గీత.. భగవద్గీత అంటే తెలియని వారు ఉండరు. ప్రపంచంలో దాదాపు 100కు పైగా భాషల్లో దీన్ని అనువదించి అందరూ అనుసరిస్తున్న గ్రంథం. ఇది కేవలం హిందువులకే కాదు సర్వమానవాళికి నేటికి ఎప్పటికీ కొత్తగా ఉండే ఒక మార్గదర్శి. ఎవరు ఏ కోణంలో చూసినా దానిలో వారి వారి సమస్యలకు పరిష్కారం చూపిస్తూ ప్రపంచంలో గొప్ప మేనేజ్మెంట్ గ్రంథంగా అనుసరించబడుతున్న పవిత్ర గ్రంథం. విష్ణుమూర్తి దశావతారాల్లో పరిపూర్ణ అవతారమైన శ్రీకృష్ణుడి అవతారంలో దీన్ని అర్జునుడికి ఉపదేశించాడు. కురుక్షేత్ర సంగ్రామంలో తన బంధువులను, గురువు, స్నేహితులను చూసిన అర్జునుడి వారితో యుద్ధం చేయడానికి మనసు అంగీకరించదు…
ఆ సమయంలో కార్యోన్ముఖుడిని చేయడానికి శ్రీ కృష్ణపరమాత్మ లోకానికి అందించిన బ్రహ్మవిద్య భగవద్గీత. దీనిని మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున భగవానుడు అందించాడని నమ్మకం. అందుకే ఆ రోజున ప్రపంచ వ్యాప్తంగా గీతా జయంతిని జరుపుకుంటారు. గీత సాక్షాత్తు భగవానుడి నోటి నుంచి వచ్చింది. ఎలాంటి సందేహానికి తావులేకుండా పరమ ప్రామాణికమైన మానవజాతికి దివ్యమార్గాన్ని చూపే పవిత్ర గ్రంథం భగవద్గీత.
గీత అర్థం పరిశీలిస్తే… గీకారం త్యాగరూపం స్యాత్, తకారమ్ తత్వబోధకమ్, గీతా వాక్య మిదమ్ తత్వం, జ్ఞేయమ్ సర్వ
ముముక్షుభి:
అక్షరం తత్వాన్ని అంటే ఆత్మస్వరూపాన్ని ఉపదేశిస్తుంది. గీత అనే రెండు శబ్దాలకు అర్థం ఇదేనని ముముక్షువులు తెలుసుకోవాలని పండితులు పేర్కొంటున్నారు. త్యాగ శబ్దానికి నిష్కామ యోగమైన కర్మ ఫలత్యాగమనీ లేక సర్వ సంగపరిత్యాగమనీ అర్థం. అలాగే తత్వబోధన ఆత్మసాక్షాత్కారమనీ, బంధం నుంచి విముక్తి పొందడం అనే అర్థం ఉంది. ఈ పరమ రహస్యాన్నే గీతాశాస్త్రం ఉపదేశిస్తుంది. అలాంటి పరమపావనమైన గీత భగవానుని నోటి నుంచి వెలువడిన మహాపుణ్యదినం మార్గశిర శుద్ధ ఏకాదశి. నేడు ఈ పవిత్ర గ్రంథాన్ని సృజించినా మహాపుణ్యం దక్కుతుంది. ఇక దీని పఠన ప్రభావాన్ని వర్ణింపసాధ్యం కాదు. మానవాళి సర్వ సమస్యలకు పరిష్కారాన్ని సూచించే గ్రంథం గీత.
” సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాననందనః
పార్థోవత్సః సుధీర్భోక్తాదుగ్ధం గీతామృతమ్మహత్”
సర్వ ఉపనిషత్తులను ఒక ఆవుగా,అర్జునుడిని దూడగా మలిచిన కృష్ణుడు తాను గోపాలకుడిగా వ్యవహరించాడు. అర్జునుడనే దూడను ఆవు దగ్గర పాలు తాగడానికి విడిచి, ఒక పక్క పార్థుడికి అందిస్తూనే, మరొవైపు లోకానికి పాలను (ఉపనిషత్ సారమైన గీతను)అందిచాడు. అందుకే గీత సకల ఉపనిషత్ల సారం.
గీతను టైం మేనేజ్మెంట్, ఎమెషనల్ బ్యాలన్స్, పర్సనల్ మేనేజ్మెంట్, టీం వర్క్, గ్రూప్ టాస్క్ వంటి వాటిని చేయడానికి దీన్ని ఫాలో అయితే చాలు అంటారు ఆధునిక మేనేజ్మెంట్ గురువులు. నేడు ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది గురువులు దీన్ని ప్రామాణికంగా తీసుకుని మోటివేషన్ నుంచి మేనేజ్మెంట్ వరకు పాఠాలు చెప్తున్నారు అంటే గీత గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు.
ఇక ఆధ్యాత్మిక వాదులకు ఇదొక ప్రమాణిక గ్రంథం. ఉపషనిషత్ రహస్యాలను అత్యంత సులభంగా గ్రహించేలా శ్రీకృష్ణుడు ప్రపంచానికి దీన్ని బోధించాడు
రచన: GM రెడ్డి
రచన: GM రెడ్డి