ఆరుద్ర పురుగు - దీనినే కొన్ని చోట్ల పట్టు పురుగు అనీ, చందమామ పురుగు అనీ, లేడీ బర్డ్ అనీ, ఇంద్రగోప పురుగు అని కూడా అంటారు. ఇలా చాలా నామధేయాలు ఉన్న ఈ పురుగు చూడటానికి అరంగుళం సైజులో ఉండి, ఎర్రని మఖ్మల్ బట్ట తో చేసిన బొమ్మలాంటి పురుగుయా ఇది అనేలా ఉంటుంది. ముట్టుకుంటేనే - అత్తిపత్తి చెట్టు ఆకుల్లా ముడుచుకు పోయే స్వభావం ఉన్న ఈ పురుగులు నేలమీద కాసింత ఇసుక నేలల్లో, పచ్చగడ్డి కాసింత ఉన్న చోట్లలో విరివిగా కనిపిస్తాయి.
ఆంగ్లం లో Red velvet mite గా పిలిచే ఈ ఆరుద్ర పురుగులు పర్యావరణ నేస్తాలు. ఇవి నేలను గుల్లబారేలా చేసి పంటలకు పోషకాలు అందటం లో సహాయం చేస్తాయి. ఇవి కనిపించటాన్ని రైతులు శుభ సూచకం గా భావిస్తారు. వీటిని సాంకేతికంగా - Trombidium grandissimum పేరుతో వ్యవహరిస్తారు. కొంతమంది Coccinella septempunctata ని ఆరుద్ర పురుగులు గా పొరపడుతుంటారు. క్రింది చిత్రాల్లో రెంటినీ గమనించవచ్చు.
ఈ అందమైన, మెత్తనైన పురుగులు వర్షాకాలం తొలకరి వర్షాలు కురవగానే, బిల బిల మంటూ కుప్పలు కుప్పలుగా కనిపిస్తాయి. నేను చిన్నప్పుడు స్కూల్ కి వెళ్ళిన రోజుల్లో, అక్కడ ఇలాంటి పురుగుల్ని చాలా చాలా చూసేవాడిని. నేనూ, నా మిత్రులము కనీసం తలా పది పురుగులవరకూ పట్టేసేవాళ్ళం. వాటి చర్మముతో అందమైన పరుగుని కుట్టిన్చుకోవాలని అప్పట్లో తెగ కలలు కనేసేవాళ్ళం. ఇంతవరకూ అలా వాటి మెత్తని, ఎర్రని చర్మముతో పరుపుని ఇంతవరకూ కుట్టించుకోలేకపోయాం.
ఇసుక నేలల్లో, బొరియలు చేసుకుంటూ, అందులోనే జీవిస్తూ తొలకరి వర్షాలకి బయటకి వచ్చేసేటివి. ఇవి నేలలోని సూక్ష్మ క్రిముల్ని పట్టి భోంచేస్తూ, రైతులకి మేలు చేసేటివి. ఇవి అలా బయటకి వచ్చినప్పుడు వర్షానికి తడిచిన నల్లని భూమి మీద, ఆకుపచ్చని గీతల్లాంటి గడ్డి మీద ఎర్రని చుక్కలు అద్దినట్లుగా అనిపించేటివి. ఆ దృశ్యం ఎంతో హృద్యముగా అగుపించేడిది.
ఇంత విశిష్టత కలిగిన ఈ ఆరుద్ర పురుగులు నెమ్మదిగా అంతరించే దశకు చేరుకుంటున్నాయి. పొలాల్లో మితిమీరిన క్రిమిసంహారకాల వాడకం దీనికి ముఖ్య కారణం. ఈమద్య కాలంలో మరో ప్రమాదకరమైన ధోరణి ఛత్తీస్ గడ్ మరియు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటుంది. ఈ పురుగుల్ని కిలోల లెక్కన కొనే ఏజెంట్లు బయలుదేరారు. వీటినుంచి సేకరించే నూనెను పక్షవాతం రోగులకు వాడే తైలం లోనూ, లైంగిక సామర్థ్యాన్ని పెంచే ఆయుర్వేద మందుల తయారీలోనూ వాడుతారు. అరబ్ దేశాలలో వాడే పాన్ లో కూడా ఈ పురుగుల్ని వాడుతారు.
రచన: రాజ్