అష్టాదశ శక్తి పీఠాలు
అఖిల జగత్తుకు మూలదేవతగా జగన్మాతను ఆరాధించడం మన సంప్రదాయం.
- 卍 మహేశ్వరి,
- 卍 మహాకాళి,
- 卍 మహాలక్ష్మి,
- 卍 మహా సరస్వతి.
ఇలా ఒక్కొక్క రూపం ఒక్కో శక్తి కేంద్రమై ఈ విశ్వాన్ని కాపాడుతున్నాయి.
అష్టాదశ శక్తి పీఠాలతోపాటు అష్టోత్తర శత శక్తి పీఠాలతో భారతావని అణువణువూ మహా శక్తి కేంద్రమై విరాజిల్లుతోంది.ఈ శక్తి పీఠాలు ఆకారాది క్షకారాంత వర్ణమాలలోని ఒక్కో అక్షరానికి శక్తి స్థానమైన ప్రతీకలు. దీనివల్లే ప్రతి అక్షరం శక్తి సంపుటితమై మహా మంత్రమవుతోంది. శక్తి పీఠాలలో ప్రధానమైన అష్టాదశ పీఠాల ఆవిర్భావ విశేషాలు…
బ్రహ్మ సృష్టి ఆరంభంలో తొమ్మిది మంది ప్రజాపతుల్ని సృష్టించాడు. వారిలో దక్షప్రజాపతి ఒకడు. ఆయన కుమార్తె సతి తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా శివుడిని వివాహమాడింది. దీంతో దక్షుడు శివద్వేషిగా మారాడు.
శివుడిని అవమానించడం కోసం యజ్ఞం తలపెట్టాడు. అల్లుడు పరమేశ్వరుడు, కూతురు శక్తిని ఆహ్వానించకపోయినా స్త్రీ సహజమైన కుతూహలంతో ఆమె దక్షయజ్ఞానికి వెళ్ళింది. అక్కడ అవమానింపబడి యోగాగ్ని సృష్టించుకుని అందులో ఆహుతైంది. విషయం తెలిసిన శంకరుడు ఆగ్రహంతో శివ తాండవం చేశాడు. శివ జటాజూటం నుంచి వీరభద్రుడు ఆవిర్భవించి దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. పరమేశ్వరుడు దాక్షాయాణి మృతదేహాన్ని భుజంపై వేసుకుని విలయతాండవం చేయసాగాడు. బ్రహ్మాది దేవతలు భయంతో కంపించి విష్ణువు వద్దకు వెళ్లి ప్రార్థించారు. సతీదేవి శరీరం శంకరుడి భుజాన ఉన్నంత కాలం ఆయన రౌద్రం తగ్గదని భావించి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీర భాగల్ని ఖండఖండాలుగా చేశాడు.
శివుడిని అవమానించడం కోసం యజ్ఞం తలపెట్టాడు. అల్లుడు పరమేశ్వరుడు, కూతురు శక్తిని ఆహ్వానించకపోయినా స్త్రీ సహజమైన కుతూహలంతో ఆమె దక్షయజ్ఞానికి వెళ్ళింది. అక్కడ అవమానింపబడి యోగాగ్ని సృష్టించుకుని అందులో ఆహుతైంది. విషయం తెలిసిన శంకరుడు ఆగ్రహంతో శివ తాండవం చేశాడు. శివ జటాజూటం నుంచి వీరభద్రుడు ఆవిర్భవించి దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. పరమేశ్వరుడు దాక్షాయాణి మృతదేహాన్ని భుజంపై వేసుకుని విలయతాండవం చేయసాగాడు. బ్రహ్మాది దేవతలు భయంతో కంపించి విష్ణువు వద్దకు వెళ్లి ప్రార్థించారు. సతీదేవి శరీరం శంకరుడి భుజాన ఉన్నంత కాలం ఆయన రౌద్రం తగ్గదని భావించి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీర భాగల్ని ఖండఖండాలుగా చేశాడు.
సతీదేవి శరీర భాగాలు భారతదేశం అంతటా అక్కడక్కడా పడ్డాయి. ఆ శరీరం మొత్తం ఖండించడంతో పరమేశ్వరుడు క్రమంగా క్రోధం వదలి శాంత స్థితిలోకి చేరుకున్నాడు. ఆ ఖండాలు, ఆభరణాలు పడిన చోటల్లా ఒక శక్తి క్షేత్రంగా వెలసింది. అవే 108 శక్తి పీఠాలుగా గుర్తింపు పొందాయి. వాటిలో ప్రధానమైనవి పద్దెనిమిది శక్తి పీఠాలు.
1. శ్రీ శాంకరీదేవి – శ్రీలంక
ఇక్కడ సతీదేవి కాలి గజ్జెలు పడ్డాయి. శ్రీలంకలోని ట్రింకోమలిలో ఈ శక్తి పీఠం ఉంది. రావణాసురుడు శివభక్తుడు కావడం వల్ల పార్వతీదేవి లంకలో శ్రీ శాంకరీదేవిగా వెలసిందని ఐతిహ్యం.
2. శ్రీ కామాక్షీదేవి – కాంచీపురం
ఇక్కడ సతీదేవి వీపు భాగం పడింది. దేవతల విన్నపం మేరకు లోక కళ్యాణం కోసం దేవి బంధకాసురుడిని సంహరించి తన ఉగ్రరూపాన్ని మార్చుకుని కామాక్షిదేవిగా మారినట్లు పురాణ కథనం. ఈ శక్తి పీఠం తమిళనాడు రాజధాని చెన్నైకి 76 కి.మీ. దూరంలో ఉంది.
3. శ్రీ శృంఖలాదేవి – ప్రద్యుమ్నమ్
ఈ క్షేత్రంలో సతీదేవి ఉదరం పడింది. త్రేతాయుగంలో ఋష్యశృంగ మహర్షి శృంఖలాదేవిని సృష్టించినట్లు పురాణ కథనం. ఈ శక్తి పీఠం ప్రశ్చిమబంగలోని హుగ్లీ జిల్లా ప్రద్యుమ్నంలో ఉందీ. కోల్ కతాకు 135 కి.మీ. దూరంలో గల గంగాసాగర్ క్షేత్రం గొప్ప శక్తిపీఠంగా పేరొందింది.
4. శ్రీ చాముండేశ్వరి – మైసూరు
ఇక్కడ సతీదేవి తలా వెంట్రుకలు పడ్డాయి. త్రిమూర్తులు సహా సకల దేవతల అంశంతో వారివారి అస్త్రాలతో జన్మించి మహిషాసురుని వధించిన దేవియే శ్రీ చాముండేశ్వరి దేవి. ఈ శక్తి పీఠం కర్ణాటకలోని మైసూరు నగరానికి 13 కి.మీ. దూరంలో ఉంది.
5. శ్రీ జోగులాంబ – అలంపురం
సతీదేవి పైవరుస దంతాలు పడిన క్షేత్రమిది. ఈశ్వర ప్రసాది అయిన ఒక యువకుడు ఇక్కడ ఆలయ నిర్మాణం చేస్తుండగా ఆ ప్రాంత పాలకుడైన విలసద్రాజు ఆ యువకుడిని వధించాడు. ఫలితంగా రాజ్యం పోయి తిండిలేక సంచరిస్తున్న సమయంలో కనువిప్పు కలిగి జోగులాంబదేవి ఆలయం నిర్మించినట్లు పురాణ కథనం. ఈ శక్తి పీఠం మహబూబ్ నగర్ జిల్లాలో ఆలంపూర్ రైల్వే స్టేషన్ నుంచి 9 కి.మీ. దూరంలో ఉంది.
6. శ్రీ భ్రమరాంబదేవి – శ్రీశైలం
ఇక్కడ సతీదేవి మెడ భాగం పడింది. దేవతల, ఋషుల ప్రార్థనలకు మెచ్చి జగన్మాత ఝంకారం చేస్తూ ఉన్న భ్రమరాలతో వచ్చి అరుణాసురుని సంహరించింది. శ్రీ భ్రమరాంబాదేవిగా శ్రీశైలంలో కొలువుదీరినట్లు స్థల పురాణం. ఈ శక్తి పీఠం కర్నూలు జిల్లా శ్రీశైలంలో ఉంది. ఈ క్షేత్రం కర్నూలు నుంచి 179 కి.మీ., హైదరాబాద్ నుంచి 218 కి.మీ. దూరంలో ఉంది.
7. శ్రీ మహాలక్ష్మి – కొల్హాపూర్
ఈ క్షేత్రంలో సతీదేవి మూడు కళ్ళు పడ్డాయి. దేవతలందరూ మహాలక్ష్మిని ప్రార్థించగా వారి కోరిక మేరకు కాల్హుడిని సంహరించి ఈ క్షేత్రంలో కొలువైంది. ఇక్కడ చేసిన చిన్న దానం కూడా మేరు పర్వతమంత మేలుచేస్తుంది అని ఆర్యోక్తి. ఈ క్షేత్రానికి పూర్వనామం “కరవీర” పట్టణం. ఈ శక్తిపీఠం మహారాష్ట్రంలో ఉంది. ఈ శక్తి పీఠం హైదరాబాదుకు 540 కి.మీ. దూరంలో ఉంది.
8. శ్రీ ఏకవీరాదేవి – మహుర్వం
సతీదేవి కుడి చేయి ఈ ప్రాంతంలో పడింది. తండ్రి జమదగ్ని ఆజ్ఞతో పరశురాముడు తల్లి, సోదరుల తలలు నరికేశాడు. తల్లి శిరస్సు పడిన ప్రాంతమే ఈ క్షేత్రం. ఈ శక్తిపీఠం మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ నుంచి 42 కి.మీ. దూరంలో ఉంది.
9. శ్రీ మహాకాళి – ఉజ్జయిని
ఈ క్షేత్రంలో సతీదేవి పైపెదవి పడినట్లు చెబుతారు. త్రిపురాసురులను సంహరించడానికి శివుడు, పార్వతీదేవి మహాకాళిగా యుద్ధానికి సంసిద్ధమయ్యారు. పంచభూతాలు, బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడికి అస్త్రాలుగా సహాయపడ్డాయి. పరమేశ్వరుడు, మహాకాళి రాక్షసుణ్ణి సంహరించి విజయం సాధించిన ప్రాంతమే ఉజ్జయిని. ఈ శక్తిపీఠం మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఉంది. ఈ క్షేత్రం మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు 55 కి.మీ. దూరంలోని క్షిప్రానదీ తీరంలో వెలిసింది.
10. శ్రీ పురుహూతీకా దేవి – పిఠాపురం
ఇక్కడ సతీదేవి ఎడమ చేయి పడింది. గయాసురుడు అనే రాక్షసుని సంహరించడానికి త్రిమూర్తులు గయుని దేహమే యజ్ఞానికి సరైన స్థలంగా భావించారు. ముని అజ్ఞానుసారం యజ్ఞం చేస్తూ పార్వతీదేవి సహాయంతో గయాసురుణ్ణి సంహరించిన ప్రాంతమే పిఠాపురం. ఈ శక్తిపీఠం ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నుంచి 18 కి.మీ. దూరంలో ఉంది.
11. శ్రీ గిరిజాదేవి (బిరాజ దేవి) – ఒడిశా
ఇక్కడ సతీదేవి నాభి భాగం పడింది. లోకంలో శాంతి నశించి అశాంతిమయమైన సమయంలో లోకశాంతి కోసం బ్రహ్మదేవుడు యజ్ఞం చేశాడు. యజ్ఞం నుంచి గిరిజా దేవి ఉద్భవించింది. లోకంలో శాంతిని ప్రసాదించేందుకు ఈ ప్రాంతంలో కొలువైనట్లు పురాణ కథనం. ఈ శక్తిపీఠం ఒడిశా రాజధాని భువనేశ్వర్ కు 113 కి.మీ. దూరంలో ఉంది.
12. శ్రీ మాణిక్యాదేవి – ద్రాక్షారామం
ఈ క్షేత్రంలో సతీదేవి కణత భాగం పడింది. శివపార్వతుల తనయుడు కుమారస్వామి ఈ ప్రాంతంలోనే తారకాసురుణ్ణి సంహరించాడు. తారకాసురుడిలోని ఆత్మలింగం ముక్కలు కాగా ఏర్పడిన పంచారామాల్లో ఒకటి. ఈ శక్తిపీఠం ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు 33 కి.మీ. దూరంలో ఉంది.
13. శ్రీ కామరూపాదేవి – హరిక్షేత్రం
ఈ క్షేత్రంలో సతీదేవి యోని భాగం పడింది. ఈ శక్తిపీఠం అసోం రాజధాని గౌహతికి 7 కి.మీ దూరంలో ఉంది. బ్రహ్మపుత్రానదీ తీరంలో ఈ క్షేత్రంలో ఏటా ఆషాడమాసంలో అంబవాచి ఉత్సవం జరుగుతుంది. కాముడికి మళ్ళీ రూపం వచ్చిన ప్రాంతం కాబట్టి కామాఖ్య క్షేత్రమని, కాపారూప క్షేత్రమని అంటారు. ఇక్కడి నీలాంచల పర్వతం విష్ణు స్వరూపంగా భావిస్తారు కాబట్టి హరిక్షేత్రమని కూడా పిలుస్తారు.
14. శ్రీ మాధవేశ్వరి – ప్రయాగ
ఈ క్షేత్రంలో సతీదేవి చేతి ఉంగరం వేలు పడింది. క్షీరసాగరం నుంచి పుట్టిన అమృతం పంపకానికి శ్రీ మహావిష్ణువు మోహినీ అవతారమే శక్తి స్వరూపిణిగా ఇక్కడ కొలువుదీరినట్లు స్థలపురాణం. ఈ శక్తిపీఠం ఉత్తరప్రదేశ్ లోని అలహాబాదుకు 6 కి.మీ. దూరంలో ఉంది.
15. శ్రీ వైష్ణవీ దేవి – జ్వాలా క్షేత్రం
16. శ్రీ మాంగల్యాదేవి – గయ
ఇక్కడ సతీదేవి వక్షోజం పడినట్లు చెబుతారు. పిండప్రదానాలకు, పితృదేవతలకు పూజలకు పేరొందిన ప్రాంతమే గయా క్షేత్రం. ఫల్గుణీ, మధుర, శ్వేత అనే 3 నదుల సంగమమైన ప్రయాగ క్షేత్రంలో సమానమై ఫలం అందిస్తోంది. ఈ శక్తిపీఠం బిహార్ రాజధాని పాట్నా నగరానికి 74 కి.మీ. దూరంలో ఉంది.
17. శ్రీ విశాలాక్షి – వారణాసి
ఇక్కడ సతీదేవి మణికర్ణిక పడింది. అమ్మలగన్నయమ్మ అశేష భక్తులపై తన కృపాకటాక్షాలు ప్రసరించే క్షేత్రమే వారణాసి. కాశీక్షేత్రం, వేద విద్యలకు నిలయం, అక్కడ నిరంతరం శిష్యగణంతో వ్యాసమహర్షి విశేశ్వర, అన్నపూర్ణాంబికలను ఆరాధించేవాడు. ఈ శక్తిపీఠం ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఉంది. ఇది అలహాబాద్ కు 131 కి.మీ. దూరంలో ఉంది.
18. శ్రీ సరస్వతీ దేవి – కాశ్మీర్
కపటంతో పార్వతీదేవి ఇంటిని సొంతం చేసుకున్న రావణాసురునిపై కోపగించుకున్న పార్వదేవిని బుజ్జగిస్తున్న సరస్వతిని ఇక్కడే కొలువై ఉండమని చెప్పిన ప్రాంతమే కాశ్మీర్ క్షేత్రం. ఈ క్షేత్రంలో సతీదేవి దక్షిణ హస్తం పడినట్లు చెబుతారు. ఈ శక్తిపీఠం కాశ్మీర్ లోని శ్రీనగర్ కు 10 కి.మీ. దూరంలో ఉంది. ఒక్కప్పుడు ఇక్కడ ఉన్న శక్తి పీఠాన్ని వైదికులపై దాడి లో భాగంగా తురకలు ఈ ఆలయాన్ని కూల్చివేశారు.
అష్టాదశ శక్తిపీఠాలు దర్శించినా, స్మరించినా, జగములనేలే జగదంబ కరుణాకటాక్ష వీక్షణాలతో సకల శుభాలు కలిగి సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు పొందుతారు అని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
రచన: నాగవరపు రవీంద్ర