులూ, మూడు తలలూ, చేతిలో డమరుకమూ, త్రిశూలమూ తదితర ఆయుధాలుంటాయి. చుట్టూ కుక్కలు ఉంటాయి. ఆ శునకాలు వేదానికి ప్రతీకలు. ఆయన వెనకాల కనిపించే గోవు ఉపనిషత్తుల సారం. దత్తజయంతినాడు ఆస్తికులు జపతపాలతో, పూజలతో గడుపుతారు. పగలంతా ఉపవాసం చేసి, సాయంత్రం భజనలూ సత్సంగాలూ నిర్వహించుకుంటారు. దత్తచరిత్ర, అవధూత గీత తదితర గ్రంథాల్ని పారాయణ చేస్తారు.
ఒకానొక సమయంలో దత్త సంప్రదాయం తెలుగు గడ్డ మీద వెలుగులీనింది. దత్తుడి అవతారమని భావించే శ్రీపాద శ్రీవల్లభుడు ఆంధ్రదేశంలోని పిఠాపురంలో జన్మించాడు. కర్ణాటక-తెలంగాణ సరిహద్దులోని కురుపురంలో ఆశ్రమజీవితం గడిపాడు. అక్కడి కృష్ణాతీరంలో ఓ ఆలయాన్ని నిర్మించారు భక్తులు. నేపాల్ తదితర ప్రాంతాల్లోనూ దత్తక్షేత్రాలున్నాయి.
దత్తం దత్తం పునర్దత్తం యోవదేత్ భక్తి సంయుతః !
తస్య పాపాని సర్వాణి క్షయం యాంతి న సంశయః !!
ఎవరైతే శ్రీ దత్తాత్రేయుని భక్తితో స్మరిస్తారో వారి సమస్త పాపములు నశిస్తాయి. దీనిలో సందేహం లేదని‘ దత్త హృదయం ’నందు చెప్పబడినది. శ్రీ దత్తాత్రేయుడు కేవలం స్మరణ మాత్ర్ర సంతుష్టుడు. తీవ్రమైన పూజాదికాలు చేయకపోయినా “అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ” అనే పవిత్ర భావనతో, భక్తితో దత్త, దత్త అని స్మరిస్తే చాలు ఏదో ఒక రూపంలో వచ్చి, రక్షించి కోరిన కోరికలు తీర్చు దయామయుడు శ్రీదత్తాత్రేయుడు. శ్రీభాగవత గ్రంథమునందు ప్రథమస్కంధ,తృతీయాధ్యాయములో భగవంతుని 21 అవతారములలో ఆరవ అవతారం దత్తాత్రేయుని అవతారమని చెప్పబడినది.
స్వామి స్మరణ రోగాలను పటాపంచలు చేస్తుంది. భూత, ప్రేత, పిశాచ, గ్రహబాధలను దూరం చేస్తుంది. పీడకలలు దరిరావు. సర్ప,వృశ్చికాది జనిత విషబాధలు, కుష్టు మొదలైన వ్యాధులు నశిస్తాయి. త్రికరణశుద్ధి కలుగుతుంది. కోరిన కోర్కెలు నెరవేరి జీవితము ధన్యమవుతుంది.
శ్రీ దత్తుని రూపంలో అంతరార్థం
శ్రీ దత్తమూర్తి మూడు శిరస్సులతో, ఆరుభుజములతో, ఆయుధములతో, నాలుగు కుక్కలతో, ఆవుతో ఉన్నట్టు చిత్రించబడి ఉంటుంది. వీటికి గల అర్థాలను పరిశీలిస్తే
మూడు శిరస్సులు:
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, సృష్టి, స్థితి, లయములు, ఓంకారములోని అ, ఉ, మ లు త్రిమూర్త్యాత్మక పరబ్రహ్మము.
- నాలుగు కుక్కలు:
- నాలుగు వేదములు ఇవి. శ్రీ దత్తమూర్తి సకల వేదవిజ్ఞానమును అధిగమించిన జ్ఞానసాగరుడు.
- ఆవు: మనసే మాయాశక్తి. సంకల్ప, వికల్పములకు, సుఖదుఃఖములకు కారణమైన మాయను యోగబలముచే శ్రీదత్తమూర్తి కామధేనువుగా మార్చాడు.
- మాల: అక్షరమాల, సర్వమంత్రమయము, సమస్త వైఖరి, వాగ్జాలమునకు, సాహిత్యసంగీతములకు సర్వ వ్యవహారములకు మూలము.
- త్రిశూలము : ఆచారము, వ్యవహారము, ధర్మార్థ కామముల సంపుటి.
- చక్రము: అవిద్యా నాశకము, ఆత్మావలోకన, సామర్థ్యమును, వివేకమును కలుగచేయును.
- డమరు: సర్వవేదములు దీనినుంచి ప్రాదుర్భవించినవి.
- కమండలము: సమస్త బాధలను పోగొట్టును. శుభములను సమకూర్చును.
1.దిగంబరం భస్మవిలేపితాంగం !
బోధాత్మకం ముక్తితరం ప్రసన్నం !
నిర్మానసం శ్యామల తనుంభజేహమ్ !
దత్తాత్రేయం బ్రహ్మ సమాధియుక్తం !!
2. అనసూయాత్రి సంభూతా దత్తాత్రేయో దిగంబరః !
స్మర్తృగామి స్వభక్తాన ముద్ధార్థ భవసంకటాత్ !!
పై రెండు శ్లోకాలు నిత్యం 108 సార్లు పఠిస్తే కష్టాల బాధలుండవు.
3. నమస్తే భగవాన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభో !
సర్వరోగ ప్రశమనం కురుశాన్తిం ప్రయచ్చమే !!
ఈ శ్లోక జపంవల్ల రోగభయం ఉండదు. దీర్ఘకాలిక రోగాలు నిదానిస్తాయి.
4. అత్రేరాత్మ ప్రధానేన యోముక్తో భగవాన్ ఋణాత్ !
దత్తత్రేయం తమీశానం నమామి ఋణవిముక్తయే !!
ఈ శ్లోకజపం అప్పులబాధను నివారిస్తుంది.
5. విద్యుత్సుత మవిద్యం యత్ ఆగతం లోకనిందితం !
భిన్న జిహ్వం బుధం చక్రే శ్రీ దత్తం శరణం మమ !!
ఈ శ్లోక పఠనం వలన ఉన్నత విద్య లబిస్తుంది.
6. దరిద్ర విప్రగే హేయః శాకం భుక్త్యోత్త మశ్రియం !
దదౌ శ్రీ దత్త దేవః సదాదారిద్ర్యాత్ శ్రీ పదో2వతు !!
ఈ శ్లోకం దరిద్రం నుంచి విముక్తి కలిగిస్తుంది.
7. దూరీకృత్య పిశాచార్తిం జీవయిత్వామృతం సుతమ్ !
యో భూదభీష్టదః పాతునః సంతాన వృద్ధికృత్ !!
ఈ శ్లోకం సత్సంతానాన్ని అనుగ్రహిస్తుంది.
8. అచింత్యా వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే !
సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః !!
శ్రీ దత్తాత్రేయ స్తోత్రం:
జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం |
సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే ||
జగదుత్పత్తికర్త్రే చ స్థితిసంహారహేతవే |
భవపాశవిముక్తాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧ ||
జరాజన్మవినాశాయ దేహశుద్ధికరాయ చ |
దిగంబరదయామూర్తే దత్తాత్రేయ నమోఽస్తుతే || ౨ ||
కర్పూరకాంతిదేహాయ బ్రహ్మమూర్తిధరాయ చ |
వేదశాస్త్రపరిజ్ఞాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౩ ||
హ్రస్వదీర్ఘకృశస్థూలనామగోత్రవివర్జిత |
పంచభూతైకదీప్తాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౪ ||
యజ్ఞభోక్తే చ యజ్ఞాయ యజ్ఞరూపధరాయ చ |
యజ్ఞప్రియాయ సిద్ధాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౫ ||
ఆదౌ బ్రహ్మా మధ్యే విష్ణుః అంతే దేవః సదాశివః |
మూర్తిత్రయస్వరూపాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౬ ||
భోగాలయాయ భోగాయ యోగయోగ్యాయ ధారిణే |
జితేంద్రియజితజ్ఞాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౭ ||
దిగంబరాయ దివ్యాయ దివ్యరూపధరాయ చ |
సదోదితపరబ్రహ్మ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౮ ||
జంబుద్వీపే మహాక్షేత్రే మాతాపురనివాసినే |
జయమానసతాం దేవ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౯ ||
భిక్షాటనం గృహే గ్రామే పాత్రం హేమమయం కరే |
నానాస్వాదమయీ భిక్షా దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧౦ ||
బ్రహ్మజ్ఞానమయీ ముద్రా వస్త్రే చాకాశభూతలే |
ప్రజ్ఞానఘనబోధాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧౧ ||
అవధూతసదానందపరబ్రహ్మస్వరూపిణే |
విదేహదేహరూపాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧౨ ||
సత్యరూపసదాచారసత్యధర్మపరాయణ |
సత్యాశ్రయపరోక్షాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧౩ ||
శూలహస్తగదాపాణే వనమాలాసుకంధర |
యజ్ఞసూత్రధరబ్రహ్మన్ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧౪ ||
క్షరాక్షరస్వరూపాయ పరాత్పరతరాయ చ |
దత్తముక్తిపరస్తోత్ర దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧౫ ||
దత్త విద్యాఢ్యలక్ష్మీశ దత్త స్వాత్మస్వరూపిణే |
గుణనిర్గుణరూపాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧౬ ||
శత్రునాశకరం స్తోత్రం జ్ఞానవిజ్ఞానదాయకమ్ |
సర్వపాపం శమం యాతి దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧౭ ||
ఇదం స్తోత్రం మహద్దివ్యం దత్తప్రత్యక్షకారకమ్ |
దత్తాత్రేయప్రసాదాచ్చ నారదేన ప్రకీర్తితమ్ || ౧౮ ||
ప్రతి నిత్యం పై శ్లోకాలన్నీ కానీ లేదా మీకవసరమైనవిగానీ పఠించి శ్రీ దత్తాత్రేయుని అనుగ్రహం పొందండి.
రచన: వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు శాంతి నగర్,ఖాదీ కాలనీ, తిరుపతి